త్యాగ ఫలితం...(కథ)

 

                                                                              త్యాగ ఫలితం                                                                                                                                                                    (కథ)

త్యాగమనేది ఒక గొప్ప శక్తి. త్యాగానికి ఫలితం ఎప్పుడూ దొరుకుతుంది. అది ప్రకృతి అందించేది. కానీ, ఫలితం ఎదురు చూసి త్యాగం చేయకూడదు.

త్యాగానికి కూడా ఒక హద్దూ పద్దూ వుండాలా. స్నెహం గొప్పదే, ఎవరూ కాదనరు...కానీ స్నేహం కోసం ఒకరు తమ జీవితాన్నే త్యాగం చేయాలనుకోవడం వొట్టి మూర్కత్వం కాదా?

"నువ్వు చేస్తున్న ప్రేమ త్యాగం నీ ఒక్క మనసు పైనే అధారపడిందా?...నిన్ను ప్రేమించిన నా మనసుపై నీకు కనీసం జాలి కుడా కలగట్లేదా? మీ ఆడవాళ్ళు అంటూంటారే 'మనసు ఒకరికిచ్చి శరీరాన్ని యంత్రంగా మార్చి మరొకరితో కాపురం చేయడం మోసం! వంచన!' అని...ఆ మాటలు ఒక్క మీ ఆడవాళ్ళకు మాత్రమే సొంతం కాదు, మగవారికి కూడా సొంతమైనదే. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్ళి చేసుకోవడం నా వల్ల కాదు ...అయినా తెలియక అడుగుతున్నా నా మనసుపై ఒత్తిడి తెచ్చే అధికారం నీకెవరిచ్చారు? "

చిన్నగా నవ్విన అర్చన "నువ్వే నవీన్...ఆ అధికారం నువ్వే ఇచ్చావు. నీ ప్రేమను నాకు తెలిపిన రోజు 'నీ కొసం ఎటువంటి త్యాగమైనా చేశ్తాను అని నువ్వు చెప్పావు...గుర్తులేదా?...ఆ అధికారంతోనే...సారీ, ఆ చనువుతోనే నీ మీద ఒత్తిడి తెస్తున్నా"

అర్చన ఒత్తిడికి నవీన్ లొంగిపోయాడా? అర్చన అసలు తన ప్రేమను ఎందుకు త్యాగం చేసింది? దాని వలన అర్చన పొందిన ఫలితం ఏమిటి?...తెలుసుకోవటానికి ఈ కథ చదవండి. 

*************************************************************************************************

కారులో నుంచి ఎగురుతున్నట్టు ఒక్కసారిగా కిందకు దూకింది 8 ఏళ్ళ వర్షిణి.

పెద్ద పూవు ఒకటి చేతులూ, కాళ్ళతో వొయ్యారంగా నడిచి వస్తున్నట్లు ఉన్నది.

ఒక పక్క నవీన్, మరోపక్క మాధవి వర్షిణి చేతులు పట్టుకోగా, బంగళాలోకి వచ్చిన వర్షిణి కళ్ళకు మొదటగా కనిపించింది అర్చన యొక్క అందమైన ఫోటో.

ఫోటోకి పూల మాల, ఫోటోకి ఒక పక్క వెలిగించిన అగరొత్తులు, మరో పక్క వెలుగుతున్న దీపం... ఫోటోను చూసిన ఎవరైనా సరే ఫోటోలోని వ్యక్తి ప్రాణాలతో లేదని వెంటనే గ్రహిస్తారు. కానీ చిన్న పిల్ల వర్షిణికి విషయాన్ని గ్రహించే శక్తి ఇంకా రాలేదు.

"హాయ్...అర్చనా ఆంటీ!" అంటూ నవీన్-మాధవీల చేతులను ఒక్కసారిగా విధిలించుకుని పరిగెత్తుకుంటూ అర్చన ఫోటో దగ్గరకు వెళ్లిన వర్షిణి, చప్పట్లు కొడుతూ, నవ్వుకుంటూ అర్చన ఫోటో ఎదురుగా ఆనందంతో గిరగిరా తిరుగుతోంది.

సడన్ గా ఏదో అర్ధమైన దానిలా నవ్వునూ, చప్పట్లనూ ఒక్క సారిగా ఆపిన వర్షిణి మాధవి వైపుకు తిరిగి "మమ్మీ...అర్చనా ఆంటీ ఫోటోకి ఎందుకు పూలమాల వేశారు?...ఆంటీ దేవుడు దగ్గరకు వెళ్లిపోయిందా?" అంటూ అప్పుడే సొఫాలో కూర్చున్న మాధవి దగ్గరకు వచ్చి అడిగింది.

భారమైన మనసుతో, తీవ్ర ఆలొచనలో ఉన్న మాధవి వర్షిణి అడిగిన ప్రశ్నను వినలేదు.

మాధవి మాట్లాడకపోయేసరికి ఆమె చేతులను కుదుపుతూ "చెప్పు మమ్మీ"అంటూ ఇందాక అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగింది వర్షిణి.

"అలా అని నీకెవరు చెప్పారు?" ఆశ్చర్యంతో వర్షిణిని అడిగింది మాధవి.

"మా స్కూల్ ప్రిన్సిపాల్ రూములో కొన్నిఫోటోలు ఉన్నాయి మమ్మీ...వాటికి కూడా ఇలాగే పూలమాలలు వేసున్నాయి. ఎందుకలా వేశారు అని ప్రిన్సిపాల్ ను అడిగితే...వారంతా దేవుడు దగ్గరకు వెళ్ళిపోయారు, అందుకని వేశాము అని మా ప్రిన్సిపాల్ నాతో చెప్పింది" అమాయకంగా చెప్పింది వర్షిణి. వర్షిణిని దగ్గరకు తీసుకుంటూ "నిజమే తల్లీ...అర్చనా ఆంటీ దేవుడు దగ్గరకు వెళ్లిపోయింది" బొంగురుపోయిన కంఠంతో చెప్పింది మాధవి. "అయితే రా...ఆంటీకి దణ్ణం పెట్టుకుందాం.దేవుడు దగ్గరకు వెళ్లిపోయిన వాళ్ళకు దణ్ణం పెట్టుకుంటే వాళ్ళు మనల్ని విష్ చేస్తారట...మా ప్రిన్సిపాల్ చెప్పింది" అంటూ మాధవి చెయ్యి పుచ్చుకుని లాగుతూ, పక్కనే కూర్చున్న నవీన్ ను చూసి "నువ్వు కూడా రా డాడీ" అన్నది వర్షిణి.

"నువ్వు దణ్ణం పెట్టుకున్నా, పెట్టుకోక పోయినా నువ్వు ఎప్పుడూ బాగుండాలని అర్చన నిన్నువిష్ చేస్తుంది" అనుకుంటూ వర్షిణితో కలిసి అర్చన ఫోటో దగ్గరకు వెళ్లింది మాధవి. ఆమె వెనుకే వచ్చాడు నవీన్.

కళ్ళు మూసుకుని ముగ్గురూ అర్చనకు దణ్ణం పెట్టుకున్నారు.

దణ్ణం పెట్టుకుని కళ్ళు తెరిచిన మాధవికి వర్షిణి ఇంకా కళ్ళు మూసుకుని నిలబడి ఉండటం కనిపించింది. తన కళ్ళ వెంట నీరు ఉబికి వస్తుండటంతో కళ్ళు తుడుచుకుంటూ వర్షిణినీ, అర్చన ఫోటోనూ మార్చి మార్చి చూసింది మాధవి.

మాధవి మనసంతా అర్చన జ్ఞాపకాలతో నిండిపోయింది.

                                                                 ***********************************

"సారీ మాధవి...ఇప్పుడు నేను నెత్తురిచ్చే పొజిషన్లో లేను"

ప్రాణ స్నేహుతురాలు అర్చన అలా మొహం మీద కొట్టినట్టు చెప్పిన జవాబు విని కొయ్యబారిపోయింది మాధవి.

"అర్చనేనా ఇలా మాట్లాడేది!....వీలున్నప్పుడు కళ్ళనూ, అవయవాలనూ...ఎవరికైనా అవసరం ఏర్పడినప్పుడు రక్తాన్నీ దానం చేయాలి. దానాలలోనే అన్నింటికన్నా విలువైన దానం రక్త దానమే అని కాలేజీలో తీరిక దొరికినప్పుడు లెక్చర్లు ఇచ్చేది. అందరినీ కన్విన్స్ చేసేది. కానీ ఇప్పుడు, దానికి విరుద్దంగా, అందులోనూ ప్రాణ స్నేహితురాలి భర్తకు నెత్తురు అవసరమైనప్పుడు...నెత్తురు ఇవ్వడానికి ముందుకు రావటం లేదేమిటి?" అనుకుంటూ అయోమయంలో పడ్డ మాధవి "అర్చనా... నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు?" అని అడిగింది.

మాధవి మొహంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్నఆశ్చర్య వేడిని తట్టుకోలేక " ఇప్పుడు నేనున్నుపరిస్థితిలో నెత్తురు ఇవ్వడమనేది నా వల్ల అయ్యే పని కాదు...ఇంకేదైనా విషయం ఉంటే మాట్లాడు" తల దించుకునే చెప్పింది అర్చన.

వేరే విషయం మాట్లాడాలా...? నేనొచ్చింది అందుకనే అనే విషయం నీకు తెలియదా?... హాస్పిటల్లో ఒకరి ప్రాణం...అందులోనూ నీ ప్రాణ స్నేహితురాలి భర్త ప్రాణం, నెత్తురు కోసం ఊగిసలాడుతుంటే...వేరే విషయం మాట్లాడలా?" కోపంగా అడిగింది మాధవి.

కోపంతో ఎర్ర బడ్డ ప్రాణ స్నేహితురాలి ముఖం చూడలేక, ఆమెకు ఎలాంటి జవాబు చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది అర్చన.

హాస్పిటల్ .సి.యులో నవీన్ను చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయిన నన్ను డాక్టర్ల సహాయంతో లేపి కూర్చోబెట్టి భయపడకండి, మీ క్లోజ్ ఫ్రెండ్ అర్చన బ్లడ్ గ్రూప్...మీ ఆయన బ్లడ్ గ్రూప్ ఒకటే అని మీ వాళ్ళేవరో చెబితే...ఆవిడ్ని కాంటాక్ట్ చేశాము...అరగంటలొ రక్తం ఏర్పాటు చేశ్తానని చెప్పింది అని డాక్టర్లు చెప్పిన వెంటనే నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో తెలుసా?... నువ్వు ఆటోలో వస్తే లేటౌతుందని, వెంటనే నిన్ను తీసుకెళ్ళాలని కారు తీసుకుని నీ దగ్గరకు వచ్చేశాను ...కానీ నువ్వు ఒక ప్రాణం విలువ తెలిసుండి కూడా నెత్తురు ఇవ్వలేనని చెబుతున్నావు...నీకు మతిగాని పోయిందా?"

మాధవీ కోపగించుకోకు. ఇంకో చోట నుండి మీ ఆయనకు నెత్తురు ఏర్పాటు చేశాను. మరో పావు గంటలో నెత్తురు హాస్పిటల్ కు చేరుతుంది. నెత్తురు హాస్పిటల్ కు చేరిన వెంటనే నాకు మెసేజ్ చేశ్తారు... మెసేజ్ కోసమే ఎదురుచూస్తున్నాను...నువ్వు ఆదుర్ధా పడకు" అంటూ మాధవి భుజం మీద అభయంగా చేతులు వేసింది అర్చన.

భుజం మీద అభయంగా పడ్డ అర్చన చేతులను తోసిపారేస్తూ "ఛీ... నన్ను ముట్టుకోకు. నువ్వూ వద్దు నీ స్నేహమూ వద్దు. నువ్వు అవకాశవాదివని ఆలేశ్యంగా అర్ధం చేసుకున్నాను...నెత్తురివ్వడానికి నువ్వెందుకు ముందుకు రావడంలేదో కూడా నాకు అర్ధమయ్యింది" చెప్పింది మాధవి.

మాధవి మాటలకు నోటమాట రాక ఆశ్చర్యంతో మాధవినే కళ్ళార్పకుండా చూస్తున్న అర్చనను చూసి మనసులో ఇంత క్రూరత్వం దాచుకుని, నా దగ్గర ఎంతో ప్రేమగా ఉన్నట్లు నటించేవు కదూ...నవీన్ నీ ప్రేమను ఒప్పుకోలేదనేగా ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నావు. అందుకేగా మమ్మల్నందరినీ వదిలేసి కనబడకుండా విదేశాలకు వెళ్లిపోయావు. మనసులో ఇంత విషం నింపుకుని సంధర్భం కోసం కాచుకోనున్నావని అర్ధంచేసుకోలేకపోయాను...ఇలా చూడవే దేవుడనే వాడు ఒకడున్నాడు! ఆయన నా భర్తను కాపాడతాడు. ఇక జన్మలో నీ మొహం చూడను" అని చెప్పి వేగంగా బయటకు వచ్చింది మాధవి.

గుమ్మం దాటబోతుంటే లోపలి నుండి వినోదమైన శబ్ధం వినబడింది. లోపలకు తొంగి చూసింది మాధవి. వాష్ బేసిన్ పట్టుకుని నిలబడ్డ అర్చన కనబడింది.

రెండే అడుగులతో అర్చన దగ్గరకు చేరుకుంది. బేసిన్ వైపు చూసిన మాధవికి కళ్ళు చీకట్లు కమ్మేయి.

"అయ్యో...రక్తం" అంటూ అరిచింది మాధవి.

అర్చన పంపు తిప్పి నోటిని, ముఖాన్నీ కడుక్కుంది. నీరసంతో గోడనానుకుని క్రిందకు జారి కూర్చుండిపోయింది. కళ్ళు మూసుకుపోయినై. మాధవి పరిగెత్తుకెళ్లి ఫ్యాను స్పీడు పెంచి, మంచి నీళ్ళు తీసుకు వచ్చి "అర్చనా...ముందు నీళ్ళు తాగు" అంటూ నీళ్ల బాటిల్ అందించింది మాధవి.

అర్చన కొంచం కొంచంగా నీళ్ళు తాగి బాటిల్ పక్కన పెట్టింది.

"ఏమిటే నీ ప్రాబ్లం...నీ వొంటికి ఏమిటే ప్రాబ్లం" మాధవి గొంతులో ఆదుర్ధా తెలుస్తోంది.

కళ్ళు తెరిచిన అర్చన విరక్తిగా నవ్వుతూ చెడిపోయిన రక్తం ఇవ్వలేదనేగా నువ్వు ఇంతసేపు నాతో గొడవ పడింది" అన్నది.

సరే...సరే...నువ్వులే! డాక్టర్ దగ్గరకు వెడదాం"

ప్రయోజనం లేదే. చాలా మంది డాక్టర్లను చూశాను. రోగం బాగా ముదిరిపోయిందినేను రోజులు లెక్కపెడుతున్నాను. ఇది క్యాన్సర్...బ్లడ్ క్యాన్సర్" అర్చన కళ్ళలో నీళ్ళు తిరిగినై.

మాధవి కళ్ళలోనూ నీళ్ళు తిరిగినై "అలా మాట్లాడకు అర్చనా! నేను తట్టుకోలేను. అవును... విషయాన్ని నా దగ్గర ఇన్నిరోజులు ఎందుకు దాచావు"

అర్చన నవ్వింది.

" విషయాన్ని నీతో చెప్పడానికి , నీకు, నవీన్ కు ఒక కానుక అందించటానికి, దాంతో పాటు నేను చేసిన కొన్ని ఏర్పాట్ల గురించి కూడా నీతో చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఊరు వచ్చాను...అయితే నిన్ను చూసిన తరువాత నేను చెప్పే విషయాలు విని నువ్వు తట్టుకోలేవనిపించింది. అందుకే నేను వెంటనే చెప్పలేదు. చివరిదాకా నీ స్నేహంలో మునిగిపోయి, నీ ప్రేమతో తడిసిపోయి సంతోషంగా చచ్చిపోవాలని అనుకున్నాను. సడన్ గా చనిపోయే వ్యాధి కాదుగా, ఎప్పుడు చనిపోతానో తెలిపే వ్యాధి కాబట్టి చనిపోయే ముందు నీకీ విషయం చెప్పచ్చులే అని ఊరుకున్నా...ఇప్పుడు సమయం వచ్చింది" అని చెబుతూ ఊపిరి పుంజుకోవటానికి మాట్లాడటం ఆపింది అర్చన.

"నువ్వేమీ చనిపోవు...నిన్ను నేను చనిపోనివ్వను" అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయిన మాధవిని చూసి "నన్ను మాట్లాడని...సమయం ముంచుకొస్తోంది...నేను చెప్పాల్సింది చెప్పేస్తా... తరువాత నువ్వు నా చావును ఆపగలిగితే ఆపుదువుగాని" అన్నది అర్చన.

మౌనంగా ఉండిపోయింది మాధవి.

" బీరువాలో ఒక కవరు ఉంది...దాన్ని తీసుకురా" చెప్పింది అర్చన.

మాధవి పరిగెత్తుకు వెళ్లి కవరును తీసుకు వచ్చింది.

"కవరు ఓపెన్ చెయ్"

మాధవి కవరును ఓపెన్ చేసింది. లోపల ఇంకో కవరు. అందులో ఒక పాప ఫోటో. ఫోటోలో కొత్తగా పూసిన పువ్వులా నవ్వుతూ ఉన్నది రెండేళ్ళ పాప.

"ఇది వర్షిణి కదూ...?” అడిగింది మాధవి.

"అవును...దాంట్లోనే ఇంకో రెండు ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తీయ్" అన్నది అర్చన.

మాధవి ఫోటలను కూడా తీసింది. ఒక ఫోటో అర్చన-మాధవి...భుజాల మీద చేతులు వేసుకుని కలిసి తీయించుకున్న ఫోటో. రెండో ఫోటో మాధవి-నవీన్ కలిసున్న ఫోటో.

" ఫోటోలు...." అంటూ ఫోటోల గురించి మాధవి ఎదో చెప్పబోతూంటే అర్చన అడ్డు పడింది.

"మాధవి... ఫోటోల గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పాల్సింది విను" నీరసంగా చెప్పింది అర్చన.

"సారీ అర్చనా... చెప్పు" అన్నది మాధవి.

"మధూ(మాధవి)... నాకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు వర్షిణి చిన్న పిల్ల. అది కడుపులో ఉన్నప్పుడే దాని తండ్రి చనిపోయాడు. షాక్ లో నుండి తేరుకోలేక నా తండ్రి కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. నా కోసం వర్షిణి...వర్షిణి కోసం నేను అని నన్ను నేను సముదాయించుకుని బ్రతకడానికి అలవాటు చేసుకున్నాను. అలా జీవితం మొదలు పెట్టినప్పుడే నాకు క్యాన్సర్ అనే విషయం పిడుగులాగా నా నెత్తిన పడింది. నేను ఇంక మీదట రోజులు లెక్కపెడుతూ గడపాలనే సంగతి నాకు అర్ధమైనప్పుడు నాకు పిచ్చిపట్టినట్లు అయిపోయింది. ఏమీ అర్ధం కాలేదు...తల్లి లేని నాకు నా తండ్రి అండగా ఉన్నాడు. నా పెళ్ళి చేసినప్పుడు నన్ను ఒకరి చేతిలో పెట్టేననే ఆనందం, త్రుప్తి ఆయనకు ఏర్పడింది. ఆయనలో ఆనందం ఎక్కువకాలం ఉండలేకపోయింది. నా భర్త చనిపోయిన తరువాత మళ్ళీ ఆయనే నాకు అండగా ఉండాల్సి వచ్చింది. కానీ నా భర్త పోయిన విషయం ఆయన్ని మనోవ్యాధికి గురిచెసింది. ఆయన కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు....కానీ నా వర్షిణికి...నేను పోయిన తరువాత ఎవరు అండగా ఉంటారు?...దానికి ఎందుకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు?.... దేవుడు రాసిన రాతను నేను మార్చాలనుకున్నాను...ఎంత డబ్బు ఖర్చైనా సరే నేను బ్రతకాలి...వర్షినికి అండగా ఉండాలి...అనుకున్న వెంటనే తెలిసిన వారి ద్వారా వైద్యం కొసం అమెరికా వెళ్ళాను...నా చావు నన్ను వెంటాడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు...ఎటువంటి వైద్యమూ పనిచేయదని చెప్పారు. దేవుడు రాసిన రాతను మార్చలేనని అర్ధంచేసుకుని దిగులుతో తిరిగి వచ్చాను. నేను చనిపోయినా సరే...వర్షిణి ఒంటరిగా బ్రతక కూడదు... రాతను మాత్రం ఎలాగైనా మార్చాలని అనుకున్నాను... దేవుడికి నా ఆశ న్యాయమైనదిగా అనిపించినట్టుంది, నాకో బ్రహ్మాండమైన ఆలొచన కలిపించాడు" కళ్ల వెంట ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకోవడానికి చెప్పటం ఆపింది.

" ఆలొచనను వెంటనే అమలుచేయడం మొదలుపెట్టాను. వర్షిణిని ఊటీలోని ఒక మంచి బోర్డింగ్ స్కూల్లో చేర్చాలని స్కూల్ మేనేజ్ మెంట్ తో నేను చేయదలచుకున్న విషయం చెప్పాను. చట్ట దిట్టాలను దాటి మానవత్వంతో వాళ్ళు నా నిర్ణయానికి ఒప్పుకున్నారు. వర్షిణిని స్కూల్లో చేర్చాను. వర్షిణి దగ్గర ఇలాంటి ఫోటో...అదేనే...నేనూ నువ్వు కలిసి తీయుంచుకున్న ఫోటో ఇంకొకటి ఉంది... ఫోటోలో ఉన్న నిన్ను చూపించి ఈమే నీ తల్లి అని చెప్పాను...నిన్నే అది తన తల్లిగా అనుకుంటోంది"

మాధవికి పెద్ద షాక్ తగిలినట్లయ్యింది.

"అయ్యో... ఏం చెబుతున్నావే నువ్వు...ఎందుకు...ఎందుకలా చెప్పావు?" మాధవి వలవల పోయింది.

"స్వార్ధమేనే మధూ...స్వార్ధమే! నా కూతురు అనాధ కాకూడదనే స్వార్ధమేనే. నీ మీద, నవీన్ మీద నాకున్న నమ్మకం..స్నేహం...నాకు బలానిచ్చింది! అల్పాయిష్స్ తో చనిపోతున్న అమ్మ ప్రపంచంలో లేకుండా పోయిన రోజున నా కూతురు "అనాధ" అనే మాట వినకూడదు, తనకి ఎవరూ లేరని ఏడవకూడదు. రక్షణ వలయంలో ఉండాలి. వర్షిణికి అర్చన అనే దురద్రుష్టమైన అమ్మ ఉండేదని తెలియనివ్వకూడదనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి ఒక అందమైన, ప్రేమపూర్వక బంధుత్వం అమర్చాలనే అలా చేశాను. నవీన్, నువ్వూ దాన్ని పెంచిన వారు మాత్రమే అని అది అనుకోకూడదని దాని దగ్గర అలా చెప్పాను... వర్షిణికి నిజమైన తల్లితండ్రులుగా ఉండటానికి మీరు ఒప్పుకుంటారని...నా మాట కాదనరనే బలమైన నమ్మకంతో అలా చేశాను"అంటూ చెప్పటం ఆపి మాధవి వంక చూసింది అర్చన.

"అది సరే అర్చనా..." అంటూ మాధవి అర్చనను ఏదో అడగబోయింది...."నువ్వేం అడగ దల్చుకున్నావో...దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నా" ఆశ్చర్యంగా చూస్తున్న మాధవితో అన్నది అర్చన.

వర్షిణి దగ్గర నువ్వూ-నవీన్ కలిసున్న ఫోటో చూపించి వీరిద్దరే నీ తల్లి తండ్రులు...నేను నీ ఆంటీని అని చెప్పాను. మీరిద్దరూ ప్రస్తుతం విదేశాలలొ ఉన్నారని, అక్కడికి పిల్లలను తీసుకు వెళ్ళకూడదని...అందుకే నిన్ను నా దగ్గర వదిలి వెళ్లేరని చెప్పాను. త్వరలోనే మీరిద్దరూ తిరిగి ఇండియా వచ్చి నిన్ను తీసుకు వెల్తారని చెప్పాను. చిన్న పిల్ల కదా చెప్పిందంతా నమ్మేసింది. స్కూల్లో కూడా మీరిద్దరి ఫోటోనే ఇచ్చి మీరే వర్షిణి తల్లి-తండ్రులని రాయించాను....నేను లేకుండా మీరు వెళ్ళినా వర్షిణి మీ దగ్గరకు రావడానికి తటపటాయించదు" చెబుతున్న అర్చన ఊపిరాడక ఆయాసపడింది .

ఆపవే...నీ మాటలింక ఆపు... హాస్పిటల్ కు వెడదాం...లే" అన్నది మాధవి.

"ప్రయోజనం లేదని ఇందాకే చెప్పానుగా"

"నా ప్రయత్నం నన్ను చేయని

"వస్తా...ముందు నాకు మాటివ్వు...హాస్పిటల్ కు వెళ్ళేదోవలోనే నేను చనిపోతే?"

నువ్వు అడగబోయే మాటేమిటో నాకు అర్ధమయ్యింది...తల్లితండ్రులుగా ఉండి వర్షిణిని మేము పెంచాలి...అంతే కదా...అలాగే చేశ్తా...ఇది నా ప్రామిస్....ముందు నువ్వు లే...హాస్పిటల్ కు వెడదాం"

మాధవి చేతుల సహాయంతో అర్చన పైకి లేచి మెల్లగా నడిచి కారు దగ్గరకు వచ్చి కార్లో కూర్చుంది. కారు స్టార్ట్ చేసి స్పీడుగా హాస్పిటల్ వైపుకు పోనిచ్చింది. కారును హాస్పిటల్లోని ఎమర్జన్సీ ఆవరణలో ఆపింది.

స్ట్రెట్ చర్ తోసుకుంటూ కారు దగ్గరకు ఇద్దరు వార్డ్ అసిస్టంట్లు వచ్చారు. అర్చనను అందులో పడుకో బెట్టారు. ICU వార్డుకు తీసుకు వెళ్ళారు. లోపలకు వెళ్లబోతుంటే అర్చన మాధవి చేతిని గట్టిగా పట్టుకుంది. మాధవి తన రెండో చేతిని బలంగా అర్చన చేయి మీద వేస్తూ "వర్షిణి గురించి బెంగ పెట్టుకోకు" చెప్పింది మాధవి.

"మీరిక్కడే ఉండండి మేడం" మాధవికి చెప్పి అర్చనను ICU లోకి తీసుకు వెళ్ళారు.

                                                                      ***********************************

పురుషుల ICU లో భర్త...మహిళల ICU లో అర్చన.

ఇద్దరూ సృహలోకి రాలేదు. తన భర్త నవీన్ ఇంకో రెండు గంటల్లో సృహలోకి వస్తాడని డాక్టర్లు చెప్పారు...అర్చన గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.

మాధవి రెండు ICU మధ్య ఉన్న కుర్చీలో కూర్చోనున్నది.

