కన్న రుణం… (కథ)

                                                                                           కన్న రుణం                                                                                                                                                   (కథ)

తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. కొన్ని సంధర్భాలలో కూతుళ్లు కూడా చేయొచ్చని చాటిచెప్పారు కొందరు కూతుళ్లు. కన్న తల్లి-తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకోవటం అతిపెద్ద పుణ్యం. ఈ కథలో ఇద్దరు అన్నదమ్ములకు ఆ పుణయం కూడా దొరకలేదు. ఎందుకో తెలుసుకోండి.

************************************************************************************************************

"రేపు మీ అమ్మా, నాన్నలను చూసిన వెంటనే ప్రేమంతా ఒలకబోసి కరిగిపోయి సంబరపడిపోకండి. ఏదో చూశామా...పత్రిక ఇచ్చామా అనుకుని వెంటనే బయలుదేరాలి..."  స్వర్ణ ఖచ్చితంగా ఉరమటంతో... సుందరం ఎప్పటిలాగా మౌనంగా రోజు దినపత్రికలో తల దూర్చాడు.

కొద్ది నిమిషాల తరువాత.......

"రండి...రండి..." అంటూ భార్య ఎవరినో ఆహ్వానిస్తున్న శబ్ధం విని తలెత్తి చూశాడు.

అతని తమ్ముడు మోహన్, అతని భార్య వనజ ,కూతురు శ్రీదేవితో కలిసి లోపలకి వస్తూ కనిపించాడు.

"రా రా... మోహన్ "

"అన్నయ్యా...రేపు అమ్మా-నాన్నలను చూడటానికి వెడుతున్నట్టు వదిన నిన్న 'ఫోన్ చేసింది. మేమూ మీతో వస్తాం. నా కూతురు పెద్ద మనిషి అయిన విషయం వాళ్ళకు తెలియదు. దాన్ని నేరుగా తీసుకువెళ్ళి చూబిద్దామని అనుకున్నాను" అని మోహన్ చెప్పగా....    

'నేను మాత్రం చేసిందేమిటి...ఇళ్లు కట్టుకోవటానికి స్థలం కొన్న విషయం కూడా చెప్పకుండా గృహప్రవేశానికి ఆహ్వానపత్రిక ఇవ్వబోతున్నాను నేను...' అని మనసులోనే గొణుకున్నాడు సుందరం.

ఏంటన్నయ్యా...ఆలొచిస్తున్నావు?  కూతురు పెద్ద మనిషై ఒక సంవత్సరం అవబోతోంది...ఎందుకు ఇంతవరకు చెప్పలేదు?’అనే కదా ఆలొచిస్తున్నావు! వెంటనే చెప్పాలనే నాకు ఆశ. కానీ వనజ...'అది చిన్న పిల్ల. విషయం తెలిస్తే మీ అమ్మ వెంటనే సంబరాలు అంటూ సంప్రదాయాలు ప్రారంభిస్తుంది. నాకు అది ఇష్టం లేదు అని చెప్పి ఒక్కసారిగా నా నోరు నొక్కేసింది!  

ఇక్కడ మాత్రం ఏమిటి జరుగుతోంది? స్థలం కొన్న వెంటనే చెప్పాలనే అనుకున్నాను. దాని గురించి మాట్లాడిన వెంటనే మీ వదిన దయ్యంలాగా ఉగిపోయింది. 'చెప్పిన వెంటనే మా నాన్నలాగా మీ నాన్న పది లక్షల రూపాయలు తీసిచ్చి 'ఉంచుకోబ్బాయ్!' అని చెబుతారా ఏమిటి?' - అంటూ ఎన్నో మాటలు మాట్లాడింది. అన్నీ విని ఇలా ఏమీ చేయలేని దద్దమ్మగా ఉన్నాను...'అని మళ్ళీ గొణుక్కున్నాడు సుందరం.  

ప్రేమ చూపించటానికి కూడా డబ్బులు కావాలనే వలయంలోకి తోయబడ్డట్టుగా ఇద్దరం మారిపోయామే? డబ్బు ముందు ప్రేమ, అభిమానం అన్నీ ఓడిపోతున్నాయే!'

