దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

 

                                                               దుబాయి వాడి పెళ్ళాం                                                                                                                                         (కథ)

"సంపాదన, సంపాదన. ఎవరికి కావాలి డబ్బు. డబ్బు, డబ్బూ అంటూ మీరు విదేశాలకు వెళ్ళి కూర్చుని, రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఒక నెలరోజులు ఉంటున్నారు.

జీవితాన్ని అనుభవించాల్సిన కాలంలో, ఇలా కనబడని దేశంలో వెళ్ళి కష్టపడుతున్నారు. ఒక స్త్రీగా నేను పడుతున్న బాధ, నరకమండి. ఎన్ని రోజులు నేను మధ్య రాత్రి చల్లటి నీళ్ళతో స్నానం చేశానో తెలుసా?

గుడికి వెళితే, 'వచ్చే సంవత్సరం పిల్లాడితో రా తల్లీ' అంటూ కుంకుమ ఇస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే భర్తను పెళ్ళి చేసుకుని ఎలా పిల్లాడితో రాగలను?

అంతే కాదండీ, దానికంటే పెద్ద నరకం ఏది తెలుసా? ఒక పోస్టు మ్యాన్ దగ్గర కూడా రెండు నిమిషాలు ఎక్కువగా నిలబడి మాట్లాడ లేకపోతున్నాం. 'భర్త పక్కన లేడు చూడు...అందుకే నవ్వుతూ మాట్లాడుతోంది ' అనే చెడ్డపేరు.

***************************************************************************************************

మాలతీ  యొక్క మొబైల్ ఫోను చాలాసేపటి నుండి రింగ్ అవుతోంది.

ఇంటి వెనుక తోటపని చేస్తున్న తల్లి కృష్ణవేణి దగ్గరకు వచ్చింది హేమా.

తన మొబైల్ ఫోనుపై నుండి కళ్ళను తిప్పకుండానే, "అమ్మా...వదిన ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఫోను చాలాసేపటి నుండి మోగుతూనే ఉంది" అన్నది.

గుడికి వెళ్తున్నట్టు చెప్పింది. ఆశ్చర్యంగా ఉంది. ఫోను పెట్టేసి వెళ్ళిపోయిందా?...కర్ణుడు కుండలాలతోటి పుట్టినట్టు ఎప్పుడు చూసినా మొబైల్ ను చేతిలోనే కదా పెట్టుకుంటుంది? వెళ్ళి, ఎవరు అని చూడు" అన్నది తల్లి.

అంతకు రెండు రోజుల ముందే మల్లెపూల చెట్టు మొక్కను నాటిన చోట నీళ్ళ పాదును సరిచేస్తూ, కింద మోకాళ్ళపైన కూర్చున్న హేమా నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను. నువెళ్ళి చూడు అన్నది హేమా.

"ఛీ పాడు...ఈ మొబైల్ ఫోను వల్ల ఒక కుక్క కూడా బాగుపడబోయేది లేదు"  తిట్టుకుంటూనే, చేతులు కడుక్కుని, లోపలకి వచ్చింది కృష్ణవేణి. కంటిన్యూగా మోగుతున్న మొబైల్ ఫోను శబ్ధంతో విసుక్కున్నది.

ఎవరు పిలుస్తున్నది అని కూడా చూడకుండా తీసి "హలో..." అన్నది కృష్ణవేణి. "అమ్మా..." గోపీ స్వరం విన్న వెంటనే, పొత్తి కడుపు కరగటం మొదలుపెట్టింది.

"నాయనా...బాగున్నావా అయ్యా?" అడుగుతున్నప్పుడే కళ్ళల్లో కన్నీరు పొంగింది.

దుబాయిలో ఉంటున్న కొడుకు యొక్క స్వరాన్ని వింటున్న ప్రతిసారీ, ఆమె కళ్ళు చెరువులాగా కనబడేది మామూలే.

