తీర్పు...(కథ)
తీర్పు (కథ)
“దీనికి, నేను తీర్పు చెప్పక్కర్లేదు. నీ కూతురే మంచి
ముగింపు చెప్పేసింది. అనవసరంగా పెళ్ళి బాంధవ్యం ముగియకూడదు. ఇద్దర్నీ పూర్తి
మనసుతో చేర్చిపెట్టు. వాళ్ళు బిడ్డతో మంచిగా జీవించనీ..." అన్నారు వివాహరద్దు
వకీలు.
ఆ కూతురు
చెప్పిన ముగింపు ఏమిటో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
***************************************************************************************************
"కాఫీ
ఇవ్వు మానసా. ఇంకా కాసేపట్లో తాయారమ్మ, ఆమె కూతురు, కూతురు భర్త వచ్చేస్తారు" డైవర్స్ కేసుల స్పెషలిస్ట్
అడ్వకేట్ ప్రభాకరం చెప్ప, ఆయన భార్య భర్తను నవ్వుతూ చూసింది..
"ఇన్ని రోజులు
కోర్టులో వకీలుగా, ప్రాక్టీస్ చేశారు...ఈ రోజు, మన ఇంట్లో జడ్జీగామారి తీర్పు ఇవ్వబోతారు. అంతే కదా"
అన్నది మానసా.
వాళ్ళింట్లో పని
చేస్తున్నది తాయారమ్మ...ఆమె, కూతురు వల్లీకి, ఏడుకొండలుకి మూడు సంవత్సరాల ముందు పెళ్ళి చేసింది.
ఇల్లు కట్టే తాపీ
మేస్త్రీ పని చేస్తున్న ఏడుకొండలు, ప్రారంభంలో వల్లీతో బాగానే కాపురం చేశాడు. రెండు నెలల
క్రితం,
ఆడపిల్ల పుట్టింది. ఆ తరువాతే అతని ప్రవర్తన మారిపోయింది.
రోజూ తాగటం,
కారణం లేకుండా వల్లీని పట్టుకుని గొడ్డును బాదినట్టు బాదడం
మొదలయ్యింది. తనతో పాటూ పనిచేస్తున్న ఒక స్త్రీతో ఒకరోజు ఊరు వదిలి పారిపోయాడు.
ఆరు నెలల బిడ్డతో
తపించి పోయింది వల్లీ. కూతురి జీవితం ఇలా అయిపోయిందే అని బాధపడింది తాయారమ్మ.
రోజులు గడిచిన కొద్దీ, ఇక వెళ్ళిపోయిన అతను తిరిగి రాడు అనుకుని మనసును దృడం చేసుకున్న వల్లీ,
హోల్ సేల్ మార్కెట్టులో కూరగాయలు కొని,
రోడ్డు రోడ్డూ తిరిగి అమ్మి, జీవితాన్ని నడపటం ప్రారంభించింది.
ఇప్పుడు పిల్లకి
ఒకటిన్నర వయసు. పారిపోయిన ఏడుకొండలు తిరిగి వచ్చి, 'నన్ను క్షమించు వల్లీ. బుద్ది గడ్డితిని వదిలేసి
వెళ్ళిపోయాను. ఇప్పుడు మారి వచ్చాను. ఇక నిన్నూ, బిడ్డనూ వదిలిపెట్టి వెళ్ళను..." అంటూ బ్రతిమిలాడాడు.
తాయారమ్మ దాన్ని
అంగీకరించలేకపోయింది.
‘ఇప్పుడే నా
కూతురు కాస్త ప్రశాంతంగా జీవిస్తోంది...వీడు మళ్ళీ ట్రబుల్ చేయటానికి చూస్తున్నాడు.
దానికి భర్త అనేవాడే వద్దు. బిడ్డ చాలు. మారిపోయి వచ్చాను అని చెప్పడమంతా అబద్దం.
ఇక వీడి సావాసమే వద్దు..." అనుకున్నది తాయారమ్మ.
వల్లీకి ఎలాంటి
నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. కాళ్ళమీద పడేంత పర్యంతరం చేస్తున్నాడు ఏడుకొండలు.
ఇంట్లో బిడ్డను ఏడుకొండలు
ఎత్తుకోవడం తాయారమ్మకు అసలు నచ్చలేదు.
“ఇదిగో చూడు. నీ
సావాసమే వద్దు. బయలుదేరు...” అన్నది తాయారమ్మ.
“అత్తయ్యా,
అలా మాట్లాడకండి. దయచేసి క్షమించండి. నేను చేసింది తప్పే.
వల్లీని ఇక వదిలి వెళ్లను. ఎవరి దగ్గరకైనా పంచాయతీకి తీసుకు వెళ్ళండి...'
అన్నాడు.
ఎటువంటి నిర్ణయానికీ
రాలేకపోయి “అమ్మా...
నువ్వు,
వకీలు ఇంట్లోనే కదా పనిచేస్తున్నావు. ఆయన దగ్గరకు
తీసుకువెళ్ళు, ఆయన
ఏం చెబుతారానేది చూద్దాం...” అన్నది వల్లీ.
“వకీలు
బాబూ,
మీరు కోర్టులో ఎన్నో కేసులు చూసుంటారు...మీకు న్యాయం,
ధర్మం తెలుసు. నమ్మిన దాన్ని వదిలేసి వెళ్ళిన వాడు
మారిపోయాను అని చెప్పటాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మీరు విచారించి మంచి తీర్పు
చెప్పాలి...” అన్నది
తాయారమ్మ.
“నీ
కూతుర్నీ,
ఆమె భర్తను ఇద్దరినీ పిలుచుకురా. వాళ్ళిద్దరి మనసుల్లోనూ
ఏముందో తెలుసుకుని, న్యాయమైన అభిప్రాయం చెబుతాను...”అన్నాడు వకీలు.
వాకిట్లో మాటల శబ్ధం
వినబడ,
తొంగచూసి, "వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు. తాయారమ్మ తీసుకు వచ్చింది.
ఎన్నో 'డైవర్స ' కేసులలో మీరు హాజరై ఉంటారు. పాపం ఆ పిల్ల. వాడ్ని బాగా
విచారించండి. ఇప్పుడే ఆ పిల్ల ఏదో తానుగా జీవిస్తూ వస్తోంది. ఉన్న ప్రశాంతతను
చెడిపేసి వెళ్ళబోతాడు" తన ఒపీనియన్ను చెప్పింది మానసా.
బయటకు వచ్చిన వకీలు ప్రభాకరం,
కూర్చీలో కూర్చుంటూ "ఎందుకు నిలబడతారు. అలా గచ్చుమీద కూర్చోండి
" అన్నారు.
"ఉండనియ్యండయ్యా..."
నిద్రపోతున్న
బిడ్డను భుజాల మీద వేసుకుని, భవ్యంగా నిలబడ్డాడు ఏడుకొండలు.
అతని మొహాన్ని చూసిన
వెంటనే,
నిజంగానే దెబ్బతిని మారి తిరిగి వచ్చాడని అనుకుంటూ,
తాయారమ్మను చూశారు వకీలు ప్రభాకరం.
"అయ్యా...ఇద్దరూ
మీ ఎదురుగానే ఉన్నారు. నా కూతురి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా చేసి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు,
ఇతను మాట్లాడేది నేను నమ్మలేకపోతున్నా. తిరిగి మరోసారి నా
కూతురు మొసపోకూడదు" అన్నది తాయారమ్మ.
"నేను
విచారిస్తాను. నువ్వు సైలెంటుగా ఉండు" అన్నారు వకీలు.
"ఏడుకొండలూ...కట్టుకున్న
దాన్ని వదిలేసి, ఇంకొకదాని
వెనుక వెళ్ళి, ఇప్పుడు
మారిపోయి,
తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాను అని నువ్వు చెప్పటాన్ని
వాళ్ళు నమ్మలేకుండా ఉన్నారు. నాలుగు నెలలు మంచివాడిగా ఉండి,
తిరిగి మళ్ళీ వెళ్ళిపోవనేది ఎలా నమ్మటం?"
