వాళ్ళూ మనుష్యులే…..(కథ)

 

                                                                వాళ్ళూ మనుష్యులే                                                                                                                                               (కథ)

మూర్తికి ఇద్దరు పిల్లలు ఇద్దరూ పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టారు. ఇద్దరు పిల్లలనూ ఎక్కడైనా వదిలిపెట్టాసి రమ్మని, రోజూ బార్యతో పోట్లాట పెట్టుకుంటాడు. ఏ తల్లీ అలా చేయదని అతని భార్య అతనితో చెప్పినప్పుడు నేను విడిచిపెట్టి వస్తాను అని గొడవపడే వాడు. రోజూ అతను పెట్టే భాధలను భరించలేక పిల్లలను తీసుకుని అతని భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది. సమాజానికి భయపడి పోలీసు రిపోర్టు ఇచ్చేడే గానీ, భార్యా పిల్లల మీద ప్రేమతో కాదు.

తన ఆఫీసులొ పనిచేస్తున్న పెళ్ళి వయసు దాటిన క్రిష్ణవేణిని పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడి ఆమెను అడుగుతాడు. 

పెళ్ళి వయసు దాటిన, అందం తక్కువగా ఉన్న  తనను పెళ్ళిచేసుకోవటానికి రెడీ అంటున్న మూర్తికి  క్రిష్ణవేణి ఓ.కే. చెప్పిందా?......తెలుసుకోవటానికి ఈ కథను చదవండి. 

*****************************************************************************************************

అందంగా లేకపోయినా చూడటానికి లక్షణంగా ఉంటుంది క్రిష్ణవేణి. వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. ఇంకా పెళ్ళి కాలేదు. మూర్తితో పాటు అతని ఆఫీసులోనే గత పదేళ్ళుగా పనిచేస్తోంది. ఇద్దరికీ బాగా పరిచయముంది.

" క్రిష్ణవేణిని పెళ్ళిచేసుకుంటే...ఏమవుతుంది?"… అని అనిపించిన వెంటనే ఇంటర్ కాం లో క్రిష్ణవేణిని పిలిచాడు మూర్తి.

"సార్" అంటూ అతని క్యాబిన్ లోకి వచ్చింది క్రిష్ణవేణి.

"నీతో కొంచం పర్సనల్ గా మాట్లాడాలి అలా కూర్చో " అంటూ క్రిష్ణవేణికి కుర్చీ చూపించాడు మూర్తి.

" పరవాలేదు చెప్పండి సార్"

తిన్నాగా అసలు విషయానికే వచ్చాడు మూర్తి.

"నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను"

"ఏంటి సార్ అంటున్నారు!" ఆశ్చర్యపోతూ అడిగింది.

"అవును క్రిష్ణవేణి. నా పరిస్థితి నీకు తెలుసు కదా. పిల్లలను తీసుకుని నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటికి రెండేళ్ళు దాటింది. ఎంత వెతికినా కనబడలేదు. పోలీసు కంప్లైంట్ ఇచ్చినా దొరకలేదు. పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. నా భార్య వలన నీకు ఎటువంటి ఇబ్బందీ రాదు. దానికి నేను గ్యారంటీ. డైవర్స్ కూడా మంజూరయ్యింది. ఇంకోవారం రోజుల్లో కోర్టు నుండి పేపర్స్ వస్తాయి"

ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది క్రిష్ణవేణి.

"నీ మౌనాన్ని అంగీకారంగా తీసుకోవచ్చా" అన్నాడు మూర్తి.

మాటకు ఉలిక్కిపడ్డ క్రిష్ణవేణి "నాకు కొంత టైము కావాలి" అన్నది.

ఎంతటైము కావాలి? ఒక రెండు, మూడు రోజులు అన్నాడు మూర్తి.

"అలా అడిగితే ఎలా సార్?" ఇబ్బంది పడ్డది క్రిష్ణవేణి.

"దేనికైనా గడువు అనేది పెట్టుకోవాలి క్రిష్ణవేణి. అప్పుడే అది త్రిల్లింగ్ గా ఉంటుంది" చిన్న చిరు నవ్వుతో చెప్పాడు.

"నాకు ఒక్క వారం రోజులు టైము కావాలి సార్"

"వారం రోజులా? పెళ్ళి చేసుకోవాలా, వద్దా అని ఆలొచించుకునేందుకు అన్ని రోజులు అవసరమా?"

