మానసిక ధర్మం…(కథ)

 

                                                                  మానసిక ధర్మం                                                                                                                                                 (కథ)

అరవై అరవైగానే ఉండాలి...శారీరక మానసిక ధర్మాలు ఆయా వయసులను బట్టి ఉండాలి. వృద్ధాప్య దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అహాన్ని, ఆధిపత్య ధోరణిని, తాపత్రయాల్ని, నేను-నాది అనే భావనల్ని ఒక్కొకటిగా వదిలేయాలి. అలా వదిలేయలేకపోతే ఆ మనిషి చింతలు, చికాకులు, అలజడి, అశాంతితో...ప్రశాంతతను కోల్పోతారు”

పెద్దతనం అనేది సాత్విక స్వభావానికి, ఆలొచనకూ, సంయమనానికి స్థానం. మంచిని పిల్లలు చెప్పినా...పెద్దవాళ్ళు ఆహ్వానించాలి”

బోసినవ్వు పసిబిడ్డకు అందం. ఆటా, పాటా పిల్లలకు అందం. గిలిగింతలు పెట్టే ఊహలు యౌవనానికి అందం.బాధ్యతలు మోయడం గృహస్థుకు అందం”

అలాగే- సమాజానికి మంచి చెబుతూ, స్ఫూర్తి కలిగిస్తూ, మానసికంగా రుషి జీవనం గడపడమే వృద్ధాప్యానికి అందం"

ఈ కథలో మానసిక ధర్మాన్ని మర్చిపోయి, తన సొంత కొడుకుని, కోడల్ని...మరీ పంతంగా మనవరాలుని మానసికంగా ఏడిపించిన బామ్మ ఎలా తన మానసిన ధర్మాన్ని అర్ధం చేసుకోగలిగింది?....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

*****************************************************************************************************

ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చిన లావణ్య గుమ్మం దగ్గర చెప్పులు విప్పి ఇంటి లోపలకు వచ్చి సోఫాలో వాలిపోయింది. ఇది రోజూ ఉన్న తంతే అయినా, రోజు ఆఫీసులో లావణ్యకు ఊపిరాడనంత పని.

లావణ్య అలా సోఫాలో వాలిపోగానే, చేతిలో మంచి నీళ్ళ గ్లాసుతొ అక్కడ ప్రత్యక్ష మయ్యేది లావణ్య ఎనిమిదేళ్ళ కూతురు గౌతమి. కూతురు అందించిన మంచి నీళ్ళు తాగిన తరువాత లావణ్యకు అప్పటివరకు ఉన్న అలసట ఒక్క క్షణంలో తగ్గిపోయేది. కూతుర్ని దగ్గరకు లాక్కుని, ముద్దాడి తన పక్కన కూర్చోబెట్టుకుని నాటి కబుర్లలోకి వెళ్ళిపోయేది లావణ్య.

రోజు సోఫాలో వాలిపోయి ఐదు నిమిషాలు అయినా, కూతురు గౌతమి మంచి నీళ్ళ గ్లాసుతో తన దగ్గరకు రాకపోయేసరికి గాబరా పడ్డది లావణ్య. సోఫాలో లేచి కూర్చుని "గౌతమి... గౌతమి" అంటూ పిలిచింది.   

కూతురు రాకపొయేసరికి, అదే హాలులో దివాన్ మీద ఎటువంటి చలనమూ లేకుండా, ఇవేమీ పట్టించుకోకుండా పడుకుని టీ.వీ చూస్తున్న అత్తగారిని చూసి "అత్తయ్యా... గౌతమి స్కూల్ నుండి వచ్చేసింది కదా...?" అని అడిగింది.

"ఆ...వచ్చింది" టీ.వీ ప్రొగ్రాములో నుండి తల తిప్ప కుండానే జవాబు చెప్పింది లావణ్య అత్తగారు సుజాతమ్మ.

"ఎక్కడికి వెళ్ళుంటుంది!...ఇంట్లో ఉండుంటే ఈ పాటికి మంచి నీళ్ళ గ్లాసుతో వచ్చుండేదే...?!" అనుకుంటూ సోఫాలో నుండి లేచి ముందుగా తన బెడ్ రూము లోకి వెళ్ళింది లావణ్య.

అక్కడ మంచం మీద కుర్చొనున్న కూతురు గౌతమిని చూడగానే సంతోష పడింది...వెంటనే ఆశ్చర్య పడింది.  

మంచం మీద కూర్చుని హోమ్ వర్క్ చేసుకుంటున్న కూతురు దగ్గరకు వెళ్ళి, పక్కనే కూర్చుంది లావణ్య. కూతురి ముఖం ఎందుకో వాడిపోయి ఉన్నది.  

ఏంటి నాన్నా...ఎందుకలా ఉన్నావు. నాకు మంచి నీళ్ళు కూడా తెచ్చి ఇవ్వలేదు. నేను పిలిచినా పలుకలేదు.  ఓంట్లో బాగలేదా?...అమ్మ మీద కోపం వచ్చిందా?" కూతుర్ని అడిగింది లావణ్య.

"ఏమీ లేదు..." ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చింది గౌతమి.

"టీచర్ ఏదైనా అన్నదా?"

"లేదు"

"మరి"

"బామ్మ తిట్టింది"

"బామ్మ తిట్టిందా?"  అని లావణ్య అన్నవెంటనే, అంతవరకు గౌతమిలో అణిగి ఉన్న దుఃఖం, ఏడుపుగా బయటకు వచ్చింది.

కూతుర్ను దగ్గరకు తీసుకుని "చూడు పండు...ఏడవ కూడదు. సరేనా...?" అని సముదాయిస్తూ "నువ్వు ఏమైనా అల్లరి చేశావా?" అని గౌతమిని అడిగింది.

"లేదమ్మా...బామ్మ నా దగ్గర ఎప్పుడూ కోపంగానే మాట్లాడుతుంది...ఆవిడ స్వభావం అంతే, ఆవిడ మాటలను పట్టించుకోకు అని నువ్వే కదా అదే పనిగా చెబుతావు" అన్నది గౌతమి.

"మరైతే...బామ్మ తిట్టిందని ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు డల్ గా ఉన్నావు? ఎందుకు నాకు మంచి నీళ్ళు తీసుకు రాలేదు?"

"కానీ ఈ రోజు బామ్మ రోజూలాగా విసుక్కుంటూ ఒక మాట అన్నది. ఆ మాట వినంగానే నాకు ఏడుపు వచ్చేసింది"

"నీకు ఏడుపు తెప్పించేటంతటి మాట ఏమిటో?"

"నిన్ను డబ్బులిచ్చి కొనొక్కొచ్చారు "

అంతే లావణ్య షాక్ తో వొణికిపోయింది. అమె నోట మాట రాలేదు!

"నువ్వు చెప్పమ్మా, నన్ను డబ్బులిచ్చి కొనుకొచ్చావా? నేను నీ కన్న బిడ్డను కానా?"… ఏడుస్తూ, తల్లిని కుదుపుతూ అడిగింది గౌతమి.

షాక్ లో నుండి తేరుకుని "లేదురా...బామ్మ స్వభావం నీకు తెలుసు కదా...ఆవిడ మాటలను పట్టించుకోకు. నువ్వు నా కన్న బిడ్డవే....ఏడవకు….నాన్న రానీ, బామ్మ గురించి, బామ్మ మాటల గురించి చెబుదాం" అంటూ కూతుర్ని ఎత్తుకుని కళ్ళు తుడిచి, ముద్దాడి ఏడవకూడదు...నీ హోమ్ వర్క్ చేసుకో. నేను ఫ్రెష్ అయ్యి, నాన్నకు వంట చేసి, ఆ తరువాత వస్తాను. హోమ్ వర్క్ లో ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడుగు...ఏడవ కూడదు సరేనా" అంటూ కూతుర్ను బుజ్జ గించి, కూతురు "సరే" అన్న తరువాత ఆ గదిలో నుండి వెళ్ళింది లావణ్య .  

                                                                                    ******************  

"ఏ విషయాన్నైతే పిల్ల దగ్గర చెప్పకూడదో…..ఏ విషయాన్నైతే పిల్ల దగ్గర చెప్ప కూడదని చెప్పామో ఆ విషయాన్నే పని గట్టుకుని చెప్పింది అత్తగారు...వయసొచ్చింది గానీ జ్ఞానం మాత్రం రాలేదు" వంట పని చేస్తోందే గానీ లావణ్య అలొచనలన్నీ అత్తగారి పైనే వెడుతున్నాయి.

గౌతమి ఇంకా చిన్న పిల్లే. దాన్ని ఎలాగైన ఈ విషయాన్నించి మళ్ళించవచ్చు. కానీ అత్తగారిని ఎలా మార్చేది. ఇదే మాట మళ్ళి, మళ్ళి అంటే...పిల్ల మనసు విలవిలా కొట్టుకుంటుందే. అత్తగరిని ఏలా ఆపాలి?...... ఆవిడలోని మానవత్వ భావనలను వెలుపలకి తీసుకు వస్తేనే  ఆవిడ్ని ఆపగలందానికి మంచి ఉపాయం ఆలొచించాలి”  అనుకుంటూ  ఆలొచిస్తున్న లావణ్య ఆలొచనలు ఆమెను గతంలోకి తీసుకువెళ్ళినై.

సుజాతమ్మ నెలలో మొదటి 15 రోజులు పెద్ద కొడుకు సుమన్ ఇంట్లో కాలం గడుపుతుంది.  ఎప్పుడూ నవ్వుతూ చేయగలిగిన పనులు చేస్తూ అక్కడ పెద్ద కోడలికి సహాయంగా ఉంటుంది. నెలలో మిగిలిన రోజులు చిన్న కొడుకు రవి ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏ పనులూ చేయకపోగా, ఎప్పుడూ ధుమధుమ లాడే ముఖంతో కోపంగా ఉంటుంది. కారణం, ఆమె చిన్న కొడుకు రవికులం, మతం, గోత్రం తెలియని ఒక ఆడ పిల్లని దత్తతు తీసుకోవడమే.  అది ఆమెకు ససెమీరా నచ్చలేదు.

" రవి కులం  గోత్రం తెలియని అనాధ పిల్లను దత్తతు తీసుకోవలసినంత కర్మ నీకేం పట్టిందిరా...మన కులంలోనే, అదేరా మా మేనత్త చుట్టాలలో ఒకబ్బాయి ఉన్నాడు, వాడీని తీసుకోరా" అన్నది.

"వద్దమ్మా...తెలిసిన వాళ్ళ పిల్లలను దత్తతు తీసుకుంటే ఏదో ఒక రోజు చుట్టరికం కలుపుకుంటూ మన ఇళ్ళ మీద పడతారు. బిడ్డ మనసు పాడుచేస్తారు. నాకది ఇష్టం లేదు. నేను దత్తతు తీసుకునే బిడ్డ, నా సొంత బిడ్డగానే పెరగాలి. దత్తతు తీసుకోబడిన బిడ్డ అన్న నిజం ఏ నాటికీ ఆబిడ్డకు తెలియకూడదు. అప్పుడు బంధుత్వాలు కలుపుకుని ఎవరూ రారు. మనం ప్రశాంతంగా బ్రతకవచ్చ

అనాధ పిల్లల్ని దత్తతు తీసుకుంటే, ఒక వైపు మన కొరికా తీరుతుంది, మరోవైపు ఆ పిల్లలకు ఒక కుటుంబం దొరుకుతుంది. నేను ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్న అనాధ శరణాలయంలో ఒక ఆడ పిల్లను చూశాను. ఒక సంవత్సరం ఉంటుంది. ఆ పిల్లనే దత్తతు తీసుకుంటాను. చట్టపూర్వకమైన పనులు పూర్తి చేసి చెప్పమన్నాను" రవి పూర్తి చేశాడు.

కొడుకును ఏమీ అనలేక కోపంగా వాడి వంక చూసి, వేగంగా తన రూములోకి వెళ్ళి తలుపులు వేసుకుంది సుజాతమ్మ.

భర్త తమ గదిలోకి వచ్చిన వెంటనే "ఎందుకండి ఆవిడతో  అంత ఆవేశంగా మాట్లాడారు...అవిడ ఎంత బాధ పడిందో చూడండి. గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. కొంచం నిదానంగా, విడమరచి చెప్పుండొచ్చు" అన్నది లావణ్య.

"లేదు లావణ్య...కావాలనే కొంచం కఠినంగా మాట్లాడాను. మా అమ్మంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు కదా. ఆవిడ నా ప్రేమను, నా వీక్ నెస్ గా చూడకూడదు. నేను అలా మాట్లాడి ఉండకపోతే మనం పిల్లను దత్తతుతీసుకునే వ్యవహారం ఒక పెద్ద సమస్యగా మారేది...అలా సమస్య కాకూడదనే అంత కఠినంగా మాట్లాడాను"

"ఏమో నాకెందుకో భయంగా ఉన్నది" తన భయాన్ని బయటపెట్టింది లావణ్య.

"నువ్వేమీ భయపడకు లావణ్య...ఒకటి రెండు రోజుల్లో ఆవిడ కోపం తగ్గిపోతుంది. అప్పుడు ఆవిడ మామూలు మనిషిగా మనతో ఉంటుంది" అంటూ భార్యకు  అభయం ఇచ్చాడు రవి.

కుక్కరు విజిల్ వేయటంతో లావణ్య ప్రస్తుత లోకానికి వచ్చింది.

గ్యాసు పొయ్యి ఆపి, డైనింగ్ హాలుకు వచ్చి కూర్చుంది. మళ్ళీ పాత ఆలొచనలు లావణ్యను చుట్టుముట్టాయి.

"నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదమ్మా. టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ కూడా నీకు అందు బాటులో లేదు. నీ గర్భ సంచీ చాలా వీక్ గా ఉన్నది. సరొగసీ , అంటే అద్దె గర్భం ఫెసిలిటీ ని నేను ఎంకరేజ్ చేయను. దానికి కారణం, నీ భర్త దగ్గర వివరించాను. ఆయన నీకు చెప్తారు" అని లేడీ డాక్టర్ చెప్పిన రోజు, లావణ్య ప్రాణమే పోయినంత పని అయ్యింది. హాస్పిటలే కాబట్టి, వెంటనే ట్రీట్ మెంట్ మొదలుపెట్టి, మరుసటి రోజే లావణ్యను మామూలు మనిషిని చేశారు.

రోజులు గడిస్తున్నాయి కానీ లావణ్యలో ఉత్సాహం లేదు. సుజాతమ్మే తోడుగా ఉన్నది. లావణ్య మీద ఆప్యాయంగా లావణ్యకు ఇస్టమైన వంటలు చేసిపెడుతూ, లావణ్యకు ప్రొశ్చాహకరమైన మాటలు చెబుతూ, చాలా సహాయంగా ఉన్నది.

అలా ఎంతో అన్యోన్నంగా ఉంటూ వచ్చిన అత్తగారు ఆ రోజు, అదే రవి దత్తతు గురించి చెప్పిన రోజు...అలా మారిపోయింది?

ఆ రోజు నుండి ఆవిడ మాటల్లోనె కాదు, చేష్టలలొ కూడా మార్పు వచ్చింది. దత్తతు స్వీకారం రోజు ఆవిడ భోజనం చేయలేదు. అడిగితే కడుపు బాగాలేదు అని చెప్పింది. ఆ తరువాత లావణ్యతో సన్నిహితంగా ఉండటం మానేసింది. వంట పనులు, ఇతర పనులలో సహాయపడేది కాదు. ముభావంగానూ, సమయం దొరికినప్పుడు లావణ్యను ఎత్తి పొడుపు మాటలతో కష్టపెట్టేది. ఇవేవీ లావణ్య ఏనాడు భర్తతో చెప్పలేదు.

కానీ ఇప్పుడు చెప్పాలి. పిల్ల విషయం కాబట్టి చెప్పాలి. 'అమ్మా' అన్న పిలుపుకుఅమ్మ ప్రేమకు ధర కట్టగలమా?...ఈ విషయాన్ని అత్తగారికి వివరించాలి...కానీ అత్తగారు ఆ కాలపు మనిషి. కాబట్టి ఆమెకు అర్ధమయ్యేట్టు చెప్పాలి...అలా ఎలా చెప్పడం?" అనుకుంటూ ఆలొచిస్తున్న లావణ్య మనసుకు ఒక మంచి ఆలోచన తట్టింది. ఆ ఆలొచనను వెంటనే అమలులో పెట్టటానికి భర్త సహాయం చాలా అవసరం. ఇంకో అరగంటలొ భర్త ఇంటికి వస్తాడని తెలిసినా, భర్తకు ఫోను చేసి విషయమూ, ఆలొచనా రెండింటినీ వివరించింది.

                                                                               ********************

రవి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు.

హాలులో ఉన్న సోఫాలో కూర్చుని షూ విప్పుతూ " గౌతమి ఎక్కడా?" మంచి నీళ్ళ గ్లాసు అందించిన భార్య లావణ్యను అడిగాడు.

"వీడియో గేమ్ ఆడుకుంటోంది రవి...పిలవనా?"

"వద్దు...నువ్వు ప్రొద్దున ఏదో చెబుతున్నావు. నేను ఆఫీసు ఫోనులొ ఉండి సరిగ్గా వినిపించుకోలేదు"

అదా రవి...ఈ ఆదివారం బిర్లా మందిరానికి, అటు నుండి ట్యాంక్ బండ్ కి వెళ్ళొద్దామా అని అడిగాను రవి"

"ఊ...ఓకే...."

భార్యా భర్త లిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు కోడలు మాటిమాటికీ భర్తను పేరు పెట్టి పిలవడం అత్తగారు సుజాతమ్మ భరించలేకపోయింది.

సమయం కోసం ఎదురు చూసింది.

భార్య, భర్త లిద్దరూ వాళ్ళ రూముకు వెళ్ళారు.

అరగంట తరువాత.....హాలులో కూర్చుని టీవీ చూస్తున్న అత్తగారి దగ్గరకు వచ్చింది లావణ్య.

"రండి...భోజనానికి లేవండి" అని అత్తగారిని పిలిచి వెనక్కి తిరిగిన లావణ్యను "లావణ్య...ఆగు" ఆని ఆపింది అత్తగారు.

ఏమిటన్నట్టు చూస్తున్న లావణ్యతో వయసు పెరుగుతోంది ...భర్త మీద మర్యాద తగ్గుతోంది" అన్నది.

"ఏమైంది అత్తయ్యా?"

"మాట మాటకీ భర్తను పేరు పెట్టి పిలుస్తున్నావు"

"ఏం...అలాపిలిస్తే తప్పేమిటి"

"తప్పేమిటని అడుగుతున్నావా...!?"

"అవును...నేను నా భర్తను డబ్బులిచ్చే కదా కొనుకున్నాను... అందుకనే పేరు పెట్టి పిలుస్తున్నాను. చూడండి అత్తయ్య గారూప్రేమ అనేది పేరు చెప్పి పిలిచే దాంట్లో లేదు. అది మనసులో ఏర్పడాలి....డబ్బిచ్చి కొనుకున్నాను కాబట్టి నా భర్త పైన నాకు ప్రేమ, మర్యాద లేకుండా పోతుందా?... కానీ మీరేం చేశారు , పాపం...అభం, శుభం ఎరుగని పిల్ల గౌతమి. దాని దగ్గర నిన్ను డబ్బు పెట్టి కొనుకున్నారు అని చెబితే ఆ పిల్ల మనసు ఎంత బాధ పడుతుంది..."

"అసలు, డూప్లికేటూ ఒకటౌతుందా...? వెటకారంగా మాట్లాడింది అత్తగారు.

అత్తగారికి సమాధానం చెప్పబోతున్న భార్యను, అక్కడకు వచ్చిన రవి ఆపి "నేను మాట్లాడుతాను... లావణ్య" అంటూ తల్లి పక్కనే కూర్చున్నాడు.

అమ్మా...పాప వేరైనా, పాప మా మీద చూపించే ప్రేమ డూప్లికేట్ కాకుండా, అసలైనదిగా ఉంటే చాలు...ఇదిగో ఇలా చూడు.నీ మీద ప్రేమ చూపించటానికి నేనున్నాను, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య మీద ప్రేమ చూపించటానికి అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ నాకు, లావణ్యకు...నువ్వు పోయిన తరువాత, మా చివరి రోజుల్లో మా మీద ప్రేమ చూపడానికి ఒక బంధుత్వం ఉండద్దా?...  లేక మేము మా చివరి రోజుల్లో అనాధల్లాగా జీవించాలా?”

కొడుకు ఆ మాట అన్న తరువాత, ఆ క్షణం సుజాతమ్మను ఏదో తెలియని బాధ నలిపేసింది. సోఫాలో నుండి లేచి బయటకు వెళ్ళి , పక్క వీదిలో ఉన్న దేవాలయానికి వెళ్ళింది.  

సూజాతమ్మ మనసులో అర్ధం కాని అలజడి, చికాకు.

ప్రశాంతత కోరకు అక్కడున్న అరుగు మీద కూర్చుంది. పక్కనున్న స్పీకర్ బాక్స్ లో నుండి ఎవరివో స్వామీజీ ప్రవచానాలు వినబడుతున్నాయి. అవి వింటుంటే అమె మనసుకు కాస్త ఊరట కలిగింది. మరికొంత శ్రద్దతో ఆ ప్రవచనాలను వినడం మొదలుపెట్టింది.

అరవై అరవైగానే ఉండాలి.....శారీరక మానసిక ధర్మాలు ఆయా వయసులను బట్టి ఉండాలి. వృద్ధాప్య దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అహాన్ని, ఆధిపత్య ధోరణిని, తాపత్రయాల్ని, నేను-నాది అనే భావనల్ని ఒక్కొకటిగా వదిలేయాలి. అలా వదిలేయలేకపోతే ఆ మనిషి చింతలు, చికాకులు, అలజడి, అశాంతితో...ప్రశాంతతను కోల్పోతారు

పెద్దతనం అనేది సాత్విక స్వభావానికి, ఆలొచనకూ, సంయమనానికి స్థానం. మంచిని పిల్లలు చెప్పినా...పెద్దవాళ్ళు ఆహ్వానించాలి

బోసినవ్వు పసిబిడ్డకు అందం. ఆటా, పాటా పిల్లలకు అందం. గిలిగింతలు పెట్టే ఊహలు యౌవనానికి అందం.  బాధ్యతలు మోయడం గృహస్థుకు అందం

అలాగే- సమాజానికి మంచి చెబుతూ, స్ఫూర్తి కలిగిస్తూ, మానసికంగా రుషి జీవనం గడపడమే వృద్ధాప్యానికి అందం"

 అర్ధమైనట్లు సుజాతమ్మ అక్కడ్నుంచి లేచింది. ఇప్పుడామే హుందాగా నడుచు కుంటూ ఇంటి దారిపట్టింది.

గేటు దగ్గరే నిలబడున్న గౌతమి, బామ్మను చూసి పరిగెత్తుకెళ్ళి బామ్మా...ఎక్కడికెళ్ళావు బామ్మా. నీకిష్టమైన సీరియల్ మొదలయ్యిందిఅంటూ ప్రేమగా చెప్పింది.

"బామ్మా' అన్న గౌతమి పిలుపులో ఆమెకు నిజమైన ప్రేమ కనబడింది. వెంటనే గౌతమిని కౌగలించు కున్నది. పిల్లల మనసులో కల్మషం ఉండదు అన్న ఆమె తల్లి భావన ఆమెలోని తల్లిగుణాన్ని లేపింది.  

గౌతమిని ఎత్తుకుని ఇంట్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుని, గౌతమిని తన ఒడిలో కూర్చో బెట్టుకుంది.

అది చూసిన రవి, లావణ్య దంపతులు సంతోషంలో మునిగిపోయారు.

*************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)