చిన్నారి పెద్దరికం…(కథ)

 

                                                                          చిన్నారి పెద్దరికం                                                                                                                                                               (కథ)

ప్రతి మనిషి ఇతరులతో వ్యవహరించే పద్దతే పెద్దరికం. 

నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా...మాట్లాడటం, ప్రవర్తించడమే కరెక్ట్ అనుకుంటారు కొందరు...చాలామంది అనుభవం మీద అవతలి వ్యక్తి స్థాయి,ప్రవర్తనని బట్టే, వారి ప్రవర్తన, మాటలు ఉండాలని తెలుసుకుంటారు.  

నిజానికి ఈ విషయం చిన్నతనం నుండే అందరికీ తెలుసు. అందుకనే తల్లి-తండ్రుల దగ్గర ఒకలాగా, తోబుట్టువులతో ఒకలాగా,స్నేహితులతో ఒకలాగా...బయటి వారితో ఒకలాగా మాట్లాడతారు.

ఎదిగిన మనిషిలో కూడా పసితనం ఉండవచ్చు!...పసి వయస్సులో కూడా పెద్దరికం ఉండవచ్చు.  

ఈ కథలో హీరో ఒక చిన్న పిల్లాడు. చిన్నవాడైనా పరిస్థితి అర్ధం చేసుకుని విచక్షణతో  వ్యవహరించి పెద్దతనం చూపిస్తాడు.

ఆ చిన్న పిల్లాడు ఎలా తన పెద్దరికం చూపించాడో తెలుసుకోవాలంటే అత్యంత ఎమోషనల్ ఫీలింగ్స్ తెప్పించే ఈ కథను చదవండి:

                                                               ***********************************

జయంతి వంటలో లీనమైపోయున్నది. దేమునిపై పాటలను సన్నగా రాగాలు తీస్తూ వంట పనులను ఉత్సాహంతో చేస్తోంది. భర్తకు క్యారేజి పట్టుకెళ్ళడానికి ఆఫీసు కుర్రాడు ఈరోజు తొందరగా వస్తాడు. లోపు వంట అయిపోవాలి. తరువాత స్వీట్లు చేసి ఊరి చివరగా ఉన్న అనాధ పిల్లల శరణాలయంలో పిల్లలకు పంచిపెట్టాలి. అందుకే హడావడిపడుతోంది.

జయంతికి పెళ్ళై ఆరు సంవత్సరాలవుతున్నా పిల్లలు పుట్టలేదు. డాక్టర్లకు చూపించుకుంటే దంపతులిద్దరికీ ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. దేముడికి పూజలు, అనాధ పిల్లలకు సహాయం చేస్తే పిల్లలు త్వరలో పుడతారని ఒక స్వామీజీ చెప్పటంతో ప్రతి సంవత్సరం తమ పెళ్ళి రోజున ఊరి చివర ఉన్న అనాధ పిల్లల శరణాలయంలో స్వీట్లు పంచిపెడుతుంది, కొంత డబ్బును విరాళంగా ఇస్తుంది. రోజుకూడా అందుకోసమే ఇంట్లో పనిని త్వరగా ముగింప చేస్తోంది.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

"వస్తున్నా" గట్టిగా చెబుతూ వెళ్ళి తలుపు తీసింది.

వచ్చిన వాళ్ళను చూసి ఆశ్చర్యపోయింది. వచ్చింది ఇద్దరు పోలీసులు.

"రాఘవ ఇళ్ళు ఇదేనా?" అడిగేడు ఇన్ స్పెక్టర్.

"అవును" చెప్పింది జయంతి.

"ఆయన ఇంట్లో ఉన్నారా?"

లేరు...ఆఫీసుకు వెళ్ళారు"

"ఆయన మీకేమౌతారు"

"మా ఆయన"

" పర్స్ ఆయనదేనా?"

పోలీసులు చూపిన పర్సును చూసి "ఆయనది కాదు...నాది" అన్నది జయంతి.

పర్సులో ఆయన విసిటింగ్ కార్డు ఉంది...అందులోని అడ్రెస్ చూసి ఇక్కడకు వచ్చాము...దీని గురించి కొంచం ఎంక్వయరీ చేయాలి...లోపలకు రావచ్చా?" అడిగేడు ఇన్ స్పెక్టర్.

"రండి" అంటూ వారిద్దరినీ లోపలకు రమ్మని అక్కడున్న సొఫా చూపించి ఇక్కడ కూర్చోండి....నేను స్టౌవ్ కట్టేసి వస్తాను" అని చెప్పి జయంతి వంటింట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళి, స్టౌవ్ ఆఫ్ చేసి తిరిగి అదే స్పీడుతో హాలులోకి వచ్చి నిలబడింది.

"మీరు కూడా కూర్చోండి" జయంతిని చూసి ఇన్ స్పెక్టర్ చెప్పడంతో జయంతి వారి ఎదురుకుండా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది.

"ఇప్పుడు చెప్పండి... పర్స్ ఎలా పోయింది?...ఎవరన్నా దొంగతనం చేశారా?.... పర్స్ పోయినట్లు పోలీసు కంప్లైంట్ ఇచ్చారా?...ఎందుకంటే ఇందులో 4 రకాల క్రెడిట్ కార్డులు, రెండు డెబిట్ కార్డులు, ఎవో 4 రకాల తాళాలు ఉన్నాయి... పర్సులో ఇవికాక ఇంకేమైనా ఉన్నాయా?" గుక్క తిప్పుకోకుండా అడిగేడు ఇన్ స్పెక్టర్.

"దాన్నేవరూ దొంగతనం చేయలేదు...అది మార్కెట్టులోని మురికి కాలవలో పడిపోయింది...ఇది మీకెలా దొరికింది" కుతూహలంతో ఇన్ స్పెక్టర్నుఅడిగింది జయంతి.

"మీరు అబద్దం చెబుతున్నారు...మురికికాలవలో పడిపోయుంటే... పర్సు కుర్రాడి దగ్గర ఎలా దొరుకుతుంది... కుర్రాడు మీకు తెలిసినవాడా... మీన్ మీ ఇంట్లో పనివాడా? అతన్ని కాపాడటానికోసం అలా చెబుతున్నారా"

కుర్రాడు...నాకు కుర్రోడూ తెలియదు... మా ఇంట్లో పనికుర్రోడే లేడు. నా పర్సు కాలవలోనే పడిపోయింది...దాన్ని ఎవరూ దొంగతనం చేయలేదు"

రాత్రి నైట్ పెట్రొల్ మీద సిటీలో తిరుగుతుంటే బస్ స్టాండ్ దగ్గర దొంగచూపులతో ఒక పదేళ్ల కుర్రాడు కనబడ్డాడు...అనుమానంతో వాడ్ని దగ్గరకు పిలిచి ప్రశ్నలడుగుతుంటే అప్పుడప్పుడు వాడు లాగూ జేబు తడుముకుంటున్నాడు...వాడి జేబు చెక్ చేస్తే పర్స్ దొరికింది...నాలుగు తగిలించి స్టేషన్ కి తీసుకెళ్ళి సెల్లో పడేసి ఇంకో నాలుగు తగిలించేము. పర్స్ ఎక్కడ దొంగతనం చేసువు అని ఎంత అడిగినా నొరెత్తటంలేదు...పర్స్ తీసి చూస్తే అందులో అడ్రెస్ ఉన్నది. మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని ఇక్కడికి వచ్చేము...మీరేమో అది కాలవలో పడిపోయిందని చెబుతున్నారు"

"నిజమండి...అది కాలవలోనే పడిపోయింది"

"చూడండమ్మా...పదేళ్ల కుర్రాడు. వయసులోనే దొంగతనం చేస్తున్నాడంటే పెద్ద వాడైన తరువాత పెద్ద పెద్ద నేరాలు చేస్తాడు. పిల్లలను వయసులోనే బాగుచేయాలి. వాడిని బాల నేరస్తులు సంరక్షణ కేంద్రానికి పంపి వాడ్ని సరిచేయాలి. సమాజంలో బాధ్యతగల వ్యక్తులుగా మనం వ్యవహరించాలి....మీరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఒక కంప్లైంట్ రాసిస్తే వాడ్ని కొర్టులో హాజరు పరిచి బాల నేరస్తులు సంరక్షణ కేంద్రానికి పంపుతాను" చెప్పాడు ఇన్ స్పెక్టర్.

"ఇదేమి న్యాయం ఇన్ స్పెక్టర్...కాలువలో పడిపోయిన పర్సును... కుర్రాడు దొంగతనం చేసినట్లు కంప్లైంట్ రాసిస్తే, నేరమే చేయని ఒక కుర్రాడిని దొంగ అని ముద్రవేసినట్లు కాదా? ఇదా సమాజంలో బాధ్యతగల వ్యక్తులు చేసే పని...మీ ఆలొచన సరైనది కాదు " గట్టిగా చెప్పింది జయంతి.

జయంతి మాటలకు కోపం తెచ్చుకున్న ఇన్ స్పెక్టర్ మరైతే... కాలవలో పడిపోయిన మీ పర్సు కుర్రాడి చేతికి ఎలా వచ్చింది" గట్టిగానే అడిగేడు.

మాట మీరు కుర్రాడినే అడగాలి"

"ఎంతకొట్టినా చెప్పటంలేదే"

" అనవసరంగా ఒక కుర్రాడిని వీళ్ళు కొడుతున్నారే...ఒక వేల నేను వెతుకుతున్నఆ కుర్రాడే కుర్రాడా? ఒక వేల వాడే వీడైతే? నాకు సహాయం చేయబోయిన, నేను వెతుకుతున్న కుర్రాడిని నేనే హింసలకు గురిచేయడం అన్యాయం కాదా.... పోలీసు స్టేషన్ లోఉన్న కుర్రాడిని ఒక సారి చూసొద్దాం" అని తన మనసులోనే అనుకుంటూ ఓకే ఇన్ స్పెక్టర్...నేను పోలీసు స్టేషన్ కి వస్తాను. కంప్లైంట్ ఇవ్వటానికి మాత్రం కాదు...కాలవలో పడిన నా పర్స్ అతని చేతికి ఎలా వచ్చిందో అడిగి తెలుసుకోవటానికి" చెప్పింది జయంతి.

సరే..మొదట మీరు వచ్చి అడగండి. మా దగ్గర నొరెత్తని వాడు మీ దగ్గరన్నా నొరెత్తుతాడేమో చూద్దాం"

సరే మీరు వెళ్ళండి...నేను ఇంకో అరగంటలో వస్తాను"

"ఓకే మేడం" అని చెప్పి ఇన్ స్పెక్టర్ తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్తో కలిసి వెళ్ళిపోయాడు.

                                                               ***********************************

"భర్తకు క్యారేజి రెడిచేసేసి, ఆఫీసు కుర్రాడు వచ్చి క్యారేజీ తీసుకు వెళ్ళిన తరువాత మనం పోలీసు స్టేషన్ కు వెళ్ళాలి. అనాధ పిల్లల శరణాలయంలో స్వీట్లు పంచి పెట్టటానికి రోజు ఇంట్లో స్వీట్లు చేసే టైము లేదు. బ్యాకరీలో స్వీట్లు కొనుకెళ్ళి పంచి పెట్టల్సిందే" అని జయంతి అనుకున్నవెంటనే "అరె! నా పర్సు పోయిన రోజుకూడా ఇదేలాగా జరిగిందే. రోజు కూడా అనాధ పిల్లల శరణాలయంలో స్వీట్లు పంచిపెట్టటానికని బ్యాకరీలో కేకులు కొంటుంటే కుర్రాడు కనబడ్డాడు... కుర్రాడేనా పోలీసులు చెబుతున్న కుర్రాడు...ఏమో పోలీసు స్టేషన్ కి వెళ్ళి చూస్తే గాని తెలియదు" అనుకుంటూ అన్ని పనులు పూర్తిచేసుకుని కారు తీసుకుని పోలీసు స్టెషన్ కి బయలుదేరింది జయంతి.

                                                               ***********************************

కారులో వెడుతున్న జయంతికి పర్స్ పోయిన రోజు, తరువాత జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చేయి.

కార్ పార్కింగ్లో కారాపి ఆనాధ పిల్లల శరణాలయంలో పంచిపెట్టటానికి కేకులు కొనాలని బ్యాకరీకి వచ్చింది జయంతి. కేకులు ఆర్డర్ చేసింది. "అలా కూర్చోండి మేడం. .. కేకులు ప్యాక్ చేసి ఇస్తాను" అని షాపతను చెప్పడంతో అక్కడున్న కుర్చీలో కూర్చుంది జయంతి. అప్పుడే కుర్రాడ్ని చూసింది. మాసిపోయిన ముఖం, పైన చొక్కలేదు, చినిగిపోయిన నిక్కరు, నూనే రాయని చింపిరి జుట్టు, చెప్పలేనంత మురికిగా ఉన్న కాళ్ళతో దీనంగా తనవైపే చూస్తున్నాడు. అతని చూపుల్లో ఆకలి కొట్టచ్చినట్లు కనబడుతోంది. జయంతికి జాలేసింది. స్వీటు కొట్టు యజమానికి చెప్పి ఒక కేకును పేపర్లో పెట్టి కుర్రాడికి ఇమ్మంది. యజమాని పనిపిల్లకు చెప్పాడు. పని పిల్ల ఒక కేకును కుర్రాడికి అందించింది.

అర్ధ రూపాయో లేక రూపాయో ఇస్తుందేమో అనుకున్న కుర్రాడు "అంత ఖరీదైన కేకు నాకు ఒద్దండి" అన్నాడు.

వాడు వద్దని చెబుతున్నా, వాడి చేతులు మాత్రం కేకును తీసుకోవటానికి ఆరాటపడుతూండడం గమనించింది జయంతి. "పరవలేదు తీసుకో" అన్నది. జయంతి నోటి నుండి మాట రాగానే కేకును తీసుకుని పారిపోయాడు కుర్రాడు. నవ్వుకుంది జయంతి. షాపు యజమాని కేకులు మొత్తం ప్యాక్ చేసి "ఇవిగోనండమ్మా" అనడంతో వాటిని తీసుకుని, షాపతనికి డబ్బులిచ్చి, కేకు ప్యాకెట్లను తాను తెచ్చిన సంచీలో ఉంచుకుని ఎదురుకుండా ఉన్న కూరగాయల మార్కెట్లోకి వెళ్ళింది జయంతి.

అక్కడే అది జరిగింది.

కూరగాయలు కొనుక్కుని, డబ్బులు లెక్క పెట్టి ఇచ్చి, క్రింద పెట్టున్న సంచీని ఒంగి తీసుకుందామనుకునేటప్పుడు, ఆమె చేతిలో ఉన్న మనీ పర్స్ చేతిలోనుండి జారి పక్కనే ఉన్న మురికి కాలవలో పడిపోయింది.

ఆరువేల రూపాయల డబ్బు, ఒక బంగారు గొలుసు, నాలుగు క్రెడిట్ కార్డులు, రెండు డెబిట్ కార్డులు, ఇంటి తాళంచెవి, బీరువా తాళం చెవులు, తనూ, తన భర్త కలిసి తీసుకున్న ఫోటో ఉన్న పర్సును పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక, చెతులు నలుపుకుంటూ భారమైన మనసుతో నిలబడి ఉన్నప్పుడు "ఇదిగో ఒక్క నిమిషం" అంటూ అర్జెంటు సహాయం అందించాడు కుర్రాడు.

కుర్రాడే...వాడే...పెదవులపై చిన్న కేకు ముక్క అతుక్కోనున్నది.......కనురెప్పలు మూసి తెరిచేలోపల కాలువలోకి దూకాడు. మరు క్షణం మురికి నీటిలో పడి తడిసిపోయిన ఆమె మనీ పర్సును గుండెలకు హత్తుకుని కాలువలో నుండి బయటకు వచ్చాడు.

"వాడికి ఎలా కృతజ్ఞత చెప్పబోతాను, మురికి నీటిలో తడిసిపోయిన తన మనీ పర్సును ఎలా తీసుకోవటం" అని జయంతి ఆలొచిస్తూండగా జయంతి ముందుకు వస్తున్న కుర్రాడు సడన్ గా వెనక్కి తిరిగి మనీపర్స్ తో సహా పరుగుతీసాడు.

"అలా ఎందుకు చేసాడు? మనీ పర్సును తిరిగి ఇస్తున్నాడేమో అనుకున్నానే?" అనుకుంది జయంతి.

కొద్ది నిమిషాల తరువాత తేరుకున్న జయంతి గుంపులో కలిసి కనిపించకుండా పోయిన కుర్రాడు ఇక కనిపించడని తీర్మానించుకుని "ఒక దొంగ వెధవ మీద జాలిపడి అనవసరంగా ఒక కేకు కొనిచ్చేనే" తనని తాను నిందించుకుంటూ ఏమీ చేయలేక పార్కింగ్లో ఉంచిన తన కారు దగ్గరకు వెళ్ళింది.

ఆమె కొంచం కూడా ఎదురు చూడలేదు. కుర్రాడు తన కారు దగ్గర ఉంటాడని! కారు అమెదేనని కుర్రాడికి తెలిసే చాన్సే లేదు. కారు వెనుక దాక్కుని భయం, భయంగా చూస్తున్నాడు.

జయంతి వాడికి తెలియకుండా మెళ్ళిగా వెళ్ళి వాడి వేనుక నిలబడింది.

ఎవరో తన వెనుక నిలబడ్డారని గ్రహించిన కుర్రాడు వెనక్కి తిరిగేడు. జయంతి వాడి చెయ్యి పుచ్చుకుంది.

"అమ్మగారూ నన్ను కొట్టకండి...పోలీసులకు పట్టివ్వకండి...మీ పర్సు మీకిద్దామనే కాలవలో నుండి పైకొచ్చిన నేను మీదగ్గరగా వచ్చాను.... అక్కడే కనబడ్డాడు కాశీ అన్నయ్య మనిషి...అయితే వాడు నన్ను చూడలేదు...చూసేస్తాడేమో నన్న భయంతో అక్కడి నుండి పారిపోయాను... మీరు ఎక్కడున్నారో నని వెతుకుతూ ఇక్కడ నిలబడ్డాను" అని చెప్పాడు.

అప్పుడే వాడి మొహాన్ని బాగా చూసింది. మొహాన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు జయంతికి అనిపించింది...ఎక్కడ చూసుంటానబ్బా!?” అనుకుంటూ అదే ఆలొచనలో జయంతి ఉన్నప్పుడు కుర్రాడు జయంతి చేతిని విదిలించుకుని గబుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ పారిపోయాడు.

జయంతి చూస్తూ ఉండగానే ఒక్క సెకండులో పక్క సందులోకి పరిగెత్తి మాయమయ్యాడు.

జయంతికి కోపం రాలేదు...మారుగా కుర్రాడి మొహమే అమె మదిలో మెదులుతోందిబాగా దగ్గిర వాడిలో, కావలసినవాడిలా అనిపించిందిఎలాగైనా ఇంకోసారి వాడిని చూడాలనిపించింది. కానీ వాడు పారిపోయాడు "ఇక వాడిని పట్టుకోలేను" అనుకుంటూ కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది.

                                                               ***********************************

ఇంటికి వచ్చిన భర్తతో ప్రొద్దున జరిగిన విషయం చెప్పి వాడి మొహం బాగా తెలిసిన మొహంలా ఉన్నది...కానీ ఎంత ఆలొచించినా వాడిని ఎక్కడ చూసుంటానో గుర్తుకు రావటంలేదు అన్నది.

బాగా తెలిసిన మొహంలా ఉన్నది...గుర్తుకు రావటంలేదు...ఇవన్నీ నీ భ్రమ...ఒక వీధి కుర్రాడిని ఎక్కడ చూసుంటావు...మార్కెట్లోనో, రోడ్డుమీదో చూసుంటావు. వాళ్ళు గుర్తుపెట్టుకునేంత మొహంతో ఉంటారా? నీ పిచ్చిగానీ...అనవసరంగా కుర్రాడి గురించి ఆలొచించడం మానేయి...ఎందుకంటే ఇక వాడిని పట్టుకోలేవు. వాడొక వీధి కుర్రాడు. ఈరోజు ఇక్కడ ఉంటాడు...రేపు ఇంకోచోట ఉంటాడు...వాడొక అనాధ..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భర్త మాటలను మధ్యలోనే అడ్డుకుని "అనాధ ఎందుకవుతాడు? ప్రపంచంలో అనాధ అనే వాళ్లే ఉండరు. పుట్టిన ప్రతి మనిషికీ తల్లి, తండ్రీ ఉంటారు. తల్లి తండ్రులకు తోబుట్టువులు ఉంటారు. అలాంటప్పుడు వీధి కుర్రాళ్ళు అనాధలెందుకు అవుతారు. అనాధలు చేయబడ్డారు...ఇలాంటి పిల్లలకు సంఘం చేయాల్సింది, ఇవ్వల్సింది చాలా ఉంది. సంఘంలో మనమూ ఒకరిమే ఆవేశంగా చెప్పింది జయంతి.

పిల్లలు పుట్టలేదన్న బాధలో ఉన్న భార్యతో వివదాం చేయకూడదని అనుకుంటూ "సరే...సరే ...ఇప్పుడేం చెయ్యాలంటావు" అని అడిగేడు.

పోలీసు కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి...డబ్బులు, గొలుసు పోతే పోయినై. క్రెడిట్ కార్డులను, డెబిట్ కార్డులను బ్యాంకు వాళ్ళకు చెప్పి బ్లాక్ చెయ్యండి" చెప్పింది భర్తతో.

"అలాగే" అన్నాడు జయంతి భర్త.

                                                               ***********************************

ఆరోజు నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా కుర్రాడు ఎక్కడన్నా కనబడతాడేమోనని జయంతి వెదుకుతూనే ఉన్నది. కానీ కుర్రాడు జయంతికి కనబడలేదు. రోజు పోలీసులు వచ్చి ఒక కుర్రాడి గురించి చెబుతున్నారు. "మన పర్సు వాడి దగ్గర ఉందంటే ఒక వేల కుర్రాడు కుర్రాడేమో?"

పోలీసు స్టేషన్ లోకి కారు వెళ్ళి ఆగింది....డోర్ తెరుచుకుని గబగబా లోనికి వెళ్ళింది...జయంతిని చూసిన ఇన్ స్పెక్టర్ "రండి... సెల్లులో ఉన్నాడు కుర్రాడు...చూసి రండి" అని జయంతికి చెబుతూ "ఫోర్ నాట్ సెవెన్...ఈమెకు సెల్లులో ఉన్న కుర్రాడిని చూపించు" అని చెప్పాడు.

జయంతి వెతుకుతున్న కళ్ళకు ఫలితం దక్కింది...వాడే... కుర్రాడే...ముఖమంతా దెబ్బలతో కందిపోయుంది. పెదవుల పక్కన నెత్తురు కారుతోంది. గోడ చివర కూర్చుని తన కాలు గాయాన్ని తడుము కుంటున్నాడు. వాడిని చూసిన వెంటనే అమె మనసు కలుక్కు మంది.

ఎవరో సెల్ దగ్గరకొచ్చి నిలబడటం గమనించిన కుర్రాడు తలెత్తి చూసాడు...జయంతిని చూసి షాక్ తిన్నాడు. గోడకు చేతులు ఆనించి లేచి నిలబడ్డాడు. మెల్లగా నడుచుకుంటూ జయంతి దగ్గరకు వచ్చి "అమ్మగారూ..." అంటూ ఎదో చెప్పబోయాడు.

పెదవుల మీద వేలు పెట్టి "మాట్లాడకు" అన్నది. వాడు సెల్ కడ్డీలు పట్టుకుని నిలబడ్డాడు. జయంతి వెనక్కు తిరిగి ఇన్ స్పెక్టర్ దగ్గరకు వెళ్ళింది.

ఎందుకు కుర్రాడిని అంతలా కొట్టేరు...చిన్నపిల్లడనే కనికరం కూడా లేకుండా నెత్తురు వచ్చేటట్లు కొట్టారు. ఏం తప్పు చేసేడని అంతలా కొట్టారు"

మేడం...అవి మేము కొట్టిన దెబ్బలు కావు... అవి అంతకు ముందే ఉన్నాయిమేము మెల్లగానే నాలుగు తగిలించాము...కావాలంటే వాడినే అడగండి"

"సరే... కుర్రాడిని వదిలి పెట్టండి"

"మీ పర్స్ అతని దగ్గరకు ఎలా వచ్చిందో కనుక్కున్నారా?"

"అవసరం లేదు...కాలవలో పడిన నా పర్స్ అతని దగ్గరకెలా వచ్చింటుందో వాడిని చూసిన వెంటనే ఊహించుకున్నాను...వాడు దొంగ మాత్రం కాదు...అది నేను ఖచ్చితంగా చెప్పగలను"

"ఎలా తెలుసుకున్నారు...వాడి అవతారం చూస్తేనే చెప్పేస్తారు వాడొక దొంగని...మీరేంటి వాడేదో మీకు తెలిసిన కుర్రాడిలా అంత ఖచ్చితంగా వాడు దొంగ కాదని చెబుతున్నారు"

వాడిని నేను ఇది వరకు చాలా సార్లు మార్కెట్టులో చూసాను...చిన్న చిన్న కూలీ పనులు చేసేవాడు...ఒక సారి నా సంచీ మోసుకు వచ్చి నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు అబద్దమాడింది జయంతి.

"అదేంటి మేడం...వాడ్ని ఎందుకు అంతలా వెనకేసుకొస్తున్నారు" వెటకారంగా అడిగాడు.

"అది మీకు అనవసరం. నా పర్స్ పోయిందని నేను మీకు కంప్లైంట్ ఇవ్వలేదు...పోనీ వీడిని ఇంకేదైనా కేసు గురించి పట్టుకున్నారా? లేదు కదా! నా పర్స్ గురించే పట్టుకున్నారు...నేనేమీ కంప్లైంట్ ఇవ్వలేదు...వాడిని విడిచి పెట్టండి...లేకపోతే..." అంటూ ఇంకేదో మాట్లాడబోయింది.

ఈలోపు "ఫోర్ నాట్ సెవెన్...వాడ్ని విడిచి పెట్టు" అని కానిస్టేబుల్ కి చెప్పాడు.

సెల్లు బయటకు వచ్చిన కుర్రాడిని చేతులు పుచ్చుకుని మెల్లగా నడిపించుకుంటూ పోలీసు స్టెషన్ బయటకు వచ్చి, కారు దగ్గరకు వెళ్ళి "లోపల కూర్చో" అని వాడ్ని కారు ఎక్కించుకుని అక్కడి నుండి బయలుదేరింది జయంతి.

                                                               ***********************************

కార్లో తలవంచుకునే కూర్చున్న కుర్రాడ్ని చూసి ఇప్పుడు చెప్పు... రోజు రెండుసార్లు నా మనీ పర్స్ నాకివ్వటానికి నాదగ్గరకొచ్చినట్లు నటించి, గబుక్కున పారిపోయావు...మురికి కాలవలో పడిపోయిన మనీ పర్సును క్షణం కూడా ఆలొచించకుండా కాలవలోకి దూకి తీసుకుని పైకొచ్చినప్పుడు ...ఎంత మంచి కుర్రాడు అనుకున్నా..కానీ పారిపోయినప్పుడు తెలిసింది నువ్వొక దొంగవని...ఇలాంటి వాడికా నేను కేకు కొనిచ్చిందని అవమానంతో కుంగిపోయాను....రెండొసారి నువ్వు కనిపించినప్పుడు నువ్వు అలాంటి వాడివి కాదని సంతోషించేను...కానీ నాకు పర్స్ ఇవ్వకుండా మళ్ళీ పారిపోయావు.....ఎందుకలా చేసేవు?”

నిజమేనమ్మగారూ...నేను దొంగనే...పుట్టుకతో కాదు...దొంగను చేయబడ్డాను. నాకు అమ్మా నాన్నలు లేరు. కాశీ అన్నయ్యే తెలుసు. అతని దగ్గర నాలాగా చాలామంది పిల్లలున్నారు. అందరూ దొంగతనాలు చేస్తారు. దొంగతనాలు చేసినవాటిని తీసుకు వచ్చి కాశీ అన్నయ్యకు ఇచ్చేయాలి. అలా ఇవ్వకపోతే మమ్మల్ని చితకబాదుతాడు. కాశీ అన్నయ్యే మాకందరికీ తిండిపెడతాడు. అతను పెట్టే తిండి మాకు చాలదు. అందుకని అక్కడక్కడ అడుక్కుంటూ ఉంటాము. రోజు బాగా ఆకలేసిందనే బ్యాకరీ దగ్గరకు వచ్చాను. డబ్బులిస్తారనుకున్న మీదగ్గర నుండి నాకు తిండి దొరికింది

కాలవలో పడ్డ పర్సును నేను తీసుకుని పారిపోదామనుకోలేదు.మీకు తిరిగి ఇవ్వటానికే ప్రయత్నించాను. కానీ అక్కడక్కడ నిలబడ్డ కాశీ అన్నయ్య మనుష్యులు నన్ను చూస్తూండటం గమనించేను. అందుకని తిరిగి ఇవ్వలేదు. తిరిగి ఇవ్వాలని ప్రయత్నించాను. కుదరలేదు.రెండు మూడు రోజులు మీరెక్కడన్నా కనబడతారేమోనని చూసేను.కనబడలేదు... తరువాతే మీ పర్స్ తెరిచి చూసాను.అందులో డబ్బు...బంగారు గొలుసు ఉన్నది.బంగారు గొలుసు తీసి మా బామ్మ మెడలో వేసేను...బామ్మంటే నా సొంత బామ్మ కాదు...నాలాగే అనాధ...కళ్ళు కూడా తెలియదు.కానీ నేనంటే ఆమెకు ప్రాణం.తాను అడుకొచ్చినదాంట్లో నా కోసం కొంత అట్టేపెడుతుంది. నేను మాత్రం ఇంతవరకు ఆమెకు ఏమీచేయలేదు... రోజు మాత్రం మీ పర్సులోని బంగారు గొలుసును ఆమె మెడలో వేసేను.డబ్బులతో బిరియానీ కొనుకొచ్చి ఇచ్చాను.ఆయాసానికి మంచి మందులు కొనిచ్చాను..పదిరోజులు అలాగే తిన్నాము. మా ఇద్దరి జీవితంలోనూ పది రోజులే మేము కడుపు నిండుగా తిన్న రోజులు...మరు నాడు బామ్మ చనిపోయింది. చుట్టు పక్కల వారందరూ వచ్చారు. కాశీ అన్నయ్య కూడా వచ్చాడు. బామ్మ మెడలో వేసున్న బంగారు గొలుసు చూసాడు. వెంటనే అర్ధం చేసుకున్నాడు. "ఎందుకు నా దగ్గర పర్స్ ఇవ్వలేదు" అని నన్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు" చెబుతున్నఆ కుర్రాడికి దుఃఖము ఆగలేదు.

"నువ్వెందుకు అప్పుడే అతని దగ్గర పర్స్ ఇవ్వలేదు" అడిగింది జయంతి.

దొంగలిస్తేనే కదా ఇవ్వాలి? మీ పర్స్ నేను దొంగలించలేదే? అది కాలువలో జారి పడిపోయింది. నేనే కదా కాలువలోకి దూకి తీసింది. కాబట్టి అది నాకే..అదే కదా న్యాయం?... మాటే కాశీ అన్నయ్యతో చెప్పాను..."న్యాయం మాట్లాడతావారా..న్యాయం" అంటూ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టేడు. నొప్పి భరించలేక పోయాను. ఇక కాశీ అన్నయ్యను చూడకూదని నిర్ణయించుకుని అక్కడా, ఇక్కడా తిరుగుతూ నిన్న బస్ స్టాండ్లో ఉన్నాను. అప్పుడే పోలీసులు వచ్చి పట్టుకున్నారు"

"అయితే దెబ్బలు పోలీసులు కొట్టినవి కావన్నమాట"

"కావు...పోలీసులు లాటీతో కాళ్ళమీద కొట్టేరు. అంతే"

"సరే...నిన్ను ఇప్పుడు మా ఇంటికి తీసుకువెడతాను, చదువు నేర్పిస్తాను...సక్రమంగా ఉంటావా" అని జయంతి అడిగినప్పుడు షాక్ తిన్న కుర్రాడు. “అమ్మగారు...నాకు చాలా ఆకలిగా ఉన్నది...ముందు నాకు మీరు రోజు కొనిచ్చేరే కేకు కొనివ్వండి. తరువాత మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాను" అన్నాడు.

జయంతి కారును బ్యాకరీ దగ్గరకు పోనిచ్చింది. బ్యాకరీలో వాడడిగిన కేకు కొనిచ్చి...వాడు తింటుంటే ఆనందపడింది. కానీ ఆనందం ఎక్కువసేపు అనుభవించలేకపోయింది.

కేకు తింటున్న కుర్రాడు, మిగిలిన కేకు ముక్కను తీసుకుని పారి పోయాడు.

ఇప్పుడెందుకు పారిపోయాడో జయంతికి అర్ధం కాలేదు.

                                                              ***********************************

ఈసారి కుర్రాడు పారిపోవడానికి బలమైన కారణముంది. కుర్రాడి తల్లి అనారోగ్యంతో చనిపోయే రోజున తాను దాచుకున్న సంచీలో నుండి ఒక ఫోటో తీసి వాడికి చూపించి ఫోటోలో నాతో పాటు ఉన్న ఆయనే నీ తండ్రి...నా అనారోగ్యానికి నిజమైన కారణం తెలుసుకోకుండా నన్నూ, పసి బిడ్డగా ఉన్న నిన్నూ వదిలేసి ఆయన వెళ్ళి పోయారు. నాలుగేళ్ళు నిన్ను కష్టపడి పెంచాను. నా ఆరొగ్యం బాగా క్షీణించిపోయింది. నేను బ్రతకనని డాక్టర్లు చెప్పేసారు. నేను పోయిన తరువాత నువ్వెలా బ్రతుకుతావో అనే బెంగ నన్ను ఎక్కువగా బాధ పెడుతోంది..... దేముడే నిన్ను కాపాడతాడు...ఏదోక విధంగా నీ తండ్రిని నీకు చూపిస్తాడు...అప్పుడు...అప్పుడు.." అంటూ ఏదో చెప్పబోయిన కుర్రాడి తల్లి చెప్పకుండానే చనిపోయింది.... రోజు జయంతి పర్సు కాలువలో దొరికినప్పుడు, ఆమెకు పర్సు తిరిగి ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా పర్సు ఇవ్వలేక పోయాడు. కొన్ని రోజులు ఆమె కోసం వెతికిన కుర్రాడు అమె కనబడకపోయేసరికి పర్సు తెరిచి చూసాడు. అందులో డబ్బు, బంగారు గొలుసు, తాళం చెవులు, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు జయంతి, తన తండ్రి కలిసున్న ఫోటో ఉండటం చూసాడు. ఉలిక్కిపడ్డాడు. కోపం, ఆగ్రహం నిండిన మనసుతో తన తండ్రిని నిలదీయాలనుకున్నాడు...కానీ జయంతిని చూసిన తరువాత ఉద్దేశం మార్చుకున్నాడు. మీ ఆయనే నా తండ్రి,, అతను ఒక మొసగాడు అని చెబితే అమె తట్టుకుంటుందా...ఎంతో మంచి మనసున్న ఆమెను బాధలకు గురిచేయడం తను చేసిన నేరాలలోనే పెద్ద నేరమౌతుంది....నేను అనాధగానే బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నాడు. చిన్నవాడైనా పెద్దరికంతో ఆలొచించాడు.....అందుకే అమె నుండి పారిపోయాడు.

**********************************************************సమాప్తం**************************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)