న్యాయమైన కోరిక…(కథ)


                                                                          న్యాయమైన కోరిక                                                                                                                                                                (కథ) 

"కారు మబ్బులు, ఈదురు గాలులూ ఉన్నాయి...కానీ వర్షం లేదు. దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానని చేయి చాపని వాడుకూడా అలాంటి వాడే అర్జున్.

నా తండ్రి చనిపోయిన రోజున "నేనున్నాను" అని నువ్వు ఒక మాట అనుంటే, దానిని వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు కానుకలా భావించుంటాను...కానీ..." అంటూ ఏదో చెప్పబోయిన మానస వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి తల పక్కకు తిప్పుకుని, దుఃఖాన్ని దిగమింగుకుంటూ తనని తాను సమాధాన పరచుకుంది.

 తప్పు చేశాను నన్ను క్షమించు మానస అని నిన్ననే నేను గుడిలో నిన్ను అడిగాను. రోజు ఎందుకో మా అమ్మ మాటను నేను ఎదిరించలేకపోయాను.

 తరువాత ఆలొచించాను. నేను చేసిన తప్పేమిటో అర్ధమయ్యింది. బాధ్యతలు తీసుకోని వాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క అనే సూత్రాన్ని ఆలస్యంగా అర్ధం చేసుకున్నాను...

అందుకే నిన్ను పెళ్ళి చేసుకుని నా తప్పును సరిచేసుకుందామని అనుకుంటున్నాను" అన్నాడు అర్జున్.

 అర్జున్ ను మానస మన్నించిందా? అసలు ఇద్దరి మధ్యా జరిగిన సంఘటన ఏమిటి? 'బాధ్యతలు తీసుకోని వాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క' అని అర్జున్ ఎందుకు చెప్పాడు?....వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు కథను చదవాల్సిందే.

*************************************************************************************************

అదొక ప్రభుత్వ కార్యాలయం.

అక్కడ పనిచేస్తున్న వారందరూ రోజు చాలా హడావిడి పడుతున్నారు. అందులోనూ కార్యాలయ డిప్యూటీ అధికారి అర్జున్ ఊపిరాడని పనులతో సతమత మవుతున్నాడు. కారణం, కార్యాలయానికి కొత్తగా నియమించబడ్డ కార్యాలయ పరిపాలక అధికారి రోజు కార్యాలయంలో పదవి బాధ్యతలను చేపట్టటానికి వస్తున్నారు.

దానికి చేయవలసిన ఏర్పాట్లలో ఏదైనా తేడా వస్తే దానికి పూర్తి బాధ్యత అర్జున్ పైన పడుతుంది. అందుకని అర్జున్ తానే స్వయంగా దగ్గరుండి పనులు పూర్తిచేస్తున్నాడు.

ఇంతలో ఎవరో "కొత్త కమీషనర్ వచ్చేశారు" అని అరిచారు.

అంతే... అర్జున్ అత్యంత వేగంగా అక్కడున్న ఫ్లవర్ బొకేను చేతిలోకి తీసుకుని అదే వేగంతో కార్యాలయ గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. అతనితో పాటు మరికొందరు ఉద్యోగస్తులు కూడా కొత్త ఆఫీసర్ కు స్వాగతం పలకటానికి అక్కడికి చేరుకున్నారు.

ప్రభుత్వ అధికార గుర్తు వేసున్న బ్యాడ్జీ కలిగిన కారు వచ్చి కార్యాలయ గుమ్మం ముందు ఆగింది.

కారు డోర్ తెరుచుకుంది. అందులో నుండి దర్జాగా ఒక మహిళ దిగింది.

అందరూ ఒక్క సారిగా "వెల్ కం మాడమ్" అంటూ ఆమె ముందుకు వెళ్లారు.

వచ్చిన మహిళా అధికారిని చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్. ఆశ్చర్యంలో నుండి తేరుకోలేక అలాగే శిలలా నిలబడిపోయాడు.

ఎవరో అర్జున్ భుజాలు పట్టుకుని కుదిపారు. కుదుపుతో ఆశ్చర్యంలోనుండి తేరుకున్న అర్జున్ తనని తాను సమాధానపరచుకుని "నమస్తే" చెబుతూ, చేతులో ఉన్న ఫ్లవర్ బొకేను ఆమెకు అందించాడు. అప్పుడు అతన్ని చూసిన మహిళా అధికారి కూడా అర్జున్ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది.

"మానస...మీరు..." అని తడబడుతూ అర్జున్ ఆమె పేరు ఉచ్చర్తిస్తుంటే ఆమె అడ్డు పడింది.