వీళ్ళిద్దరూ భార్యల దగ్గర చేతకాని వాళ్ళులాగా ఉండటానికి వాళ్ళ అమ్మ ఒక కారణమో?

అమ్మ చాలా మమకారం గలది. చిన్న వయసులో పిల్లలు చేసే తప్పులకు దండన అని ఏమీ ఇవ్వక ప్రేమ మాటలతో కొట్టి...అభిమానంతో భయపెట్టేది. ఆడవాళ్ళను గౌరవించటాన్ని నేర్పించింది.

"నాన్నా...వ్యాసం రాసిస్తానని చెప్పారే! 'రెడీ' చేశేశారా?"--రెండో కొడుకు గోపాల్ వచ్చి అడిగేటప్పటికి, లోకంలోకి వచ్చాడు సుందరం.

"అన్నయ్యా...నీకు వ్యాసాలు రాయడం కూడా వచ్చా?" అని అడిగాడు మోహన్ ఆశ్చర్యంగా! అతని జ్ఞాపకాలు కూడా కొంచం వెనక్కి వెళ్ళినై.

వాళ్ళిద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడు...అమ్మే ప్రసంగాల పోటీలకు, వ్యాసాల పోటీలకూ పోటీ పడమని, అందమైన ముద్రించిన అక్షరాలలాగా రాసే చేతిరాతతో వ్యాసాలు రాసిచ్చేది. ఆమె రాసిచ్చిన వ్యాసాలతో గెలుచుకున్న ఎన్నో బహుమతులు, మెడల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి.

నాన్న కష్టపడి సంపాదించుకుని వచ్చిన సంపాదనను అద్భుతంగా-పొదుపుగా ఖర్చుపెడుతూ ఆదా చేస్తుంది అమ్మ. తక్కువ సంపాదనలో నలుగురూ సంతోషంగా జీవిస్తున్నారంటే అది అమ్మ యొక్క ఉత్తమ నిర్వాహ ప్రతిభే!

సహోదరులిద్దరూ ఏరోజూ దేనికీ కష్టపడిందే లేదు. కానీ ఇప్పుడు...అన్ని వసతులూ ఉన్నా కూడా మనసులో ప్రశాంతత లేదు.

"సరే... మోహన్. రేపు ఇక్కడికి వచ్చేయండి. అందరం కలిసి నా కారులోనే వెల్దాం" అంటూ పాత జ్ఞాపకాలలో నుండి తమ్ముడ్ని లేపాడు సుందరం. వాకిలి వరకు వెళ్ళి వాల్లను సాగనంపాడు.  

పెద్ద పోర్టికోను పూర్తిగా ఆక్రమించి నిలబడుంది సుందరం కారు. అందులో విలాసవంతంగా ఆరుగురు ప్రయాణం చేయవచ్చు. బంగళా, కారు, పదవి అన్నీ తండ్రి ఇచ్చిన ఆస్తి అని భార్యలతో చెబితే వాళ్ళు అంగీకరించరు. కేవలం పన్నెండు వేలు 'పెన్ షన్ తీసుకునే అత్యంత సాధారణ మనిషి అనే భావన. తమ ఇంటి కారు డ్రైవర్ కు కూడా నెలకు పదిహేను వేలు జీతం అంటారు!

తండ్రి, ఆస్తి ఏమీ కూడబెట్టలేకపోయినా...తనకున్న ఒకే ఒక ఆస్తి అయిన పొలాన్ని అమ్మి కొడుకులను పెద్ద చదువులు చదివించాడు. పెద్ద చదువుల వలన వాళ్ళ జీవిత ఘనత మారిపోయింది.

జీవితంలో అన్నిటినీ నిజాయతితో, క్రమశిక్షణతో అనుసరించి శ్రమించి జీవితం గడిపారు నాన్న... మనం అనుకున్నట్టు జీవితం గడపగలమా ఏమిటి? కుటుంభంలో సమస్యలు మొదలై...అవి భూతాకారం ఎత్తక ముందే ధైర్యంగా అమ్మను తీసుకుని బయటకు వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

కోడళ్ళిద్దరూ గొప్పింటి వారు! కొంత కాలం వరకే గౌరవంగానూ, మర్యాదగానూ నడుచుకున్నారు. ఆస్తి-పాస్తులు లేని మామగారు-అత్తగార్లతో మనమెందుకు సొంతమనిషిలాగా ప్రవర్తించాలి? అని అనుకున్నారు. వాళ్ళ వాళ్ళ స్వార్ధం - గౌరవానికి చోటిచ్చి సమస్యలను ఉత్పాదన చేసేరు.

కన్నవాళ్ళు కేవలం రెండువందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా కొడుకులు  వెళ్ళి చూడలేదు. పని ఒత్తిడి, టైము దొరక్కపోవటం  అంటూ ఏదేదో సాకులు చెప్పి వాళ్ళను వాళ్ళే మోసపుచ్చుకున్నారు.

అమ్మా, నాన్నల దగ్గర 'సెల్ ఫోన్ లేదు అనేది ఒక  సాకు...కుశలం విచారించ లేకపోతున్నాం అనేదానికి ఒక కుంటి సాకు అయ్యింది.

మరుసటి రోజు ప్రయాణంలో, కారు నడుపుతున్న సుందరం, పక్కనే కూర్చున్న మోహన్ ఇద్దరి మనసుల్లోనూ వాళ్ళ కన్నవాళ్ళ గురించిన ఆలొచనలే!

మనల్ని చూసిన వెంటనే అమ్మా-నాన్నా చాలా సంతోష పడతారు. వంట చేయడానికి అమ్మ హడావిడి పడుతుంది.  ఆమె చేతి వంట తిని ఎన్ని రోజులయ్యంది...? వంటలు చేయటంలో అమ్మ అరితేరిన మనిషి.

వాళ్ళల్లో ఒక్కొక్కరికీ ఏమిష్టమో చూసి చూసి వంట చేసి తృప్తి పడుతుంది. ఇదిగో ఇప్పుడు కూడా.... సుందరానికి కారకాయ పులుసు కూర, మోహన్ కి గుత్తి వంకాయ కూర చేయటానికి కావలసినవి రెడీ చేస్తుంది. నాన్న, సంచీ తీసుకుని కొట్టుకు వెడతారు. 

తాము చెప్పబోయే సంతోషమైన వార్తలను విని ఆనందంతో ఉప్పొంగిపోతారు. "ముందే ఎందుకు చెప్పలేదు?" అని అమ్మ ఏనాడూ అడిగిందే లేదు.

మనవరాలు వయసుకు వచ్చిందనేది విని సంతోషపడుతుందే తప్ప ఆచారం, సంప్రదాయం అంటూ ఒత్తిడి చేయదు. అవతలి వాళ్ళ ఇష్టాలు కాదని అమ్మ ఎప్పుడూ ఏపనీ చెయ్యలేదు. కానీ, వసతి లేని వాళ్ళను చూసి ఏదైనా మాటలనడం కొడళ్ళకు అలవాటు

చిన్నగా ఉన్న వీధిలోని ఇంటిముందుకు వెళ్ళి ఆగింది బ్రహ్మాండమైన కారు. ఇంట్లోని ఒక పక్క పోర్షన్ లోనే అమ్మా-నాన్నలు ఉన్నారు.

వయసైన -- గడ్డమూ, కళ్ళజోడు ఉన్న ఒక మనిషి తలుపు తెరిచాడు.

"ఇక్కడ సుబ్బారావ్ గారు అని..."

"...వాళ్ళా? వాళ్ళు ఇళ్లు ఖాలీ చేసి వెళ్ళిపోయారే! మీరు వాళ్ళకు బంధువులా?"

'కొడుకులం' అని చెప్పటానికి గబుక్కున వాళ్ళకు నోరు రాలేదు.

"అవునండి! వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో మీకు తెలుసా?"

ఆయన కొంచం వెనుకాడాడు. "చెబుదామా...వద్దా?" అని ఆలొచిస్తున్నట్టు అన్నదమ్ములకు అర్ధమయ్యింది.

"సార్...తెలిసుంటే దయచేసి చెప్పండి" అని ఒత్తిడిచేసేరు.

"వాళ్ళు...నా దగ్గర కూడా ఏమీ చెప్పలేదు. నేను తాసీల్ధార్ గా ఉండటం వలన ఒకసారి తన భార్యకు అరవై ఏళ్ళు పూర్తి అయినై అని చెప్పి 'సర్టిఫికేట్' అడిగారు. రోజు ప్రొద్దున వాకింగ్ వెళ్ళినప్పుడు రెండిళ్ళ తరువాత ఉంటున్న ఒక రైల్వే ఉద్యోగి మాటల్లో...ఇద్దరికీ పోయిన నెల కాశీ వెళ్ళటానికి ' సీనియర్ సిటిజన్ కోటా' లో టికెట్టు కొని ఇచ్చినట్టు చెప్పారు...అంతే తెలుసు" అన్న ఆయన లోపలకు వెళ్లటానికి వెనుతిరిగాడు.

ఆయన అలా వెనుతిరగడం 'నాకు తెలిసింది చెప్పను. మీరు వెళ్ళొచ్చు అని చెప్పకనే చెప్పింది.

కొడుకులిద్దరూ నేరం చేసేమనే భావం తో కృంగి కృశించి పోయారు. 'కన్నవారికి దేశం చూపించే మర్యాద కూడా, వాళ్ళ రక్తం పంచుకుని పుట్టిన మనం చూపించలేకపోయామే...?' అనుకుంటూ అవమానపడి నిలబడ్డారు.

"సరే...సరే... వెల్దాం" అంటూ తరుముతున్న భార్యలను గబుక్కున తిరిగి చూసిన అన్నదమ్ములిద్దరి కళ్ళళ్ళోనూ ఎర్రటి మంటలు చెలరేగినై.

ఇంటికి తిరిగి వెడుతుంటే చిన్నప్పుడు చదువుకున్నది, విన్నది, తెలిసినది అన్నదమ్ములిద్దరికీ గుర్తుకు వచ్చింది.

తల్లి తన గర్భగుడిలో బిడ్డను నవమాసాలు మోస్తుంది.. ప్రాణాలకు తెగించి.. పురిటి నొప్పులతో జన్మనిస్తుంది.   పాలిచ్చి.. లాలించి పెంచి పెద్ద చేస్తుంది..   తాను పస్తులుండైనా బిడ్డ ఆకలి తీరుస్తుంది. గోరుముద్దలు తినిపిస్తుంది.. చందమామ కథలు చెప్తుంది.ఆలనా పాలన చూస్తుంది.. అడిగిందల్లా ఇస్తుంది..జోలపాట పాడి నిద్రపుచ్చుతుంది..రుణం తీర్చుకునే సమయం వస్తే..కన్న కొడుకుగా.. ఏమిచ్చి తల్లి రుణం తీర్చుకోవాలి.

అమ్మ నిజం అయితే.. నాన్న నమ్మకం.. తల్లి మనల్ని నవ మాసాలు మోసి జన్మనిస్తే, బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు తాను కొవ్వొత్తిల కరిగిపోయే గొప్ప వ్యక్తి నాన్న. నాన్న మన పక్కనుంటే కొండంత ధైర్యం, ఏదైనా సాధించగలననే నమ్మకం ఉంటుంది. మన వేలుపట్టి నడిపిస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు.

అలాంటి తల్లి-తండ్రుల్ను కనీసం గౌరవించలేదు, మర్యాద ఇవ్వలేదు సరికదా కనీసం ఒక దశాబ్ధంగా ఎలా ఉన్నారోనని చూడటానికి కూడా ప్రయత్నించలేదు....భగవంతుడా మమ్మల్ని క్షమించి, మా తల్లి-తండ్రులను మాకు చూపించి కన్నవారి రుణం తీర్చుకునే సందర్భం కలిగించు...అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తునే ఉన్నారు.

************************************************సమాప్తం*********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మంచిదొక ఐడియా...(కథ)

స్పష్టత...(కథ)

మాతృ హృదయం...(కథ)