వాగుడుకాయ...(కథ)

 

                                                                              వాగుడుకాయ                                                                                                                                                                    (కథ)

ప్రయాణీకుల చూపంతా అతనిపైనే పడింది.

బస్సు బయలుదేరుతున్నట్టు చూపించటానికి బస్సు డ్రైవర్ బస్సును ఒక్కసారిగా కుదిపి, వేగంగా బస్సును బస్ స్టేషన్ బయటకు తీసుకు వచ్చి రోడ్డు పక్కన ఆపాడు. దానికే అరగంట పట్టింది. అది కూడా బస్సు వెనుక అదే రూటులో వెళ్ళే మరో బస్సు హారన్ మోత బస్సు డ్రైవర్ను కదలమని చెప్పటంతో.

బస్సులో సీట్లను నింపటానికి ఇదొక ఎత్తు. చివరి క్షణాన్న వేగంగా పరిగెత్తుకు వచ్చి ఎక్కి కూర్చున్న అతనే చక్రధర్. వచ్చి కూర్చున్న దగ్గర నుండి ఒకటే వాగుడు. అందుకే ప్రయాణీకుల చూపంతా అతనిపైనే పడింది.

"రైలు ప్రయాణం కంటే బస్సు ప్రయాణమే నాకు చాలా నచ్చుతుంది. దీనికి కారణాలన్నీ అడగకండి. కొన్ని కోరికలకు కారణం ఉండదు...కానీ నచ్చుతుంది"

"నేను మిమ్మల్ని అడగనే లేదే?" చక్రధర్ పక్కన కూర్చున్న ప్రయాణీకుడు అమాయకంగా అన్నాడు.

"గుడ్ జోక్..." అంటూ చక్రధర్ నవ్వుకుంటూ, ఖాలీగా కనబడ్డ మరో సీటుకు వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూడా ఒక ప్రయాణీకుడు కూర్చోనున్నాడు. అతను కూడా అమాయకుడే. ఎందుకంటే చక్రధర్ వాగుడును భరించాలిగా.

"సార్...ఎవర్ని చూసినా చాలా రోజుల పరిచయం ఉన్నవాడిలా చనువు తీసుకుని మాట్లాడటం మొదలుపెడతాడు చక్రధర్..."

"ఎవరండీ చక్రధర్...?"

"నేనే నండి" అంటూ చక్రధర్ పగలబడి నవ్వటంతో ప్రయాణీకుని ముఖం వాడిపోయింది.

చక్రధర్ అలా బస్సులో ఖాలీగా ఉన్న సీట్లను ఆక్రమించి, పక్కన కూర్చున్న ప్రయాణీకులను తన వాగుడుతో విసిగించటంలో ఆరితేరిన మనిషి. అతని దగ్గర నుండి తప్పించుకోవటానికి అందరూ తలో ట్రిక్కూ వేయాల్సి వస్తోంది.

ఒకరు పాటలు వింటున్నట్టు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నాటకమాడితే, కొందరు అప్పుడే సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాటకమాడుతున్నారు. మాట్లాడటానికి పక్కన మనిషి ఉన్నాడా అన్నది మాత్రమే చూస్తాడు చక్రధర్. పక్కతను తన మాటలు వింటున్నాడా, లేదా అన్నది అతనికి అనవసరం.

రఘుపతికి పక్కవారి మాటల నుండి తప్పించుకోవటానికి నిద్రపోతున్నట్టు ఫోజు పెట్టటం అలవాటు. చాలామందికి పక్క ప్రయాణీకుల వాగుడు నుండి తప్పించుకోవటానికి నిద్ర ఫోజు చాలా ఉపయోగకరమైన ఆయుధం.

"ఏమిటి సార్...నిద్రా?....మీకు నైట్ సిఫ్ట్ అనుకుంటా. జాగ్రత్తగా నిద్రపొండి. ఏరియాలో దొంగతనాలు ఎక్కువ. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పటానికే చక్రధర్ నిద్రా భంగం కలిగించాడు"

"హలో...ఊరికే నోరు మూసుకుని కూర్చోవయ్యా. నిద్రపోతున్నానని తెలిసి కూడా వాగుతున్నావు. నీకు కొంచం కూడా ఇంకిత జ్ఞానం లేదా" అందామని అనుకున్నాడు. కానీ ఎందుకనో చెప్పలేకపోయాడు. మిగితా ప్రయాణీకుల లాగానే రఘుపతి కూడా మౌనంగా నిద్రా బంగిమలొ ఉండిపోయాడు.

"సార్... పని మీద ప్రయాణం? చక్రధర్ తెలుసుకోవచ్చా?"

