దేవుడు శిక్షించేశాడు!...(కథ)

 

                                                                   దేవుడు శిక్షించేశాడు!                                                                                                                                                                            (కథ)

పోయిన జన్మలో ఏం పాపం చేసేనో, జన్మలో దేవుడు నన్ను శిక్షించేసేశాడు. అన్ని వసతులూ ఉన్న మన ఇంట్లో ఒక బిడ్డకూడా లేదు. కానీ...గంజికే కష్టపడుతున్న రాజమ్మ ఇంట్లో ముగ్గురు పిల్లలు. పిల్లలే లేరని నేను తపన పడుతున్నాను. ఆమెకు పిల్లలే భారంగా ఉన్నారు. ఇదేనాండీ విధి అంటే?” 

మనం తలచుకుంటే విధిని పుణ్యంతో జయించవచ్చు. నిజమా?....ఈ కథ చదివి తెలుసుకోండి.

***************************************************************************************************

అమ్మగారూ... రాజమ్మ తల గోక్కుంటూ వచ్చి నిలబడప్పుడే ఏదో అడగబోతోందని గ్రహించాను.

ఏదో ఏమిటి? డబ్బులే. మొత్తంగా తోటకూర కట్టలాగా రెండువేల రూపాయలు ఒకటో తారీఖు వచ్చిందంటే ఇస్తున్నా, అప్పుడప్పుడు సాకుబోకులు చెప్పి యాభై, వంద, రెండొందలు అంటూ అడిగి తీసుకుంటుంది. జీతంలో తగ్గించుకోండమ్మాఅని తీసుకునేటప్పుడే చెప్పేస్తుంది. కానీ ఒకటో తారీఖు దగ్గర పడుతుంటే అమె పాడే లేమి పాటలతో డబ్బును జీతంలో తగ్గించటానికి నాకు మనసు ఒప్పదు.

అమ్మగారూ... ఆమె రెండోసారి పిలిచినప్పుడు తల ఎత్తి చూశాను.

ఏమిటి రాజమ్మా?”

అమ్మగారూ...అదొచ్చి...అర్జెంటుగా ఒక ఐదు వందల రూపాయలు కావాలి అంటూ నా మొహంలో చీకటి నింపింది.

ఎప్పుడూ వందా, రెండొందలు అని తీసుకునే ఆమె ఇప్పుడెందుకు ఐదు వందల రూపాయలు అడుగుతోంది. నేను ఎక్కడ లేవుఅని చెప్తానో అని భయపడుతున్న దానిలాగా, నేను ఏదైనా మాట్లాడేలోపు గబగబా అమ్మగారూ...ఒకటో తారీఖున జీతంలో తగ్గించుకోండి అన్నది.

ఏం చెప్పి 'నా దగ్గర లేవు ' అని చెప్పాలని ఆలొచించాను.

అమ్మగారూ...నా కూతురికి రెండు రోజులుగా జ్వరం. అదే తగ్గిపోతుందులే అనుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా మెడికల్ షాపులో మందులు కొని ఇచ్చాను. జ్వరం తగ్గలేదు సరికదా ఎక్కువైంది అమ్మగారు. పిల్ల చాలా కష్టపడుతోంది. రోజైనా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్దామని అనుకుంటున్నా. చేతిలో పదిపైసలు కూడా లేవమ్మా. అందుకే...

గబుక్కున నా మనసులో అంతకు ముందున్న చికాకు పోయి మనసు భారమయ్యింది. పిల్లకు అని అడుగుతోందే?’ లేచి వెళ్ళిఐదువందల రూపాయలు తీసుకు వచ్చి ఇచ్చాను.

చాలా థ్యాంక్స్ అమ్మగారూ! సంతోషంతో చేతులు జోడించి నమస్కరించింది.

తొందర తొందరగా పనులు పూర్తి చేసి, “ఆసుపత్రికి వెళ్తున్నానమ్మా అని చెబుతూ బయలుదేరింది.

ఆమె వెళ్ళిన కొన్ని నిమిషాల తరువాత నా భర్త వచ్చారు. ఉమా, రాజమ్మ దగ్గర ప్యాంటూ, షర్టూ ఇచ్చి ఐరన్ చేసి ఉంచమని చెప్పు. నేను స్నానం చేసి వస్తాను అన్నారు.

ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె కూతురికి ఆరొగ్యం బాగలేదట. డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాలట. అందుకే త్వరగా వెళ్ళింది. ఐదు వందల రూపాయలు డబ్బు అడిగింది. ఇచ్చాను. జీతంలో తగ్గించుకోమన్నది

అవును! ఐదువందల రూపాయలు జీతంలో తగ్గించుకోమన్నదా! తగ్గించకే. పోతే పోనీ. పిల్ల ఆరొగ్యానికని అడిగింది. పాపం ముగ్గురు పిల్లలను పెట్టుకుని కష్టపడుతోంది. మనకేమన్నా పిల్లాపాపనా? డబ్బు చేర్చి పెట్టుకుని ఏం చెయ్యబోతాం?”

ఆయన చెప్పిన చివరి మాట నన్ను ఫట్ మని చెంపమీద కొట్టినట్టు అనిపించింది. కళ్ళు చెరువు అవగా తల ఎత్తి ఆయన్ని చూశాను.

నీళ్ళు నిండిన నా కళ్ళను చూసిన ఆయన అప్పుడు తన తప్పు గ్రహించారు. గబుక్కున ఆయన మొహం మారింది.

క్షమించరా...నోరు జారి...

ఏమిటండీ...మనకు పిల్లలే పుట్టరని నిర్ణయం చేసేసారా?” నేను బొంగురు కంఠంతో అడిగాని.

ఉమా...నేను అర్దంతో చెప్పలేదు--నా దగ్గరకు వచ్చి, నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చ ప్రయత్నించారు.

పోయిన జన్మలో ఏం పాపం చేసేనో, జన్మలో దేవుడు నన్ను శిక్షించేసేశాడు. అన్ని వసతులూ ఉన్న మన ఇంట్లో ఒక బిడ్డకూడా లేదు. కానీ...గంజికే కష్టపడుతున్న రాజమ్మ ఇంట్లో ముగ్గురు పిల్లలు. పిల్లలే లేరని నేను తపన పడుతున్నాను. ఆమెకు పిల్లలే భారంగా ఉన్నారు. ఇదేనాండీ విధి అంటే?” అంటూ పెద్ద నిట్టూర్పు వదలిన నన్ను గుండెలకు హత్తుకున్నారు.

ఉమా, మనం తలచుకుంటే విధిని పుణ్యంతో జయించవచ్చు

ఎలాగండీ?” అంటూ ఆయన మొహం చూశాను.

రాజమ్మ యొక్క పిల్లలలాగా ఎంతోమంది పిల్లలు దేశంలో కష్టపడుతున్నారు. పిల్లలలో ఒకర్ని మనం ఎందుకు దత్తతు తీసుకోకూడదు?”

భర్త యొక్క మాటలు నన్ను గిలగిలా కోట్టుకునేటట్టు చేసినై. ఆగ్రహము, కోపము నాలో పోటీ వేసుకుని బయలుదేరినై. అలాగంటే నేను గొడ్రాలుననే నిర్ణయం చేసేసారా?”

ఖచ్చితంగా లేదు ఉమా. మన ఇద్దరిలోనూ లోపమూ లేదని డాక్టర్ చెప్పేసారు. పిల్లలు పుట్టేటప్పుడు పుట్టనీ. మనం ఒక బిడ్డను దత్తతు తీసుకుని పెంచితే ఏం?”

చాలు! వెర్రి కేక వేశాను.

నా కేకతో ఆయన వణికిపోయారు.

"ఇలా చూడండి, ఎవరో కన్న బిడ్డ మన బిడ్డ అయిపోతుందా? మన రక్తం పంచుకుని పుడితేనే మన బిడ్డగా ఉండటం కుదురుతుంది. అనాధ ఆశ్రమాలలో ఉండే పిల్లలందరూ నా బిడ్డగా అవరు. దయచేసి దత్తతు, గిత్తతూ అంటూ పిచ్చి పట్టినట్లు మాట్లాడొద్దు...

నన్ను క్షమించు ఉమాఅంటూ ఆయన మెల్లగా జరిగారు.

సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన వెంటనే నా భర్త మాట్లాడిన మొదటి మాట రాజమ్మ గురించే అయింది.

ఉమా! రాజమ్మ యొక్క బిడ్డకు ఆరొగ్యం అసలు బాగుండ లేదట. వచ్చేటప్పుడు  ఆమెను ఒక మెడికల్ షాపు వాకిట్లో చూశాను. ఏడుస్తున్నట్టు మాట్లాడింది. ఇంకో వారం రోజులు బిడ్డను ఆసుపత్రిలోనే ఉంచాలని డాక్టర్ చెప్పారట. చాలా పాపం అనిపించింది. నువ్వెళ్ళి బిడ్డను చూసేసి, ఆమె చేతికి ఎంతో కొంత డబ్బు ఇచ్చిరా... అన్నారు.

నాకూ పాపం అనిపించింది. ఇలా సహాయం చేస్తే అయినా నా పాపం తీరదా అని నా లోతైన మనసులో అనిపించింది. భర్తకు కాఫీ కలిపి ఇచ్చి బయలుదేరాను.