"మిస్టర్! ఇది ఆఫీసు...నేను మీ పై అధికారిని. మీరొక డిప్యూటీ అధికారి. ఆఫీసులో తేడాతో ఉంటే మంచిది" కఠినంగా అన్నది మానస పేరు కలిగిన మహిళా అధికారి.

కోళాహలంగా ఉన్న వాతావరణం నిశ్శబ్ధంగా మారింది.

మానస కార్యాలయంలోకి వెళ్ళింది. ఆమెతో పాటు మరో నలుగురు అధికారులు తోడుగా వెళ్లి ఆమెకు ఆమె గది చూపించి తిరిగి వచ్చారు.

మానస అన్న మాటలతో షాక్ తిన్న అర్జున్ మౌనంగా కార్యాలయ గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు.

గదిలో తన కుర్చీలో కూర్చున్న మానస, టేబుల్ మీదున్న మంచి నీళ్ళ గ్లాసును అందుకుని, గ్లాసుడు నీళ్ళను ఒక్క గుటకలొ తాగేసింది. అయినా ఆమె గుండె కొట్టుకుంటున్న వేగం తగ్గలేదు.

అర్జున్ అక్కడ కనబడతాడని ఊహించని మానస కుర్చీలో వెనక్కి వాలి కొంచం రిలాక్స్ అవాలనుకుంది. కానీ ఆమె మనసు ఆమెను గతంలోకి తీసుకు వెళ్ళింది.

                                                                ***********************************

ఒక మధ్య తరగతి కుటుంబంలోని నలుగురు ఆడపిల్లలలో పెద్దది మానస. ఆమె తండ్రి రాజారావుకు గవర్నమెంట్ ఉద్యోగం.

మొదటి ఇద్దరి కూతుర్లనూ డిగ్రీ చదివించటానికే నానా యాతనలు పడ్డ రాజారావు, చివరి ఇద్దరి కూతుళ్ళనూ చదివించటానికి కష్టపడుతున్నాడు.

ఈలోపు పెద్ద కూతుర్లిద్దరూ పెళ్లీడుకు వచ్చారు.

రిటైర్ మెంటుకు ఇంకా కొన్నేళ్ళే ఉందనగా లోపు ఇద్దరి కూతుర్లకైనా పెళ్ళి చేశాయలని ప్రయత్నం చేశాడు రాజారావు.

అతని ప్రయత్నానికి ఫలితంగా పెద్ద కూతురు మానసకు వచ్చిన వివాహ సంబంధమే అర్జున్. సంబంధం కుదుర్చుకున్నారు. కట్నకానుకలు, నగలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, లాంఛనాలు, పెళ్ళి ఖర్చులు ఖాయం చేసుకున్నారు...పెళ్ళి ఏర్పాట్లు, పెళ్ళి పనులు వేగంగా జరుగుతున్నాయి.

"ఏం రాజారావ్...మొత్త డబ్బుని పెద్ద కూతురికే ఖర్చు పెట్టేట్టున్నావే! ఇంకా ముగ్గురు కూతుర్లున్నారు మర్చిపోకు"...లోను కాగితాల మీద సంతకం పెడుతూ రాజారావును హెచ్చరించాడు అతని పై అధికారి.

"ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇద్దరి కూతుర్లకు పెళ్ళి చేశేస్తే...రిటైర్మెంట్ తరువాత వచ్చే డబ్బుతో మిగిలిన ఇద్దరికీ చెయ్యచ్చు " భయంలేని నవ్వుతో సమాధానం ఇచ్చాడు రాజారావు.

"నువ్వు కష్టపడి సంపాదించే డబ్బంతా నీ కూతుర్ల పెళ్ళిళ్ళకే ఖర్చు పెట్టేస్తే...చివరి రోజుల్లో నీ జీవితం ప్రశ్నార్ధకమవుతుంది"

ఎందుకు అవుతుంది సార్...మన బాధ్యతలను మనం నెరవేరిస్తే, చివరి రోజుల్లో మనల్ని చూసుకోవడానికి పైవాడు మనకి ఎవరో ఒకరి రూపంలో సహయాం అందిస్తాడు సార్"

"నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను రాజారావ్. నలుగురు ఆడపిల్లల తండ్రివైన నువ్వు ఎనాడూ ఒక మొగ పిల్లాడు లేడే నని బాధ పడటం నేను చూడలేదు"

"ఎందుకు బాధ పడాలి సార్...ఆడ పిల్లలు కూడా మొగ పిల్లలతో సమానమే సార్. కన్న తల్లి తండ్రులమైన మనమే వాళ్ళలో భేదాలు చూస్తే ఇక సంఘం వాళ్ళని మరింత భేదంతో చూస్తుంది సార్"

"ఎంత బాగా చెప్పావు రాజారావ్...చివరి దాకా నువ్వు ఇదే ఆనందంతో ఉండాలని నిన్ను విష్ చేస్తున్నాను. ఇదిగో నీ అప్రూవ్డ్ లోన్ కాగితం. తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్లో ఇచ్చాయి. రెండు మూడు రోజుల్లో వాళ్ళు నీకు చెక్కు ఇస్తారు" అంటూ రాజారావుకు ఒక వౌచర్ అందించేడు రాజారావ్ పై అధికారి.

"ధాంక్యూ సార్" అంటూ వౌచర్ తీసుకుని తన సీటు దగ్గరకు వెళ్ళాడు రాజారావ్.

కానీ విధి చేతిలో చిక్కుకుని చిన్నాబిన్నం అవుతాడని రాజారావ్ కొంచం కూడా అనుకోలేదు!...చట్ట విరోధమైన పనిచేయమని రాజారావును ఒక కాంట్రాక్టర్ ఒత్తిడి చేయగా దానికి రాజారావ్ నిరాకరించాడని, రాజారావును పన్నాగంలో ఇరికించి అతని ఉద్యోగానికే ముప్పు తీసుకు వచ్చాడు కాంట్రాక్టర్.

ఫిర్యాదు కాయితాలు తీసుకుంటున్నప్పుడు, రంగు పూసిన డబ్బు కాగితాలను ఫిర్యాదు కాయితాల మధ్యలో పెట్టి...రాజారావును లంచగొండిగా చిత్రీకరించి పట్టించాడు.

అవమానాన్ని భరించలేని రాజారావ్ తనని తానే శిక్షించుకుని దేవుడుని నిలదీయటానికి స్వర్గానికి వెళ్లాడు.

రాజారావు లేని లోటును పూర్తి చేయలేక కుటుంబం విలవిల లాడిపోయింది. సమయంలో అర్జున్ తల్లి పిడుగులాంటి వార్తను వాళ్ళ నెత్తిన పడేసింది.

"ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చేటప్పుడు...లక్ష్మీ దేవి వచ్చినట్లు ఉండాలి. కానీ ఇంటికి రాకుండానే అశుభం జరిగిపోయింది. ఇప్పుడు నా కొడుకు మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే...మీ కుటుంబంలోని అన్ని బాధ్యతలనూ వాడే మోయాలి. కాబట్టి మీరు వేరే వరుడ్ని చూసుకోవడం మంచిది" అని చెప్పి వెళ్ళిపోయింది.

ఆమె మాటలు విన్న మానస నిరుశ్చాహ పడలేదు. ధైర్యం కోల్పోలేదు. అప్పటికే కన్నీరు ఇంకిపోయి, మనసు రాయిలాగా అయిపోయిన మానస హృదయానికి అర్జున్ తల్లి మాటలు ఊరట కల్పించేయి. ఇంటికి పెద్ద కూతురునైన నేను తండ్రి స్థానం వహించి కుటుంబ బాధ్యతలు పూర్తిచేయాలి. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే బాధ్యతలను నెరవేర్చడానికి తన భర్త ఒప్పుకుంటాడో లేదో అని సతమత పడుతున్న మానసకు అర్జున్ తల్లి మాటాలు బలం చేకూర్చినై.

తండ్రి లేని లోటును తీర్చటానికి ఇక నాకు అడ్డమూ లేదు" అని సంతోషపడింది. అదే అమె లక్ష్యంగా కూడా మారింది.

లక్ష్యాలు స్పూర్తినిస్తాయి, చక్కని దారిచూపుతాయి. లక్ష్యమే రోజు ఆమెను ఒక ప్రభుత్వ రంగ కార్యాలయ అధికారిగా నిచ్చన ఎక్కించింది....కానీ తాను అధికారిగా వచ్చిన ప్రభుత్వ కార్యాలయంలోనే తనని పెళ్ళి చేసుకోవలనుకున్న అర్జున్ డిప్యూటీ అధికారిగా ఉంటాడని అమె ఎదురు చూడలేదు.

కలవర పెడుతున్న మనసును శాంత పరచుకోవటానికి సాయంత్రం అమ్మోరి గుడికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. వెంటనే కార్యాలయంలో తన పని మొదలుపెట్టింది.

                                                                          ***********************************

సాయంత్రం అమ్మోరి గుడిలో మళ్ళీ అర్జున్ని చూసింది మానస. తనని చూసి కూడా చూడనట్లు వెడుతున్న అర్జున్ ముందుకు వెళ్ళి నిలబడింది.