“నమ్మమని చెప్పండి
అయ్యగారు. వల్లీని వదిలేసి వెళ్ళిన తరువాతే, నాకు ఆమె గొప్పతనం తెలిసింది. నేను,
నా భార్యతోనూ, బిడ్డతోనూ మంచిగా జీవించాలి. ఇక,
నిజాయితీగా పనికివెళ్ళి, నా కుటుంబాన్ని చూసుకుంటాను...ఈ ఒక్కసారికి నన్ను క్షమించి,
వల్లీతో నన్ను కలపండయ్యా"
"వల్లీ,
నువ్వేం చెబుతావు?" అన్నారు వకీలు ప్రభాకరం.
“అయ్యా...పెళ్ళి
చేసుకున్నది, భర్తకు అనిగిమెనగి జీవించాలని అనుకునే, అతను తాగేసి నన్ను గొడ్డును బాదినట్టు బాదినా
ఓర్చుకున్నాను.
కానీ,
నన్ను వదిలేసి ఇంకొక దాని మీద మోహం పెట్టుకుని,
కనికరం లేకుండా నన్ను వదిలేసి వెళ్లాడే...అతన్ని నేను
క్షమించలేను. ఒక భార్యగా ఏ ఆడదీ ఇటువంటి భర్తను అంగీకరించదు"
'అతన్ని
చూస్తే,
నిజం చెప్పేవాడిలాగానే కనబడుతున్నాడు. నమ్మకం తెచ్చుకోలేని
వల్లీని ఏం చేయగలం. మనసారా క్షమించ గలిగితేనే, ఇతన్ని అంగీకరించి, ఇతనితో జీవించగలదు. లేకపోతే ఇద్దర్నీ చేర్చి పెట్టినా
ప్రయోజనం ఉండదు’
"సరే
వల్లీ...అలాగైతే వీడ్ని క్షమించలేము. ఇతనితో ఇక జీవించలేనని చెబుతున్నావు - అంతే
కదా..." అన్నారు ప్రభాకరం.
"అయ్యాగారూ,
ఒక్క నిమిషం. ఒక భార్యగా నా మనసులో ఉన్నది చెప్పాను. కానీ,
అదిగో అతని భుజాల మీద నిద్రపోతుందే,
నా కూతురు, ఆమె తల్లిగా ఇప్పుడు చెబుతున్నాను....
అతన్ని నేను వద్దు
అని చెప్పేస్తే...నేను భర్త లేకుండా జీవించగలను. కానీ,
కూతుర్ని, దాని తండ్రి దగ్గర నుండి విడదీయటానికి నాకు హక్కులేదు.
ఆమెకు తల్లి యొక్క
ప్రేమ,
అభిమానం మాత్రమే కాదు, తండ్రి యొక్క ఆత్మీయత, ఆదారణ దొరకాలి. దాన్ని నేను అడ్డుకోకూడదు. నిజానికి
మారిపోయి వచ్చినవాడైతే, కూతురి తండ్రిగా ఒప్పుకుని, అతనితో జీవించటానికి అంగీకరిస్తాను. కూతుర్ని,
దాని తండ్రి దగ్గర నుండి వేరు చేసిన పాపం నాకు వద్దు"
అన్నది వల్లీ.
కళ్ళు విరుచుకోగా,
కృతజ్ఞతతో వల్లీని చూశాడు ఏడుకొండలూ.
‘చదువుకోని
అమ్మాయే. ఎంత లోతుగా ఆలొచించి మాట్లాడింది. చదువుకున్న అమ్మాయలు స్వార్ధంతో,
పిల్లల గురించి ఆలొచించకుండా కోర్టు మెట్టు ఎక్కి,
విడాకులు అడిగే ఈ కాలంలో, ఈమె తీసుకున్న నిర్ణయం అభినందించాల్సిన ఒకటే’
"తాయారమ్మా... దీనికి,
నేను తీర్పు చెప్పక్కర్లేదు. నీ కూతురే మంచి ముగింపు
చెప్పేసింది. అనవసరంగా పెళ్ళి బాంధవ్యం ముగియకూడదు. ఇద్దర్నీ పూర్తి మనసుతో
చేర్చిపెట్టు. వాళ్ళు బిడ్డతో మంచిగా జీవించనీ..." అన్నారు వివాహరద్దు వకీలు ప్రభాకరం.
**************************************************సమాప్తం*****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి