ప్రేమ గుంట...(కథ)

 

                                                                              ప్రేమ గుంట                                                                                                                                                                      (కథ)

"ప్రేమ అనేది ఒక పెద్ద గుంట. ఇందులో పడి, లేచి రావటం చాలా కష్టమైన పని. ఈ ప్రేమ గుంటలో పడిన వారు దెబ్బలు తినకుండా జీవితం గడపలేరు. ఈ దెబ్బల వలన చాలా మంది ప్రేమికులు పెళ్ళికి ముందు గానీ, కొందరు పెళ్ళి తరువాత గానీ విడిపోతున్నారు.

కొంతమంది అదృష్ట జాతకులు ప్రేమలో పడిన కొద్ది రోజులలొనే  ప్రేమ అనేది ఒక పెద్ద గుంట అని అర్ధం చేసుకుని, ముందే ప్రేమ వ్యవాహారం నుండి తెలివిగా తప్పుకుంటారు.

ప్రేమ అనేది ఒక పెద్ద గుంట, దానిలో పడి కొట్టుమిట్టాడకండి అని ప్రకృతి ప్రతి ప్రేమ జంటకు, ఏదో ఒక రూపంలో తెలియపరుస్తుంది. దాన్ని అర్ధం చేసుకుని ప్రేమ నుండి తప్పించుకుని వచ్చే వారు అదృష్ట జాతకులే" ప్రవచనాలు వింటున్న మానస ఏదో నిర్ణయించుకున్న తరువాత, తన కళ్ళు తెరిపించటానికే ఈ ప్రవచన వేదికకు వచ్చినట్లు, ఇది భగవంతుడు తనకిచ్చిన ఒక సంధర్భం అని అర్ధంచేసుకుని, తన ప్రేమను వద్దనుకుంది.

మానస అలా అనుకోవాటానికి కారణం ఏమిటి? తన ప్రేమ వ్యవహారంలో ఏం జరిగిందని అలా ఒక నిర్ణయానికి వచ్చింది.?...తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.

*************************************************************************************************

మానస కార్లో ఎక్కి కూర్చున్న వెంటనే, కార్లోని ఏసి చల్లదనానికి అమె ముఖానికి పట్టిన చెమట తగ్గిపోయి, ఆమె ముఖం ప్రకాశవంతంగా మారింది. క్షణం ఆమె మనసు వరుణ్ జ్ఞాపకాలతో నిండిపోయింది. పక్కన కూర్చున్న తల్లి తండ్రులను కూడా మరిచిపోయింది.

వరుణ్...ఆమెకు బావ. అత్తయ్య కొడుకు. అత్తయ్య కొడుకు అంటేనే ఒక కిక్ ఉంటుంది. ఇప్పుడు వెడుతున్న ఒక పెళ్ళి ఫంక్షన్లో అతన్ని కలుసుకోబోతున్నందుకు ఆమె మనసు సీతాకోకచిలుకలా గెంతులు వేస్తున్నది. అతన్ని చూసిన వెంటనే ఆమె సిగ్గు పడుతుంది. వసీకరించే అతని నవ్వు ఆమె శరీరంలోని రక్తనాళాలను ఉద్రేక పరుస్తుంది.

వరుణ్ క్రితం రాత్రి పన్నెండింటి దాకా మానసతో వాట్సాప్ లో చాటింగ్ చేశాడు. మధ్య తీసుకున్న తన ఫోటోలను మానసకి పంపాడు. చివరగా మానసతో మాట్లాడినప్పుడు "మానసా...నువ్వు గమనించావా. నేను ఇప్పుడు నా జుట్టును హెయర్ స్ట్రెయటనింగ్ చేయించుకున్నాను. నీకిష్టమైన క్రికెటర్ ధోనీలాగా భుజాల వరకు పెంచుకోవాలని, ఎన్నో రోజులు జుట్టు కత్తిరించుకోకుండా పెంచుకున్నది ఇందుకే"

వాట్స్ ఆప్ లో వచ్చిన వరుణ్ ఫోటోను మరొసారి చూసింది. "నా కోసం, నా ప్రేమ కోసం వరుణ్ ఏదైనా చేశ్తాడు" అన్న భావన మనసులో మెదలగానే గర్వపడింది.

