పరిగెత్తు...దాక్కో!...(కథ)

 

                                                                              పరిగెత్తు...దాక్కో!                                                                                                                                                                (కథ)

ఈ సమాజంలో డబ్బో, పదవో ఉంటే...అంతస్తో, రాజకీయమో పక్క బలంగా ఉంటే...నేరాలు చెయచ్చు, శిక్షల నుండి ఎలాగూ తప్పించుకోవచ్చు అని అనుకేనే వాళ్ళు పెరిగిపోయారు.

రాసుంచిన చట్టాలన్నీ వాళ్లకోసం తలవంచుతాయి. తమకు తలవంచని వాళ్ళను డబ్బుపెట్టి కొనుక్కోవటానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం ఓడిపోతే తలవంచని వాళ్ళు కనబడకుండా పోతారు.

ఇది అన్యాయం అనుకున్న కాలంపోయి, ఇదే యదార్ధం అని ఒప్పుకునే మనో పరిస్థితికి తోయబడ్డాం.

డబ్బూ, పలుకుబడి ఉన్నవాళ్ళు చట్టానికి ఎదురుగా నడుచు కుంటే, వాళ్ళను  ఎదిరించి సామాన్యుడు పోరాడగలడా?

***************************************************************************************************

ఆ పోలీసు జీపు వేగంగా ఆ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోకి దూరి, తిన్నగా వాకిలి ముందు ఆగింది.

జీపులో నుండి ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి దిగారు.

స్టేషన్లో వాళ్ళంతా ఆటెన్షన్లో నిలబడ్డారు.

లోపల బెంచి మీద ఇన్‌స్పెక్టర్ కోసమే గంటసేపటి నుండి కాచుకుని కూర్చున్న హేమా కూడా లేచి నిలబడింది.

వేగంగా స్టేషన్ లోపలకు నడుచుకుంటూ వచ్చిన ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి, హాలులో ఆగి అక్కడున్న ఒక పోలీసు అధికారితో మిస్టర్. కాంతా రావ్...ఆ రాయప్ప కేసు ఫైలు తీసుకుని నా గదికి రండి అని చెప్పి, తన గదిలోకి వెళ్ళిపోయారు.

అంతసేపు ఆయనకోసమే కాచుకోనున్న హేమా, అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి సార్...నేను ఇన్‌స్పెక్టర్ గారిని చూడచ్చా?”

ఉండమ్మా...ఆయన ఇప్పుడే కదా వచ్చారు.  వస్తున్నప్పుడే ఎస్.ఐ.కాంతా రావు గారితో ఏదో కేసు ఫైలు తీసుకుని ఆయన గదికి రమ్మన్నారు. అదేమిటో తేలిన తరువాత మీరు వెళ్దురుగాని...అంతవరకు కూర్చోండి అన్నాడు అతి చిన్న స్వరంతో.

చేసేదేమీ లేక హేమా వెనక్కి తిరిగి తాను ఇంతకముందు కూర్చున్న బెంచి దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

ఎస్.ఐ. కాంతారావ్ ఒక ఫైలుతో లోపలకు వెళ్ళాడు.

పావుగంట తరువాత బయటకు వచ్చాడు.

అది చూసి హేమా హెడ్ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళింది.

ఒక్క నిమిషం ఆగండి. ఆయన్ని అడిగి వస్తాను అని చెప్పి ఇన్‌స్పెక్టర్ గదిలోకి వెళ్ళి ఐదు నిమిషాల తరువాత బయటకు వచ్చి మీరు వెళ్ళండి అన్నాడు.

ఎక్స్ క్యూజ్ మి సార్ అంటూ గది తలుపులు తోసుకుని లోపలకు వెళ్ళింది.

ఎస్...రండి...కూర్చోండి

హేమా కూర్చుంది.

చెప్పండి అన్నాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

మా అన్నయ్య కనబడటం లేదండి

మీ అన్నయ్య వయసు ఎంత?”

ముప్పై ఐదు

అంతపెద్ద యువకుడు కనబడకుండా పోయాడంటే అలా చెప్పకండి. ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పండి. అలా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళను, అందులోనూ ముప్పై ఐదు ఏళ్ళ వ్యక్తి అంటే మేము వెతకటం వేస్టు. ఇంట్లో గొడవలతో వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళే తిరిగి వస్తారు. మీరు కంగారు పడకండి

మా అన్నయ్య ఇంట్లొంచి వెళ్ళిపోయే వ్యక్తి కాదు సార్. బరువు, బాధ్యతలు తెలిసిన మనిషి. తండ్రి లేని మా కుటుంబాన్ని తనొక్కడే లాక్కొస్తున్నాడు. దానికోసం ఇంతవరకు అతను పెళ్ళి కూడా చేసుకోలేదు. ముప్పై ఐదు ఏళ్ళున్న వ్యక్తి, అతనే తిరిగి వస్తాడు అని చెబుతున్నారే, మా అన్నయ్య ఆఫీసుకు వెల్తున్నానని చెప్పి వెళ్ళి నాలుగు రోజులైంది సార్. అన్ని చోట్లా ఎంక్వయరీ చేసిన తరువాతే ఇక్కడికి వచ్చాను సార్

సరే...మీ మాటకే వస్తాను. మీ అన్నయ్య కనబడకుండా పోయాడని మీరెలా ఖాయపరచుకున్నారు

సార్...మా అన్నయ్య రెండు మూడు నెలలకు ఒకసారి ఆఫీసు పనిమీద బయట ఊర్లకు వెడతాడు. అదేలాగా, ఆఫీసు పనిమీద రెండు రోజులు పనుందని, చీరాల వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. నాలుగు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవటం, కనీసం ఫోను చేయటం కూడా లేకపోవటం, మేము ఫోను చేసినా స్విచ్ ఆఫ్ చెయబడిందని చెబుతోంది. ఈ రోజు ప్రొద్దున నేను నేను మా అన్నయ్య ఆఫీసుకు ఫోను చేశాను. మీ అన్నయ్యకు బయట ఊరి ప్రోగ్రామే లేదు. మేము అతన్ని ఎక్కడికీ పంపలేదు. అతనే ఏదో వ్యక్తిగత పని ఉన్నదని రెండు రోజులకు సెలవు చీటీ రాసిచ్చి వెళ్ళాడు. ఇప్పటికి నాలుగు రోజులు అవుతోంది.  అందుకని అతని సెల్ ఫోనుకు ఫోన్ చేసి కనుక్కుందామనుకుంటే, అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. మేమే మీకు ఫోన్ చేసి కనుక్కుందామని అనుకుంటున్నాము, ఈ లోపు మీరే చేశారు. ఇప్పుడు మాకున్న కంగారు ఎక్కువయ్యింది. మాసైడు నుండి నేను టోటల్ ఎంక్వయరీ చేసి మరో గంటలో మీకు ఏ విషయం చెబుతాను. ఈలోపు మీరూ మీ వైపు ఎంక్వయరీ చేయండీ అన్నారు.

మావైపు బంధువులు అని చెప్పుకోటానికి ఎవరూ లేరు. ఉన్న ఒకలిద్దరితో మాకు కాంటాక్ట్ లేదు. మేము పేదవాళ్ళమని మమ్మల్ని వెలి వేశారు. అందువల్ల అక్కడికి వెళ్ళుండడు. ఇకపోతే అన్నయ్య స్నేహితులు. అన్నయ్యకు ఆఫీసులో కొలీగ్స్ తప్ప ప్రత్యేకంగా, విడిగా స్నేహితులు ఎవరూ లేరు.

గంట తరువాత అన్నయ్య ఆఫీసు నుండి ఫోను వచ్చింది. ఎవరికీ ఏమీ తెలియదని చెప్పారట. అందుకే ఇక్కడికి వచ్చాను

ఓ.కే. మిస్...

హేమా...

మిస్ హేమా, మీ అన్నయ్య డీటైల్స్ విత్ ఫోటో మా ఎస్.ఐ. దగ్గర ఇచ్చి వెళ్ళండి. మేము మా ఎంక్వయరీ మొదలు పెడతాము అన్నాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

అలాగే సార్...కానీ, మీరు...

మీరేం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు. మీ అన్నయ్యను త్వరగా వెతికి పెట్టమంటారు. చూడండి మిస్. హేమా, మిగతా స్టేషన్ల గురించి నాకు తెలియదు. చక్రవర్తి స్టేషన్ అంటే, ఇక్కడకొచ్చే అన్ని కేసులూ మాకు ముఖ్యమే. ఎటువంటి నిర్లక్ష్యము ఉండదు. కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి

హేమా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది.

**************************************************PART-2******************************************

సునీల్ షిప్పింగ్ అండ్ ట్రేడింగ్ కార్పోరేషన్అనే బోర్డు ఉన్న ఆఫీసు ముందు ఆ పోలీసు జీపు ఆగింది.  అందులో నుండి ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి, ఎస్.ఐ. కాంతారావ్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ మఫ్టీ డ్రస్సులో దిగారు.

వేగంగా ఆఫీసు లోపలకు వెళ్ళారు.

ఎంట్రన్స్ లో ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గర తన ఐడీ చూపించి మీ ఎం.డీ. ని కలవాలి అన్నాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

ఆమె ఇంటర్ కాం తీసి ఎం.డి. కి విషయం చెప్పి, “వెళ్లండి సార్, రైట్ సైడ్ కార్నర్ రూము అన్నది.

పోలీసులు అటువైపు వెళ్లారు.

మిస్టర్. సుబ్రమణ్యం...మేము మీ ఆఫీసులో పనిచేస్తున్న రమేష్ గురించి ఎంక్వయిరీ చేయటానికి వచ్చాము

కూర్చోండి సార్

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి, ఎస్.ఐ. కాంతారావ్ ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు.

అడగండి సార్

మిస్టర్. రమేష్ ఎన్ని రోజుల నుండి ఆఫీసుకు రావటం లేదు?”

ఈ రోజుకి ఐదో రోజు సార్

అతన్ని మీరేమన్నా బయట ఊరుకు పంపారా లేక అతనే సెలవు పెట్టుకుని వెళ్లాడా?”

"మేము పంపలేదు సార్...అతనే ఏదో వ్యక్తిగత పని ఉన్నదని చెప్పి రెండు రోజులకు సెలవు చీటీ రాసిచ్చాడు. రెండు రోజులనేది నిన్నటికి నాలుగు రోజులయ్యింది. వర్క్ లో  చాలా బ్యాక్ లాగ్ పడుతోంది. అందుకని అతన్ని కాంటాక్ట్ చేద్దామని అతని సెల్లుకు ఫోను చేశాము. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంటికి ఫోన్ చేసి కనుక్కుందామని వాళ్ళ సిస్టర్ హేమాకు ఫోన్ చేశాము. ఇంటి దగ్గర ఆఫీసు వర్క్ మీద, మా దగ్గర వ్యక్తిగత పని మీద అని రెండు కథలు చెప్పినట్టు తెలుసుకున్న మాకు కొంచం ఆందోళనగా ఉంది

మీకెందుకు ఆందోళన కలిగింది

అతను రెండు కథలు చెప్పాడు. అతను అలా ఎందుకు చెప్పాడో మాకు అర్ధం కాలేదు. ఎందుకంటే రమేష్ అలాంటి వ్యక్తి కాదు. చాలా సిన్సియర్ మనిషి. అతను ఇలా చేయటం మాకు ఆందోళన కలిగిస్తోంది

పరవాలేదే, ప్రజలు కూడా మాలాగా ఆలొచిస్తున్నారే. గుడ్ జాబ్. అది సరే మీ ఆఫీసులో రమేష్ క్యాష్ డీలింగ్...

మా ఆఫీసులో క్యాష్ డీలింగ్ లేనే లేదు సార్. ఏదైనా సరే ఓన్లీ చెక్ డీలింగ్

పేమెంట్ డిస్పర్సల్, కొటేషన్స్ అడగటం -- ఇలాంటి పనులు ఏదైనా

లేదు సార్. అతను మా ఆఫీసులో ఫైనాన్షియల్ ఆడ్వైజర్. మా పెట్టుబడులు, ఖర్చులు, కొత్త పెట్టుబడులు ప్రోగ్రాం చేస్తాడు. హీ ఈజ్ ఏ ఫినాన్షియల్ అడ్వైజర్. అంతే

మీ ఆఫీసులో అతనితో ఎవరూ ఎక్కువగా క్లోజ్ గా ఉంటారు

వ్యక్తిగత సన్నిహితం ఎవరికీ లేదు...ఆఫీషియల్ సన్నిహితం ఎస్. మా చీఫ్ అకౌంటంట్. ఆయనే కనీసం రోజుకు నాలుగైదు సార్లు అతన్ని కలుస్తాడు

ఆయన కాకుండా ఇంకెవరితోనైనా?”

నాకు తెలిసి లేదు సార్!

ఆయన్ని, అదే మీ చీఫ్ అకౌంటంటును పిలవండి

ఎం.డి. ఇంటర్ కాం తీసి ఒక నెంబర్ నొక్కి ఒకసారి నా గదికి రండి అని చెప్పి పెట్టేశారు.

చీఫ్ అకౌంటంట్ వచ్చారు.

మీ దగ్గర ఒక చిన్న ఎంక్వయరీ కోసం వచ్చాము. మిస్టర్. రమేష్ గారు ఈజ్ మిస్సింగ్. బహుశ మీకు తెలిసే ఉంటుంది. ఆయన క్యారక్టర్ గురించి మీకు తెలిసింది చెప్పండి అడిగాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

ఆయన మోస్ట్ డీసెంట్ అండ్ స్ట్రిక్ట్ పర్సన్ సార్. ఆయన చెప్పిన పనిని ఆయన చెప్పిన టైముకు పూర్తి చేసి ఇవ్వకపోతే ఆయనకు కోపం వస్తుంది. తిడతారు

ఇది అఫీషియల్...పర్శనల్ గా?”

నాకు ఆయనతో అఫీషియల్ రిలేషనే తప్ప పర్శనల్ రిలేషన్ లేదు సార్. ఆయన ఎప్పుడూ పర్శనల్ విషయాల గురించి మాట్లాడిందీ లేదు, అడిగిందీ లేదు సార్

ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా...ఐ మీన్ ఆయన ఎవరితోనైనా పెద్దగా గొడవపడటం అదీ ఏమైనా చూసారా?”

నో...సార్!

ఓ.కే. యూ కాన్ గో! ఏం.డి. గారు, మేము రమేష్ గారి రూము చెక్ చేయాలి

రండి సార్

ఎం.డి వాళ్ళను రమేష్ గదికి తీసుకు వెళ్ళారు.

కాంతారావ్, మీరు సెర్చ్ మొదలుపెట్టండి...ఏ కాగితం ముక్క అయినా సరే విడిచిపెట్టకండి, ఇగ్నోర్ చేయకండి. ఈ కేసు చూస్తే కొంచం కాంప్లికేటడ్ గా కనిపిస్తోంది

ఎస్ సార్ అని చెప్పి, అందరూ తలో వైపు నుండి ఆ గదిని చెక్ చేశారు.

ఒక గంట తరువాత క్లూగా ఏమీ దొరకలేదని నిర్ణయానికి వచ్చారు.

ఓ.కే. ఎం.డి. గారూ. ఈ రూములో మాకు ఎటువంటి క్లూదొరకలేదు. అయినా ఈ కేసు ముగిసేంతవరకు మేము ఈ రూము సీల్ చేస్తున్నాము. అవసరమైతే ఇంకోసారి వస్తాము. ఈ రూము నుండి మీకేదైనా కావలసి వస్తే నాకు ఫోన్ చేయండి. నేనొక కానిస్టేబుల్ను పంపిస్తా. ఈలోపు రమేష్ గురించి మీకేదైనా తెలిస్తే మాకు తెలియపరచండి

ఓకే అన్నట్టు ఎం.డి తల ఊప పోలీసులందరూ బయలుదేరి వెళ్ళారు.

**************************************************PART-3******************************************

జీపులో తిరిగి వెడుతూండగా డ్రైవర్ రత్నా హోటల్ దగ్గర జీపు ఆపు. టిఫిన్ తిని వెళదాం అని చెప్పాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

అలాగే సార్ అని చెప్పి డ్రైవర్ జీపును కుడివైపుకు తిప్పాడు.

కాంతా రావ్. మిస్సింగ్ పర్సన్స్ లిస్టులో రమేష్ పేరు, ఫొటోను కంట్రోల్ రూముకు పంపించారా?”

పంపించాను సార్

ఈ రోజు మార్నింగ్ మన స్టేషన్ కు వచ్చిన యాక్సిడెంట్ లిస్టు, ఫోటోలూ చెక్ చేశారా?”

చూసాను సార్

ఎనీ సస్ పెక్టివ్ ఇన్ ఫరమేషన్

సో ఫార్ నో...సార్

హోటల్ వచ్చింది. అందరూ దిగి హోటల్ లోపలకు వెళ్ళి టిఫిన్లు కానిచ్చి, బయటకు వచ్చారు.

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తికి ఫోన్ వచ్చింది. జేబులో నుండి సెల్ ఫోన్ తీసి ఎస్.ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి హియర్

సార్...నేను సైబర్ సెక్యూరిటీ నుండి మాట్లాడుతున్నాను సార్. ఇందాక మీరొక సెల్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమన్నారు...

ఆ...చెప్పండి

సార్...ఆ నెంబర్ రైల్వే స్టేషన్ దగ్గర స్విచ్ ఆఫ్ చేయబడింది. ఆ తరువాత మళ్ళీ ఆన్ అవలేదు సార్

సరే నేను చూసుకుంటా అని చెప్పి తన్ సెల్ ఫోన్ను జేబులో పెట్టుకున్నాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

సార్ మన తరువాత ప్లాన్...

మిస్టర్. రమేష్ ఇంటికి వెళదాం

జీపు ఆగిన శబ్ధం విని హేమా బయటకు వచ్చింది. ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి కొందరి వ్యక్తులతో మఫ్టీలో లోపలకు వస్తుండటం చూసింది.

రండి సార్! కూర్చోండి అంటూ సోఫా చూపించి అమ్మా అంటూ తల్లిని కేకేసింది.

మిస్. హేమా, మేమంతా పోలీసులమే. మఫ్టీలో వచ్చాము. పోలీసు డ్రస్సులో వస్తే చుట్టు పక్కల కలవరం ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని దుఃఖం విచారిస్తారు. అనవసరమైన మాటలు అంటారు

అర్ధమయ్యింది సార్! ఈమె మా అమ్మగారు బాలమ్మ -- తల్లిని పరిచయం చేసి చెప్పండి సార్...ఎనీ ప్రోగ్రస్?”

నిన్ననే కదా కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడే ప్రోగ్రస్ కనబడాలంటే మీ అన్నయ్యే రావలి. మీ అన్నయ్య గురించిన మా విచారణ ఈ రోజు ప్రొద్దున్నే మొదలుపెట్టాము. ఇంతకు ముందే మీ అన్నయ్య ఆఫీసుకు వెళ్ళి విచారించాము. క్లూఏమీ దొరకలేదు

తల్లి కన్నీరు పెట్టుకోవటం, హేమా ముఖం వాడిపోవటం గమనించిన చక్రవర్తి బాధ పడకండి. త్వరలోనే రమేష్ గారిని కనిబెడతాం అన్నాడు వాళ్ళను ఉత్సాహపరచటం కోసం.

ఎలా సార్?” అడిగింది హేమా.

అదే పోలీసుల తెలివితేటలు. మీరు ధైర్యంగా ఉండండి. మేమొకసారి మీ అన్నయ్య గది చెక్ చేయాలి. ఆయనకని ప్రత్యేకంగా గదేమైనా ఉందా?”

ఉంది

చూపించండి

ఇదే సార్

మిస్టర్.కాంతారావ్, గది మొత్తం జల్లెడ వేసి వెతకండి. అనుమానమున్నది ఏదైనా సరే తీసి పెట్టండి

ఓకే సార్!

మిస్. హేమా, మీ అన్నయ్య ఊరికి వెళ్ళిన రోజున గాని, అంతకు ముందు గానీ ఎవరితోనైనా ఫోనులో ఎక్కువసేపు మాట్లాడటం, అరుచుకోవటం లాంటివి ఏమైనా గమనించారా?”

అలాంటిదేమీ జరగలేదు సార్

మీ అన్నయ్యకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?”

అన్నయ్యకు క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరూ లేరు సార్...నేనూ, మా అమ్మమేమిద్దరమే అన్నయ్యకు క్లోజ్ ఫ్రెండ్స్

ఊరు వెళ్ళే రోజు ఆయన ఆక్టివిటీస్ చెప్పగలరా?”

హేమా చెప్పింది.

అందులో ఏదీ అనుమానించ దగినదిగా లేదు.

ఇంతలో ఎస్.ఐ. కాంతారావ్, టీముతో బయటకు వచ్చాడు.