"ఆఫీసు పనిమీద వెడుతున్నాను" చక్రధర్ తో మాట్లాడ కూడదనుకున్నాడు రఘుపతి. కానీ చక్రధర్ ఎలాగో మాట్లాడేటట్లు చేశాడు.

" వాగుడుకాయ దగ్గర ఎంత గొప్ప మనిషైనా సరండర్ అయిపోతాడు...మాట్లాడే చంపేశ్తాడు అని విన్నామే... ఇతనేనా అతను?" మనసులోనే అనుకున్నాడు రఘుపతి.

"గవర్నమెంట్ ఉద్యోగమా...ప్రైవేట్ ఉద్యోగమా?"

"చేతి నిండా జీతం ఇచ్చే ఉద్యోగం"

"జీతం కోసమే కదా అందరూ ఉద్యోగానికి వెడుతున్నారు! చక్రధర్ కి ప్రైవేటు ఉద్యోగం. వారం పని ముగించుకుని ఇంటికి వెడుతున్నాను. శని, ఆది వారాలలో భర్యా-పిల్లలతో సరదాగా కాలం గడిపితేనే పైవారం ఉత్సాహాంగా ఉండవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావలంటే అలా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ సంతోషాన్ని అనుభవించడం మన చేతుల్లోనే కదా ఉంది"

పక్కన కూర్చున్నతని మనో పరిస్థితి ఏమిటి...అతనెవరు? ఇలాంటివి చక్రధర్ కు అక్కర్లేదు. వినడానికి చెవులు ఉండే ఒక మనిషి పక్కన కూర్చోనుంటే చాలు.

ఇతను మాట్లాడకుండా (మాట్లాడకుండా ఎలా ఉండగలడు?) టీ.వీ యాంకరింగ్ ఉద్యోగానికి వెళ్ళి ఉండవచ్చు. చక్రధర్ లాంటి మనుష్యులే ఇరవై నాలుగు గంటలు మట్లాడటానికి, ఇప్పుడు బోలేడు టీ.వీ చానెల్స్ కి మనుష్యులు కావలసి ఉంది మనసులోనే అనుకున్న రఘుపతి అతని భార్యా-పిల్లల పరిస్థితిని ఆలొచించి చూశాడు. అయ్యో పాపం అనిపించింది. పెళ్ళి చేసుకున్న పాపానికి గతిలేక భరిస్తూ ఉంటుంది భార్య. లేకపోతే వినే అలవాటుకు బానిస అయిపోయుంటుంది

కండక్టర్ నుండి ఒక ఈల. ఏదో బస్ స్టాప్ వస్తున్న సూచన!

"అందరికీ నమస్కారం...వెళ్ళిరానా? మరొసారి ఖచ్చితంగా అందర్నీ కలుస్తా. భూమి గుండ్రం... లాజిక్కు తో వెడుతున్నాను..." అంటూ ఇద్దరికో, ముగ్గురికో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి బస్సు దిగాడు చక్రధర్.

బస్సు మళ్ళీ బయలుదేరింది. శబ్ధ నిషేద చట్టం వేసినట్టు బస్సులో ఒక ప్రశాంతత. మనసులో ఉండే ఆఫీసు పనుల ఆలొచనలు అన్నీ కూడా ఎక్కడో ఒక చెట్టు కొమ్మకు పోయి కూర్చున్న ఫీలింగ్. మళ్ళీ ఆఫీసు ఆలోచనలను తవ్వి బయటకు తీసి హెడ్ ఆఫీసులో అప్పచెప్పాలి.

మొదట్లో చక్రధర్ వాగుడు, చేష్టలు చికాకు తెప్పించినై గానీ పోను పోను అతని వాగుడు అందరికీ నచ్చినట్లు అనిపించడమే నిజం.

" చక్రధర్ వాగుడు వలన రెండు గంటల బస్సు ప్రయాణం ఎలా గడిచిందో తెలియడం లేదు"

"చిన్న పిల్లావాడిలాగా కలిసిపోయాడు...అందుకే అతన్ని కోపగించుకోలేకపోయాను"

"కష్టాలే లేని మనిషనుకుంటా"

ప్రయాణీకులు మాట్లాడుకుంటునే వారి వారి స్టాపింగులలో దిగిపోయారు.

బస్సు బస్ స్టేషన్లో కి వచ్చి ఆగినప్పుడు మిగిలింది రఘుపతి...ఇంకో నలుగురు మాత్రమే!

బస్సు దిగిన వెంటనే రఘుపతిని అతని ఆఫీసు పనుల ఆలొచనలు చుట్టుముట్టాయి. "పని త్వరగా అయిపోతే...వెంటనే తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ హెడ్ ఆఫీసులో పని చూసుకోవాలంటే వాళ్ళ లంచ్ టైము అయిన తరువాతే వెళ్ళాలి" అనుకుంటూ సెల్ ఫోన్లో టైము చూసుకున్నాడు. టైము మధ్యాహ్నం పన్నెండు.

"హలో...ఇది ఎవరిదండి?"....అలవాటైన కండక్టర్ గొంతు. దిగేటప్పుడు బస్సు మెట్ల మీద నిలబడి వెనక్కి తిరిగి చూశాడు రఘుపతి. కండక్టర్ చేతిలో బ్రౌన్ రంగు హ్యాండ్ బ్యాగ్.

"ఇది చక్రధర్ చేతిలో ఉండటం చూశాను కదా?" గుర్తుకు రావడంతో "కండక్టర్... హ్యాండ్ బ్యాగ్ చక్రధర్ గారిది" చెప్పాడు రఘుపతి.

"...అవును. ఆయన పేరు కూడా ఉంది. ఇప్పుడేం చేయాలి. ఆయన రెండు స్టాపింగులకు ముందే దిగిపోయాడే?"

"నేను కావాలంటే ఆయనకు తీసుకు వెళ్ళి ఇచ్చేయనా?" హెడ్ ఆఫీసులో పని పూర్తి చేసుకోవటానికి ఇంకా చాలా సమయం ఉందన్న ధైర్యంతో కండక్టర్ తో అన్నాడు రఘుపతి.

"ఆయన మీకు తెలుసా?" అని కండక్టర్ అడిగినప్పుడునీకిది అవసరమేనా...లేనిపోని సహాయాలకు వెడితే ఇంతే" రఘుపతి మనసు అతన్ని ప్రశ్నించింది. "లేదు! కానీ ఇప్పుడు తెలిసిన మనిషి అయ్యాడు"

"నేను కూడా వెంటనే బస్సును రిటర్న్ ట్రిప్పుకు తీయాలి. మీకెందుకు లేనిపోని శ్రమ అని ఆలొచిస్తున్నాను...ముఖ్యమైన బ్యాగు అయితే అయానే వచ్చి తీసుకోనివ్వండి"

"బ్యాగులో ముఖ్యమైనవి ఏమున్నాయో మనకేం తెలుసు...రేపు, ఎళ్ళుండి శని, ఆదివారాలు. ఒక వేల ఆయన మిమ్మల్ని కలుసుకోలేకపోతే?"

కండక్టర్ బ్యాగును కింద, పైకి వంచి, ఆడించి చూశాడు. తరువాతే రఘుపతికి అందించాడు. ఎందుకైన మంచిదని రఘుపతి అడ్రెస్సు అడిగి తీసుకున్నాడు.

బ్యాగు తీసుకుని ఆటో ఎక్కి బ్యాగు పైనున్న ఆడ్రెస్సు చెప్పి వెళ్ళమన్నాడు.

ఆటో ఒక ఇంటి ముందు ఆగింది. బ్యాగు పైన ఉన్న డోర్ నెంబర్ చూశాడు. ఒకటి ఎక్కువ ఉన్నది. వెనక ఇళ్ళు అనుకున్నాడు. ఆటో దిగి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాడు.

ఇంటి కిటికీలో నుండి ఒకతను కనబడ్డాడు. అది చక్రధర్ గారే!... చేతులు ఆడిస్తూ తన భార్యా, పిల్లాడి దగ్గర ఏదో మాట్లాడుతున్నాడు. రఘుపతిని చూసిన వెంటనే బయటకు పరిగెత్తుకు వచ్చాడు. అతని వెనకే వచ్చిన అతని భార్య, పిల్లాడు "రండి...రండి" అనే చూపులతో నవ్వు మొహంతో వచ్చి నిలబడ్డారు.. బ్యాగు అందించాడు రఘుపతి.

"చాలా ధ్యాంక్స్ అండి...లోపలకు రండి సార్" రఘుపతిని ఆహ్వానించాడు చక్రధర్.

"ఇంత భవ్యంగా, సన్నని గొంతుతో మాట్లాడటం కూడా చక్రధర్ కు తెలుసన్నమాట" అని అనుకుంటూ "హెడ్ ఆఫీసులో చేసుకోవలసిన ముఖ్యమైన పనికి సమయం తక్కువగా ఉంది. అందుకని నేను వెంటనే వెళ్ళాలి" అని చక్రధర్ తో చెప్పాడు రఘుపతి.

"ఒక్క ఐదు నిమిషాలు కూర్చోని వెళ్ళండి...అది మాకందరికీ తృప్తిగా ఉంటుంది" బ్రతిమిలాడాడు చక్రధర్.

"కానివ్వండి..." అంటూ లోపలకు వెళ్ళాడు రఘుపతి. చక్రధర్ చూపించిన సోఫాలో కూర్చున్నాడు.

"సార్...తెలిసో తెలియకో బస్సు ప్రయాణంలో మీలాంటి ప్రయాణీకుల మనసును గాయపరచి ఉంటాను. ఎవడ్రా వీడు...అనవసరమైన వాగుడుతో మనల్ని విసిగిస్తున్నాడు అని నా వెనుక మాట్లాడుకోనుంటారు. అంతెందుకు...నా ముఖాన్నే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు"

చిన్నగా నవ్వాడు రఘుపతి.

"ఇంట్లో నేను మాట్లాడను సారు. మాట్లాడే వాక్ఛాతుర్యం ఉన్నది కదా అని నేను సరదాగా మాట్లాడినా...మాట్లాడలేని జీవులైన నా భార్యా, పిల్లాడు మానసికంగా బాధ పడతారు కదా?" అంతవరకు సరదాగా మాట్లాడుతున్న చక్రధర్ కళ్ళల్లో నుండి నీరు ధారగా కారింది.

చక్రధర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు రఘుపతి.

కల్లు తుడుచుకుంటూ "అవును సార్...నా భార్యా, పిల్లాడు...బోత్ ఆర్ డెఫ్ అండ్ డంబ్. చిన్నప్పటి నుండి వికలాంగులంటే నాకు విపరీతమైన జాలి కలిగేది. అలాంటి వారిలో ఒకరికైన జీవితంలో ఆనందం పంచివ్వాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఏరి కోరి డెఫ్ అండ్ డంబ్ గా ఉన్న సంధ్యను పెళ్ళిచేసుకున్నాను. దేవుడు నాలోని జాలిగుణానికి బహుమతిగా మరో మూగ, చెవిటి జీవిని నాకు వరంగా ఇచ్చాడు. వాడే నా కొడుకు ప్రశాద్. వాడికి గవర్నమెంట్ డెఫ్ ఆండ్ డంబ్ స్కూల్లో అడ్మిషన్ దొరికింది. నేను పారేసుకున్న బ్యాగులోనే అడ్మిషన్ లెటర్ ఉంది. మీరు బ్యాగును నా ఆడ్రస్సు వెతుక్కుంటూ తీసుకు వచ్చి ఇచ్చారు. మీ రుణం ఏలో తీర్చుకోవాలో తెలియటం లేదు" చెప్పాడు చక్రధర్.

"బాధ పడకండి చక్రధర్ గారు" అన్నాడు రఘుపతి.

"ఇలా జరిగిందేమిటని నేను ఏనాడు బాధ పడలేదు సార్. ఇద్దరి మూగ జీవులతో పాటు నేను కూడా ఒక మూగ జీవిగా ఉంటూ, వారిని సంతోష పెడుతూ...మాట్లాడలనే నా కోరికను మీ లాంటి వారి దగ్గర అవసరమున్నా, లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడి తీర్చుకుంటాను . మీ తిట్లను ఆశీర్వచనాలుగా తీసుకుంటాను" సంతోషంగా చెప్పాడు చక్రధర్.

మనసు బరువెక్కటంతో "టైము అవుతోంది...ఇక నేను బయలుదేరుతాను" అని చెప్పి సోఫాలో నుండి లేచాడు రఘుపతి.

ఆటో వరకు రఘుపతితో వచ్చిన చక్రధర్ ఆటొ ఎక్కిన రఘుపతికి మరోసారి ద్యాంక్స్ చెప్పాడు.

                                                                    ***********************************

ఆటోలో కూర్చున్న రఘుపతికి చక్రధర్ గురించిన ఆలొచనలే.

మనిషి తప్పనిసరిగా చేయాల్సినవి రెండు. ఒకటి తనకు తాను సంతోషంగా జీవించటం... మరొకటి పరోపకారం కొసం తన జీవితాన్ని మలుచుకోవడం. రెండింటినీ జీవితంలో పాటిస్తున్న, నేను చూసిన మొదటి వ్యక్తి చక్రధర్...హాట్స్ ఆఫ్ టు హిమ్"

సహజమైన మనిషిగా కనిపించడానికి చక్రధర్ ఎంత శ్రమ పడ్డాడో తెలియదు కానీ ...నాకు మాత్రం ఇక శ్రమే. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాలలో గట్టిగా మాట్లాడే వాళ్ళను చూస్తే, మనసు రకరకాలుగా ఆలొచిస్తుంది... ఆలొచనలను ఎలా కట్టడి చేయాలో!” అనుకుంటూ భారమైన మనసుతో ఆటో సీటులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రఘుపతి.

************************************************సమాప్తం *****************************************

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

నిజమైన అభిమానం …(కథ)

మాతృ హృదయం...(కథ)