పేగు తెగినా ప్రేమ తెగదు…(కథ)

 

                                                            పేగు తెగినా ప్రేమ తెగదు                                                                                                                                         (కథ)

"ఏంటన్నాయ్య…అదొలా ఉన్నావు...?

"ఇంట్లో గొడవలకు పై గొడవలు... అత్తా కోడళ్ళ గొడవలు..."

"ఏంటన్నయ్యా...ఇది ఎప్పుడూ ఉండేదేగా?"

"ఎప్పుడూ ఉండేదే అని చెప్పలేకపోతున్నాను.... రోజు రోజుకూ ఇద్దరి మధ్యా గొడవలు పెరుగుతున్నాయే కానీ తగ్గు ముఖం పట్టే సూచనలే కనబడటం లేదు కిషోర్. ఇద్దరికీ ఎన్నో విధాలుగా చెప్పి చూశాను...ఎవరూ మారటంలేదు. వాళ్ళిద్దరి మధ్య ఈ రోజు జరిగిన గొడవ నన్ను కలవర పెడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు వాళ్ళిద్దరూ నాకు పెద్ద సమస్య తెచ్చి పెడతారనేది ఖాయం. అది తలుచుకుంటేనే నాకు అదొలా అవుతున్నది"

"సరే అన్నయ్యా..వర్రీ అవకు! పెద్దమ్మను నేను తీసుకు వెడతాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండనీ. బాగా చూసుకుంటాను. ఆవిడ నాకూ అమ్మలాంటిదే కదా...మా అమ్మ ఉంటే చూసుకోనా...? ఇద్దరూ కొన్ని రోజులు దూరంగా ఉంటే వాళ్ళలొ మార్పు వస్తుంది"

తల్లి దగ్గర ఈ విషయం చెప్పినప్పుడు ఆమె ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. చెళ్ళెలి కొడుకుతో ఎటువంటి సంశయము లేకుండా బయలుదేరింది.....ఆ తరువాత జరిగిందే ఆశ్చర్యం: తెలుసుకొవాలంటే ఈ కథను చదవండి.

*****************************************************************************************************

క్రిష్ణమూర్తికి మనసే బాగుండలేదు. ఏంచేయాలో అర్ధంకావట్లేదు. కుటుంబంలో గోడవులు అంటే సర్దుకుపోవచ్చు....గొడవలే కుటుంబమైతే...?

అయింది...పదిహేను సంవత్సరాలు అయ్యింది. క్రిందటివారమే పదిహేనవ పెళ్ళిరోజు సెలెబ్రేట్ చేసుకున్నారు క్రిష్ణమూర్తి దంపతులు. పదిహేను సంవత్సరాల కాలంలో కుటుంబంలో లెక్కలేనన్ని మార్పులు. ఎన్నో డెవలప్ మెంట్స్ చోటుచేసుకున్నాయి. కానీ, అత్తా-కోడళ్ళ గొడవలు మాత్రం తగ్గు ముఖం పట్టలేదు.

ఆవిడ గుణం అంతే! ఇక మీదటా మారబోతుంది...? ……ఆమె స్వభావం కూడా అలాంటిదే. పుట్టుకతో వచ్చిన గుణం...మార్చగలమా?”... అత్తా-కోడళ్ళలో ఒక్కరైనా ఇలా అనుకుంటే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.

మాటకు మాట...నువ్వా నేనా...వాదానికి వాదంఅనే పోటీ, గొడవలుగా మారింది. ఒక్కరోజు కూడా వాళ్ల గొడవలకు సెలవు లేదు. అందువలన క్రిష్ణమూర్తికి ప్రశాంతత కరువయ్యింది.

ఎవరితోనైనా తన బాధను చెప్పుకుని, మనసులోని భారాన్ని తగ్గించుకోవడానికి క్రిష్ణమూర్తికి దారిలేదు. ఎందుకంటే స్నేహితులెవరికీ క్రిష్ణమూర్తి ఇంటి వ్యవహారాలు తెలియదు. అందరికీ క్రిష్ణమూర్తి కుటుంబం అంటే ఎనలేని గౌరవం, మర్యాద.

ఇంతవరకు ఇంటి విషయాలు బయట చెప్పుకోలేదు. ఇప్పుడు చెబితే?.. నీ ప్రాబ్లం వాళ్ళ నోటికి అటుకులు వేసినట్లు అవుతుంది క్రిష్ణమూర్తి మనసు క్రిష్ణమూర్తిని హెచ్చరిస్తూ ఉంటుంది.

ఇలాంటి గందరగోళ సమయంలోనే కిషోర్ వచ్చాడు. కిషోర్ క్రిష్ణమూర్తికి తమ్ముడు వరుస...అంటే పిన్ని కొడుకు. పక్క ఊరైన ఏలూరులో చిన్నతరహా వ్యాపారం చేస్తున్నాడు. కిషోర్ కి క్రిష్ణముర్తిపై చెప్పలేనంత ప్రేమ. వ్యాపార విషయంగా క్రిష్ణమూర్తి ఉంటున్న ఊరికి ఎప్పుడొచ్చినా సమయం కేటాయించుకుని అన్నయ్యను కలిసి, మాట్లాడి వెడతాడు కిషోర్.

"ఏంటన్నాయ్యఅదొలా ఉన్నావు...?

"ఇంట్లో గొడవలకు పై గొడవలు... అత్తా కోడళ్ళ గొడవలు..."

"ఏంటన్నయ్యా...ఇది ఎప్పుడూ ఉండేదేగా?"

"ఎప్పుడూ ఉండేదే అని చెప్పలేకపోతున్నాను.... రోజు రోజుకూ ఇద్దరి మధ్యా గొడవలు పెరుగుతున్నాయే కానీ తగ్గు ముఖం పట్టే సూచనలే కనబడటం లేదు కిషోర్. ఇద్దరికీ ఎన్నో విధాలుగా చెప్పి చూశాను...ఎవరూ మారటంలేదు. వాళ్ళిద్దరి మధ్య రోజు జరిగిన గొడవ నన్ను కలవర పెడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు వాళ్ళిద్దరూ నాకు పెద్ద సమస్య తెచ్చి పెడతారనేది ఖాయం. అది తలుచుకుంటేనే నాకు అదొలా అవుతున్నది"

"సరే అన్నయ్యా..వర్రీ అవకు! పెద్దమ్మను నేను తీసుకు వెడతాను. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండనీ. బాగా చూసుకుంటాను. ఆవిడ నాకూ అమ్మలాంటిదే కదా...మా అమ్మ ఉంటే చూసుకోనా...? ఇద్దరూ కొన్ని రోజులు దూరంగా ఉంటే వాళ్ళలొ మార్పు వస్తుంది"

క్రిష్ణమూర్తికి కిషోర్ మాటలు కొంత ఊరట కలిగించింది. మనసు కొంచం ప్రశాంతత పొందింది. ఇది ఒక టెంపరరీ సెల్యూషన్ అనేది అర్ధమైనా అత్తా-కోడళ్ళ మధ్య కొంత గ్యాప్ ఉంటే మంచిదే ననిపించి కిషోర్ దగ్గర "సరే" అన్నాడు.

తల్లి దగ్గర విషయం చెప్పినప్పుడు ఆమె ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. చెళ్ళెలి కొడుకుతో ఎటువంటి సంశయము లేకుండా బయలుదేరింది.

కిషొర్ భార్య మాధవి "భర్త యొక్క పెద్దమ్మే కదా" అని వేరుగా చూడకుండా అత్తగారికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇచ్చింది. ప్రేమగా ఆమెను చూసుకుంది.

రోజులు గడిచాయి. క్రిష్ణముర్తి తండ్రికి పెట్టాల్సిన తిధి రోజు దగ్గర పడింది. ప్రతి సంవత్సరం తండ్రి తిధి రోజున తల్లితో కలిసి ఊరి చివర్లో ఉన్న అనాధ శరణాలయం కు వెడతాడు. అక్కడుంటున్న పిల్లలకు నోటికి రుచిగా, కడుపు నిండుగా లంచ్ పెట్టటం ఆలవాటు. సారి కూడా దానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు క్రిష్ణముర్తి.

"పెద్దమ్మా...అన్నయ్య మధ్యాహ్నం ఫోన్ చేసి మాట్లాడాడు. పెద్దనాన్నకు వచ్చేవారం తిధి ఇవ్వాలట కదా. మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నాడు".

" ఇన్నిరోజులకా నేను వాడికి జ్ఞాపకం వచ్చాను. ఇక్కడకొచ్చి నాలుగు నెలలు గడిచింది. ఎప్పుడన్నా ఒక ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగాడా...?"

"ఇప్పుడేమైంది పెద్దమ్మా...ఎక్కడో, ఎవరింట్లోనో ఉంటున్నావా. చెళ్ళెలు కొడుకు దగ్గరే కదా ఉంటున్నది...బాగానే ఉంటావని నమ్మకంతో మాట్లాడకుండా ఉండుంటాడు. అంత మాత్రానా నీ మీద ప్రేమలేదని చెప్పగలమా...?"

"నువ్వెప్పుడూ ఇంతే. అన్నయ్యను వెనకేసుకు రావటంలో నీకు నువ్వే సాటి...సరే అన్నయ్యను వదులు, మీ వదినైనా మాట్లాడి ఉండోచ్చు కదా? ఇప్పుడు నాన్న తిధి వస్తోందట...పిలుస్తున్నారు. తిధిని వాళ్ళే జరుపుకోనీ. మనం ఇక్కడ వేరుగా, ఒక పురోహితుడ్ని పిలిచి తిధి పెదడాం"

అదెలా పెద్దమ్మా...చుట్టుపక్కలున్నవారు అడగరా? తండ్రి తిధికి కూడా అమ్మ రాలేదా? లేక రానన్నదా? లేక నువ్వు తీసుకు రాలేదా? అని అన్నయ్యను అందరూ అడగరు. మన మధ్య ఎన్నో ఉంటాయి...దాన్ని మనం బయటకు చూపొచ్చా?" చెప్పాడు కిషోర్.

సరే, మీ పెద్దన్నాన్న తిధి రోజు రానీ...వెడదాం. కుదిరితే ఆరోజే నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. ఎందుకంటే ఇక మీదట మీ వదినతో కలిసుండి కాలం గడపలేను. మీ అన్నయ్య క్రిష్ణమూర్తికి తల్లి కంటే భార్యే ఎక్కువ. పల్లేత్తు మాట అనడు నా మీద నీ భార్యకు ఉన్నంత ప్రేమ కూడా నా కోడలు దగ్గర లేదు కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏమంటావు...?" అన్నది క్రిష్ణమూర్తి తల్లి.

"సరే. నాతోనే వచ్చేద్దువుగాని పెద్దమ్మాకానీ నేను అక్కడ ఒక రోజు ఉంటాను పెద్దమ్మా. నా వ్యాపారం గురించి అన్నయ్య దగ్గర సలహా తీసుకోవాలి. రైస్ మిల్లు ఒకటి పది లక్షలకు అమ్మకానికి వస్తోంది. దాన్ని కొందామనుకుంటున్నాను. నా దగ్గర ఏడు లక్షలు ఉన్నాయి. ఇంకో మూడు లక్షలు అవసరమవుతుంది. ఎక్కడైనా ఏర్పాటు చేయగలడా అని అన్నయ్యను అడగాలి"

"అడుగు. అన్నదమ్ముల మధ్య సహాయ గుణం కూడా లేకపోతే ఎట్లా...?"

మరుసటి రోజు పెద్దనాన్న తిధి. ముందు రోజు సాయంత్రం పెద్దమ్మను పిలుచుకుని అన్నయ్య ఇంటికి చేరాడు కిషోర్.

"అమ్మా...రా అమ్మా. బాగున్నావా...? రా కిషోర్...ఎలా ఉన్నావు?"

"రండి అత్తయ్యా...బాగున్నారా? రా కిషోర్"

సంతోషమైన ముఖంతో క్రిష్ణమూర్తి దంపతులు వాళ్ళకు స్వాగతం పలికారు.

అన్నయ్యతో కలిసి వరాండాలోని కుర్చీలో కూర్చున్నాడు కిషోర్. కిషోర్ వ్యాపారం గురించి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.

"మహతీ...కొంచం ఇలా రా" కోడల్ని పిలిచింది అత్తగారు.

అత్తగారి అర్జెంట్ పిలుపును గౌరవిస్తూ కొడలు మహతి ఆమె వెనుకే వెళ్ళింది.

ఇలా చూడు మహతి....కిషోర్ మూడు లక్షలు కావాలని అడగటానికి వచ్చాడు. నీ భర్త ఉత్త అమాయకుడు. కిషోర్ అడిగాడు కదా అని ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని కిషోర్ కు ఇస్తాడేమో. కిషోర్ వాళ్ళ అన్నయ్యను డబ్బు అడగటానికి ముందే నీ భర్తకు విషయం గురించి తెలియజేయాలి.

నా దగ్గర డబ్బులేదు...బయట నుండి అప్పు తీసుకు రావడం నా వల్ల కాదు అని మొహమాట పడకుండా చెప్పమను.. ఒంటరిగా తీసుకు వెళ్ళి విషయం చెప్పు. డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? వెయ్యా, రెండువేలా..పోతే పోని అని వదిలేయటనికి....?" నీ సంసారమే దెబ్బతింటుంది. హాయిగా నడుస్తున్న మీ కుటుంబం కుంటుపడుతుంది

మా కుటుంబం అంటే మీకు ఇంత ప్రేమ ఉన్నదని నేను అనుకోలేదు అత్తయ్యా. ఇది తెలియక మిమ్మలని ఎన్నో మాటలు అన్నాను...నన్ను క్షమించండి అత్తయ్యా. మీరు ఇక ఎక్కడికీ వెళ్ళద్దు ...నా దగ్గరే ఉండండి " అత్తగారి కాళ్ళమీద పడ్డది కోడలు.

"సరే..అవన్నీ తరువాత మాట్లాడు కుందాం... మొదట మీ ఆయన్ని పిలిచి విషయం చెప్పు" కాళ్ళ మీద పడ్డ కోడల్ని భుజాలు పట్టుకుని పైకి లేపుతూ చెప్పింది అత్తగారు.

"సరే అత్తయ్యా...ఇదిగో ఇప్పుడే పిలిచి చెప్తాను..."

మంచి నీళ్ళు తాగటానికి లోపలికి వచ్చిన కిషోర్ చెవులకు వాళ్ళ మాటలు వినబడ్డాయి. ఒక్క నిమిషం మనసు కళుక్కుమనిపించినామన వలన అత్తా-కోడళ్ళు ఒకటయ్యారు. అన్నయ్య ఇక ప్రశాంతంగా జీవితం గడుపుతాడు" అనుకుని సంతోష పడ్డాడు కిషోర్.

మరుసటి రోజు

వరాండాలో కూర్చుని రోజు పేపర్ చదువుతున్న క్రిష్ణమూర్తి దగ్గరకు వచ్చాడు కిషోర్.

"పెద్దమ్మా నీ దగ్గరే ఉంటానని చెప్పింది...ఇక నేను బయలుదేరుతాను అన్నయ్యా"

"అదేమిట్రా...అప్పుడే వెల్తానంటున్నావ్. రోజు నీ వ్యాపారం గురించి నా దగ్గర ఎదో అడగలన్నావు"

"ఏమీలేదన్నయ్యా...ఎప్పుడూ మాట్లాడే విషయాలే...దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు.అంతకంటే ఆనందమైన విషయం పెద్దమ్మ ఇక్కడే నీతోనో ఉంటాననడం... దాన్ని ఎంజాయ్ చేద్దాంనిన్నంతా వదినతో కలిసిమెలసి ఆవిడ పనులు చేయటం, సంతోషంగా మాట్లాడటం....మొదట విషయాన్ని నా భార్యతో పర్సనల్ గా చెప్పాలి...తాను కూడా చాలా సంతోష పడుతుంది"

"నిజమేరే...అంతా నీ చలవేరా. ఎన్నో ఏళ్ళ తరువాత రోజేరా నేను ప్రశాంతంగా పేపర్ చదువుకున్నాను"

"సంతోషంగా ఉండన్నయ్యా...అదే నాకు సంతోషం...ఇక నేను ఉంటా" అని చెప్పి తన ఊరికి బయలుదేరాడు కిషోర్.

************************************************సమాప్తం*********************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)