అంటే, మా అమ్మగారు ఊర్లో లేరు, శనివారం వస్తారు...అందుకని"

".కే...నీ ఇష్టం" అన్నాడు మూర్తి.

వెనక్కి తిరిగి తన సీటు దగ్గరకు వచ్చింది క్రిష్ణవేణి.

                                                           ***********************************

ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన క్రిష్ణవేణి తల్లికి విషయం చెప్పింది.

ఆనందపడిన క్రిష్ణవేణి తల్లి కూతుర్ని చూసి "నువ్వేమన్నవే?" అని అడిగింది.

"వారం రోజులు టైము కావాలి అని చెప్పాను"

"ఎందుకే అలా అడిగావు...అతను నీకు నచ్చలేదా?"

" వయసులో నచ్చటం, నచ్చకపోవటం అనేది లేదు కదమ్మా?...అయినా, మూర్తిగారు బాగుంటారు"

"మరెందుకు వారం రొజులు టైము అడిగావు?...అతని గురించి తెలుసుకోవలసింది ఏమైనా ఉందా?"

"లేదమ్మా. మూర్తిగారు చాలా మంచివారు. మర్యాదస్తులు, స్త్రీలంటే గౌరవం...పదేళ్ళ నుండి ఆయన్ని చూస్తున్నా. ఇంతవరకు ఆయన నన్ను పూర్తిగా చూసిందే లేదు...నన్నే కాదు. ఇతర మహిళా ఉద్యోగుల్ని కూడా అలాగే గౌరవంగా చూస్తాడు. ఆయనకు పెళ్ళైందని, ఇద్దరు పిల్లలని తెలుసు. భార్యా భర్తల మధ్య గొడవలేమిటో నాకు తెలియదు కానీ, పిల్లలను తీసుకుని ఆయన పెళ్ళాం ఆయన్ను వదిలేసి రెండేళ్ళ క్రితం వెళ్ళిపోయిందని తెలుసు"

"మరింకెందుకు ఆలస్యం చేస్తున్నావు. నీకు ఇప్పటికే ముప్పై ఐదు ఏళ్ళు దాటినై. నిన్ను పెళ్ళిచేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. అందం లేదని కొంతమంది, రంగులేవని కొంతమంది, లావుగా ఉన్నావని కొంతమంది, ఆస్తిపాస్తులు లేవని కొంతమంది, కట్నకానుకలు ఇచ్చుకోలేమని కొంతమంది...ఇలా అందరూ నిన్ను కాదంటుంటే, అయనెవరో మహాత్ముడు...నిన్ను ఏమీ అడగకుండానే పెళ్ళి చేసుకుంటాను అని ముందుకొస్తుంటే నువ్వు ఆలొచించటం నాకు ఎందుకో నచ్చలేదమ్మాయ్...అతను రెండో పెళ్ళి వాడని ఆలొచిస్తున్నావా?”

" వయసులో నాకు చాయిస్ కూడ లేదు కదమ్మా?"

"అన్ని తెలిసుండి ఎందుకు టైము ఆడిగావు...అందులోనూ వారం రోజులు"

"అలా ఎందుకు అడిగానో నాకూ అర్ధం కావటం లేదు"

"చూడు వేణి...నీకు అన్నీ తెలుసు. పెళ్ళి చేసుకోకూడదు అనే దీక్ష నువ్వేమీ పుచ్చుకోలేదు. సంబంధం కుదరటం లేదు....అంతే. లేక లేక ఒక సంబంధం వస్తే, అందులోనూ పెళ్ళికొడుకే పెళ్ళి చేసుకుంటానని అడుగుతుంటే, నువ్వెందుకు అన్ని రొజులు టైమడిగావో నాకు ఏమాత్రం అర్ధం కావటం లేదు. నేనేమీ నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడదానికి మగ తోడు అవసరం ఎంతైనా ఉన్నది. నేనింకా ఏన్నేళ్ళు బ్రతుకుతానో తెలియదు. నేను బ్రతికుండంగానే నీకు ఒక తోడు దొరికితే, అది చూసి నేను ఆనందంగా వెళ్ళిపోతాను...ఇన్నాళ్ళకు దేముడు మన మీద దయ చూపాడు. ఆయన దయను వద్దనకు... అల్లుడుగారితో రేపే చెప్పేయి...నీకు .కే అని"

"నువ్వు ఊర్లో లేవని చెప్పి, వారం రోజులు టైమడిగాను. అలాంటిది రేపే "సరే" నని చెబితే బాగుండదమ్మా....రెండు రోజులాగి చెబుతాను"

సరేనమ్మాయ్...వెళ్ళు, వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కుని వంటింట్లో టిఫిన్ చేసి పెట్టాను. తినేసి ఇద్దరికీ కాఫీ పెట్టి తీసుకురా" అన్నది క్రిష్ణవేణి తల్లి.

క్రిష్ణవేణి లోపలకు వెళ్ళింది.

                                                                   ***********************************

రెండు రోజులుగా క్రిష్ణవేణి ఆఫీసుకు రావటం లేదు. ఎందుకు రావటం లేదో మూర్తికి అర్ధం కాలేదు. ఆమె ఎందుకు రావటంలేదో ఎవరినైనా అడిగి తెలుసుకుందామంటే తప్పుగా అర్ధం చేసుకుంటారేమో నన్న భయం.

"నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదే. పెళ్ళిచేసుకుంటాను. ఇష్టమో కాదో చెప్పమన్నాను...అది కూడా చాలా డీసెంటుగానే అడిగాను" తనలో తాను సతమతమయ్యాడు. ఆఫీసు పనులలో శ్రద్ద పెట్టలేకపోయాడు.

అప్పుడర్ధమైయ్యింది మూర్తికి.

"అవుననో,కాదనో చెప్పేంతవరకు క్రిష్ణవేణికి కూడా ఆందోళన ఉంటుంది. ఆఫీసు పనులలో శ్రద్ద పెట్టలేదు. నేను కనబడినప్పుడల్లా ఆమె ఇబ్బంది పడుతుంది...అందుకే ఆఫీసుకు వచ్చుండదు"

రోజు కాకపోతే రేపైనా, ఏళ్ళుండైనా రావాల్సిందే కదా. అవుననో, కాదనో చెప్పాల్సిందే కదా....కే. అని చెబితే సరే, కాదని చెబితే" అలా ఆలొచనరాగానే మూర్తికి ఎందుకో కొంచం కళ్ళు బైర్లు కమ్మాయి.

లోపు క్యాబిన్ తలుపు ఎవరో తట్టారు.

"కమిన్" అన్నాడు మూర్తి.

క్యాబిన్ తలుపు తీసుకుని లోపలకు వచ్చింది క్రిష్ణవేణి.

'హమ్మయ్య అనుకున్నాడు మూర్తి.

కానీ క్రిష్ణవేణి మౌనంగా నిలబడింది.

"చెప్పు క్రిష్ణవేణి...ఏదైనా పరవలేదు. నేనేమీ తప్పుగా అర్ధం చేసుకోను" గబగబా అడిగేశాడు.

"రేపు శనివారం అమ్మ ఊరు నుండి వచ్చేస్తుంది. ఆదివారం ఇంటికొచ్చి మా అమ్మతో మాట్లాడండి సార్" చెప్పింది క్రిష్ణవేణి.

"అలాగే" అంటున్న మూర్తి మాటను కూడా వినిపించుకోకుండా వేగంగా బయటకు వచ్చింది క్రిష్ణవేణి.

                                                                 ***********************************

ఆదివారం ప్రొద్దున్న సరిగ్గా పది గంటలకు క్రిష్ణవేణి ఇంటికి వెళ్ళాడు మూర్తి.

"రండి...రండి. కూర్చోండి మూర్తికి స్వాగతం పలికింది క్రిష్ణవేణి.

కాఫీ, టీ...ఏం తీసుకుంటారు

"ఏదైనా పరవాలేదు" అన్నాడు మూర్తి.

క్రిష్ణవేణి లోపలకు వెళ్ళింది. టీ తీసుకు వచ్చి ఇచ్చింది. ఇద్దరూ టీ తాగిన తరువాత "రండి సార్...మా అమ్మ గారిని చూద్దాం" చెప్పింది క్రిష్ణవేణి.

కుర్చిలో నుండి లేచిన మూర్తి టక్ చేసుకున్న చొక్కాను సరి చేసుకుని, జుట్టును ఒకసారి దువ్వుకుని క్రిష్ణవేణిని చూసి చిన్నగా నవ్వాడు.

క్రిష్ణవేణి, మూర్తిని ఒక గదిలోకి తీసుకు వెళ్ళింది. అక్కడ మంచం మీద మూర్తికి కనిపించిన దృశ్యం...ఒక కాలు, ఒక చెయ్యి స్వాదీనంలేని పరిస్థితిలో నోరు కొంచం వంకరగా ఉన్న ఒక ముసలావిడ.

అమ్మా....నేను చెప్పానే....ఆయనే నమ్మా ఈయన" … తల్లికి మూర్తిని పరిచయం చేసింది క్రిష్ణవేణి.

అర్ధమైనట్లు చిన్నగా తల ఊపి, తలను వొంకరగా పెట్టి మూర్తిని చూసింది ఆవిడ.

"రండి... నా తమ్ముడ్ని, చెల్లెల్ని చూద్దాం" అంటూ మూర్తిని మరో గదిలోకి తీసుకు వెళ్ళింది క్రిష్ణవేణి.

అక్కడ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయికి కాళ్ళు రెండూ సన్నగా ఉన్నాయి. పోలియో అని అర్ధమయ్యింది మూర్తికి. అమ్మాయి కళ్ళకు నల్ల రంగు కళ్ళద్దాలు పెట్టుకోనుంది. పిల్ల గుడ్డిదని మూర్తికి అర్ధమయ్యింది.

మనసులో అసహ్యం నిండుకున్నట్లు వికారమైన మొహంతో కనబడ్డాడు మూర్తి.

"మనింట్లో ఇలాంటి వారిని చూడటం ఇష్టంలేకే కదా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన భార్యనూ, పిల్లలను వెతకడానికి ప్రయత్నం కూడా చేయలేదుఇంకో పెళ్ళి చేసుకుని, ఆరొగ్యమైన వారసుడుని పొందాలనే కదా క్రిష్ణవేణిని పెళ్ళి చెసుకుందాం అనుకున్నాము....ఇక్కడేమిటి ఇలా!?"… మనసులోనే గింజుకున్నాడు మూర్తి.

"ఏమిటి సార్...ఏదో ఆలొచిస్తూ నిలబడ్డారు...?" అడిగింది క్రిష్ణవేణి.

" క్రిష్ణవేణివీళ్ళంతా ఎవరు?"

"చెప్పాను కద సార్. వాలిద్దరూ నా తోడ బుట్టిన వారు. పుట్టుకతోనే ఇద్దరూ అంగవైకల్యంతో పుట్టారు... వయసు మీరిన తరువాత అమ్మకు పక్షవాతం వచ్చింది"

" పిల్లలను పెట్టుకుని.. ఎలా…." అంటూ సాగదీశాడు మూర్తి.

ఏంటి సార్...వాళ్ళూ మనలాగా మనుష్యులుగా పుట్టిన వారే కదా! అంగవైకల్యంతో పుడితే బ్రతకడానికి అర్హులు కారా?”

"అదికాదు క్రిష్ణవేణి..."

"దేముడు అందరికీ ఇలాంటి పిల్లలను ఇవ్వడు. ఎవరైతే బాధ్యతతో, ప్రేమతో, సహనంతో ఇలాంటి పిల్లలను మంచిగా పెంచగలరో...వాళ్ళకు మాత్రమే ఇలాంటి పిల్లలను ఇస్తాడు. నేనూ, మీ అమ్మ వీళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చాము. నేను చనిపోయాకా వీళ్ళను నువ్వు కూడా అలాగే చూసుకోవాలి. చనిపోతూ మా నాన్న నాదగ్గర ఒట్టేయేంచుకున్నారు. వాళ్ళ బాధ్యత ఇప్పుడు నేను తీసుకున్నాను

నా తోడ బుటిన వారికి నమ్మకం, ఆత్మవిశ్వాశం అందించి, వాళ్ళకు బ్రతుకు మీద ఒక ఆశ, జీవించాలనే పట్టుదల కలిగేటట్లు చేయటమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను...నా ఆలొచనలకు, చేసే పనులకు పక్క బలంగా ఉంటూ నా లక్ష్య సాధనకు సహాయం, శ్రమ ఇవ్వటానికి ఒప్పుకునే మగాడినే నేను పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను ఇంకా పెళ్ళిచేసుకోలేదు. మీరు గనుక నేను చెప్పిన వాటికి ఓకే అంటే మిమ్మల్ని పెళ్ళిచేసుకోవటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు సార్చెప్పటం ముగించింది క్రిష్ణవేణి.

సమాధానం చెప్పటానికి మూర్తి తటపటాయిస్తున్నాడని గ్రహించిన క్రిష్ణవేణి "మీరు వెంటనే సమాధానం చెప్పనవసరం లేదు...బాగా ఆలొచించుకుని మీ నిర్ణయం తెలుపండిచెప్పింది క్రిష్ణవేణి.

మౌనంగా తలదించుకుని బయటకు వచ్చాడు మూర్తి.

                                                                      ***********************************

మూర్తి బయటకు వెళ్ళిపోయాడని తెలుసుకున్న క్రిష్ణవేణి తల్లి, పడుకున్న మంచం మీద నుండి మామూలుగా లేచి కూర్చుని "వేణి....అతను ఏదైనా చెప్పాడా".

క్రిష్ణవేణి చిన్నగా నవ్వి "ఇక మీదట అతను మనింటి ప్కకకే రాడమ్మాఅన్నది క్రిష్ణవేణీ.

"ఎందుకే అలా చేశావు... నీకింకా పెళ్ళి కాలేదని నేను బాధపడుతుంటే, నువ్వేమో హోం నుండి ఇద్దరు పిల్లల్ని తీసుకు వచ్చి, నీ తోడ బుట్టినవారని చెప్పటం, వాళ్ళను మంచిగా పెంచటమే నీ జీవిత లక్ష్యమని, లేనిది ఉన్నదని చెబితే మగాడు నిన్ను చేసుకోవటానికి ముందుకు వస్తాడు చెప్పు.. అసలు ఎందుకలా చేశావు. ఇప్పుడు అతను వెళ్ళి నలుగురితోనూ నీకంటూ నిజంగా లేని నీ తోబుట్టువుల గురించి చెబితే నిన్ను పెళ్ళి చేసుకోవటానికి ఎవరూ రారు. అప్పుడు నీ పరిస్థితి" తన ఆవేదనను వెలిబుచ్చింది క్రిష్ణవేణి తల్లి

"అలా జరుగుతుందని నేను అనుకోవటం లేదు. నేను చేసిన పని వలన మూర్తిగారిలో మార్పు వస్తుందని నా నమ్మకం. అదే గనక జరిగితే నేను జీవితంలో విజయం సాధించినట్లే"

"ఏమిటే?...నూవ్వేం చెబుతున్నావో నాకు అర్ధం కావటం లేదు. మూర్తిగారిలో మార్పు రావటమేమిటి?".

అవునమ్మా...మూర్తిగారిలో మార్పు రావాలనే అలా చేశాను. మూర్తిగారికి ఇద్దరు పిల్లలట. ఇద్దరూ పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టారట. ఇద్దరు పిల్లలనూ ఎక్కడైనా వదిలిపెట్టాసి రమ్మని, రోజూ బార్యతో పోట్లాట పెట్టుకుంటాడట. తల్లీ అలా చేయదని అతని భార్య అతనితో చెప్పినప్పుడు నేను విడిచిపెట్టి వస్తాను అని గొడవపడే వాడట. రోజూ అతను పెట్టే భాధలను భరించలేక పిల్లలను తీసుకుని అతని భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందట. సమాజానికి భయపడి పోలీసు రిపోర్టు ఇచ్చేడే గానీ, భార్యా పిల్లల మీద ప్రేమతో కాదట

ఇవన్నీ నాకెలా తెలుసనేగా నువ్వు ఆలొచిస్తున్నావు...అంతకు ముందు మా ఆఫీసులో పనిచేసిన రమాదేవి నీకు తెలుసుకదా. ఆవిడ్ని నిన్న కలిశాను. మూర్తిగారి ప్రపోసల్ గురించి చెప్పి, ఆయన మొదటి భార్య గురించి అడిగాను. ఆవిడే విషయాలన్నీ చెప్పింది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. భాద్యతలను వదిలి పారిపోయి, ఇంకో పెళ్ళి చేసుకోవాలని తప్పుడు నిర్ణయం తీసుకున్న మూర్తిగారికి బాధ్యత గురించి తెలియజేయాలని అనుకున్నాను. ఆయనతో ముక్కుకు సూటిగా విషయం చెబితే పనిజరగదు. నన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని చూడటానికి వెళ్ళిపోతాడు. ఆయనకు అర్ధమయ్యేటట్టు చెప్పాలనే మనింటికి రమ్మని చెప్పాను. పక్షవాతం వచ్చిన మనిషిలాగా నిన్ను నటించమన్నాను, పిల్లలను హోంలో నుండి తీసుకు వచ్చి నాటకమాడాను" అని చెప్పి అక్కడ నుండి పిల్లలున్న గదిలోకి వెళ్ళింది క్రిష్ణవేణి.

వయసు దాటిపోతున్నా, పెళ్ళికి ఆశపడకుండా, తానుగా పెళ్ళిచేసుకోవటానికి ముందుకు వచ్చిన మూర్తికి వికలాంగులుగా పుట్టిన పిల్లలను పెంచటం ఎంత పెద్ద బాధ్యతో నాటక రూపంలో తెలియజేసి....అనుకున్నది సాధించా ననే సంతృప్తితో హుందాగా వెడుతున్న కూతురును చూసి గర్వపడుతూ కళ్ళు తుడుచుకుంది తల్లి.

                                                       ***********************************

 ఇంటికి తిరిగి వచ్చిన మూర్తి మనసంతా భారంగా ఉండటంతో తలపట్టుకుని కిటికీ దగ్గర నిలబడ్డాడు. కిటికీలో నుండి దూరంగా కనబడుతున్న కొండను చూశాడు. కొండ క్లియర్ గా కనబడకపోవటంతో తనలో తానే విసుకున్నాడు. వచ్చి సోఫాలో వాలిపోయాడు.

అతని మనసు అతన్ని వేదిస్తునే ఉన్నది. క్రిష్ణవేణి ఇంట్లోని ద్రుశ్యాలే అతని కళ్ళముందు తిరిగి తిరిగి వస్తున్నాయి... తోడబుట్టిన వారిని ఒక తల్లి లాగా చూసుకుంటోంది క్రిష్ణవేణి.

భార్యా, పిల్లలూ గుర్తుకు వచ్చారు.

క్రిష్ణవేణి పిల్లల గురించి చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. “వాళ్ళూ మనుష్యులేవాళ్ళూ మనలాగా మనుష్యులుగా పుట్టిన వారే కదా! అంగవైకల్యంతో పుడితే బ్రతకడానికి అర్హులు కారా?” సిగ్గుతో తలవంచుకున్న మూర్తికి గుండెలో నొప్పి పుట్టింది.

గౌరి...ఎంత మంచి భార్య. ..పిల్లలు అంగ వైకల్యంతో పుట్టడానికి ఆమె ఒక్కతే కారణమా? అది తెలిసుండి గౌరి మీద ఎంత కఠినంగా ప్రవర్తించాను... ఆమెను మానసికంగా ఎంత బాధపెట్టాను....నాకు మంచి పిల్లలు కావాలని ఆలొచించానే తప్ప, నేను మంచి తండ్రిగా జీవించాలని ఆలోచించలేదే!”

నేను చేసిన తప్పులన్నింటికీ ప్రాయశ్చిత్తంగా ఏదైనా చేయాలి. నువ్వు ఎక్కడున్నావో వెతికి కనిపెట్టి, నీతో కలిసి నేను కూడా మన పిల్లలను సాధించే పిల్లలుగా తీర్చిదిద్దుతాను.......అంతే కాదు...వికాలాంగులైన పిల్లలకోసం ఒక ఆశ్రమం ప్రారంభించి జీవితాంతం వాళ్ళకు సేవచేస్తాను"

ఆలొచనతో భారంగా ఉన్న మూర్తి మనసు తెలిక అయ్యింది. గుండెలో నొప్పి తగ్గింది.

కిటికీ దగ్గరకు వెళ్ళి దూరంగా కనబడుతున్న కొండను చూశాడు. మనసులోనున్న చీకటి తొలగిపోవటంతో కొండ క్లియర్ గా కనబడింది.

ఇంట్లో నుండి బయటకు వచ్చి తన బైకు తీసుకుని భార్య, పిల్లలను వెతకడంలో మొదటి ప్రయత్నంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు మూర్తి.

*************************************************సమాప్తం****************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)