సార్...ఏమీ దొరకలేదు సార్

ఓ.కే... అని కాంతారావుకు చెప్పి, హేమా వైపు తిరిగి మిస్.హేమా, అధైర్య పడకండి. ఇక మా పోలీసు స్టయిలు విచారణ మొదలుపెడతాం. త్వరలోనే మీ అన్నయ్యను కనుక్కుంటాము...ఈ లోపు మీకేదైనా అనుమానమైన విషయం, సమాచారం దొరికితే నాకు ఫోన్ చెయ్యండి అని చెప్పి తన బృందంతో బయటకు వెళ్ళాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

**************************************************PART-4******************************************

అదే పోలీస్ స్టేషన్.

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తికి ఎదురుగా ఎస్.ఐ కాంతారావ్.

ఏమిటి సార్ ఇది. ఆ రమేష్ విషయంలో పది రోజులైనా మనకు ఇంతవరుకు ఒక్క చిన్న క్లూకూడా దొరకలేదు. ఈ కేసు చాలా మిస్టరీగానూ, చాలెంజింగానూ ఉందే

అవును కాంతారావ్. అతనుగా ఎక్కడికైనా వెళ్ళున్నా కనీసం కొత్త నెంబర్ నుండి చెల్లెలుకి ఫోన్ చేసుంటాడు. అది కూడా జరగలేదు. అతని ఆరునెలల కాల్ లిస్టులో ఆఫీసు నెంబర్, హేమా నెంబర్ తప్ప ఇంకేదీ లేదు. అతని ఏరియాలోనూ, ఆఫీసు ఏరియాలోనూ ఉన్న ఏ సి.సి.టి.వి. కెమేరాలలోనూ ఏదీ దొరకలేదు. ఆ రెండు ఏరియాలలోనూ మనం చేపట్టిన పర్సనల్  ఎంక్వయరీ లో కూడా మనకి ఏమీ  దొరకలేదు. లుక్ అవుట్ నోటీస్ కు ఇంతవరకు చిన్న సమాచారం కూడా రాలేదు. ఇప్పుడు ఆ హేమా అడిగితే నేనేం చెప్పను? ఆవిడకీ, ఆమె తల్లికీ నేనిచ్చిన హామీకి నేనేం జవాబు చెప్పను? ఐ యాం టెరిబులీ అప్ సెట్ కాంతారావ్

సార్. ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి ఇలా ఎప్పుడూ మాట్లాడ కూడదు. నిరుశ్చాహ పడకూడదు. ఇప్పటిదాకా మీరు తీసుకున్న ఏ కేసూ ఓడిపోయింది లేదు సార్. ఇది కూడా గెలుస్తారు సార్. ప్లీజ్ డొంట్ లూజ్ కాన్ ఫిడెన్స్

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి మౌనంగా ఉండటంతో మళ్ళీ కాంతారావే మాట్లాడాడు.

సార్...అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేసుంటారేమో?”

కిడ్నాప్ కు కావలసిన మోటివ్ ఏదీ లేదే!... అతన్ని కిడ్నాప్ చేసుంటే ఈ మూడు రోజులలో అతని కిడ్నాపర్స్ ఏవైనా డిమాండ్లు చేసుంటారే. అలాంటిదేమీ లేదే?"

ఇక మన తరువాతి మూవ్ ఏమిటి సార్?”

తెలియదు కాంతారావ్...అదే ఆలొచిస్తున్నా. ఏదైనా ఐడియా తట్టిన వెంటనే పిలుస్తాను. మీరు మీ పని చూసుకోండి

ఎస్. సార్! కాంతారావ్ సెల్యూట్ చేసి బయటకు వెళ్ళాడు.

హేమా లోపలకు వచ్చింది.

హేమా చాలా నీరసంగా కనిపించింది.

కూర్చోండి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

సార్!

మీరేం అడగబోతారో నాకు అర్ధమయ్యింది. మీ అన్నయ్య కేసును స్పీడ అప్ చేశాము. అన్ని దార్లు వెతుకుతున్నాం. త్వరలో కనిబెడతాం. మీరెందుకు ఇంతగా నీరసంగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి

నేను ధైర్యంగానే ఉన్నాను సార్. కానీ మా అమ్మ అలా లేదు. ఏడుస్తూనే ఉంది. ఇంకో రెండు రోజులలో ఇంటద్దె, వంటసామాన్లు -- వీటికి డబ్బు లేదు. నా దగ్గర, అమ్మ దగ్గర ఉన్న నగలలో ఒకటో, రెండో అమ్ముకోవాలి. దానికి మేము బాధపడటం లేదు. కానీ ఇలా ఎన్ని రోజులు. అవి కూడా అయిపోతే ఎలా? అని తలుచుకుని తలచుకుని ఏడుస్తోంది

మిస్.హేమా, ఇలాంటి పరిస్థితిలో మీ అమ్మను ఓదార్చటం కష్టమే. నేను మీ అన్నయ్య ఆఫీసులో కనుక్కుని మీకు మళ్ళీ ఫోను చేస్తాను. మీరు కంగారు పడకండి అని హేమాకు ధైర్యం చెప్పి ఆమెను పంపించాడు గానీ, హేమా చెప్పింది విని ఇన్‌స్పెక్టర్ చక్రవర్తికి బుర్ర వేడెక్కింది..

తన సీటులో వెనక్కి వాలుతూ మొదటిసారిగా దేవున్ని ప్రార్ధించుకున్నాడు.

భగవంతుడా రమేష్ విషయంలో నాకొక క్లూదొరికేటట్టు సహాయపడు. ఆ హేమా, ఆమె తల్లీ బాధను తీర్చు--అని మనసులోనే ప్రార్ధించుకుని ఫోను తీసి రమేష్ ఆఫీసుకు ఫోన్ చేసి ఏం.డి తో మాట్లాడాడు.

సార్...మీరు ఈ విషయం గురించి ఇంతగా చెప్పక్కర్లేదు. మా కంపెనీ రూల్స్ ప్రకారం అన్ ఇన్ ఫార్మెడ్ లీవు పెడితే జీతం ఇవ్వము. కానీ, రమేష్ విషయం అలాంటిది కాదు. మిస్సింగ్ కేసు. కాబట్టి అతని విషయంలో ఆ రూలు అమలు చేయలేము. అంతే కాదు రమేష్ మీద మా కంపనీకి మంచి గురి ఉంది. అంత సులభంగా మేము ఆయన్ని వదులుకోలేము. నేను అతని సిస్టర్ తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను

చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

రమేష్ విషయంలో ఏం జరిగుంటుంది? రమేష్ ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు. అతని క్యారక్టర్ ప్రకారం అయితే అతను అలా చేసుండడు. అతని ఏజ్ గ్రూపులో ఎవరూ చనిపోయినట్టు ఏ పోలీస్ రిపోర్టూ రాలేదు? అతని సెల్ ఫోను ఇంకా ట్రేస్ అవలేదు? కాబట్టి ఇది కిడ్నాప్ కేసే? కానీ రమేష్ ను కిడ్నాప్ చెయటానికి ఎవరికీ ఎటువంటి మోటివ్ ఉన్నట్లు విచారణలో ఎవరి మీదా అనుమానం రాలేదు?’ ఆలొచిస్తున్న ఇన్‌స్పెక్టర్ చక్రవర్తికి అతని సెల్ ఫోన్ మోగటం వినిపించి ఎత్తాడు.

హలో... అన్నది అవతలి గొంతు.

చెప్పండి...నేను ఇన్‌స్పెక్టర్ చక్రవర్తిని మాట్లాడుతున్నాను

సార్...కొద్ది సేపటి క్రితం మీ పోలీసులు వచ్చి మా వీధిలో ఉంటున్న రమేష్ గారి గురించి నా దగ్గర విచారించారు

దానికి...?”

వాళ్ళ దగ్గర ఒక విషయం చెప్పటం మరిచిపోయాను సార్

సీటులో వెనక్కి వాలి కూర్చున్న ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి నిటారు పొజిషన్ కు వచ్చాడు.

చెప్పండి...ఏమిటా విషయం...మీరెవరు?”

సార్ నేను రమేష్ గారు ఉంటున్న వీధిలోనే ఒక ఇస్త్రీ బండీ పెట్టుకుని బతుకుతున్నాను. వారం రోజుల క్రితం రమేష్ గారు నాలుగు బట్టలు ఉతికి, ఇస్త్రీ చేయటానికి నా దగ్గర ఇచ్చారు. బట్టలు ఉతకటానికి ముందు కొంతమంది కస్టమర్లు జేబుల్లో ఏదైనా మర్చిపోయి ఉంచుకుని అలాగే బట్టలు ఇస్తారండి. అందుకని బట్టలు ఉతికే ముందు జేబులు ఒకసారి చెక్ చేస్తాను. అలా చెక్ చేసినప్పుడు రమేష్ గారి ప్యాంటు జేబులో ఒక న్యూస్ పేపర్ కటింగ్ ఉన్నది సార్. అది తీసి దాచి, మరుసటి రోజు నా బండీని దాటుకుని రమేష్ గారు ఆఫీసుకు వెడుతుంటే ఆయన్ని పిలిచి దాని గురించి చెప్పానండి. బట్టలు తీసుకునేటప్పుడు తీసుకుంటాను అని చెప్పారు. దాన్ని నేను బట్టల కింద దాచాను.  ఆ రోజు సాయంత్రమే ఆయన బట్టలు తీసుకుని వెళ్లారు. ఆయనా ఆ న్యూస్ పేపర్ కటింగ్ గురించి అడగలేదు, నాకూ గుర్తుకు రాలేదు. ఆ తరువాత ఆ న్యూస్ పేపర్ కటింగ్ గురించి ఆయనా అడగలేదు. అందుకని అది నాకు గుర్తుకు రాలేదు. ఇందాక మీ పోలీసులు వచ్చి అడిగినప్పుడు రమేష్ గారి గురించి నాకు తెలిసిన వివరాలన్నీ చెప్పాను. ఈ న్యూస్ పేపర్ కటింగ్ గురించి చెప్పలేదు. మర్చిపోయాను

సరే...ఆ న్యూస్ పేపర్ ప్రకటనలో ఏం రాసుంది

సార్...నాకు చదవటం రాదు సార్

ఓకే! ఇంకో పది నిమిషాల్లో నేను అక్కడుంటాను...

అలాగే సార్

మోటార్ సైకిల్ వేసుకుని వచ్చిన ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి దగ్గర ఆ న్యూస్ పేపర్ ప్రకటన కటింగ్ ఇచ్చాడు ఇస్త్రీ బండి అతను.

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి రెండు మడతలుగా ఉన్న ఆ పేపర్ను విప్పి చూశాడు.

కావలెను,

ముప్పై -- ముప్పై ఐదు ఏళ్ల వయసున్న వ్యక్తులు కావలెను...ఒక ప్రత్యేక సినిమాలో హీరోగా నటించటానికి, నటనపై ఇష్టమున్న, శరీర ధారుడ్యం ఉన్నవారు వెంటనే ఈ నెంబర్ కు ఫోను చేసి సంప్రదించవలెను,

జయశ్రీ ఫిల్మ్ సర్క్యూట్.

ఫోన్: 90******90.’

పేపర్ కటింగును జేబులో పెట్టుకుని తిరిగి స్టేషన్ కు వెళ్ళిపోయాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

కుర్చీలో కూర్చోని ఇంకో సారి ఆ పేపర్ కటింగ్ తీసి చదివాడు. వెంటనే సెల్ ఫోన్ తీశాడు. నెంబర్లు నొక్కాడు.

హలో...

జయశ్రీ ఫిల్మ్ సర్క్యూట్

అవును...మీరు?”

నటులు కావాలని ప్రకటన ఇచ్చారు

ఓ...అదా...ఒకతన్ని సెలెక్ట్ చేశారు. మరుసటి రోజు రమ్మని చెప్పారు...వారం రోజులు అవుతున్నా అతను రాలేదు. మీరు పదకుండు గంటలకు ఫోన్ చేయండి. డైరెక్టర్ గారు అప్పుడు ఉంటారు. ఆయన రమ్మంటే మీరు రావచ్చు

మీ ఆఫీసు ఎక్కడుంది?”

ఇప్పుడే ఎందుకు మా అడ్రస్సు. వచ్చి చాన్స్ ఇమ్మని ప్రాణం తీయటానికా. రమ్మన్న అతనేమో రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు -- మా డైరెక్టర్ అడ్రస్సు ఇవ్వమంటే ఇస్తాను అంటూ పెట్టేశాడు.

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి వెంటనే కంట్రోల్ రూముకు ఫోను చేసి ఆ సినిమా కంపనీ అడ్రస్సు కనుక్కుని చెప్పమన్నాడు.

పావుగంట తరువాత కంట్రోల్ రూము నుండి ఫోను వచ్చింది. ఆ సినిమా కంపనీ అడ్రస్సు సెల్ ఫోనుకు పంపించామని చెప్పారు.

ఒకసారి ఫోను చెక్ చేసి చూసుకున్నాడు.

మళ్ళీ మోటర్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు.

**************************************************PART-5******************************************

అరగంట ప్రయాణం తరువాత ఆ సినిమా కంపనీకి జేరుకున్నాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి .

ఇన్‌స్పెక్టర్ను చూసి ఒక కుర్రాడు వచ్చాడు. ఇన్‌స్పెక్టర్నుచూసి భయపడుతూ  ఎవరు కావాలి సార్?” అని అడిగాడు.

మీ డైరెక్టర్...

ఆయన పదిన్నరకు గానీ రారు సార్

నేను ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి...ఫోను చేసి ఇవ్వు

అలాగే సార్ అంటూ ఫోను చేసి విషయం చెప్పాడు. ఫోనును ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి దగ్గర ఇచ్చాడు.

నేను గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ను. నా పేరు చక్రవర్తి. మీ దగ్గర ఒక ముఖ్యమైన ఎంక్వయరీ చేయాలి. మీరు వెంటనే రావాలి

అది...కాదు...సార్...

అవన్నీ తరువాత. మీరు ఇంకో పావుగంటలో మీ ఆఫీసులో ఉండాలి. లేకపోతే మా పోలీసుల టీము మీ ఇంటికి వస్తుంది

వద్దు సార్...ఇప్పుడే బయలుదేరి వస్తాను

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు.

సార్...మీరు టీ తాగుతారా, కాఫీనా?” అడిగాడు కుర్రాడు.

రెండూ వద్దు అని చెప్పి వెళ్తున్న ఆ కుర్రాడ్ని చూస్తూ ఒక్క నిమిషం అన్నాడు.

ఆ కుర్రాడు వెనక్కి తిరిగాడు.

ఏదో సినిమా తీయబోతారని, దానికి కొత్త నటులు కావాలని ప్రకటన ఇచ్చారు. ఏం సినిమా?”

అవన్నీ నాకు చెప్పరు సార్...డైరెక్టర్ గారు వస్తారు కదండి. ఆయన్ని అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి ఆ హాలు మొత్తం ఒకసారి చూశాడు. చాలా బాగా డెకోరేట్ చేసుంది. చాలా సినిమాల షీల్డులు అద్దాలలో పెట్టబడి ఉన్నాయి. టీపా మీదున్న సినిమా పుస్తకం తీసుకుని పేజీలు తిరగాసాడు.

లోపలకు వస్తూనే ఇన్‌స్పెక్టర్ చక్రవర్తిని చూసి నమస్తే సార్ అన్నాడు డైరెక్టర్.

నమస్తే

ఇద్దరూ కలిసి డైరెక్టర్ రూముకు వెళ్లారు. డైరెక్టర్ ఇన్‌స్పెక్టర్ చక్రవర్తిని కూర్చోమని చెప్పి, ఆయన ఎదురుగా అతనూ కూర్చుని చెప్పండి సార్ అన్నాడు.

జేబులో నుండి పేపర్ ప్రకటన కాగితాన్ని చూపించి ఇది మీరిచ్చిన ప్రకటనేనా?”

అది తీసుకుని చదివిన డైరెక్టర్ అవును సార్ అన్నాడు.

నటుల సెలెక్షన్ అయిపోయిందా?”

అయ్యింది సార్...కానీ...?”

ఏమిటి కానీ? ఎవర్ని సెలెక్ట్ చేశారు? అతని ఫోటో ఉన్నదా?”

ఉంది సార్ అంటూ టేబుల్ సొరుగులో ఉంచిన ఫోటోను ఇన్‌స్పెక్టర్ చక్రవర్తికి ఇచ్చాడు.

ఆ ఫోటో చూసి ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి షాకయ్యాడు. ఆ ఫోటోలో ఉన్నది హేమా అన్నయ్య రమేష్.

కానీ...అన్నారు. ఎందుకని?”

ఇతన్ని సెలెక్టు చేసి, పలు రకాల మేకప్ టెస్టులు చేసి సరిపోతాడు హమ్మయ్యఅనుకుని అతనికి వెంటనే యాభై వేల రూపాయలకు చెక్కు రాసిచ్చి, నటన నేర్పించటానికి నెల రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మరుసటి రోజు ప్రిపార్ గా రమ్మని చెప్పి పంపాము...కానీ రెండు రోజులైనా అతను రాలేదు. అతని ఫోనుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఈ రోజు వరకు రాలేదు సార్

సరే...ఇతను కాకపోతే ఇంకొకర్ని తీసుకుని ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా?”

మామూలు సినిమాలకైతే అలాగే చేసేవాళ్ళం. ఇప్పుడు మేము తీయబోయే సినిమా ఒక బయోపిక్ సినిమా. ఒకరి నిజ జీవిత కథ. ఆ ఒకరి రూపానికి దగ్గరగా ఉన్న రూపం ఉండే వ్యక్తి కోసం రెండునెలలుగా వెతుకుతున్నాము. అనుకోకుండా అచ్చు ఆ ఒకరి లాగానే ఉన్న వ్యక్తే దొరికాడు. అతనే ఈ రమేష్. మేము చాలా అదృష్టం చేసుండాలి అనుకున్నాము. వెంటనే అతనికి అడ్వాన్స్ ఇచ్చి, మరుసటి రోజు వచ్చేయమని చెప్పాము. అతను కూడా చాలా సంతోష పడ్డాడు. ఇంటి దగ్గర చెప్పేసి బట్టలు తీసుకుని వస్తానన్నాడు. ఈ రోజు దాకా రాలేదు సార్

ఎందుకు రాలేదో కనుక్కుని, అతన్ని తీసుకురావటానికి పోనీ మీరు వాళ్ళింటికి వెళ్ళలేదా?”

అక్కడే సార్ మేము పోరపాటు చేశాము. అతన్ని చూసిన తరువాత అన్నీ మరిచిపోయి, సినిమా గురించి, అతని గురించి, మేకప్ టెస్టుల గురించి హడావిడి పడ్డాము. చెక్కు రాసి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. అతని అడ్రస్సు తీసుకున్నామో, తీసుకోలేదో తెలియదు...మా దగ్గర అతని ఫోటో, పేరు, వయసు, ఫోన్ నెంబరు మాత్రం వాట్స్ అప్ లో ఉన్నాయి...ఎంతో కష్టపడి అతని సెల్ నెంబర్ పెట్టుకుని అతని అడ్రస్సు తెలుసుకుందామని ప్రయత్నించాము. అది కూడా కుదరటం లేదు. ఈ రోజు ఒక పెద్ద రాజకీయ నాయక్కున్ని పెట్టి మా పని చేసుకుందామని చూస్తున్నాము

అలా చేసినా కూడా మీరు రమేష్ ను కనుక్కోలేరు. కారణం రమేష్ ఈజ్ మిస్సింగ్

ఎలా సార్?” ఆశ్చర్యంగా అడిగాడు డైరెక్టర్.

ఎలా అంటే. మిస్సింగ్. కనబడుటలేదు. మీ ఆఫీసుకు వచ్చిన రోజు నుండి అతను కనబడటం లేదు. మీరు చెప్పింది నిజమైతే మీ ఆఫీసు నుండి బయలుదేరిన రమేష్ ఇంటికి చేరలేదు

సార్...?”

అవన్నీ తరువాత...నేనడిగే వాటికి సమాధానం చెప్పండి. మీరు తీసే సినిమా ఏమిటి? ఎవరి నిజ జీవిత కథ? ఆ క్యారెక్టర్కు రమేష్ కరెక్టుగా ఉంటాడని ఎలా నిర్ణయం తీసుకున్నారు?”

సార్ ఆ కథను...మేము సినిమాగా తీయాలనుకునే ఆ బయోపిక్ నిజ జీవిత కథ, ఒక ఓపన్ కథ. చాలా సినిమా కంపెనీలు ఆ కథను తీయాలనుకుంటున్నారు. ఎవరు ముందు తీస్తారో నన్న కాంపటీషన్ ఉండటంతో కథను చాలా సీక్రెట్ గా ఉంచాము. అన్ని సినిమా కంపనీలూ గుడాచారులను పెట్టి ఎక్కడెక్కడ సెలెక్షన్ జరుగుతున్నదో నిఘా వేసుంచారు. మీరు పోలీసులు. ఎవరితోనూ చెప్పరని నమ్ముతూ చెబుతున్నాను...స్వామీ లలితానందా కథ

ఈ సారి ఆశ్చర్యపోవటం ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి వంతు అయ్యింది.

ఎవరు? ఆరు నెలల క్రితం మూడు రేపులూ, రెండు హత్య కేసులలో అరెస్టు అయ్యి జైలులో ఉన్నాడే ...ఆ ఫ్రాడు స్వామీజీ గురించిన సినిమానా?”

అవును సార్...?”

రమేష్ ను ఏ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారు?”

లలితానందా స్వామీజీ క్యారెక్టర్ కే

విషయం ఎవరికీ చెప్పకూడదని ఎందుకు డిసైడ్ చేసారు

చెప్పాను కదా సార్. దానికి కారణం రమేష్ సెలెక్షన్ కూడా ఒకటి...రెండోది, ఎవరు ముందు సినిమా తీస్తారో తెలుసుకోవటానికి

థ్యాంక్స్... అని డైరెక్టర్ కు చెప్పి ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి బయటకు వచ్చి, ఎస్.ఐ కాంతారావుకు ఫోన్ చేసి, రమేష్ మిస్సింగ్ లో ఒక క్లూ దొరికిందని, వెంటనే తనని స్టేషన్లో కలవమని చెప్పాడు.

**************************************************PART-6******************************************

మూడు నెలలు గడిచిపోయింది.

రమేష్ తల్లి మానసికంగా జబ్బు పడింది. రమేష్ ఆఫీసులో హేమాకు ఉద్యోగం వేసిచ్చారు.

తల్లికి చేయాల్సిన అన్ని పనులు చేసి, తన పనులూ ముగించుకుని, ఇంటికి తాళం పెట్టి, ఇంట్లో నుండి బయటకు వస్తున్న హేమాకు ఇంటి వాకిట పోలీసు జీపు ఆగడం కనిపించింది. ఆమె అలాగే నిలబడిపోయింది.

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి జీపులో నుండి దిగారు. ఆయనతో పాటూ ఎస్.ఐ. కాంతారావ్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ దిగారు. దిగిన వారందరూ జీపులో నుండి ఇంకా ఎవరో దిగుతారని, ఆగి వెనక్కి తిరిగి చూశారు. నిజమే, జీపులో నుండి గడ్డాలు, మీసాలు ఉన్న మరొక వ్యక్తి దిగాడు. అందరూ కలిసి హేమా ఇంటి వాకిలికి వచ్చారు.

రండి ఇన్‌స్పెక్టర్ అంటూ అప్పుడే ఇంటికి వేసిన తాళం ను మళ్ళీ తెరిచి, అందరినీ లోపలకు ఆహ్వానించి సోఫాలో కూర్చోమని చెప్పింది.

ఏమిటి హేమా...తలుపుకు తాళం వేసి ఆఫీసుకు వెళుతున్నావు. ఇంట్లో అమ్మ లేదా?”

ఉంది ఇన్‌స్పెక్టర్. అందుకే తాళం వేసి వెళ్తున్నాను. తాళం వేయకుండా వెళితే అన్నయ్యను వెతికొస్తానంటూ బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. పోయిన ఆదివారం నేను ఇంట్లో ఉండగానే బయటకు వెళ్ళిపోయింది. అమ్మను వెతకటానికి సాయంత్రం అయ్యింది. అందుకని ముందు జాగ్రత్త కోసం ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా ఇంటికి తాళం వేసి వెళ్తున్నాను...మీరేంటి ఇన్‌స్పెక్టర్ మూడు నెలలుగా ఇటుపక్కకు రాని వాళ్ళు, సడన్ గా ఏకంగా మీ బృందంతో కలిసి వచ్చారు. మీరే కాకుండా మరో వ్యక్తిని కూడా తీసుకు వచ్చారు. మళ్ళీ ఎంక్వయరీనా?" అన్నది.

ఆ కొత్త వ్యక్తి ఎవరనేది నువ్వు గుర్తించ లేకపోతున్నావా? అతనెవరో కాదు, మీ అన్నయ్య రమేష్

మా అన్నయ్యా...!?”

మిస్టర్ రమేష్...మీ వేషం తీయండి

ఆ కొత్త వ్యక్తి నిలబడి తన వేషం తీశాడు...అంతే అన్నయ్యా అంటూ అరుస్తూ పరిగెత్తుకు వచ్చి రమేష్ ను కావలించుకుని భోరుమని ఏడ్చింది.

ఏడవకు హేమా...నేను వచ్చాసాను కదా. అమ్మ ఎక్కడుంది. ఇక్కడ ఇంత గోల జరుగుతున్నా ఆమె రాలేదేం

బహుశ ఆమె నిద్రపోయుంటుంది. రా వెళదాం

ఇద్దరూ కలిసి వెనుక ఉన్న రూములో నిద్రపోతున్న తల్లి దగ్గరకు వెళ్లారు. వారితో పాటూ పోలీసులు కూడా వెళ్ళారు. రమేషు, హేమా కలిసి వారి తల్లిని లేపబోతుంటే మిస్టర్.రమేష్. ఆవిడ్ను ఇప్పుడు లేపకండి. ఆవిడ లేచినప్పుడు మాట్లాడండి అన్నాడు ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి.

ఇద్దరూ వెనక్కి తిరిగినప్పుడు ఇన్‌స్పెక్టర్ మా అన్నయ్యను ఎలా కనిబెట్టారు. ఎక్కడున్నాడు. అన్నయ్యను తీసుకు వస్తున్నారని నాకు ముందే ఫోనులో చెప్పుంటే, నేనూ, మా అమ్మా రెడిగా ఉండేవారిమే?”

"అదొక చాలా పెద్ద స్టోరీ. కానీ బయటకు చెప్పకూడని కథ…మీకు అది నేను తప్పకుండా చెప్పాలి. రండి హాలులోకి వెళదాం

అందరూ కలిసి హాలులోకి వెళ్ళారు. సోఫాలొ కూర్చున్నారు.

ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి మాట్లాడటం మొదలుపెట్టాడు.

మిస్. హేమా. మీ అన్నయ్య కిడ్నాప్ చెయ్యబడ్డాడు. అందులోనూ ఒక నీచమైన పనికోసం. రమేష్ కిడ్నాప్ వెనుక అతిపెద్ద మనుషులు ఉన్నందువలన దీన్నీ మేము చాలా సీక్రెట్టుగా చెయవలసి వచ్చంది. సీక్రెట్టుగా ఉంచవలసి వచ్చింది.

ఆ రోజు వినాయక చవితి నిమజ్జనం రోజు...బందోబస్తు డ్యూటీలో ఉన్నాను. అప్పుడు నాకొక ఫొన్ వచ్చింది. లలితానందా స్వామీజీ మఠంలో నుండి ఏవో శబ్ధాలు వస్తున్నాయి.  అక్కడెవరో మనుషులు ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ విషయం మీకు చెప్పాలనిపించింది. చెప్పాను అని చెప్పి ఫోను కట్ చేశాడు.

లలితానందా స్వామీజీ మఠాన్నీ, ఆశ్రమాన్నీ కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసులు సీలు  వేశారు. లలితానందా స్వామీజీని ఖైదు చేశారు. ఆయనపై మూడు కేసులు  జరుగుతున్నాయి. రెండు రేప్ కేసులు, ఒక హత్య కేసు. స్వామీజీ జైలులో ఉన్నాడు. సీలు వేసిన మఠంలో నుండి మోతలు రావడమేమిటి...సంతింగ్ ఈజ్ రాంగ్అనుకుంటూ ఒక నలుగురు పోలీసులను తీసుకుని నేను మఠానికి వెళ్ళాను.

నేను, ఇంకో పోలీసు అధికారి గోడదూకి మఠంలోకి వెళ్లాము. కొంచం దూరం వెళ్ళిన తరువాత, మఠంలో నుండి మాకూ కూడా ఏవో మాటలు వినబడ్డాయి. వెంటనే మా వైర్ లెస్ ఫోను ద్వారా మిగిలిన పోలీసులనూ లోపలకు రమ్మని, వాళ్ళు కూడా వచ్చిన తరువాత అక్కడున్న ఒక గది తలుపును తోసుకుంటూ అందరమూ లోపలకు వెళ్ళాము. అక్కడ లలితానందా స్వామీజీ మరియు మరో ముగ్గురు ఉన్నారు. ఒక్క నిమిషం షాకైన  నేను క్షణంలో తేరుకుని నలుగురినీ పట్టుకుని, మా స్టేషన్ కు తీసుకు వచ్చాము.

నలుగురినీ సెల్లో ఉంచి...మీరంతా ఎవరు? ఎందుకు మఠంలో ఉన్నారు? లోపలకు అసలు ఎలా వెళ్లారు? పోలీసు సీలు వేసున్నది తెలిసి కూడా అక్కడికి వెళ్ళారంటే మీకూ ఆ మఠానికి ఏదో సంబంధం ఉంది...ఏమిటా సంబంధం? లలితానందా స్వామీజీ వేషంలో ఉన్నది ఎవరు? అసలు ఆయన వేషం ఎందుకు వేసారు?’ అని అడిగినప్పుడు నలుగురూ ఎగతాళిగా నవ్వారు. అప్పుడు నాకెందుకో అనుమానం వచ్చింది మా స్టేషన్ పోలీసులను అలర్ట్ చేశాను. ఆ నలుగురి దగ్గరా ఉన్న ఫోనులు లాక్కుని ఆ సెల్ లోని లైటు ఆర్పి నేనూ, ఎస్.ఐ. కలిసి జైలుకు ఫోను చేసి లలితానందా స్వామీజీ గురించి ఎంక్వయరీ చేశాను. ఆతను జైలులోనే ఉన్నాడని జైలర్ చెప్పాడు.

అంతే వెంటనే  మా పోలీసు స్టయిలు ఎంక్వయరీ మొదలు పెట్టాము.

మా ఎంక్వయరీ స్టయిలు తట్టుకోలేక నిజమంతా కక్కేశారు.

మాకు చిక్కింది నిజమైన లలితానందా స్వామీజీనే. జైలులో ఉన్నది ఆయనలాగా ఉన్న మరొక మనిషి. ఆ మనిషి ఎవరో కాదు మీ అన్నయ్యే. వాళ్ళు అలా ఎందుకు చేశారో చెప్పిన తరువాత నేను వీళ్ళను పట్టుకున్న విషయాన్నీ, వాళ్ళ మోటివ్ ను తెలుసుకుని అధిరిపడ్డాను. వాళ్ళను పోలీసు స్టేషన్లో ఉంచటం సేఫ్ కాదని అనిపించి వెంటనే వాళ్లను తీసుకుని ఎవరూ కనిపెట్టలేని ఒక చోట దాచాము

అక్కడున్న గ్లాసులోని మంచి నీళ్లను తాగాడు.

నా గోల్ ఎమిటి అని ఆలోచించాను. నిజమైన లలితానందా స్వామీజీని జైలుకు చేర్చి, అక్కడున్న మీ అన్నయ్యను బయటకు తీసుకురావాలి...ఇదంతా పబ్లిక్ గా చేయకూడదు. ఎందుకంటే ఈ ప్లానులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలిసున్నారు. అందువల్ల ఈ కేసును అతి జాగ్రత్తగా, కన్నింగ్ గా డీల్ చేయాలి అని నిర్ణయించుకున్నాను.

అంటే ఏ ఒక్కరికీ తెలియకుండా నా దగ్గరున్న నిజమైన లలితానందా స్వామీజిని జైలులో ఉంచి, మీ అన్నయ్యను బయటకు తీసుకురావాలి. ఇది చాలా కష్టమైన పని. మా ఈ పనిలో ఒక తప్పు జరిగినా నా టీములోని పోలీసులను, జైలులో ఉన్న మీ అన్నయ్యను మరియు మీ కుటుంబాన్నీ అందరినీ చంపేస్తారు.

ఈ కేసు విషయంలో పూర్తి డీటైల్స్ చెప్పలేను.  ఎలాగైతే దేశ ద్రోహులందరూ కలిసి మీ అన్నయ్యను జైలులో ఉంచి, నిజమైన స్వామీజీని ఎలా బయటకు తీసుకు వచ్చారో, అదే టెక్నిక్ ఉపయోగించి నిజమైన లలితానందా స్వామీజీని జైలుకు పంపించి మీ అన్నయ్యను బయటకు తీసుకు వచ్చాను.

హేమా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మీ అన్నయ్య మిస్సింగ్ అయినట్టు, మేమిలా తీసుకువచ్చినట్టు ఎవరికీ తెయకూడదు. ఏమీ జరగనట్టు మామూలుగా ఉండాలి. ఇక మేము బయలుదేరతాం అని ఇన్‌స్పెక్టర్ చక్రవర్తి చెప్పిన వెంటనే అక్కడున్న పోలీసులందరూ లేచారు.

అప్పుడు హేమా ఇన్‌స్పెక్టర్ గారూ, ఒకే ఒక విషయం మాత్రం చెప్పండి

అడగండి

వాళ్ళు ఎందుకిలా చేశారు

కొంతమంది అతిపెద్ద రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు స్వామీజీ దగ్గర వాళ్ల అవనీతి డబ్బును, ఆస్తుల దస్తావేజులను దాచమని ఇచ్చుంచరు.  వాటిని స్వామీజీ ఎక్కడ దాచి ఉంచాడో వీళ్ళకు తెలియదు. స్వామీజీ తనని జైలు నుండి, ఉరి స్తంభం నుండి తప్పేస్తే తానే వాటిని అందించి తాను విదేశాలకు పారిపోతానని వాళ్ళకు వాగ్దానం చేశడు.  వాటిని తిరిగి తీసుకోవాటానికి స్వామీజీని జైలు నుండి తప్పించారు....దయచేసి ఇంతకంటే ఇంకేమీ అడగకండి అని చెప్పి వచ్చాశారు.

పోలీసు జీపు అక్కడ నుండి బయలుదేరింది.

**************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మంచిదొక ఐడియా...(కథ)

ఏల్నాటి శని...(కథ)

ఆడపిల్ల…(కథ)