కల్యాణ మండపం కార్ పార్కింగ్ ఏరియాలో కారు ఆగగానే ఆమె జ్ఞాపకాలకు ఫులుస్టాప్ పడింది. డోర్ తెరుచుకుని కారు దిగింది మానస.

కల్యాణ మండపం గుమ్మం దగ్గర వరుణ్ కొంతమంది బంధువులతో మాట్లాడుతున్నాడు. అతన్ని చూసిన వెంటనే మానస నిరాశ పడింది. భుజాల వరకు పెంచుకున్న జుట్టును పొట్టిగా తగ్గించుకున్నాడు.

గబగబా అతని దగ్గరకు వెళ్ళింది.

"ఏరా...రాత్రేగా జుట్టును బుజాల వరకు ఉంచుకున్న ఫోటో పంపావు. మరేంటి ఇప్పుడు అంత పొట్టిగా ఉన్నది?" అడిగింది మానస.

" రోజు సాయత్రం కత్తిరించుకున్నాను" చెప్పేసి మానసను చూడకుండానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

తాను కనపడ్డ వెంటనే ఎప్పుడూ తనతోనే ఉండే వరుణ్ అలా ఎందుకు వెళ్ళిపొయాడో మానసకు అర్ధంకాలేదు.

" హైర్ స్టైల్ చాలా బాగుందనే కదా చెప్పాను. మరైతే ఎవరు చెప్పి పొడుగ్గా, అందంగా ఉన్న జుట్టును కత్తిరించుకుని ఉంటాడు?" మనసులో కుమిలిపోయింది మానస.

"ఎవరో వరుణ్ తో హైర్ స్టైల్ బాగుండలేదని చెప్పుంటారు. అందుకనే ఇప్పుడు వేరే స్టైల్...ఎవరు చెప్పి తన హైర్ స్టైలును మార్చి ఉంటాడు?" తలచుకున్న వెంటనే మానస మనసు ఆందోళనకు గురి అయ్యింది.

"ట్రాఫిక్ లో కారు బ్రేకు వేసి ఆగి ఆగి వచ్చింది. అందుకే కొంచం చికాకుగా ఉన్నది. నీకిష్టమైన డిజైనర్ శారీ కట్టుకుని వచ్చేటప్పటికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా"...ఇలాంటి చిన్న చిన్న ఆలొచనలను వరుణ్ తో పంచుకోవాలని తాపత్రయపడింది. కానీ వరుణ్ ఆమె దగ్గరకు రానే లేదు.

ఎప్పుడూ మానస పక్కనే హక్కుతో వచ్చి కూర్చుంటాడు వరుణ్. మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకోడు. మానసతో ఎక్కువ మాట్లాడతాడు.

ఇంకొక బంధువుల అమ్మాయితో దగ్గరగా కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. అది చూసిన మానసకు కోపం ముంచుకు వచ్చింది.

పెళ్ళి వేదికపైన కూడా అదే అమ్మాయితో కలిసి నిలబడి ఫోటోలు తీయించుకున్నాడు. అది చూసిన మానస ముఖం వాడిపోయింది. తరువాత షాక్ తగిలింది.

వరుణ్ తన వేళ్ళను, అమ్మయి వేళ్ళతో జోడించి ఫోటోకి నవ్వుతూ ఫోజ్ ఇస్తున్నాడు. మానస వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది. మనసులో అలజడి. ఏవేవో ఆలొచనలు అలలలాగా ఆమె మనసులో పొంగి వస్తున్నాయి.