కారు తీసుకుని, రాజమ్మ బిడ్డను చేర్పించిన ఆసుపత్రికి వచ్చాను.

అది గవర్నమంట్ హాస్పిటల్. ముక్కు మూసుకునే లోపలకు వెళ్ళాల్సి వచ్చింది.

నేను వెతుక్కుని చూసేలేపే రాజమ్మే పరిగెత్తుకు వచ్చింది.

అమ్మగారూ...

స్వరం వినబడ్డవైపు తిరిగి చూశాను. చేతిలో కాఫీ గ్లాసుతో  జుట్టు చెదిరిపోయి, చీర మాసిపోయి అదేదో అవతారంతో పరిగెత్తుకు వచ్చింది.

రాజమ్మా, పాపకు ఎలా ఉంది?” -- నేను అడగటమే ఆలస్యం, నిద్రలేని ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు దారగా కారింది.

అమ్మగారూ...పిల్ల చాలా...చాలా చిక్కిపోయింది. టైఫాయిడ్ అని డాక్టర్ చెబుతున్నారు. ఇంకో పదిరోజులు ఇక్కడే ఉండాలని చెబుతున్నారు

ఆమెతో పాటూ నడిచాను.

చిరిగిపోయిన చాపమీద పడుకోబెట్టున్న పిల్లను చూసినప్పుడు నాకు పొత్తి కడుపులో తిప్పింది. కళ్ళు లోపలకు పోయి, కడుపు అతుక్కుపోయి, పీచు,తొక్కుగా పడుంది బిడ్డ. నాకే ఇలా మనసును పిండినట్టుంటే, కన్న రాజమ్మకు ఎలా ఉంటుంది.

అమ్మగారూ. ఎన్ని సంవత్సరాలైనా నా కడుపు పండలేదు. కానీ...దేవుడు నాకు ముగ్గురు పిల్లలను ఇచ్చాడని తలుచుకుని ఆనందించాను. ఇప్పుడు...ఇప్పుడు... మూడులో ఒకర్ని పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందమ్మా...

రాజమ్మ మొహం మూసుకుని ఏడవ, నేను షాకయ్యాను.

రాజమ్మా! నువ్వేం చెబుతున్నావు? పిల్లలందరూ నీ పిల్లలు కారా...?”

నా పిల్లలేనమ్మా. నేను కనని పిల్లలు. మా గుడిసెల గూడెం కాలనీలో నా పక్క గుడిసెలో ఒకత్తుండేది. ఆమె పిల్లలే వీళ్ళు. తల్లి చచ్చి పోయింది. తండ్రి తాగుడూ, పని అంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. పిల్లలు ఆకలితో పస్తులుగా పడున్నప్పుడు నేను చూస్తూ ఉండలేకపోయాను. అందువలన పిల్లలను నా గుడిసెకు తీసుకువచ్చి, నేనే పెంచటం మొదలుపెట్టాను. నా ఒక్క కడుపుకు ఉందో లేదో, వీళ్ళకోసం కష్టపడ్డాను. అలా నేను కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోతుందేమోనన్న భయంగా ఉందమ్మా...

ఆమె మాట్లాడిన ఒక్కొక్క మాట నన్ను కొరడాతో కొట్టినట్టు ఉన్నది.

ఒక పూట భోజనానికే వెతుక్కునే ఈమే, ముగ్గురు పిల్లలను దగ్గరకు తీసుకుని పెంచుతోంది. చదువు, సంధ్యా లేకపోయినా, లౌకిక జ్ఞానమేలేని ఈమేకే ఇంత ఉన్నత ఆలొచనా! మెచ్యూర్డ్ లక్షణం!!  కడుపు పండకపోయినా దేవుడు నాకు ముగ్గురు పిల్లలను ఇచ్చాడమ్మాఅని సంతోషపడుతున్న మనసు.

కానీ, నేనో దేవుడు శిక్షించాడుఅని సనుగుతున్నాను.

ఎవరో కన్న పిల్లల కోసం రాత్రీ పగలూ కష్టపడి రక్తాన్ని చెమటగా చిందించి బాధపడుతున్న ఈమెకున్న అనురాగం, చదివి డిగ్రీ పుచ్చుకుని నాగరీకంగా జీవిస్తున్న నాకు లేదే! ఒక్క క్షణంలో కుంగిపోయాను! హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నప్పుడు, ఒక నిర్ణయంతో వచ్చాను. భర్తను కూడా పిలుచుకుని ఒక అనాధ ఆశ్రమానికి వెళ్ళాలి!

ఇక నా చేతుల్లోనూ ఒక బిడ్డ పొర్లుతుంది. దేవుడి శిక్ష నుండి విడుదల పొందుతాను!

****************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

హక్కు...(కథ)