"రాత్రి పూట కదా నాయినా ఫోను చేస్తావు? అందుకే ఇంకెవరో అని అనుకున్నా"

"ఒంట్లో బాగుండలేదమ్మా. ఈ రోజు సెలవుపెట్టాను" అన్నాడు.

"అయ్యయ్యో...ఏమయిందయ్యా?"

"కంగారుపడకమ్మా...చిన్నగా తలనొప్పి, వేరే ఏమీ లేదు. అవును మాలతీ ఎక్కడ?"

"ఆమె, గుడికి వెళ్ళింది. ఎక్కడికెళ్ళినా, చెప్పులు వేసుకోవటం మరిచిపోయినా మరిచిపోతుందే తప్ప, మొబైలు ఫోను మరిచిపోదు. ఈ రోజు ఏమిటో ఆశ్చర్యంగా పెట్టేసి వెళ్ళిపోయింది"

"దేవుడ్ని దన్నం పెట్టుకునేటప్పుడు, ట్రబుల్ గా ఉండకూడదని పెట్టేసి వెళ్ళిందో, ఏమో?"

భుజం మీద కొడుతున్నట్టు "అవునురా...నీ భార్యను సపోర్టు చెయ్యకుండా ఉండవే" అన్నది కృష్ణవేణి.

"అమ్మా, హేమాని పెళ్ళివారు వచ్చి చూసి వెళ్ళినట్టు చెప్పావే...అటువైపు నుండి తారీఖు ఏదైనా ఖాయం చేసినట్టు చెప్పారా?" అడిగాడు గోపీ.

"ఆ సంబంధం సెట్ అవదు" సడన్ గా విరక్తిని బయటపెట్టింది తల్లి.

"ఏమ్మా...".

"వాడు తాగుబోతుట. భార్య వస్తే చెడు అలవాట్లు మానేస్తాడని మధ్యవర్తి చెబుతున్నాడు. అమ్మాయిని వంట నేర్చుకోమని మాత్రమే చెప్పి చెప్పి పెంచాము. సంఘసేవ చేయటానికా మనం పిల్లను పెంచి పెద్ద చేశాము? అదే పెద్ద బాధగా ఉంది. దాన్ని ఒక మంచివాడి చేతికి ఇచ్చి కట్టబెడితే, ఒక భారం తగ్గుతుంది"

తల్లి యొక్క పెద్ద నిట్టూర్పు శ్వాశగాలి వేడి అక్కడ అతన్ని కాల్చి ఉండాలి.

"బాధపడకమ్మా. నీ దగ్గర ఒక విషయం చెబుదామనే ఫోను చేశాను. ఇక్కడ నాతోపాటూ ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. పేరు సురేష్. సొంత ఊరు, కాకినాడ. చాలా మంచి గుణం, బాద్యత తెలిసిన వాడు, కష్టపడే వ్యక్తి.

నాకంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు. చూడటానికి సేటు ఇంటి అబ్బాయిలాగా ఎర్రగా ఉంటాడు. మన ఊరికే వస్తున్నాడు. అతని దగ్గర బట్టలు, డబ్బులు ఇచ్చి పంపించాను. మనింటికి వస్తాడు.

అడ్డు చాటుగా చూసి ఉంచుకో. ఇక్కడికి వచ్చిన వెంటనే, అతన్ని మన హేమాకి మాట్లాడదామనుకుంటున్నా. హేమా చేత కాఫీ ఇప్పించు. హేమా అతని చూపులలో పడేలాగా చూసుకో. ఏమంటావు?" అన్నాడు.

ఆ క్షణమే వియ్యపురాలుగా మారి తాంబూల పళ్ళాలు మార్చుకుంటున్నట్టు ఊహించుకుని తడబడ్డది కృష్ణవేణి.

"వినటానికే చాలా సంతోషంగా ఉందయ్యా"

"చెల్లెల్ని పెళ్ళి చేసిచ్చినా, నా పక్కనే ఉండి, పనిచేస్తాడు. ఏదైనాసరే నేను చూసుకుంటాను"

"అయ్యా...నా నోట్లో పాయసం పోసినట్లు ఉంది. ఈ హేమా పిల్ల కూడా ఉత్త అమాయకంగా ఉంది. పెళ్ళి అయిన తరువాత, మన ఇంట్లోనే ఉంచుకుందాం. నేనూ దాన్ని వదిలి ఉండలేను"

"అవునమ్మా...అదికూడా ఆలొచించే నేను నిర్ణయం తీసుకున్నాను"

"సరే నాయనా"

"సరేమ్మా...తరువాత మాలతీతో మాట్లాడతాను"

"నాయనా... మాలతీతో నువ్వు మాట్లాడేటప్పుడు, కొంచం జాగ్రత్తగా మాట్లాడు"

"ఎందుకమ్మా?"

"ఆ అబ్బాయి గురించి మామూలుగా చెప్పుంచు. అలా, ఇలా అని వాగద్దు. నీ పెళ్లాం నోరు, అమ్మవారి గుడిలో కట్టున్న స్పీకర్ లాంటిది. ఊరంతా చాటింపు వేస్తుంది

"సరేనమ్మా..."

మొబైల్ ఫోను ఆఫ్ చేసింది కృష్ణవేణి.

కొత్త ఉత్సాహంతో వెనుక వైపు తోటకు వచ్చి "ఇదిగో అమ్మాయ్...ఆ మొబైల్ ఫోనును అవతల పారేసి ఇటురా" అన్నది తల్లి.

"వస్తానమ్మా...అందుకని పదివేల రూపాయల మొబైల్ ఫోనును విసిరి అవతలపారేయటం కుదరదు" అంటూ లేచి వచ్చింది.

"అవును, పదివేలు! ఇకమీదట నువ్వు, యాభై వేల రూపాయలకు కూడా మొబైల్ ఫోను కొనుక్కోవచ్చే"

"ఏమ్మా...నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా?"

"నీ దగ్గరే రాబోతుంది డబ్బు"

"అదెలాగమ్మా..." అని ఆశ్చర్యపోయింది.

కూతురు దగ్గరకు రావటంతో, ఆశగా బుగ్గలను గిల్లి, విషయం చెప్పింది తల్లి.

హేమా కళ్ళల్లో కోటి నక్షత్రాలు ప్రకాశించినై.

"నిజంగానే?"

"అవునే....ఇప్పుడు మీ వదిన వస్తుంది. పిచ్చిదానిలాగా విషయమంతా ఆమె దగ్గర చెప్పకు"

"విషయమంతా అంటే?"

"ఆ సురేష్ కుర్రాడు, అన్నయ్య కంటే రెండు రెట్లు జీతం ఎక్కువ తెచ్చుకుంటున్నాడు. అంతే, ఆ మాట చెబితే మీ వదిన కడుపులో మంట లేస్తుంది. ఆ మంటలో అన్నీ కాలి బూడిదైపోతాయి. మనకంటే, మన ఆడపడుచు ఆస్తి పరురాలుగా అయిపోతుందని అనుకుని ఈ పెళ్ళిని అడ్డుకోవాలని కూడా అనుకుంటుంది"

"ఊర్లో, నేనొక్కదాన్నే దుబాయి వాడి పెళ్ళాం ను అని చెప్పుకుంటూ గర్వంగా నడవాలని అనుకుంటున్నది, ఆ తరువాత నిన్ను కూడా దుబాయ్ వాడి పెళ్లాం అని చెబితే, ఆమె ఓర్చుకోగలదా? దానికోసమైనా గొడవ పడుతుంది. అందుకని నోరు మూసుకుని కూర్చో" అన్నది తల్లి.

