పెళ్ళి బేరం…(మినీ కథ)
పెళ్ళి బేరం (మినీ కథ)
పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అందరికీ తెలుసు. అయినా కానీ పెళ్ళి నిశ్చయం చేసుకునేటప్పుడు బేరసారాలు తప్పక జరుగుతాయి. దీన్ని నాజూకుగా ఇచ్చి పుచ్చుకోవటాలు అని చెప్పొచ్చు.ఈ ఆచారాన్ని ఎవరూ పూర్తిగా మార్చలేరు. అది ప్రేమ వివాహమైనా లేక పెద్దలు నిర్ణయించిన వివాహమైనా సరే బేరాలు తప్పక చొటు చేసుకుంటాయి. ఈ మధ్యకాలంలో ఇందులో కొన్ని మార్పులు వచ్చినై.........ఆ మార్పులలో ఒక తండ్రి తన కొడుకు ప్రేమ వివాహాన్ని ఒప్పుకోవటానికి ఎలా మాట్లాడాడో ఈ కథ చదివి తెలుసుకోండి.
మేడ మెట్లు దిగి వస్తున్నాడు కార్తీక్.
చొక్కా జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ మోగింది.
తీసి చూసాడు.
‘నందిని’ అని కనబడింది.
మెట్టు మీద ఆగి సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి "హాయ్
నందిని...గుడ్ మార్నింగ్" అన్నాడు.
"హాయ్, మార్నింగూ
తరువాత. ముందు ఇది చెప్పు. మన ప్రేమ
గురించి మీ నాన్నకు చెప్పావా, లేదా?"
"లేదు..ఇంకా
చెప్పలేదు"
"ఎన్ని రోజుల
నుంచి చెబుతున్నా మన ప్రేమ గురించి మీ నాన్నకు చెప్పమని…రాత్రి చెబుతానని నిన్న సాయింత్రం మనం పార్కులో
కలుసుకున్నప్పుడు ప్రామిస్ కూడా చేసావు" నందిని స్వరంలో కోపం తెలుస్తోంది.
"ఇప్పుడు
చెప్పబోతున్నాను" హడావిడిగా చెప్పి, సెల్ ఫోన్ ఆఫ్
చేయటం మర్చిపోయి అలాగే చొక్కా జేబులో పెట్టేసుకున్నాడు.
మెట్లు దిగి హాలులో పేపర్ చదువుకుంటున్న తండ్రి దగ్గరకు
వచ్చాడు.
"నాన్నా...నీదగ్గర ఒక విషయం మాట్లాడాలి" అన్నాడు
కార్తీక్.
"చెప్పరా" తండ్రి గొంతు.
"నేను నందినీ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను"
"ఉద్యొగం-సద్యోగం లేని నీకు ప్రేమ ఎందుకురా?"
"అవసరపడకండి.
నందిని ఎం.బి.బి.ఎస్ చివరి సంవత్సరం చదువుతోంది"
ఇప్పుడు తండ్రి స్వరంలో శ్రుతి తగ్గింది.
"కోడలు డాక్టరైతే బాగా సంపాదించొచ్చే...సరే ఆ ఆమ్మాయినే
పెళ్ళి చేసుకో"
"మరి...నందిని మన కులం కాదు"
"వేరే కులమా? అయితే అ అమ్మాయి వద్దురా"
"ఒక్క నిమిషం నాన్నా...వాళ్ళ నాన్నగారు
కోటీశ్వరుడు"
"కోటీశ్వరుడి కూతురా? అలగైతే కుల మత భేదాలు
చూడకుండా నువ్వు ఇష్టపడ్డ ఆ అమ్మాయినే చేసుకో"
"కానీ, మా ప్రేమ వాళ్ళ నాన్నకు కొంచం కూడా ఇష్టం లేదు.
నన్ను పెళ్ళి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్పేసాడు"
తండ్రి స్వరంలోని శ్రుతి మళ్ళీ పెరిగింది.
"ఆస్తి రాదా?...అయితే ఆ
అమ్మాయికి మన కోడలుగా వచ్చే అర్హత లేదు"
"ఆస్తి ఆయన రాసివ్వకపోయినా ఒకే కూతురు కాబట్టి...ఆయన
చనిపోతే ఆస్తి మొత్తం నందినికే వచ్చి చేరుతుంది"
"సరే...నీ ఇష్టం...ఆ అమ్మాయినే నువ్వు..."
"ఒక వేల నందిని వాళ్ళ నాన్న చనిపోవటానికి ముందే వేరే
ఎవరి పేరుకైనా వీలునామా రాసేస్తే...?"...కార్తీక్
సాగదీశాడు.
"అయ్యో, అలాగైతే ఆ శని
మనకొద్దురా"
"లేదు నాన్నా, పూర్వీకుల ఆస్తి
కాబట్టి, కోర్టులో దావా వేస్తే ఆస్తి మొత్తం నందినికే
వస్తుందంట"
"ఓ...కే.....నందిని మన ఇంటికి కోడలుగా రావటానికి
నేను అంగీకరిస్తున్నా"
"కానీ, కోర్టు కేసులో
త్వరగా తీర్పు రాక, వాయిదాలపై వాయిదాలతో
కొన్ని సంవత్సరాల తరబడి కేసు తీర్పు ఆలశ్యమైతే..."
"సమస్యలతో వేగలేము...ఈ అమ్మాయే మనకొద్దు"
“మనం మంచి అడ్వకేట్ ను
పెటుకుని కేసు వాదాడితే..."
అవతలపక్క సెల్ ఫోన్ లో తండ్రి-కొడుకుల సంభాషణ వింటున్న
నందిని, ఇక వినలేక కళ్ళు తిరిగి పడిపోయింది.
**************************************************సమాప్తం*******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి