విశాలమైన జైలు…(కథ)


                                                                    విశాలమైన జైలు                                                                                                                                                 (కథ) 

"ఒకప్పుడు వృద్దులు ఇంట్లోవుంటేనే ఎంతో గౌరవం.

గతంలో ఏదో మహా నగరంలో మాత్రమే ఒకటి అరా కనిపించే వృద్దాశ్రమాలు నేడు చిన్న చిన్న పట్టణాలు, ఒక మాదిరి గ్రామాలలో కూడా వీధికి ఒకటి వెలుస్తున్నాయి.

వృద్దాశ్రమాలు అతిధి గృహాలు అయ్యాయి. అవి ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్ అయినై.  కన్న తల్లిదండ్రులు పిల్లలకు బరువయ్యారు. కన్న బిడ్డలు వాళ్ళను కన్నవారికి కన్నీటిని కానుక ఇస్తున్నారు.

'మరుజన్మ ఉన్నదో లేదో, ఈ మమతలు అప్పుడేమవుతాయో' అని కవి రాసిన పాటను వింటుంటే ఎందుకో గాని మరుజన్మ గురించి రాసినట్లు అనిపించడం లేదు. ఈ జన్మ గురించి రాసినట్లే అనిపిస్తోంది.

మాతృ దేవో భవ, పితృ దేవో భవ అన్న వేద మంత్రాన్ని వల్లే వేసే భారత భూమిలో మనం అందరం ధర్మాన్ని వదిలివేసి మనకు సంపాదించుకునే శక్తి సామర్ధ్యాలు లభించాయని, మనకు ఒక కుటుంబము ఏర్ఫడింది కదా అని, ఇక మనకు తల్లి తండ్రులతో పని ఏముంది, అని వాళ్లను విశాలమైన జైళ్ళకు పంపిస్తున్నారు. దీనిని నేను సమర్ధించను." అని తన సెక్రెటరీకి చెబుతూ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి?.....తెలుసుకొవటానికి ఈ కథ చదవండి.

*************************************************************************************************

ఏమిటండీ, ‘చాలా అర్జెంట్ ఆఫీసు పనులు ఉన్నాయి...ఒక రెండు గంటలు నన్ను డిస్టర్బ్ చేయకండిఅని నా దగ్గర, పిల్లల దగ్గర చెప్పి, ఇలా గదిలో మీ ల్యాప్ టాప్ముందు కూర్చుని ఆఫీసు పని చేసుకోకుండా ఏదో కోట్లు నష్టపోయినట్టు ఏదో ఆలొచిస్తూ  కూర్చోనున్నారు భార్య మైత్రేయి భర్తను అడుగుతూ, అతని టేబుల్ మీద టీగ్లాసు ఉంచింది.

ఇంకేముంటుంది చెప్పు...నిన్న అమ్మ ఫోన్ చేసినప్పటి నుండి, మనసు అదొలా ఉంది. ఇండియాలో ఉన్న తల్లి-తండ్రులకు ఇప్పుడు మన సహాయం ఖచ్చితంగా కావాలి. మనం ఖచ్చితంగా ఇండియా వెళ్ళిపోవాలి. కానీ మన పిల్లల చదువు సంగతి ఏం చేయాలా అని ఆలొచిస్తున్నాను. నేను ఉద్యోగం మానేసి ఇండియ వెళ్ళిపోవచ్చు. నెల రోజుల్లో నాకు అక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుంది. కానీ పిల్లలు పెద్ద క్లాసులలో చదువుతున్నారు. ఇక్కడి చదువులకు అలవాటు పడ్డారు. ఇప్పుడు వాళ్లను ఇండియా తీసుకు వెడితే వాళ్ళ చదువు ఎటూ కాకుండా పోయి, వాళ్ల భవిష్యత్తే పాడైపోతుంది

దీని కోసమా మీరు ఇంతగా ఆలొచిస్తున్నారు. వాళ్లకు సహాయంగా పనివాళ్ళను ఏర్పాటు చేస్తే సరిపోతుంది

ఎంతమంది పనివాళ్లను ఏర్పాటు చేస్తాం చెప్పు. వారం క్రిందటి వరకు అమ్మా-నాన్నలు ఆరొగ్యంగా ఉన్నారు కాబట్టి ఒక పనిమనిషితో అంతా సరిపోయింది. కానీ, ఇప్పుడు అలా కాదే. నాన్న అనారోగ్యంతో, తన పని కూడా తాను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అమ్మకు తన పని చేకోవడమే కష్టమవుతోందని ఇదివరకే చెప్పింది. ఇప్పుడు నాన్నకు కూడా చేయాలంటే ఆమె వల్ల కుదురుతుందా చెప్పు. అందువల్ల ప్రతి పనికీ పనివాళ్లను పెట్టుకుంటామా చెప్పు. అది ఒక విధంగా మంచిది కూడా కాదు. మనం వెళ్లటమే సరైన పరిష్కారం. కానీ..... అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు.

మీరు ఎక్కువగా ఆలొచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనకు ఒకే దారి ఉంది. మీ నాన్నా-అమ్మల్ని పెయిడ్ ఓల్డేజ్ హోమ్ లో చేర్పించటమే. ఇదేమీ తప్పు కాదు. అందరూ చేస్తున్నదే. ఇప్పుడు డబ్బులు తీసుకుని వృద్దులను చేర్చుకునే హోమ్స్  చాలా వచ్చినై. అక్కడ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళ వయసులో ఉన్న వారు చాలామంది ఉంటారు. వాళ్లకు ఒంటరిగా ఉన్నట్టు కూడా అనిపించదు. వాళ్ళు  ఇప్పుడుంటున్న ఇల్లును అద్దెకు ఇచ్చేయచ్చు...దీనికంటే మీకు ఇంకో దారి లేదు

అలా చేస్తే మా బంధువులందరూ నన్ను తిట్టిపోస్తారు. వాళ్ళ మధ్యలో నేను తలెత్తుకు తిరగలేను. ఇదే విషయాన్ని మాటి మాటికి మాట్లాడుతూ గుచ్చి చూపిస్తారు

అయితే ఒక పనిచేయండి. కానీ దీనికి మనం కొంచం పెద్దగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ హోమ్’. మధ్య పేరుతో విల్లాలు, అపార్ట్ మెంట్లు, రిటైర్మెంట్ కమ్యూనిటీ కాలనీలు వచ్చాసేయి. అయితే ఇక్కడ మనం ఒక రిటైర్మెంట్ హోమ్కొని అందులో మీ అమ్మా-నాన్నలను ఉంచాలి. అక్కడే, పని వాళ్ళూ, డాక్టర్లూ, నర్సులూ, డైనింగ్ వసతులు అన్నీ ఉన్నాయి. అక్కడుంటే ఓల్డేజ్ హోమ్ లో ఉన్న ఫీలింగ్ కలగదు. అయితే మనకు కనీసం నలభై లక్షలు ఖర్చు అవుతుంది

ఐడియా బాగానే ఉంది. ఒక మంచి రిటైర్మెంట్ కాలనీ ఎక్కడుందో ఇంటర్నెట్లో ఇప్పుడే వెతుకుతాను

అక్కర్లేదండీ... మధ్య హైదరాబాద్ లో ప్రసిద్ది చెందిన బిల్డర్స్ ఒక రిటైమెంట్ కమ్యూనిటీ కాలనీ కట్టబోతారట. అక్కడున్న అమినిటీస్ కూడా చాలా బాగున్నాయి....పది తరువాత ఫోన్ చేసి కనుక్కోండి"

"హమ్మయ్యా...ఇప్పుడు నా మనసు కొంచం ప్రశంతత చెందింది" అంటూ టేబుల్ మీద భార్య పెట్టిన టీ గ్లాసును ఆమె చేతికిస్తూ "మళ్ళీ వేడి చేసుకురా" అన్నాడు.

                                                            **************************************

సాంబశివ రావ్ గారు బ్రహ్మాండమైన తన ఆఫీసు భవనంలోకి వెళ్ళారు. ఆయన హైదరాబాద్ లోనే ఒక పెద్ద, ప్రసిద్ది చెందిన బిల్డింగ్ ప్రమోటర్వేల లెక్కలో ఇళ్ళు కట్టి అమ్మారు. ప్రజలలో ఆయనకూ, ఆయన ఆఫీసు పేరుకూ మంచి గుర్తింపు ఉంది. ప్రకటనలు చెయ్యక్కర్లేదు. పిలిచి పిలిచి అమ్మక్కర్లేదు. శంకుస్థాపన చేసిన రోజే అన్ని ఇళ్ళూ అమ్ముడు పోతాయి.

ఇప్పుడొక ప్రాజక్ట్ పోతోంది. అది పూర్తి అయ్యేలొపు తరువాతది మొదలుపెట్టేయాలి.

ఆయన చేతిలో రెండు, మూడు ప్రాజక్టులు ఉన్నాయి. దాంట్లో దేనిని మొదలు పెడదామా అని ఆలొచిస్తూ కూర్చున్నప్పుడు--ఆయన చీఫ్ ఇంజనీర్ వాసుదేవ్ లోపలకు వచ్చారు.

రండి మిస్టర్ వాసుదేవ్. మీరిచ్చిన మూడు ప్రాజక్టుల గురించే ఆలొచిస్తున్నాను. అన్నీ మంచి ప్రదేశాలలోనే సెలెక్ట్ చేయబడ్డాయి. మీకు నేను చెప్పినట్టే కొత్త కొత్త ఫెసిలిటీలు, అమినిటీలూ అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. మూడిట్లో ఏదైనా ఓకేనే. నాకు ఇదిగో ప్రాజక్ట్ నచ్చింది. మీరు ఓకే చెబితే మంచి రోజు చూసి శంకుస్థాపనకు ఏర్పాటు చేసి ఒక ప్రకటన ఇచ్చేద్దాం అంటూ ఒక ఫైల్ తీసి వాసుదేవ్ కు ఇచ్చారు.

సాంబశివ రావ్ గారు ఇచ్చిన ఫైలును చేతిలోకి తీసుకుని, వెంటనే అదే టేబుల్ పై ఒక పక్కన పెట్టేసి......

ఏం.డి సార్. ప్రాజక్టులన్నీ తరువాత చూసుకుందాం. నేను ఇప్పుడొక కొత్త ప్రాజెక్టును రెడీ చేశాను. ఇది అధ్భుతమైన విజయం పొందుతుంది సార్

దానికి సంబంధించిన ఫైలును సాంబశివ రావు గారి దగ్గర ఇచ్చాడు. ఆయనా దాన్ని తీసుకుని చూశాడు. ప్రాజక్ట్ అద్భుతంగా ఉన్నది అన్నాడు.

రండి సార్, కట్టబోయే ఇళ్ల మాడల్స్ ను చూపిస్తాను అంటూ ఆయన్ని పక్క గదిలోకి తీసుకు వెళ్ళి అక్కడుంచిన కట్టబోయే ఇళ్ళ మాడల్స్ ను చూపించాడు.

ఊరికి బయట ఐదు వందల ఇళ్ళు. అన్నీ విల్లా టైపు. విశాలమైన వాకింగ్ ట్రాక్, టెన్నీస్ కోర్ట్ , సూపర్ మార్కెట్, సినిమా హాలు, లోపలే చిన్న ఆసుపత్రి, డాక్టర్లు, మగ... ఆడ నర్సులు, మస్సాచ్ సెంటర్, స్కూల్, క్రికెట్ గ్రౌండ్, పార్కు, కమ్యూనిటీ హాలు, ఇంటర్నెట్... అంటూ ఒకటి పైన ఒకటి చెబుతూ వెళ్లాడు.

సాంబశివ రావు గారు మధ్యలోనే అడ్డుపడి, “వెరి గుడ్! ప్లాన్ చాలా బాగుంది అన్నారు.

రెండు వందల యాభై కోట్ల బడ్జెట్. ఎలాగూ లాభం మాత్రం కొన్ని వందల కోట్లు ఉంటుంది అన్నాడు ఇంజనీర్ వాసుదేవ్.

తరువాత...?” అంటూ వెనక్కి తిరిగి తన క్యాబిన్ వైపు నడిచారు.

ఇలాంటి ప్రాజక్టులకే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉన్నది సార్. చాలా మంది ఇందులో పెట్టుబడి పెడతారు. పర్టికులర్ గా అమెరికాలో నివసించే భారతీయులు. ఎంత రేటు చెప్పినా ఇది కొనేస్తారు

వద్దు అని హఠాత్తుగా చెప్పారు సాంబశివ రావు గారు.

సార్... ప్రాజక్ట్ ప్రారంభించబోతున్నాము అని తెలిసిన వెంటనే...మొదటి రోజే అందరూ అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడే ఇలాంటివి మీ దగ్గరున్నాయా  అని చాలా మంది అడుగుతున్నారు

అందుకే ప్రాజక్ట్ వద్దుఅని చెబుతున్నాను

ఆశ్చర్యంలో మాటలే రాక అలాగే ఎం.డి ని చూస్తున్న చీఫ్ ఇంజనీర్ ను చూస్తూ...

మిస్టర్. వాసుదేవ్

వృద్దాశ్రమాలు అతిధి గృహాలు అయ్యాయి. అవి ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్ అయినైకన్న తల్లిదండ్రులు పిల్లలకు బరువయ్యారు. కన్న బిడ్డలు వాళ్ళను కన్నవారికి కన్నీటిని కానుక ఇస్తున్నారు. కలకాలం పిల్లల్ను కళ్ళలో పెట్టుకొని చూసిన వారు, వారి చివరి దశలో మనకి అవసరం లేకుండా పోతున్నారు. పిల్లలకు చిన్న జబ్బు చేసినా కంటికి రెప్పలా కాచిన అమ్మ తన అవసాన దశలో ఆసరా కోసం ఎదురు చూస్తుంది.

'మరుజన్మ ఉన్నదో లేదో, మమతలు అప్పుడేమవుతాయో' అని కవి రాసిన పాటను వింటుంటే ఎందుకో గాని మరుజన్మ గురించి రాసినట్లు అనిపించడం లేదు. జన్మ గురించి రాసినట్లే అనిపిస్తోంది.   'అమ్మా' నను కన్నందుకు పాదాభివందనం అంటూ తల్లిదండ్రులను వృద్దాప్య సమయంలో లోటు రాకుండా చూసుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఆస్థి, అంతస్తులుండి కూడా తల్లిదండ్రులను దూరంగా ఉంచుతున్నారు కొందరు, వారిని కన్నందుకు వారి తల్లిదండ్రులు జన్మలోనే బాధలను అనుభవిస్తున్నారు. ప్రేమ, అనురాగం అనేది చిన్నప్పడే గాలికెగిరిపోయాయి. కొందరికి తల్లిదండ్రులు శత్రువులు అయిపోయారు, వారితో మాట్లాడలంటే తమకు సంఘంలో గౌరవం పోతుందనుకుంటారో ఏమో తెలియదు గాని ఇలాంటి వాళ్లకు ఇటువంటి ప్రవర్తనతో ఉన్న గౌరవం పోతుంది.

తమకంటు ఎవరు లేని వారు, తమ వాళ్లను కోల్పోయినవారు వృద్దాశ్రమంలో ఉంటున్నారంటే అందుకో అర్ధం ఉంది, కాని అన్ని రకాలుగా ఆస్తిపాస్తులుండి వృద్దాశ్రమంలో ఉంటున్నారంటే తల్లిదండ్రులు పిల్లలను కన్నందుకు బాధపడాలి. ఇటువంటి వాళ్లకు ఎందుకు జన్మనిచ్చామని బాధ ఒక వైపుంటే తాము వృద్దాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి గూర్చి మరో వైపు బాధ పడుతుంటారు. డబ్బలు పోతే మళ్లి సంపాదించవచ్చుగాని తల్లిదండ్రులను దూరం చేసుకుని కోల్పోయిన ప్రేమను ఎలా సంపాదించుకోగలమనే ప్రశ్నలు మదిలో కదలాడితే తల్లిదండ్రులకు వృద్దాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి రాదు.

ఒకప్పుడు వృద్దులు ఇంట్లోవుంటేనే ఎంతో గౌరవం.

గతంలో ఏదో మహా నగరంలో మాత్రమే ఒకటి అరా కనిపించే వృద్దాశ్రమాలు నేడు చిన్న చిన్న పట్టణాలు, ఒక మాదిరి గ్రామాలలో కూడా వీధికి ఒకటి వెలుస్తున్నాయి.

మాతృ దేవో భవ, పితృ దేవో భవ అన్న వేద మంత్రాన్ని వల్లే వేసే భారత భూమిలో మనం అందరం ధర్మాన్ని వదిలివేసి మనకు సంపాదించుకునే శక్తి సామర్ధ్యాలు లభించాయని, మనకు ఒక కుటుంబము ఏర్ఫడింది కదా అని, ఇక మనకు తల్లి తండ్రులతో పని ఏముంది, మన సంతోషాలకు వాళ్ళు అడ్డం అని, ముసలి వాసన అని, వారికి సేవలు చేయలేమని, ఇలా సవా లక్ష కారణాలు వెదుక్కొని, వారు రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు కట్టుకొని సంపాదించిన ఆస్తులను, వాళ్ళు పస్తులుండి చదివించిన చదువులనూ  మాత్రం అక్కున చేర్చుకొని వాళ్ళను  వృద్దాశ్రమాలు పాలు చేస్తున్నారు.

మనలాంటి వాళ్ళకు అదే గతి అత్యంత వేగంగా వచ్చేస్తుందని గమనించలేక పోతున్నారు. మారలేక పోతున్నారు. అసలు మనకు స్థితి రాదు అని అతి నమ్మకంతో బ్రతికేస్తున్నారు

సార్...

అందుకే ప్రాజక్ట్ వద్దు అంటున్నాను. నేను ప్రాజక్ట్ వేస్తే వెంటనే అందరూ కొనుక్కుంటారు. ప్రాజక్ట్ వేస్తే పరొక్షంగా నేనూ వృద్దులను, తల్లి-తండ్రులను దూరంగా ఉంచమని ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. పాపం నాకు అవసరం లేదు. వృద్దులను విధిలించి తోసేసి ఒంటరి వాళ్లను చేసి జైలులో పడేయటానికి నేను కారణంగా ఉండదలుచుకోలేదు. ఇంటర్నెట్, టెన్నీస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, డాక్టర్లు, కమ్యూనిటీ డైనింగ్ హాల్ లాంటి వాటిని ఆశ చూపి వయసైన వారిని సొంత కొడుకులే రిటైర్మెంట్ హోమ్స్ అనే విశాలమైన జైలులో బంధించి పెట్టటానికి నేను సహాయకుడిగా ఉండను. మీరు ఫైలును డెస్ట్రాయ్ చేసేసి -- వేరే ప్రాజక్ట్ తీసుకు రండి అన్నారు సాంబశివరావ్ గారు.

కన్నవారికొసం కట్టబడే రిటైర్మెంట్’, ‘కమ్యూనిటీ ప్రాజక్ట్’  అన్న పేరు రాసున్న ఫైలుపైన పేర్లను కొట్టేసి విశాలమైన జైలుఅని రాసేసి చెత్త బుట్టలో పారేసిన చీఫ్ ఇంజనీర్ వాసుదేవ్.....మనసులో యజమానిని పొగడుతూ చేతులెత్తి నమస్కరించారు.

*************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ప్రేమ గుంట...(కథ)