"అమ్మా...నువ్వు నా నోరు ముయొచ్చు. కానీ, రాత్రి పూట ఫోను చేసి పెళ్లాంతో తెల్లవార్లూ మాట్లాడతాడే అన్నయ్య. వాడు చెప్పడా?"

"చెప్పకూడదని ఖండిచున్నానే"

"భార్య గురించి, ఈర్ష్య పడుతుంది అని చెబితే, నీ గురించి ఏమనుకుంటాడు?"

"నేనేమన్నా నీలాంటి పిచ్చిదాన్నా డైరెక్టుగా అలా చెప్పటానికి? ఆమె లూజ్ టాక్ నోరు గలది. అమ్మ ఇంట్లో చెబితే, వాళ్ల చుట్టాలందరూ ఆవేశపడతారని చెప్పాను"

"ఓ...వదిన యొక్క బంధువుల మీద తొసేసావా? గొప్ప మనిషమ్మా నువ్వు!

గోపీ చెప్పినట్టే, ఆ మరుసటి శుక్రవారం రోజు, ఫోనుచేసి ఇంటికి వచ్చాడు సురేష్.

అతని రూపం అందంగా ఉన్నది. చూపు వెయ్యి వొల్ట్స్ బల్బులాగా ప్రకాశవంతంగా ఉంది. మాటలు గౌరవంగా ఉన్నాయి.

కాఫీ తీసుకు వచ్చిన హేమాని ఎగబడి మింగేసేటట్టు చూడకుండా, పేరు, చదువు అని అడగటం అతని నాగరికతని ఎత్తి చూపింది.

అతని అంతస్తులో తల్లి కరిగిపోగా, అతని అందంలో కూతురు కరిగిపోగా...సెలవు తీసుకున్నాడు సురేష్.

రాత్రి గోపీ ఫోను చేసినప్పుడు, తన సంతోషాన్నంతా కుండ పగిలిన పాలులాగా కారేటట్టు చేసింది తల్లి.

"నాయనా...చాలా బాగున్నాడయ్యా. ఎంత నిదానం, ఎంత అనుకువ...చూస్తేనే తెలుస్తోందయ్యా, మంచి కుటుంబానికి చెందిన వాడని. నాకు చాలా బాగా నచ్చాడు. ఎలాగైనా ఖాయం చేసేయయ్యా"

"నీకు నచ్చితే చాలా, హేమా ఏం చెబుతోంది?"

"అతని మత్తులో పడిపోయిందని అనుకో"

"సరే, మాలతీ దగ్గర ఇవ్వు!"

"ఇస్తాను...చెప్పింది జ్ఞాపకంపెట్టుకో. అన్ని విషయాలనూ వాగి పడేయకు. దోమల గుంపును జ్ఞాపకం పెట్టుకో"

"తెలుసమ్మా, ఇవ్వు"

"ఇదిగో మాలతీ..." అన్నది.

ఆమె మొబైలు ఫోనును తీసుకుని, తన గదికి వెళ్ళి, తలుపు మూసుకోగా, కృష్ణవేణి గుండె గుభేలు మంది.

"ఏమిటే...ఇది ఇక్కడ మాట్లాడక గదిలోకి వెళ్ళింది?" పక్కన నిలబడున్న కూతుర్ని చూసి చెప్పింది.

"భర్త దగ్గర మాట్లాడే భార్య, ఏదైనా పబ్లిక్ మీటింగులోలాగా గుంపులోనా మాట్లాడుతుంది?"

"తెలివి తక్కువ దానా...ఆమె ఏమీ ముద్దులాడి మాట్లాడటానికి గదిలోకి వెళ్లలేదు. కుటుంబాన్ని విడదీయటానికి వెళ్ళింది"

"వాగకమ్మా..."

