నాతో వచ్చిన అమ్మాయి…(కథ)

 

                                                               నాతో వచ్చిన అమ్మాయి                                                                                                                                          (కథ)

అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం.

అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే.

అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని విషయాలలో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.

అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు.

ఈ కథలో జానకి తన స్నేహితురాలు, తన భర్తను ఎవరో ఇంకొక అమ్మాయితో చూశానని చెప్పటంతో, అంతవరకు తన భర్త మీద ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మని జానకి, స్నేహితురాలు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మి  భర్తను అనుమానించి, ఆత్మహత్య చేసుకునేంతవరకు వెళ్ళిపోతుంది.

చివరికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరో భర్త ద్వారానే తెలుసుకున్న జానకి సిగ్గుతో తలవంచుకుంటుంది.....జానికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఎందుకు వెళ్ళింది?...మీరు కూడా తెలుసుకోండి!

                                                               ***********************************

సెల్ ఫోన్ మోగింది.

బట్టలు మడత పెడుతున్న జానకి, మోగుతున్న సెల్ ఫోన్ తీసుకుని స్విచ్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.

"హలో జానకి నేను ప్రియా మాట్లాడుతున్నానే" సెల్ ఫోన్ లో అవతలి కంఠం

"చెప్పవే...ఎలా ఉన్నావు?"

"బాగున్నానే...ఇప్పుడు అబిడ్స్ కు వచ్చాను. అక్కడ మీ ఆయన్ను చూశాను"

"ఆయన నిన్ను గుర్తు పట్టారా?...బాగా మాట్లాడారా?"

"మాట్లాడ లేక పోయాను! ఎవరో ఒక అమ్మాయితో బట్టల కొట్లో నుండి బయటకు వచ్చారు. అది చూసి, నేను ఆయన్ని కలుద్దామని ఆయన దగ్గరకు వెళ్ళేలోపు, ఆయన గుంపులో కలిసి కనుమరుగయ్యారు"

ఆందోళనలో పడిన జానకి, తేరుకుని" అది...ఆమె మా చుట్టాలమ్మాయి. సరే...నువ్వొక రోజు మా ఇంటికి రావే" అని చెప్పి ఫోన్ కట్ చేసింది.

ఆలొచించటం మొదలుపెట్టింది జానకి.

గుండె దఢతో వేగంగా కొట్టుకుంటోంది.

" అమ్మాయి ఎవరై ఉంటుంది?"......ఆలొచించి, ఆలొచించి అలసట చెందటంతో తల తిప్పుతున్నట్టు అనిపించింది జానకికి.

ఎంత ఆలొచించినా అమ్మాయి ఎవరో అర్ధం కావటం లేదే" నీరశంతో మంచం మీద వాలి పోయింది జానకి. అప్పుడు ఆమెను పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి.

                                                              ***********************************

" జానకీఎందుకు చాలా డల్ గా ఉన్నావు" స్నేహితురాలు ప్రియా అడిగింది.

"నిన్న సాయంత్రం నుండి ఆలొచనలు నన్ను వేదించుకు తింటున్నాయే....రాత్రంతా నిద్రలేదు"

"దేని గురించే అంత ఆలొచన"

" నా పెళ్లి గురించే"

"ఇక దాని గురించి ఆలొచనలు ఎందుకే, అరవింద్ నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడుగా. అదికూడా వచ్చే వారమేగా"

"అదే నా ఆలొచనలకు ముఖ్య కారణం"

"ప్రేమించిన వాడినే పెళ్ళి చేసుకోబోతున్నందుకు సంతోషపడాలి గానీ, దానికి కూడా ఆలొచనలు ఎందుకే"

"పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకుంటున్నాము...చాలా పెద్ద తప్పు చేస్తున్నానని నా మనసు నన్ను ప్రశ్నిస్తోంది"

"ఆంటే, నీ మనసులో నీకు అరవింద్ పైన నమ్మకం లేదు...అంతేగా?"

"ప్రియా..."

"లేకపోతే ఏమిటే...ఇన్ని రోజుల మీ ప్రేమకు శుభం కార్డు పడబోతోందని సంతోష పడాల్సింది పోయి, ఇప్పుడు మీ పెద్దల గురించి ఆలొచిస్తావేమిటి. నువ్వు ఎంత ప్రాధేయపడ్డా అరవింద్ తో నీ పెళ్ళికి ఒప్పుకోని వాళ్ళ గురించి ఇంకా ఆలొచనలేమిటే"

"అది కాదే...పెళ్ళి తరువాత బంధువులమని చెప్పుకుని ఎవరూ మా ఇంటికి రారు, మేమూ ఎవరింటికి వెళ్లలేము...ఒంటరిగానే బ్రతకాలి కదా"

"తప్పదే...కొన్ని రోజులు ఒంటరిగా బ్రతకాలి. కానీ అది నువ్వనుకుంటున్నట్టు సాస్వతంగా మాత్రం కాదు"

"మనవడో, మనవరాలో పుట్టిన తరువాత, వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళే వస్తారంటావా"

"అంత చీపుగా తల్లితండ్రులను అంచనా వేయను"

"మరైతే"

వాళ్ళ ప్రేమను నువ్వు తిరిగి గెలుచుకోవాలి, వాళ్ళను నీ దగ్గరకు రప్పించుకోవాలి, అది మీ ఇద్దరి చేతుల్లోనే ఉన్నది"

ఎలా

"చూడు జానకి..... పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోబోయే మీరు వాళ్ళ ముందు ఆనందంగా జీవించి చూపాలి. …దానికి తారకమంత్రం మీరిద్దరూ ఒకరి మీద ఒకరు నమ్మకంతో దాంపత్య జీవితం కొనసాగించాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించు కుంటూ ప్రేమించుకుంటూ పోతే అది మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. తగినంత బలం చేకూరుస్తుంది. భయాన్నీ, పిరికితన్నాన్నీ దూరం చేసి జీవితంపై అనేక ఆశలను పెంచుతుంది. మీ అన్యోన్య దాంపత్య జీవితం చూసి మీ కుటుంబాలు మీ దగ్గరకు వస్తాయి"

"అది సాధ్యమా?"

సాధ్యమే...ఎందుకో తెలుసా, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమికులలో అధిక శాతం విడిపోయున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, పిల్లల ప్రేమను అంగీకరించి, ఇరు కుటుంబాలూ ఒప్పుకుని, తల్లితండ్రులు పీటల మీద కుర్చుని చేసిన పెళ్ళిల్లలో కూడా అదిక శాతం కలిసి కాపురం చేయటం లేదు...రెండింటిలోనూ భార్యా, భర్తల మధ్య అర్ధం పర్ధం లేని గొడవలే కారణం

"ప్రేమించి పెళ్ళి చేసుకున్న తరువాత విడిపోవటం ఎందుకే?"

"చెప్పేనుగా..భార్యా, భర్తల మధ్య నమ్మకం తగ్గి, ఒకరి మీద ఒకరు అనుమాన పడి ,అర్ధం పర్ధం లేని గొడవలు పడటమే"

"నేను మాత్రం...నా అరవింద్ ను ఎప్పటికీ విషయంలోనూ అనుమానించలేను"

నాకు తెలుసు, అరవింద్ ఇరవై నాలుగు క్యారట్ల బంగారం"

                                                              ***********************************

చేతిలో మల్లె పువ్వులతొ ఇంటికి వచ్చాడు జానకి భర్త అరవింద్. కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. మైన్ డోర్ తెరుచుకోలేదు. మళ్ళీ ఇంకోసారి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. "ఏప్పుడూ ఒక్కసారి కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే జానకి తలుపు తెరుస్తుందే... రోజేమిటి రెండుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తెరవలేదు. నిద్ర పోతోందా? టైములో నిద్ర పోదే" అనుకుంటూ మూడోసారి కాలింగ్ బెల్ నొక్కి, తలుపు కూడా తట్టాడు.

మైన్ డోర్ తలుపులు తెరుచుకున్నాయి. భార్య ముఖం చూశాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. జుట్టు కొంచం చెదిరి ఉండటంతో " నిద్ర పోతున్నావా... టైములో నిద్ర పోవే" అంటూ చేతిలోని మల్లె పువ్వులను భార్య చేతికి ఇవ్వబోయాడు.

భర్త చేతిని విసురుగా కొట్టి "పువ్వులు నాకు...చీర వేరొకరికా?"

భార్య చేష్టకు ఆశ్చర్యపోయిన అరవింద్ఏమైంది జానకి...ఎందుకంత కోపంగా ఉన్నావు" అని అడిగి క్రింద పడ్డ మల్లె పువ్వులను తీయబోయాడు.

ఎవత్తినో ఒక దానిని తీసుకుపోయి బట్టలకొట్లో సరసాలాడలేదు? నాకు అంతా తెలుసు...మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా మనసులో మీకు నేను గుడి కట్టి అందులో మిమ్మల్ని పూజించని రోజే లేదు. అందరి మగాళ్ళలాంటి వారు మీరు కాదని నేను ఎంతో మురిసిపోయాను...కానీ మీరు ఏకంగా ఒకమ్మాయిని మీతో వెంటబెట్టుకుని మార్కెట్టంతా ధైర్యంగా తిరిగారు. అందరికీ కనిపించారు...నన్ను మోసం చేశారు" అంటూ ఏడుస్తూ బెడ్ రూము లోపలకు వెళ్ళి గొళ్ళేం పెట్టుకుంది.

"జానకి... జానకి. నా మాట విను..." అంటూ జానకి వెనుకే వెళ్ళిన అరవిందుకు భయం వేసింది. గదిలోపలకు వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్న జానకి ఏదైనా ఆఘాయిత్యానికి పాల్పడితే.

ఆలొచన అతనిలో వొణుకు తెప్పించింది.

"జానకి... జానకి" గట్టిగా పిలిచాడు. లోపలి నుండి పలుకు లేదు.

గబగబా సందువైపున్న కిటికీలో నుండి గదిలోకి చూశాడు. జానకి మంచంపై కూర్చోనున్నది. "అమ్మయ్య" అనుకుంటూ కిటికీ దగ్గర నిలబడి "జానకి... జానకి" అని అరిచాడు.

జానకి అతనివైపు తిరిగి చూడలేదు.

"ఇంతకంటే గట్టిగా అరవలేను జానకి. ఏదో జరుగుతోందని చుట్టు పక్కల వాళ్ళంతా మనింటి ముందు గుమిగూడతారు. ఇది అవసరమా? అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న మనకు గొడవేమిటి?...తలుపు తెరు...నాతో వచ్చిన అమ్మాయి ఎవరో చెబుతాను"

"ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను...ఇంటి పెద్దలను లెక్క చేయకుండా మీ వెనుక వచ్చినందుకు, నాకు బాగా బుద్ది చెప్పారు. దీనికి ఎవరూ లేరు...ఏం చేసినా ఎక్కడికీ వెళ్ళ లేదు. మన కాళ్ళ క్రిందే పడుంటుంది అనేగా మీ ధైర్యం..."

"జానకి...ఎందుకలా ఏవేవో ఊహించుకుంటావు. నెనేవరితో వెళ్ళేనో తెలుసుకుంటే నువ్వు క్షమాపణ చెబుతావు"

"మళ్ళీ ఇదొక నాటకమా...నేను సారీ చెప్పేటంతటి ముఖ్యమైన మనిషా?... అలాంటి వారు మనకు ఎవరూ లేరే?"

"ముందు గది తలుపు గొళ్లెం తీయ్... ఆమ్మయి ఎవరొ చెబుతా"

జానకి గది తలుపు తెరవటానికి లేచింది. అరవింద్ పరిగెత్తుకుని ఇంట్లోపలకు వచ్చి తలపు ముందు నిలబడ్డాడు.

గది తలుపు తెరిచిన జానకి "లోపలకు రాకండి. బయట నుండే చెప్పండి. ముఖ్యమైన మనిషేవరో తెలుసుకుంటాను"

"నేను బట్టల కొట్టుకు తీసుకు వెళ్ళిన ఆమ్మాయి...వేరే ఎవరో కాదు. నీ చెళ్ళెలు అశ్విని ని "

"నా చె..ళ్ళె..లా...." అంటూ ఏదో చెప్పబోయింది.

"ఆగు జానకి...నేను చెప్పింది వినకుండా నన్నో...మీ చెళ్ళెల్నో అవమాన పరిచి మాట్లాడకు. నేను చెప్పేది పూర్తిగా విని, తరువాత మాట్లాడు"

"మా టీవీ ఛానల్ ప్రోగ్రాం కోసం మీ చెళ్ళెలు చదువుతున్న కాలేజీకి వెళ్ళాము. చాలా మంది ఆడపిల్లలు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అశ్విని కూడా ఉంది. అక్కడున్న ఆడపిల్లలందరూ ఎంతో ఫ్యాషన్ గా ఖరీదైన, అందమైన డ్రస్సులు వేసుకున్నారు. కానీ మన అశ్విని వేసుకున్నది పాత చుడీదార్. అది చూసిన వెంటనే నా మనసుకు బాధ కలిగింది. మీ తాగుబోతు నాన్నకు మీ కుటుంబాన్ని గమనించే టైమెక్కడుంది చెప్పు..."

"..............."

పెళ్ళి కాక ముందు నీ సంపాదన మీ కుటుంబానికి సహాయంగా ఉండేది. మన ప్రేమ వివాహంతో, ఇప్పుడు అది కూడా లేదు. మీ తల్లి-తండ్రులు మన ప్రేమ వివాహాన్ని అంగీకరించక పోయినంత మాత్రానా కుటుంబం మన కుటుంబం కాకుండా పోతుందా. అశ్విని నీ రక్తం పంచుకు పుట్టిన చెళ్ళెలు. అశ్విని పై బాధ్యత మనకి లేదా?"

పిలిచిన వెంటనే రాననే చెప్పింది. నేను బలవంతం చేస్తే నాతో వచ్చింది. బట్టల కొట్టుకు తీసుకు వెళ్ళి నాలుగు కొత్త చుడీదార్లు కొనిబెట్టి ఇంటికి పంపించాను. నువ్వు తప్పుగా అర్ధం చేసుకోవని అనుకున్నాను. అందుకే నీకు చెప్పకుండా చేశాను…."

అరవింద్ చెప్పి ముగించేలోపు, గబుక్కున భర్తను వాటేసుకుని "తప్పైపోయింది...నన్ను క్షమించండి.”అంటూ ఏడుపు మొదలుపెట్టింది జానకి.

************************************************సమాప్తం**************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఏల్నాటి శని...(కథ)