ICU లో సృహలో లేని అర్చన లోనూ, నవీన్ లోనూ చిన్నగా కదలికలు.

                                                                       ***********************************

"త్యాగానికి కూడా ఒక హద్దూ పద్దూ వుండాలి అర్చనా...స్నేహం గొప్పదే, నేను కాదనను...కానీ స్నేహం కోసం నీ జీవితాన్నే త్యాగం చేయాలనుకోవడం వొట్టి మూర్కత్వం"

"పొరపడుతున్నావు నవీన్. నేను త్యాగం చేసేది నా ప్రేమను మాత్రమే...నా జీవితాన్ని కాదు. నా కోసం నువ్వుకాక మరింకవరో పుట్టుంటారు అని దేవుడు నా నుదిటిమీద రాసేడనుకుంటా...అలాగే జరగనీ. వారితో నిజాయతీగా నా జీవితం పంచుకుంటాను, సంతోషంగా జీవితం గడుపుతాను" చెప్పింది అర్చన.

"నువ్వు చేస్తున్న ప్రేమ త్యాగం నీ ఒక్క మనసు పైనే అధారపడిందా?...నిన్ను ప్రేమించిన నా మనసుపై నీకు కనీసం జాలి కుడా కలగట్లేదా? మీ ఆడవాళ్ళు అంటూంటారే 'మనసు ఒకరికిచ్చి శరీరాన్ని యంత్రంగా మార్చి మరొకరితో కాపురం చేయడం మోసం! వంచన!' అని... మాటలు ఒక్క మీ ఆడవాళ్ళకు మాత్రమే సొంతం కాదు, మగవారికి కూడా సొంతమైనదే. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్ళి చేసుకోవడం నా వల్ల కాదు ...అయినా తెలియక అడుగుతున్నా నా మనసుపై ఒత్తిడి తెచ్చే అధికారం నీకెవరిచ్చారు? "

చిన్నగా నవ్విన అర్చన "నువ్వే నవీన్... అధికారం నువ్వే ఇచ్చావు. నీ ప్రేమను నాకు తెలిపిన రోజు 'నీ కొసం ఎటువంటి త్యాగమైనా చేశ్తాను అని నువ్వు చెప్పావు...గుర్తులేదా?... అధికారంతోనే...సారీ, చనువుతోనే నీ మీద ఒత్తిడి తెస్తున్నా...మాధవి పాపం నవీన్...మాధవి ఏం తప్పు చేసిందని దాని మీద అంతటి అపవాదు పడింది చెప్పు….ఒక విధంగా ఆమె మీద పడిన అపవాదుకు నువ్వూ ఒక కారణమేగా"

"అంటే!...నన్ను నువ్వు అనుమానిస్తున్నావా?"

"లేదు నవీన్...నిన్నుగానీ, మాధవిని గాని అనుమానిస్తే దేవుడు నన్ను క్షమించడు...ఆమెపై అపవాదు రావటానికి పరొక్షంగా నువ్వు కూడా ఒక కారణమయ్యావని మాత్రమే నేను చెబుతున్నా"

"అందుకని"

"మాధవిని నువ్వు పెళ్ళి చేసుకోవాలి"

"అర్చనా..." పెద్దగా అరిచేడు నవీన్.

ఉండు...ఉండు...నన్ను సాంతం చెప్పనీ...అపవాదు పడ్డ అమ్మాయి జీవితం నరకమే నవీన్. ఒకమ్మయి పై అపవాదం ఉందని తెలిస్తే అమాయికి పెళ్ళి జరగటం కష్టం. ఒకవేల జరిగినా, అపవాదు నిజమో కాదో తెలుసుకోకుండా అమ్మాయిని చిత్రవధలకు గురి చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనమెన్నో చదివాము, చూశాము, విన్నాము, చర్చించుకున్నాము. అలాంటి స్థితి మన స్నేహితురాలు మాధవికి రాకుడదు...అలాంటి స్థితి మాధవికి రాకుండా ఉండాలంటే దానికి భర్తగా నువ్వే అవ్వాలి. నువ్వుకాక ఇంకెవరు దానికి భర్తగా వచ్చినా మాధవి జీవితం సుఖంగా సాగదు...కాబట్టి..."

"కొంచం గూడా ఆలొచించుకునేందుకు నాకు సమయం ఇవ్వవా?" అర్చన మాటలకు అడ్డుపడ్డాడు నవీన్.

ఏమాలోచించుకోవటనికి నీకు సమయం కావాలి. నువ్వే కదా అంటూంటావు మంచి పనులు చేయడానికి అసలు ఆలొచించనవసరం లేదని...చూడు నవీన్...నువ్వూ, నేను ప్రేమించుకుంటున్న విషయం మనిద్దరికీ, దేవుడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అంతెందుకు. ఎప్పుడూ మనతో కలిసుండే మాధవికే తెలియదు...అందుకని, మాధవిని పెళ్ళి చేసుకుంటానని వాళ్ళింట్లో వాళ్లకు చెప్పు...సంతోషిస్తారు. మనవలన నలుగురు సంతోష పడుతున్నారంటే అది ఎంత కష్టమైన పనైనా చెయ్యల్సిందే... ఇదీ నీ డైలాగేగా నవీన్

ఆలొచనలో పడ్డాడు నవీన్.

ఇంకేమీ ఆలొచించకు. నేను చెప్పినట్లు చెయ్యి...నేను పై చదువులకు యూ.ఎస్. వెడుతున్నాను. తిరిగి వచ్చేటప్పటికి నువ్వూ, మాధవి భార్యభర్తలుగా కలిసి ఏయర్ పోర్టుకు రావాలి"

నిశ్చేస్టుడై కుర్చీలో కూర్చుండిపోయిన నవీన్ ను కుదుపుతూ "సరేనా...సరేనా" అని అడుగుతోంది అర్చన.

                                                                           ***********************************

సరే...సరేఅంటూ కలవరిస్తూ చేతులను కదిలిస్తున్ననవీన్ను కుదుపుతూ "మిస్టర్ నవీన్...మిస్టర్ నవీన్" గట్టిగా పిలిచేడు డ్యూటీ డాక్టర్.

సృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచిన నవీన్ డాక్టర్ తో తన భార్య మాధవిని పిలవమని చెప్పాడు.

డాక్టర్ బయటకు వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్న మాధవితోమీ ఆయనకి సృహ వచ్చింది...మీతో మాట్లాడలట...మీరు లోపలకు వెళ్ళండి" అన్నాడు.

ఆనందంతో ఒక్క పరుగున భర్త ఉంటున్న ICU లోకి వెళ్ళింది మాధవి.

"ఎలా ఉన్నారండి" భర్త చెయ్యి పుచ్చుకుని అడిగింది మాధవి.

"బాగున్నా మాధవి. ముందు ఇది చెప్పు...అర్చన ఊరు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది...ఎక్కడుంది?" ఆదుర్దాగా అడిగేడు నవీన్.

"అర్చన మన ఊరు వచ్చి రెండు నెలలు అయ్యింది. నవీన్ కి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టుతో నేను నవీన్ కు జీవితాంతం గుర్తుండి పోవాలి. గిఫ్ట్ ఇవ్వడానికి సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా నవీన్ను కలుస్తాను. అంతవరకు నేను ఊరు వచ్చినట్లు నవీన్ కు చెప్పకు...అంటూ నా దగ్గర ఒట్టు వేయించుకుంది. అందుకని..."

"సరే...సరే...ఇప్పుడు అర్చన ఎక్కడుంది"

మీ పక్క రూములోనే. ఫీ మేల్ ICU లో...కోమా స్టేజ్లో ఉంది"

"వాట్!"

"అవునండి. తనిప్పుడు చావుకు అతి దగ్గరలో ఉన్నది. బ్లడ్ క్యాన్సర్ చివరి స్టేజి... విషయాన్ని ఇంతకు ముందే ఒక అమూల్యమైన గిఫ్టును నా చేతిలో పెడుతూ చెప్పింది"

"...గాడ్" అంటూ కళ్ళు మూసుకున్నాడు నవీన్.

ఇంతలొ ఒక నర్స్ మాధవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి "మేడం...మీ ఫ్రెండ్ అర్చన మిమ్మల్ని పిలుస్తోంది" అని చెప్పింది.

"కోమా నుండి బైట పడ్డటుంది...నే వెళ్లి చూశొస్తా" భర్తకు చెప్పి ఫీ మేల్ ICU వైపుకు వేగంగా నడిచింది మాధవి.

ICU లోకి వస్తున్న మాధవిని చూసి "టాటా..బై బై" అన్నట్టు చేయి ఊపింది అర్చన.

అర్చన బై...బై... చెప్పింది ICU తలుపు అద్దంలో నుండి తనవైపు చూస్తున్న నవీన్ కని మాధవికి తెలియదు.

ఊపుతున్న అర్చన చేయి మెళ్లగా క్రిందకు జారిపోయింది.

"సారీ...మేడంషీ ఈజ్ నో మోర్" మాధవితో చెప్పి అర్చన పక్కనున్న డాక్టర్లు, నర్సులు పక్కకు తప్పుకున్నారు.

*************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

చిలుకల గుంపు...(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)