"వరుణ్, ఎందుకురా నా పక్కకి రావటం లేదు? నాతో మాట్లాడటం లేదు? దూర దూరంగా వెడుతున్నావు?" కారణం తెలియక గిలగిలా కొట్టుకుంది.

"వరుణ్ తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, దానికి కారణం అడిగి తెలుసుకుని, తన తప్పు ఏదైనా ఉంటే అతని కొసం మార్చుకోవాలి" అనుకున్నది.

మునుపంతా అతను తనను వదిలి భొజనానికి వెడితే తను కోపగించుకునేది. తనకు ఇష్టమైన పదార్ధాలను అతని ఆకులో నుండి తీసి ఆమెకు పెట్టేవాడు.

భోజనాల బంతిలో ఎక్కడ కూర్చోనున్నా, మధ్యలోనైనా సరే మానస కనబడగానే, ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. రోజు కూడా అదే జరుగుతుంది అనే ఆలొచనతో తల్లితో కలిసి భోజనాల బంతిలో కూర్చుంది. వరుణ్ అప్పుడు కూడా అదే అమ్మాయితో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నాడు. మానస దగ్గరకు రానేలేదు.

ఆరోజు రాత్రి నిద్ర పట్టక పక్క మీద పొర్లాడింది మానస. తనని ప్రేమిస్తున్న వరుణ్ ఇంకొక అమ్మయితో అంత క్లోజ్ గా ఉండటంమానస మనసు అంగీకరించట్లేదు. మనసులో వరుణ్ ని తలచుకుని తలచుకుని భారమైన మనసుతో, ఏడుస్తూనే నిద్రలోకి వెళ్ళిపోయింది మానస.

మరుసటి రోజు స్నేహితురాలు రమ్యకు ఫోన్ చేసింది.

"వరుణ్ నన్ను పట్టించుకోనే లేదు. ఇంకొక అమ్మాయితో చనువుగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది. వరుణ్ ఎందుకు అలా ప్రవర్తించాడు? నేను నచ్చ లేదా?"

"మానసా, వరుణ్ కి నువ్వంటే చాలా ఇష్టం. సదా నిన్నే తలుచుకుని, నీ గురించే అలొచిస్తున్నాడు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. నీకు అర్ధం కాలేదా?"

"ఊహూ"

"ఇంకొక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తున్నాడు. వరుణ్ నా వాడు, నాకు మాత్రమే సొంతం అని నువ్వు అనుకుంటూ, వాడి వెనకాలే నువ్వు తిరగాలని అతను ఆశ పడుతున్నాడు"

"ఓహో"

"నిన్ను బాగా ఏడిపిస్తున్నాడు....అలాగే అతను నువ్వు పడుతున్న బాధను ఎంజాయ్ చేస్తున్నాడు"

స్నేహితురాలు రమ్యతో మాట్లాడిన తరువాత మానసకు కొంచం ఊరట కలిగింది.

తరువాత నాలుగు రోజులు మౌనంగా, భారంగా గడిపింది మానస. ..కారణం, కనీసం రోజుకు రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడే వరుణ్ నాలుగు రోజులలో ఒక్క సారి కూడా ఫోన్ చేయలేదు. రెండు రోజులకు ఒకసారి మానసను చూడటానికి వచ్చే వరుణ్ నాలుగు రోజులైనా రాలేదు. మనసులో ఏదో నిర్ణయానికి వచ్చినట్లుంది మానస....మానసే వరుణ్ కి ఫోన్ చేసి మాట్లాడింది.వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకునే పార్కుకు రమ్మంది.

పార్కులో అక్కడక్కడ ప్రేమ జంటలు కూర్చోనున్నారు. సాయం సమయ చల్లటి గాలి వాళ్ళకు అహ్లాదం కలిపిస్తోంది. ఇంతకు ముందు మానస, వరుణ్ కూడా పార్కులో సాయం సమయ గాలిని పీలుస్తూ పక్కపక్కనే కూర్చుని ఆనందంగా మాట్లాడుకునే వారు. అవన్నీ జ్ఞాపకానికి రాగానే మానస మనసు కొంచం గాయపడింది.

మానస చెప్పిన టైముకు ఖచ్చితంగా వచ్చాడు వరుణ్. ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. మానసే మొదటగా మాట్లాడింది.

"వారం రోజులుగా నాకు ఫోన్ కూడా చేయలేదు"

"నేను చేయకపోతే...నువ్వు చేసి మాట్లాడి ఉండోచ్చు కదా"

"చేసే దానినే. కానీ రోజు పెళ్ళి ఫంక్షన్లో నిన్ను చూసిన తరువాత నీతో మాట్లాడ కూడదని అనుకున్నాను"

"మరైతే ఇప్పుడెందుకు ఫోన్ చేసి రమ్మన్నావు" పొగరుగా అడిగాడు.

మానస మౌనం వహించి తన హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులో నుండి ఖరీదైన చేతి గడియారం ను బయటకు తీసింది. హృదయం ఆకారంలో రాళ్ళు పొదిగిన తెల్లటి లోహంతో తయారు చేయబడింది. అది ఎప్పుడు మానస కుడి చేతికి కట్టుకుంటుంది.

"మనం ప్రేమించుకోవటం మొదలుపెట్టిన తరువాత నువ్వు నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్. రోజుకు కనీసం వందసార్లు వాచ్ ను చూస్తాను. ఇప్పుడు దీనిని చూడటానికే విరక్తిగా ఉందిరా....ఇందా దీన్ని నూవే ఉంచుకో"

వరుణ్ తీసుకోకుండా నిలబడ్డాడు. మానస పట్టుదలగా అతని చొక్కా జేబులో ఉంచింది.

అప్పుడు కొంచం కలవర పడ్డ వరుణ్ "ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?" అన్నాడు.

"మనం విడిపోదాం...నీలాంటి వ్యక్తితో కలిసి జీవితం గడపటం చాలా కష్టం. పొగరు, అహంకారం తో తిరిగే వాడి దగ్గర ప్రేమను ఎదురు చూడటం చాలా నరకం..."

వరుణ్ మరింత కలవర పడ్డాడు. కానీ దాన్ని కనిపించనీయకుండా "సరే...పోవే" అన్నట్టు నిలబడ్డాడు. ఆమెను దగ్గరకు తీసుకుని బ్రతిమిలాడి, ఆమెను సమాధన పరచటం మగతననికే సిగ్గుచేటు అనుకున్నాడు.

కంటి నిండా నీరుతో మానస వరుణ్ నే చూసింది. కళ్ళు తుడుచుకుంది.

"దున్నపోతులాగా పెరిగావు...ప్రతి రోజూ నీతో పోట్లాడుతూ నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండలేను. ప్రేమికురాలి ఫీలింగ్స్ ను అర్ధం చేసుకుని ఆమెను సంతోషం గా పెట్టుకోగలిగే ప్రేమికుడే కావాలి. నన్ను ఏడిపించి, వేడుక చూడాలనుకునే ప్రేమ నాకు వద్దు. నన్నే తలచుకుంటూ, నా ఆనందం కోసం తాపత్రయపడే ఒక జీవుడికోసం నా జీవితాన్ని జీవిస్తాను. పోరాటమే జీవితంగా ఉండే ఒక జీవితం నాకు వద్దు...గుడ్ బై"

మానస ఆనందంగానూ లేదు...విచారంగానూ లేదు. ప్రశాంతమైన మనసుతో అక్కడి నుండి బయలు దేరింది.

రెండు సార్లు మాట్లాడితే మానస సమాధన పడుతుంది అనే ధైర్యంతో ఉన్నాడు వరుణ్.

కానీ...మానస ఇక వరుణ్ ని తలుచుకోదు. ఆమే పెద్ద గుంటలో నుండి బ్రతికి బయటపడ్డట్టు రీలక్స్ అయ్యిందని వరుణ్ కి తెలియదు.

*************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)