"సారీ అర్జున్...ఉదయం మీతో కఠినంగా మాట్లాడాను" చెప్పింది మానస.

"పరవాలేదు...నీ దగ్గర క్షమాపణలు అడగాటానికే ప్రయత్నించాను"

"క్షమాపణలా...ఎందుకు?"

"మా అమ్మ మాటలు విని మీతో పెళ్ళి ఆపినందుకు"

అతన్ని ఆశ్చర్యంగా చూసిన మానస "చూడండి అర్జున్...ఒక చోట ఆగే రైలు, తరువాత ప్రయాణానికి బయలుదేరేటట్లే మన జీవితాలు కూడా. మిమ్మల్ని క్షమించటం...క్షమించకపోవటం, రెండూ అవసరంలేని పనులుఅన్నది.

"అది సరే..." అంటూ ఇంకా ఏదో చెప్పాలని తటపటాయిస్తున్న అర్జున్ని చూసిమీ తటపటాయింపు చూస్తుంటే నా దగ్గర ఇంకేదో చెప్పాలని ఆశ పడుతున్నట్లున్నారు...ధైర్యంగా చెప్పండి" అన్నది మానస.

"ఆగిపోయిన మన పెళ్ళి జరగాలి" తన ఆశను వెలిబుచ్చాడు అర్జున్.

"నేను మీ ఇంట్లో కాలు మోపటానికి ముందే అశుభం జరిగిందని మీ అమ్మగారు చెప్పారే ... మరి ఆవిడ దీనికి ఒప్పుకుంటుందా?"

"నేను సమాధానపరచి ఒప్పిస్తాను"

" ఐడియా రోజే ఎందుకు మీ ఆలొచనకు రాలేదు"

మాటతో కొరడా దెబ్బలు తగిలినట్లు గిలగిల లాడిపోయాడు అర్జున్. మనసుకు తగిలిన దెబ్బల నొప్పిని అనుభవిస్తూ ఉండటంతో మానస కళ్ళలొకి నేరుగా చూడలేకపోయాడు.

"వదులుకున్న దానిని తిరిగి పొందాలనే మీ వెర్రి కోరికకు కారణం...నేను సంపాదిస్తున్న డబ్బులా...నా పదవా?" అడిగింది మానస.

"రెండింటి మీద ఇష్టపడి నేను కోరికను అడగలేదు. మీ నాన్నగారు చనిపోయిన తరువాత నువ్వు నీ కుటుంబ బాధ్యతలను తీసుకున్నావే...అలాంటి గొప్ప మనస్థత్వం ఉన్న మనిషిని వదులుకోకూడదని"

"అలాంటి పొజిషన్లో ఉన్న ఆడపిల్ల అయినా అలాగే చేస్తుంది. మన్యుష్యుల బాధ్యతల గురించి మా నాన్నగారు మాకందరికీ నేర్పిన జీవిత పాఠాలలో ఇది ఒక భాగం...అది సరే, రోజు మీ అమ్మగారు చెప్పింది రోజూ వర్తిస్తుంది... మరి దానికి మీరు ఓకేనా?"

"ఏం చెప్పారు?"

నన్ను పెళ్ళి చేసుకుంటే ...మా కుటుంబ బాధ్యతలన్నీ మోయ వలసి వస్తుంది"

"కావాలనుకున్నది దొరకాలనుకుంటే బాధ్యతలను మోయాల్సిందే...ఇన్ని రోజుల బ్యాచులర్ లైఫ్ లో నేను నేర్చుకున్న గుణపాఠం ఇదే"

సరే, మీ రిక్వెస్టుకు సమాధానం చెబుతాను...మీరు రేపు మా ఇంటికి రండి" అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరింది మానస.

                                                                    ***********************************

అర్జున్ మానస ఇంటికి వెళ్లాడు.

మానస తల్లి అర్జున్ని సంతోషంతో ఆహ్వానించింది. చీర కొంగును బుజాల మీద కప్పుకుని నమస్కారం చెప్పే సరాసరి తల్లే ఆమె!

మానస చెల్లెళ్ళు వేరే గదిలో ఉన్నారు.

ఆగిపోయిన పెళ్ళి జరిగిపోతుందనే నమ్మకం తల్లి ముఖంలో కనబడుతోంది.

చెల్లెలు రోహిణి అర్జున్ కు కాఫీ ఇచ్చి వెళ్ళింది.

మానస మౌనంగా కూర్చుంది....."సరే అని చెప్పవే" అన్నట్టు మానసకు కళ్లతోనే సైగ చేసింది మానస తల్లి.

"మానస ఇంకా ఏం ఆలొచిస్తోంది?" అనే కన్ ఫ్యూజన్లోనే ఉన్న అర్జున్ మానస మాటకొసం ఎదురు చూస్తున్నాడు.

"కారు మబ్బులు, ఈదురు గాలులూ ఉన్నాయి...కానీ వర్షం లేదు. దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానని చేయి చాపని వాడుకూడా అలాంటి వాడే అర్జున్. నా తండ్రి చనిపోయిన రోజున "నేనున్నాను" అని నువ్వు ఒక మాట అనుంటే, దానిని వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు కానుకలా భావించుంటాను...కానీ..." అంటూ ఏదో చెప్పబోయిన మానస వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి తల పక్కకు తిప్పుకుని, దుఃఖాన్ని దిగమింగుకుంటూ తనని తాను సమాధాన పరచుకుంది.

తప్పు చేశాను నన్ను క్షమించు మానస అని నిన్ననే నేను గుడిలో నిన్ను అడిగాను. రోజు ఎందుకో మా అమ్మ మాటను నేను ఎదిరించలేకపోయాను. తరువాత ఆలొచించాను. నేను చేసిన తప్పేమిటో అర్ధమయ్యింది. బాధ్యతలు తీసుకోని వాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క అనే సూత్రాన్ని ఆలస్యంగా అర్ధం చేసుకున్నాను...అందుకే నిన్ను పెళ్ళి చేసుకుని నా తప్పును సరిచేసుకుందామని అనుకుంటున్నాను"

"మా తండ్రి చనిపోయిన తరువాత కుటుంబ భారం పూర్తిగా నా మీద పడింది. మా తండ్రి నెరవేర్చాలనుకున్న పనులన్నిటినీ ఆయన వారసురాలుగా నేను పూర్తి చేయాలి. అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. ప్రస్థుతం అదొక్కటే నా లక్ష్యం. తరువాతే నా వ్యక్తిగత ఆనందం"

"నా పూర్తి సహకారం నీకు ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను మానస" అన్నాడు అర్జున్.

మానస వెంటనే సమాధనం చెప్పలేదు. ఇంకా ఏదో ఆలొచిస్తోంది.

ఆమె మౌనం అతన్ని దహించి వేస్తోంది

ఎండాకాలంలో మంచు కురవాలనుకోవడం, చలికాలంలో వర్షాలు పడాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో...అదేలాగా పదవి, డబ్బు వచ్చిన తరువాత ఆమెతో బంధుత్వం ఎదురు చూసి రావడం కూడా మూర్ఖత్వమే!....బంధుత్వం కోసం ఎదురు చూసి వచ్చిన అర్జున్ కు మానస చెప్పే సమాధనం ఏమిటి?

"మీ పూర్తి సహకారం ఉంటుందని ప్రామిస్ చేశారు. బాధ్యతలు తీసుకోని వారు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే అన్నారు. మీ మాటలు నాకు నచ్చాయి. ఎంతో సంతోషాన్నీ, బలాన్ని ఇస్తున్నాయి. అందుకే పెళ్ళికి ఒప్పుకోమని అడిగి వచ్చిన మీతో సంబంధం కలుపుకోవాలని నేనూ నిర్ణయించుకున్నాను. పెళ్ళికి ఒకేనే....కానీనాదో కోరిక" అంటూ మాట్లాడటం ఆపిన మానసను చూసిచెప్పు మానస... నీ కొరిక ఏదైనా, నేను దానికి ఒకేనే" అన్నాడు అర్జున్.

"పెళ్ళికి ఒకేనే....కానీ పెళ్ళి మీకూ...నాకూ కాదు. నా చెల్లెలు రోహిణికి...మీకు….ఇదే నా కోరిక. ఓకే అంటే పెళ్ళి ఏర్పాట్లు మొదలుపెడదాం" కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది మానస.

ఇలాంటి కోరిక ఎదురు చూడని అర్జున్ షాక్ తిన్నాడు. మానస అలా అడుగుతుందని ఎదురు చూడలేదు. బాగా దాహం వేసిన వాడికి సముద్రపు నీరు కనబడినంత విరక్తితో చూశాడు అర్జున్.

అంతవరకు జల్లుల పక్కన నిలబడి మాత్రమే చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందపడిన మానస చెల్లెళ్ళకు ఇప్పుడు ఒక జలపాతం క్రింద నిలబడి చల్లదనాన్ని అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది. కారణం….మానస యొక్క కోరిక న్యాయమైన కోరికగా వాళ్ళకు అనిపించింది.

*************************************************సమాప్తం ********************************************

                                                               


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఏల్నాటి శని...(కథ)