అమ్ముడుపోని విత్తనం...(కథ)

                                                                         అమ్ముడుపోని విత్తనం                                                                                                                                                          (కథ)

రియల్ ఎస్టేట్ బిజినస్ చేస్తున్నాడు జనార్ధన్.

గ్రామం లోనే కాకుండా చుట్టుపక్కలున్న పది-పదిహేను గ్రామాలలో ఉన్న పొలాలస్థలాల రేట్ల పట్టీలో ఆరితేరిన మనిషి జనార్ధన్. అమ్మటానికి రెడీగా లేని వాళ్ళను కూడా, డబ్బు ఆశ చూపించి వాళ్ళ స్థలాలనూ-పొలాలనూ అమ్మేటట్టు చేయగల ధీరుడు. గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ ఎవరైనా స్థలలు గానీ, పొలాలు గానీ అమ్మాలన్నా, కొనాలన్నా మొదట జనార్ధన్ దగ్గరకే వస్తారు.

ఆకాష్ బయటి దేశంలో ఉంటున్నాడు. జనార్ధన్ ఆకాష్ కి ఒక విధంగా దూరపు చుట్టం. గ్రామంలో ఉంటున్న తన తల్లిని కూడా తనతో తీసుకువెళ్ళాలనే ఐడియాతోనే భారతదేశం వచ్చాడు ఆకాష్. ఇది ఎలాగో తెలుసుకున్న జనార్ధన్, గ్రామంలో ఉన్న ఆకాష్ కు చెందిన ఆస్తులను ఎలాగైనా తానే అమ్మించి, మంచి డబ్బు కమీషన్ గా పొందాలని ప్లాన్ వేసుకున్నాడు.

కానీ, అలా జరగలేదు. మరేం జరిగింది? జనార్ధన్ ఆకాష్ ను ఒప్పించలేకపోయాడా? తల్లిని తనతో పాటూ విదేశాలకు తీసుకు వెళ్దామని అనుకున్న ఆకాష్ ప్రయత్నం మానుకున్నాడా? లేదు ఇంకేమన్నా జరిగిందా? తెలుసుకోవటానికి కథ చదవండి.

****************************************************************************************************

ఏం తేల్చుకున్నావు తమ్ముడూ?” గాలం వేశాడు జనార్ధన్. రియల్ ఎస్టేట్ బిజినస్ చేస్తున్న ఈయన ఆకాష్ కి ఒక విధంగా దూరపు చుట్టం.

ఆకాష్ చిన్నగా నవ్వాడు.

వీడు...మన దారికి వచ్చేటట్టు తెలియటం లేదే! బాగా లోతుగా ఆలొచించే మనిషిలాగా ఉన్నాడే? నోరు తెరిచి చెబితేనే కదా, దానికి తగినట్టు మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకొకరు మనల్ని ఒవర్ టేక్ చేయకూడదు. తరువాత మన సంపాదన బాగా దెబ్బతింటుందిఅని మనసు కాలుతున్నా, ఏదో నవ్వాలని తానూ నవ్వాడు జనార్ధన్.    

ఆ గ్రామం లోనే కాకుండా చుట్టుపక్కలున్న పది-పదిహేను గ్రామాలలో ఉన్న పొలాల -  స్థలాల రేట్ల పట్టీలో ఆరితేరిన మనిషి జనార్ధన్. అమ్మటానికి రెడీగా లేని వాళ్ళను కూడా, డబ్బు ఆశ చూపించి వాళ్ళ స్థలాలనూ-పొలాలనూ  అమ్మేటట్టు చేయగల ధీరుడు. గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ ఎవరైనా స్థలలు గానీ, పొలాలు గానీ అమ్మాలన్నా, కొనాలన్నా మొదట జనార్ధన్ దగ్గరకే వస్తారు.

ఆకాష్ బయటి దేశంలో ఉంటున్నాడు. అందువలన అతను వచ్చిన మరుసటి రోజే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు జనార్ధన్అతన్ని కలుసుకున్నాడు. అడిగాశాడు.

అతనో మౌనంగా నవ్వాడు.

సారి తన తల్లిని కూడా తనతో పాటూ తీసుకు వెల్తున్నందువలన, అక్కడున్న పొలాలూ, ఇళ్ళు అమ్మేసి వెళ్ళిపోతాడని మాటలు వినబడటంతో...అందరి కంటే ముందుగా తాను ఉండాలని చూస్తున్నాడు జనార్ధన్.

కనీసమైన 'కమీషన్ 'చూసేయచ్చు అనే ఊహలో మునిగి తేల్తున్నాడు.

వెళ్ళేటప్పుడు అమ్మగారిని మీతో తీసుకు వెళ్ళబోతారని విన్నాను?” అంటూ మళ్ళీ ఆయనే అడిగాడు.

అవును మామా! అదే నా ప్లాను అన్నాడు.

వయసైన వాళ్ళు చివరి దశలో...కొడుకుల దగ్గర ఉంటూ, మనవుడు, మనవరాళ్ళను చూసుకుంటూ ఆనందమైన జీవితం గడపటానికే కదా ఆశపడతారు. అందువలన పక్వంగా మాట్లాడి పిలుచుకు వెళ్ళే దారి చూడు! అదే ఇద్దరికీ మంచిది

మీరు చెప్పేది కరెక్టే మామా. అలాగే చేయాలి

ఆకాష్ చెప్పిన జవాబు, జనార్ధన్ కి మంచి ఉత్సాహం ఇచ్చింది.

వెళ్ళటానికి చాలా టైము అవుతుంది కదా?మళ్ళీ గాలం వేశాడు.

లేదు మామా...రెండు వారాలలో వెళ్ళాలి

'అబ్బో..చాలా తొందరలోనే ఉన్నాడు. మన పంట పండింది ' మనసులోనే ఆనందపడుతూ--

అమ్మగారు మీతో పాటూ అక్కడికి వచ్చేస్తే, ఇక్కడున్న ఆస్తిపాస్తులను ఎవరు చూసు కుంటారు?”--పాయింటుకు వచ్చాడు జనార్ధన్.

దానికేదైనా దారి చేసేసి వెళ్లాలి. కానీ రెండు వారాల వ్యవధిలో ఏం చేయగలను. ఇదే ఇప్పుడు నాకు ఆందోళన కలిగిస్తోంది

నేనున్నప్పుడు నీ కెందుకు ఆందోళన తమ్ముడూ. నా గురించి నీకు తెలుసు కదా? ఆందోళన వదులు! నేను పక్కాగా ముగించి పెడతాను అన్న జనార్ధన్ స్వరంలో ఎనలేని ఉత్సాహం కనబడింది.

అది నాకు తెలుసు మామా

మరి ఇంకెందుకు ఆందోళన ఆకాష్, మొదట అమ్మగారి దగ్గర అనుమతి తీసుకో. మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్నారు.

సరే మామా...నేను అమ్మగారితో మాట్లాడి వెంటనే మీకు కబురు పంపిస్తాను అన్నాడు ఆకాష్.

అలాగే తమ్ముడూ... నేను వెళ్ళోస్తా అని ఆకాష్ దగ్గర చెప్పి, పట్టలేని సంతోషంతో బయటకు వచ్చాడు జనార్ధన్.   

                                                                       *********************************    

అమ్మా నాతో వచ్చే విషయం గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు? అని అడుగుతూ తల్లి సీతాదేవి పక్కన వెళ్ళి కూర్చున్నాడు ఆకాష్.

ఆమె నవ్వింది.

దాని అర్ధం ఏమిటి?

అతను చెప్పింది అంగీకరించినట్లా?...లేక ఆమె చెప్పేది అంగీకరించమనా?

ఆకాష్, నీతో వచ్చి మనవడు, మనవరాలితో ముద్దులాడుతూ పొద్దు గడపాలనే ఆశగా ఉందిరా...కానీ...కానీ అంటూ లాగింది.

కానీ...కానీ ఏంటమ్మా? ఏదైనా పరవాలేదు నాతో చెప్పమ్మా! అన్న ఆకాష్, తల్లి ఏం చెప్పబోతున్నదో అనే ఆలొచనలోకి వెళ్ళాడు.

ఆకాష్, నేను పుట్టి, పెరిగి, జీవించిన భూమిరా ఇది. ఇది వదిలి విదేశీ భూమికి వచ్చి జీవించాలంటే మనసు ఒప్పుకోవటం లేదురా”  

ఇది మామూలే కదమ్మా! కానీ మేము అక్కడ...నువ్వు వయసైన కాలంలో ఒంటరిగా ఇక్కడ ఎందుకమ్మా ఉండాలి...?

నేను ఒంటరిగా లేనురా -- అంటే నేను ఒంటరిగా ఎక్కడున్నానురా. ఎప్పుడూ నాకు తోడుగా గంగమ్మ ఉంది. ఆమె అల్లుడు ఉన్నాడు, రంగా ఉన్నాడు. పొలాలు, తోటలూ చూసుకునే శేషమ్మ, ఏడుకొండలు ఉన్నారు

అదే సరేనమ్మా! వాళ్ళు పనివాళ్ళుగా మాత్రమే లేరనేది నాకు తెలుసు...బంధువుల కంటే ఎక్కువ అభిమానం చూపించే జీవులుగానూ ఉంటూ మిమ్మల్ని చూసుకుంటున్నారు. కనుకనే, నీ గురించిన ఆందోళన లేకుండా మేము అక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. అయినా కానీ ఎన్ని రోజులు మేము అక్కడ నువ్వు  లేకుండా ఉండగలం. నీ మనవడూ, మనుమరాలూ నానమ్మ కావాలిఅని అడుగుతున్నారు. అందుకనే, ఇప్పుడు మీరు మాతో వచ్చి మా దగ్గర ఉండాలని ఆశపడుతున్నాం అమ్మా...కాదనకుండా రండమ్మా

నాకూ ఆశగానే ఉంది! కానీ...

మళ్ళీ కానీ ఏమిటమ్మా?

మీ నాన్నగారి ఊపిరి విడిపోయిన ఈ ఇంట్లోనే నా చివరి శ్వాశ వదలాలని ఆశపడుతున్నానురా

తల్లి అలా చెప్పిన తరువాత, అంత కంటే ఆమెతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ఆకాష్.

ఏమిట్రా...ఆలొచనలో పడిపోయావు! నా చివరి కోరిక తప్పు అనుకుంటున్నావా? చిన్నగా అడిగింది.

లేదమ్మా...అలా అనుకోలేదు. మీ ఆశప్రకారమే ఉండండి. ఇప్పుడు నేను ఆలొచించేది... జనార్ధన్ మామకు ఏం సమాధానం చెప్పాలి!

ఆయనకు ఏం సమాధానం చెప్పాలి? ఎందుకు చెప్పాలి?

పెద్దగా ఏమీ లేదమ్మా...మీరు మాతో రావాలనుకుంటే ఆస్తులను అమ్మాలా అని అడిగారు. మీరు ఇప్పుడు ఇక్కడే ఉండబోతారు కాబట్టి ఆమ్మే అవసరం మనకు లేదు అని చెప్పాలి? లేకపోతే అనవసరంగా మన ఇంటి చుట్టూ తిరిగి అలసట తెచ్చుకుంటారు

కొంచం సేపు మౌనం తరువాత.

ఆకాష్, నువ్వు జనార్ధన్ మామయ్యను తీసుకురా. నేను ఆయన దగ్గర మాట్లాడవలసింది ఉంది”  

కొడుకు దగ్గర కొంత అయోమయం.

పొలమో...ఇల్లో అమ్మే ఐడియానే లేదే! ఆ తరువాత ఎందుక ఆయన్ని చూడలి?

మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యా మౌనం చోటు చేసుకుంది........మళ్ళీ తల్లే అడిగింది.

ఆకాష్...కొంతకాలం తరువాత నువ్వు ఇక్కడకొచ్చి ఈ ఊర్లో నివసించాలనే ఆలొచన ఏదైనా పెట్టుకున్నావా?  

కొంచం సేపు తటపటాయింపుకు తరువాత.

అలాంటి ఆలొచన ఏదీ లేదమ్మా అన్నాడు.

సరే. నువ్వు దిక్కు మారి వెళ్ళిపోయావు. ఇక మీదట అదే 'లైను ' లోనే వెల్తావు...

హు...

అప్పుడు ఎలాగూ ఒక రోజు మన ఇంటితో సహా అన్నిటినీ అమ్మే కదా తీరాలి?

.........................

మౌనంగా ఉంటే ఎలారా? నిజాన్ని మాట్లాడే కదా కావాలి

అవునమ్మా

వీటిని అమ్మి వచ్చే డబ్బు మనకు అవసరమనుకుంటున్నావా?

అలాగంతా ఏమీ లేదమ్మా! నేనే బాగా డబ్బు సంపాదించి ఉంచుకున్నానే?

మంచిది ఆకాష్ అన్న సీతాదేవి---

అలాగైతే...నేను చెప్పేదాన్ని నువ్వు అంగీకరిస్తావని నమ్ముతున్నారా అన్నది.

ఏం చేయాలి? చెప్పమ్మా...

మన పూర్వీకులు అడవుల్ని రూపు దిద్ది - వ్యవసాయ భూమిగా మార్చి, ఈ జిల్లాకే భోజనం పెట్టే తల్లి లాగా మార్చారు. ఇది ఇలాగే పది కాలాల పాటూ జరగాలని ఆశపడుతున్నాను

...................

జనార్ధన్ మామయ్య లాగా ఉండే 'బ్రోకర్ల ' చేతిలో దీన్ని అప్పగిస్తే, వాళ్ళు ఎవరెవరికో అమ్ముతారు. కొన్న వాళ్ళు కూడా అది పంట భూమి అని కూడా చూడకుండా - బంజరు భూమిగా చేసేసి...ఫ్యాక్టరీలు, భవనాలు కట్టి డబ్బు చేసుకుంటారు.

తల్లిలా అన్నం పెట్టిన భూమిని, రసాయన ఎరువులతో విష భూమిగా మార్చేస్తారు. కాంక్రీట్ కట్టడాలు ఎత్తుగా ఎదిగి, ఈ మట్టిని ఊపిరి పీల్చు కోనివ్వకుండా చేసేస్తాయి

తన బాధనంతా కక్కింది సీతాదేవి. అప్పుడు ఆమె కళ్ళు తడిసినై. ఆమెకు భూమి మీదున్న ప్రేమ బయట పడింది.  తల్లి భూదేవి అంటే సీతాదేవికి ఎంత ప్రేమో.

తపించిపోయి నిలబడ్డాడు కొడుకు.

అయితే...మన పొలం ఎప్పుడూ పచ్చటి పంట పొలంగా ఉండాలనే ఆశపడుతున్నావు...అంతే కదా?

అవునన్నట్లు  తల ఊపింది తల్లి.

చెప్పండమ్మా...దానికొసం మీరు ఏం చేయమన్నా చేస్తాను అన్నాడు ఖచ్చితమైన స్వరంతో.

దీన్ని ఎప్పుడూ వ్యవసాయం చేసే వాళ్ల చేతుల్లోనే అప్పగించాలి. అది వాళ్ళు ఒప్పంద పత్రంలోనే రాసివ్వాలి. దాన్ని మీరితే పొలాన్ని జప్తు చేస్తామని నిబంధన రాయాలి

ఇలా నడుచుకునే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారా అమ్మా?

ఉన్నారు. మనింట్లోనే ఉన్నారు. గంగమ్మ, రంగా, శేషమ్మ, ఏడుకొండలు...వాళ్ళకు మన పొలాలను దానంగా రాసిద్దాం

అమ్మా!

ఆ తరువాత మన పెద్ద ఇంటిని, అనాధ ఆశ్రమానికి ఇచ్చేద్దాం. నాకు రెండు గదులు  మాత్రం ఉంచుకుని, మిగితా ఇంటినంతా అనాధ పిల్లలు తల దాచుకోవటానికి వసతులు చేసిద్దాం

అమ్మా...! మళ్ళీ ఆశ్చర్యపోయాడు.

జనార్ధన్ మావయ్యకే డాక్యూమెంట్ ఎలా రాయాలో వివరంగా తెలుసు. ఆయన్ని పెట్టే రాసిచ్చేద్దాం. ఆయన 'కమీషన్' ఇచ్చేస్తే...శ్రద్దగా చేసి ఇస్తాడు అన్నది సీతాదేవి.

సరేనమ్మా...చేసేద్దాం ఆనందంతో చెప్పాడు ఆకాష్.

మంచి చెట్టు విత్తనం కదా ఆకాష్?

***************************************************సమాప్తం**************************************



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)