"ఆ కుర్రాడి గురించి తప్పు తప్పుగా మాట్లాడి, ఈ సంబంధాన్ని పాడుచేస్తుందే. ఆ అబ్బాయిని చూసినప్పటి నుండీ ఆమె మోహం బాగాలేదే. రా కిటికీ పక్కకు వెళ్ళి, అది ఏం మాట్లాడుతోందో విందాం" అంటూ హేమాని లాక్కొచ్చింది. తోటవైపున్న మాలతీ గది కిటికీ దగ్గర నిలబడి, చెవికి ముఖ్యత్వం ఇచ్చింది కృష్ణవేణి.

"ఏమండీ ఈ సంబంధంలో నాకు ఇష్టం లేదు" స్పష్టంగా వినబడింది మాలతీ స్వరం.

"చూసావటే, నేను చెప్పేనా, ఈర్ష్య పుట్టింది..." అని తిట్టిన కృష్ణవేణి, స్పష్టంగా మాలతీ మాట్లాడేది వినబడుతున్నా, చెవిని మరింత అటేన్షన్లో పెట్టింది.

"ఏమిటి మాలతీ ఇలా చెబుతున్నావు...ఈ కుర్రాడికి ఏం తక్కువ. నాకంటే రెండురెట్లు సంపాదిస్తున్నాడు"

"సంపాదన, సంపాదన. ఎవరికి కావాలి డబ్బు. డబ్బు, డబ్బూ అంటూ మీరు విదేశాలకు వెళ్ళి కూర్చుని, రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఒక నెలరోజులు ఉంటున్నారు.

జీవితాన్ని అనుభవించాల్సిన కాలంలో, ఇలా కనబడని దేశంలో వెళ్ళి కష్టపడుతున్నారు. ఒక స్త్రీగా నేను పడుతున్న బాధ, నరకమండి. ఎన్ని రోజులు నేను మధ్య రాత్రి చల్లటి నీళ్ళతో స్నానం చేశానో తెలుసా?

గుడికి వెళితే, 'వచ్చే సంవత్సరం పిల్లాడితో రా తల్లీ' అంటూ కుంకుమ ఇస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే భర్తను పెళ్ళి చేసుకుని ఎలా పిల్లాడితో రాగలను?

అంతే కాదండీ, దానికంటే పెద్ద నరకం ఏది తెలుసా? ఒక పోస్టు మ్యాన్ దగ్గర కూడా రెండు నిమిషాలు ఎక్కువగా నిలబడి మాట్లాడ లేకపోతున్నాం. 'భర్త పక్కన లేడు చూడు...అందుకే నవ్వుతూ మాట్లాడుతోంది ' అనే చెడ్డపేరు.

అలంకారం చేసుకుని బయటకు వెళితే, చూసే కళ్ళల్లో ఎంత సంతోషం తెలుసా? క్రమశిక్షణతో ఉన్నా కూడా, ఎప్పుడు కథ అల్లి, కుటుంబాన్ని చెడుపుదామని ఆలోచించే ఒక గుంపు ఊర్లో ఉంది. దుబాయ్ వాడి పెళ్లాం అని ఊరు చెప్పటం పోయి, పనికిరాని వాడి పెళ్లాం అనే పేరు వచ్చేలాగుంది.

కలో, గంజో తాగేసి, ప్రశాంతంగా భార్యా-భర్తలుగా జీవించటమే నండీ జీవితం. నేను పడే బాధ, భయపడి, భయపడి జీవించే జీవితం, మీ చెల్లెలుకు వద్దండి. ఆమైనా ఆమె వయసుకు తగిన జీవితాన్ని జీవించాలి" అని చెప్పి ఏడ్చింది మాలతీ.

నోటికి చీరకొంగు అడ్డుపెట్టుకుని వస్తున్న ఏడుపును అనుచుకుని, కూతుర్ని కావలించుకుంది కృష్ణవేణి.

"తల్లీ, వద్దమ్మా...దుబాయ్ వాడి పెళ్లాం అనే పేరు నాకు వద్దమ్మా..." అని చెప్పి హేమా కూడా ఏడ్చింది.

***********************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)