నమ్మకం…(కథ)
నమ్మకం (కథ)
నీపై నీకు నమ్మకం నీకు బలం.. నీపై నీకు అపనమ్మకం అవతలి వారికి బలం!
అవును.. నువ్వు ఏదైనా సాధించాలి అంటే నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు నీపై ఉండాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు.
నీపై నీకు నమ్మకం లేకపోతే నువ్వే నష్టపోతావు.
నువ్వు ఏదైనా సాధించాలి అంటే దైర్యం ఉండాలి.. నమ్మకం ఉండాలి.. అప్పుడే విజయం సాధించగలవు. నీపై నీకు నమ్మకం లేకపోతే విజయం సాధించలేవు. ఏదైనా నేను చెయ్యగలను.. నాకు శక్తి ఉంది.
ఈ పని నేను చెయ్యగలను అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా విజయం సాధించగలవు.
మేదస్సు అనే నమ్మకాన్ని మనసులోకి బీజంగా నెట్టి, దానికీ రోజూ శ్రమ అనే నీటిని పోస్తే నువ్వు ఏదైనా సాధించగలవు"
ఈ కథలోని హీరో సురేష్ తనపై నమ్మకాన్ని ఎప్పుడు పెంచుకున్నాడు, ఎలా పెంచుకున్నాడు, ఎన్ని అనుభవాల తరువాత పెంచుకున్నాడు.......అనేది తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.
***********************************
సురేష్ మరియు విగ్నేష్ సముద్ర తీరం మట్టిలో కష్టపడి నడిచి వెడుతున్నారు.
సముద్ర తీరంలో బండ్ల మీద అమ్ముతున్న ఎండు చేపల వాసనను విగ్నేష్ భరించలేకపోయాడు. ముక్కు మూసుకుని, ఊపిరి బిగపెట్టి, చీదరింపు ముఖంతో తన ఎత్తైన పొట్టతోనూ, బరువైన శరీరంతోనూ నడవలేక అవస్తపడుతున్న విగ్నేష్ ను చూసి మనసులోనే నవ్వుకుంటూ అతని వెనకే నడిచాడు సురేష్.
దూరంగా మొదలవుతున్న సముద్రంలోని అలలు ఎగిసి పడుతూ వేగంగా తీర ప్రాంతాన్ని తాకుతున్నాయి. అలా వేగంగా వస్తున్న అలలను సైతం గమనించకుండా మాటల్లో మునిగిపోయిన ప్రేమ జంటలను దాటుకుంటూ నడుస్తున్నారు ఇద్దరూ.
"ఒక రోజైనా ఏనుగు తలతో రాకుడదు" సముద్రపు గాలికి చెదిరిపోతున్న జుట్టును సరిచేసుకుంటూ విగ్నేష్ ని అడిగాడు సురెష్.
"నువ్వు నా స్నేహితుడివి. మనిషైన నీతో సన్నిహితంగా మాట్లాడాలంటే ఈ మనిషి రూపమే సరైనది. నా నిజమైన రూపంతో వచ్చి, ఒక విప్లవం ఏర్పరచి, జనాన్ని నా పక్కకు తిప్పుకోవటం నాకు ఇష్టం లేదు" చెప్పాడు విగ్నేష్.
"అదీ కరక్టే! మానవ రూపంలో వచ్చావు కాబట్టే నీతో సరిసమానంగా మాట్లాడగలుగుతున్నాను"
"ఇక నడవలేను. ఇక్కడ కూర్చుందాం" చెప్పాడు విగ్నేష్. ఇద్దరూ అక్కడ మట్టిలో కూర్చున్నారు.
బీచ్ అంతా ప్రజా సందడితో కోలాహళంగా ఉంది. అలలతో వెళ్ళి, వాటితోనే తిరిగి వస్తున్న యువకులు. పిల్లల చేతులు పుచ్చుకుని సముద్ర తీరం నీటిలో నిలబడ్డ తండ్రులు. ఇసుకలో ఇళ్ళు కట్టి, అలలు వచ్చి వాటిని కొట్టుకుని పోతుంటే ఆనంద పడుతున్న పిల్లలు. కాళ్ళు మాత్రమే తడేసే విధంగా నడిచి వెడుతున్న యంగ్ గరల్స్. తమతో తీసుకు వచ్చిన వస్తువులను కాపాడుకోవాటానికి వాటికి దగ్గరగా కాపలాకు కూర్చున్న మహిళలు...ఇలా ప్రజా సమూహంతో నిండిపోయున్నది ఆ సముద్ర తీరం.
"నువ్వు నాతో పాటు ఇంత సావకాశంగా కూర్చుని మాట్లాడి చాలా రోజులయ్యింది తెలుసా?" విగ్నేష్ ను చూసి అన్నాడు సురేష్.
"నిజమే...కానీ దానికి నేను కారణం కాదు. నువ్వే కారణం. నువ్వు ప్రతి రోజూ ‘వాక్ ఇన్ ఇంటర్ వ్యూ’ ఎక్కడ జరుగుతున్నాయో...అక్కడికి వెడుతున్నావు! అందరూ ఇంటర్ వ్యూ, పరీక్షలు లాంటి వాటికి వెళ్ళేటప్పుడు నా దగ్గరకొచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రార్ధన చేసుకుంటారు. నువ్వేంట్రా అంటే...ఇంటర్ వ్యూ లంటూ, వాటికొసం నిన్ను నువ్వు తయారుచేసుకోవటంలో పడి కనీసం నన్ను తలుచుకునే టైము కూడా లేకుండా తిరుగుతున్నావు" చెప్పాడు విగ్నేష్.
"నీ దయతో నేను సెలెక్ట్ అయితే, అది ప్రతిభ లేని వాడికి రెకమండేషన్ లాగా అయిపోతుంది. నేను నీకు కొబ్బరికాయ కొడతానని మొక్కుకుంటే...దానికి పేరు లంచం! ఏ విజిలన్స్ వారు నిన్ను పట్టుకోలేరు. నా మేధస్సును, నా మార్కులను నమ్ముకుని ఇంటర్ వ్యూ లకు వెడుతున్నాను"
"ఏం ప్రయోజనం? ఒక్క ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అవలేక పోయావే?"
"అందుకని...నీ కాళ్ళకు మొక్కి, నీకు లంచం ఇస్తానని ప్రామిస్ చేస్తేనే నేను సెలెక్ట్ అవుతానా?" కోపంగా అడిగాడు సురేష్.
“కోపగించుకోకు సురేష్!...సరదాగా నిన్ను కవ్వించి చూశాను. రేపు జరగబోయే ‘వాక్ ఇన్ ఇంటర్ వ్యూ’ లో నువ్వు సెలెక్ట్ కావాలని నేను విష్ చేస్తున్నాను"
"రేయ్ సురేష్...లేవరా! ఇంటర్ వ్యూ కి వెళ్ళాలని చెప్పావుగా! టైమవుతోంది...లేవరా..." తల్లి గొంతు లోతైన బావిలో నుండి వినబడుతున్నట్టు అనిపించడంతో విగ్నేష్ మరియు బీచ్ సురేష్ కళ్ళ (కల) నుండి చెదిరిపొయాయి. సురేష్ కళ్ళు తెరిచి చూశాడు. వంట గదిలోని మసాలా వాసనతో తల్లి అరుపులు వచ్చి చేరుతున్నాయి.
"లేచాను" తల్లికి వినిపించేలా గట్టిగా అరుస్తూ పక్క మీద నుండి లేచాడు సురేష్. గోడ గడియారం ఎనిమిది గంటలా ఐదు నిమిషాలు చూపిస్తోంది. దాని పక్కనున్న మేకుకు వేలాడదీసున్న వినాయకుని క్యాలండర్ గాలికి అటూ, ఇటూ ఆడుతోంది.
కొన్ని రోజుల ముందువరకు ఆ మేకుకు పార్వతీ-పరమేశ్వరుల క్యాలండర్ తగిలించి ఉంచాడు సురేష్. అంతకు ముందు...అంటే కొన్ని సంవత్సరాల క్రితం అదే మేకుకు వెంకటేశ్వర స్వామి క్యాలండర్ ఉండేది. ఆ క్యాలండర్ బాగా పాతబడిపోయి, రంగులు మారిపోయి, చిరుగుతున్న దసలో ఆ క్యాలండర్ తీసేసి ఆంజనేయ స్వామి, శీతారాములు, లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి క్యాలండర్లు చోటుచేసుకున్నాయి. అందరు దేవుళ్ళూ సురేష్ను ఆశీర్వదిస్తునే ఉన్నారు.
ఇప్పుడున్న వినాయకుని క్యాలండర్ను సురేష్ స్నేహితుడు మురళి ఇచ్చాడు. వినాయకుడి క్యాలండర్ వచ్చిన తరువాత, అప్పటి వరకు సరాసరి విధ్యార్ధిగా ఉన్న సురేష్ డిగ్రీ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుని పాసయ్యాడు. అందుకనే వినాయకుని క్యాలండర్ పాతబడిపోయినా ఆ క్యాలండర్ ను తీసేయకుండా అక్కడే ఉంచాడు.
"తండ్రీ విగ్నేశ్వరా...నువ్వెప్పుడూ నాకు తోడుండాలి" మనసులోనే ప్రార్ధించుకుంటూ గబగబా పళ్ళుతోముకుని, స్నానం చేసి, టిఫిన్ తిని ‘వాక్ ఇన్ ఇంటర్ వ్యూ’ కు బయలుదేరాడు.
కలలో వచ్చిన వినాయకుడు తనతోనే ఉన్నాడన్న బ్రమ సురేష్ కు ఏర్పడింది. ఇంటర్ వ్యూ కు వచ్చిన మిగిలిన క్యాండిడేట్ల కంటే వినాయకుని ఆశిస్సులు తనకే ఎక్కువగా ఉందనే గర్వంతో హుందాగా, ధైర్యంగా కూర్చున్నాడు.
కానీ ‘వాక్ ఇన్ ఇంటర్ వ్యూ’ లో సురేష్ ఓడిపోయాడు.
"రాత్రంతా వినాయకుడు కలలో వచ్చాడని ఎంతో నమ్మకంగా ఉన్నాను...అంతా వృధా అయ్యిందే" అంటూ గొణుక్కుంటూ ఇంటికి బయలుదేరిన సురేష్ ఇళ్ళు చేరగానే మొదటి పనిగా తన గదిలోని వినాయకుని క్యాలండర్ను ఊడదీసి, చుట్టచుట్టి మంచం క్రింద ఉన్న పెట్టేలో పడేశాడు. మంచం మీద విరక్తిగా పడ్డాడు. కలలో వచ్చిన విగ్నేశ్వరుడు...నిజ జీవితంలో తనని పట్టించుకోవటం లేదని మదన పడ్డాడు.
"ఇప్పుడే వచ్చాడు...అంతలో నిద్ర పోయాడు" తల్లి ఎవరితోనో చెప్పటం వినిపించింది.
"ఎవరో వచ్చారు! ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేను" అనే నిర్ణయానికి వచ్చిన సురేష్ పక్కనున్న దుప్పటి లాక్కుని మొహం నిండా కప్పుకుని ముసుగు తన్నాడు. "ఇంకా ఎన్ని ఇంటర్ వ్యూ లలో ఇలా ఓటమిని ఎదుర్కోవాలి?" అని అనిపించడంతో సురేష్ మనసు భారమైంది. గొంతుక అడ్డుపడింది...కళ్ళల్లో నీళ్ళు పొంగినై.
"ఈ ఉద్యోగం రాకపోతే ఇంకో ఉద్యోగం! ఇంటర్ వ్యూ కు వెళ్ళొశ్తేనే ఇంతే...ఏదో జీవితమే పోయినట్లు డీలా పడిపోతాడు. ముసుగు తన్ని పడుకుంటాడు. నువ్వైనా వాడికి కొంచం ధైర్యం చెప్పు" అనే తల్లి మాటలతో పాటూ ఎవరో తన గదికి వచ్చారని గ్రహించాడు సురేష్.
"సురేష్... సురేష్...రేయ్ సురేష్" స్నేహితుడు జాన్సన్ పిలుపు!....ముఖం వరకు కప్పుకున్న దుప్పటిని తీసేసి లేచి కూర్చున్నాడు సురేష్.
"సురేష్...బాధ పడకు! మా కంపెనీలో ఖాలీలున్నాయి. వెంటనే అప్లై చెయ్యి" అన్నాడు జాన్సన్.
"మీ కంపెనీలో చేరాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా ఉండాలి కదా...నాకు అంత లేదే"
"నాకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ చూసి నాకే ఉద్యోగం ఇచ్చారు...నీకేం తక్కువరా? నా కన్నా నీకు ఇంగ్లీష్ నాలడ్జ్ ఎక్కువే...అప్లై చెయ్యి, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు.తప్పకుండా ఉద్యోగం వస్తుంది" నమ్మకాన్ని అందించాడు.
జాన్సన్ చెప్పినట్లే దేవుడు సురెష్ కి అన్యాయం చేయలేదని సురేష్ నమ్మాడు. కారణం జాన్సన్ పనిచేస్తున్న కంపెనీలో సురేష్ కి ఉద్యోగం దొరికింది. మంచం క్రింద నుండి చుట్టచుట్టి పడేసిన వినాయకుని క్యాలండర్ తీసి మళ్ళీ మేకుకు తగిలించాడు సురేష్. ఆనందంగా ఉద్యోగాని వెళ్ళి వస్తున్నాడు సురేష్. అలాగే కొన్ని రోజులు గడిచినై.
సడన్ గా ఒక రోజు సురేష్ కలలో దేవుడు ప్రత్యక్షమయ్యేడు. కొన్ని వేలమంది మధ్యలో ఎత్తైన్ స్టేజీ పైన ఆయన నిలబడి ఉన్నాడు. చేతిలోని పన్నీరు సీసాలోని జలాన్ని అందరిపైనా జల్లాడు. దూరంగా నిలబడున్న సురేష్ మీద కూడా ఆ జలం చుక్కలు పడ్డాయి.
ఈ కల గురించి జాన్సన్ కి చెప్పినప్పుడు "దేవుడి ఆశీస్సులు నీకు ఉన్నాయి రా...అందుకే నీకు కలలో అలా కనిపించాడు" చెప్పాడు జాన్సన్.
వినాయకుని క్యాలండర్ పక్కన ఇప్పుడు ఏసు ప్రభువు క్యాలండర్ కూడా తగిలించాడు. రోజూ నిద్ర లేచిన వెంటనే రెండు క్యాలండర్లకూ దన్నం పెట్టుకుంటున్నాడు సురేష్.
***********************************
అలారం మోత సురేష్ కు చిరాకు తెప్పించింది. విసుగుతో దాన్ని ఆపాడు. దుప్పట్లో నుండి బయటకు రావడానికి ఇష్టపడలేదు.
మంచి జీతం, మర్యాద. రోజులు బాగానే గడిచినై...ఎవరి దిష్టి తగిలిందో ఎమో...ఒక రోజు అన్నీ తలకిందలుగా మారినై.....మళ్ళీ ఉద్యోగ వేట మొదలుకు వచ్చింది! నిద్ర పట్టక చిరాకుగా అటూ ఇటూ దొర్లుతున్న సురేష్ కు గిన్నెల మోత వినిపించింది. తండ్రి భోజనం చేస్తున్నాడు. తల్లి వడ్డిస్తోందని గ్రహించాడు.
"సురేష్ ను ఏమీ త్తిట్టకు! వాడు లేచినప్పుడే లేవని. విధి వాడితో ఆటలాడుకుంటోంది. వాడేం చేశ్తాడు పాపం"...తండ్రి మాటలు సురేష్ ను ఇంకా బాధకు గురిచేసినై.
"ఇలా నన్ను అర్ధం చేసుకునే తల్లితండ్రులకు నేను తిరిగి ఏంచేయగలనో...నాతో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి హత్య చేయబడ్డ కారణంగా నన్ను అరెస్టు చేయడం...ఉద్యోగంలో నుండి తీసేయడం ఏ విధంగా న్యాయం? తరువాత నిజమైన హంతకుడు దొరికినందువలన నన్ను విడిచిపెట్టారు. కానీ నాకొచ్చిన చెడ్డ పేరు తొలగిపోతుందా ఏమిటి?...లంచం ఇచ్చి పనిలో చేరాడు...పై అధికారులను బుట్టలో వేసుకుని తన పని సాధించుకున్నాడు...అన్నారు" వేదనతో సురేష్ మనసు భారమయ్యింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.
పడుకో బుద్ది కాలేదు...దుప్పటి తొలగించుకుని లేచాడు. గోడకు తగిలించున్న దేవుళ్ళ ఫోటోలను చూడటానికే ఇష్టంలేదు. దుప్పటి మడతపెడుతూ "వాళ్ళేం చేయగలరు...నాకు టైము సరిగ్గా లేదు!" మనసులోనే అనుకుంటూ మెల్లగా స్నానాల గదివైపు నడిచాడు.
మళ్ళీ ఉద్యోగ వేట మొదలుపెట్టి, దానికొసం తిరిగి తిరిగి విసుగు పుట్టింది. సమయం గడపటానికి లైబ్రరీకి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఉద్యోగ అవకాశల వార్తలను పేపర్లలో చదువుతూ, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను కూడా చదివేడు...దానితో పాటు స్వీయ నమ్మకం పెంచే పుస్తకాలు కూడా చదివాడు.
ఆ పుస్తకాలు చదివిన తరువాత ఒక రోజు "నేను ఏదైనా సాధించగలను" అని ఒక తెల్ల కాగితంపైన పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. దాన్ని ఒక అట్టపై అతికించాడు. దేవుళ్ళ ఫోటోలకు మధ్య దాన్ని తగిలించాడు.
"ఏమండీ...సురేష్ ఇప్పుడు చాలా మారిపోయాడు. ఏవేవో పరీక్షలకు చదువుతున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడూ, కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా వాడు ఇలా గంటల తరబడి చదువుకోలేదండి" సురేష్ లో వచ్చిన మార్పును భర్తతో చెప్పింది సురేష్ తల్లి.
“నేనూ గమనించాను...వాడి ఆలొచనలే ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి" భార్యతో అంగీకరించాడు సురేష్ తండ్రి.
సురేష్ యొక్క కఠిన శ్రమ అతన్ని ఐ.ఏ.ఎస్ పరీక్షలలో విజయం సాధించేట్లు చేసింది.
“మనసులో నమ్మకం ఉంటే ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది. ఏది అనుకుంటే అది జరుగుతుంది" అనే విషయాన్ని తన అనుభవంలో తెలుసుకున్నాడు సురేష్.
***********************************
ఆ రోజు నిద్ర పోతున్నప్పుడు సురేష్ కు కలలో దేవుళ్ళు కనిపించారు.
అదే బీచ్...అదే గాలి.
"ఇప్పుడంతా మమ్మల్ని మరచిపోయావు కదా?...ఇప్పుడు నువ్వు సాధించిన విజయానికి కారణం మేమే...తెలుసా?" అన్నారు.
"అబద్దం...నేను చదివిన పుస్తకాలు నా మేదస్సును పెంచినై. నా విజయానికి కారణం అదే. మాయలు చేసే మిమ్మల్ని ఇంక నమ్మదలచుకోలేదు" చెప్పాడు సురేష్.
"ఉద్యోగాలు వెతికి వెతికి అలసిపోయిన నీకు మంచి ఉద్యోగం దొరికేటట్లు చేసేమే...మరచిపోయావా?"
"నేను ఎవరినీ నమ్మదలచుకోలేదు. నన్ను మాత్రమే నమ్ముతున్నాను. ఏదైనా సాధించగలను అనే మనో ధైర్యం నా దగ్గరుంది...ఇక మీరు కధలు చెప్పకండి"
"నీలో మనో ధైర్యం అనే శక్తిగా ఉన్నది మేమే".....మాటలు గంభీరంగా వినబడ్డాయి. ఆ శబ్ధానికి నిద్రలేచాడు. అటూ ఇటూ చూశాడు. కానీ ఏ రూపాన్నీ క్లియర్ గా చూడలేకపోయాడు.
"......................."
"మనో ధైర్యం పేరుతో నీ మనసులో ఒక భాగంగా ఉండేది దేవుళ్ళే" ఇప్పుడు మాటలు అతనిలో నుండే వినబడ్డాయి.
సురేష్ గబుక్కున లేచాడు. తల విధిలించుకున్నాడు. “కలా ఇది? కాదు...నిజంగానే ఎవరో మాట్లాడినట్లు ఉన్నదే!” ..... గోడవైపు చూశాడు. మేకుకు తగిలించిన అతని రాతలు కనిపించినై. తాను లైబ్రరీలో చదివిన ఒక పుస్తకంలోని వాఖ్యాలు గుర్తుకు వచ్చినై.
"మనసుకు అనంతమైన శక్తి ఉన్నది. దానితో అద్భుతాలు సృష్టించవచ్చు. మనసే శరీరాన్ని నడిపిస్తోంది. రోజువారి అవసరాలకు ప్రత్యేకించి మనసు అవసరం లేదు. ఎందుకంటే ఆ పనులకు అలవాటు పడిన మనసు వాటిని అలవోకగా చేస్తుంది. కానీ సృజనాత్మకమైన పనులు చేయాలంటే, మనసులో కొత్త కోణాలు ఆవిష్క్రుతం కావాలి. ఉపయోగించుకోవడానికే మనసు ఉన్నా, మనిషికి ఆ పద్దతి తెలియదు. అద్భుతమైన పనులు సాగించాలంటే, మనిషి మనసులో నూతన ఆలొచనలు రావాలి. నిత్యం తనను తాను పరిశీలించుకొనేవారికి మనసు చేస్తున్న పని అవగాహనకు వస్తుంది.ప్రతి పనీ మనసు అధీనంలోనే సాగుతుంది. మనసు అధీనంలో మనిషి ఉంటాడు. అతడు తన మనసులోని శక్తినంతా ఆత్మాన్వేషణ వైపు మళ్లిస్తేనే, మనసును సరిగ్గా ఉపయోగించుకున్నట్లు లెక్క. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని మనసులోకి బీజంగా నెట్టి, దానికీ రోజూ శ్రమ అనే నీటిని పోస్తే నువ్వు ఏదైనా సాధించగలవు"
"ఇదంతా (కలలు కూడా) మనసు పనే!"....హాయిగా నవ్వుకున్నాడు సురేష్.
***********************************************సమాప్తం******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి