పాలిట్రిక్...(కథ)

 

                                                                                  పాలిట్రిక్                                                                                                                                                                        (కథ)

అది ఒక జాతీయ రాజకీయ పార్టికి చెందిన రాష్ట్ర కార్యాలయం. జాతీయ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు తలపై రెండు చేతులూ పెట్టుకుని తధేక ఆలొచనలో ఉన్నాడు. ఆయనకు ఎదురుకుండా పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర రాజకీయ నాయకులు కూర్చోనున్నారు.

అందులో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడిని చూసి "ఏం నిర్ణయించుకున్నారు?" అని అడిగేడు.

రెండో అతను "లక్ష్మీపురం నియోజక వర్గంలో ఎవర్ని నిలబెట్టబోతున్నారు?" అని అడిగేడు.

అధ్యక్షుడు చిరాకుపడుతూ "ఆపండయ్యా మీ ప్రశ్నలు. ఎవర్ని నిలబెట్టాలో తెలియక నేనే కన్ ఫ్యూజన్లో ఉన్నాను. మీ ప్రశ్నలతో మీరు నన్ను ఇంకా కన్ ఫ్యూజ్ చేస్తున్నారు" అని చెప్పి తన టేబుల్ మీదున్న నీళ్ల గ్లాసు అందుకుని గడగడా గ్లాసుడు నీళ్లూ తాగేసేడు.

"నామినేషన్ వేయడానికి ఇంకా రెండు రోజులే ఉన్నది కదా.....అందుకని"

తెలుసయ్యా... విషయం తెలియకుండానే నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నానా? సిట్టింగ్ ఎం.ఎల్. రాంబాబును ఎదిరించి ఆయనకు పోటీగా నిలబెట్టాలంటే మనకి మంచి క్యాండిడేట్ కావాలి...నేను నిలబెడతామంటూ మన పార్టీ పెద్దలేవరూ ధైర్యంగా ముందుకు రావడంలేదు...పోనీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నిలబడతారా?"

ఇద్దరూ మౌనం వహించడంతో టేబుల్ మీదున్న కొన్ని పేపర్లను వారి ముందు విసిరేస్తూ "ఇదిగో నలుగురూ రాంబాబును ఎదిరించి మేము పోటీ చేస్తామని ముందుకొచ్చేరు. ఇందులో ఎవర్ని నిలబెట్టాలో మీరే చెప్పండి"

"అది కాదండి" ఏదో చెప్పబోయాడు ఒకతను

ఏం కాదయ్యా...రాంబాబు ఇదే నియోజకవర్గం నుండి నాలుగు సార్లు గెలిచేడు. ఆయన్ని ఎదిరించి పోటీచేసిన మనవాళ్లెవరూ గెలవలేదు సరికదా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయేరు. నియోజకవర్గంలో రాంబాబుకు ఉన్న పలుకుబడి అటువంటిది. విషయం మీకూ తెలుసు. అటువంటి రాంబాబును ఎదిరించి పోటీ చేసి సీటు గెలవాలంటే ...ఎలాంటి క్యాండిడేటును నిలబెట్టాలంటారు" అంటూ వారి ఎదురుకుండా పడేసిన పేపర్లను చూపిస్తూ "వీరిలో ఒకరినా?...చెప్పండి

ఎదురుగా కూర్చున్న ఇద్దరూ మౌనం వహించటంతో మళ్ళీ అధ్యక్షుడే నలుగురిలో ఎవర్ని నిలబెట్టినా మన పార్టీ పరువు గంగలో కలుస్తుంది... ఎందుకో తెలుసా! ఓడిపోవడం, డిపాజిట్లు పోగొట్టుకోవడం పట్టించుకోకపోయినా కనీసం మన పార్టీకి ఒక ఓటు కూడా పడదుఅన్నాడు.

"మరైతే... సారి మన పార్టీ తరఫున నియోజకవర్గంలో ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా?" అన్నాడు ఓకతను.

"అరెరే... విషయం నా బుర్రకు తట్టలేదే" వెటకారంగా అంటూ(ఇలాంటివారిని పార్టీలో చేర్చుకుంటే పార్టీ బాగుపడినట్లే...పార్టీ హైకమాండుకి కొంచం కూడా అలొచనలేదు అని మనసులోనే అనుకుని) "అలా చేస్తే మన పార్టీకి మిగిలిన నియోజక వర్గాలలో కూడా పరువుపోతుంది" అంటూ కుర్చీలో వెనక్కు వాలేడు అధ్యక్షుడు.

"అలాగైతే ఎలా సార్?"

తన రెండు చేతులనూ తల వెనుక పెట్టుకుంటూ "అదే ఆలొచిస్తున్నా...నాలుగు సార్లుగా ఓడిపోతున్న నియోజక వర్గం సీటును సారి మన పార్టీయే గెలవాలట... రెస్పాన్సిబిలిటీ అంతా నా నెత్తిన పడేసి మన పార్టీ హైకమాండ్ చేతులు దులుపుకుంది... సారి మన పార్టీ గెలవలేదనుకో ...ఇదిగో సీటు కూడా నాకిక ఉండదు...మీరూ మీ పదవులు రాజీనామా చేయాలి. అందుకని సారి నియోజక వర్గంలో మన పార్టీ గెలవడానికి ఒక పద్మవ్యూహం అల్లాలి...దానికి నేను బాగా ఆలొచించాలి. మీరిద్దరూ కాసేపు క్రింద హాలులో వెయిట్ చేయండి"

ఇద్దరూ లేచి క్రిందకు వచ్చేరు.

                                                                  ***********************************

క్రింద హాలులోకి వచ్చి కూర్చున్న వారిద్దరూ టీపా మీదున్న పేపర్లు తీసి చదవటం మొదలెట్టేరు. ఇంతలో హాలు తలుపులు తెరుచుకునే శబ్ధం వినబడటంతో ఎవరొచ్చేరా అని అటు వైపు చూసేరు. ఆశ్చర్యం. సిట్టింగ్ ఎం.ఎల్. రాంబాబు తమ్ముడు గోపిబాబు హాలులోకి ప్రవేశిస్తున్నాడు.

"ఈయనొచ్చేడేమిటి!" అనుకుంటూ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

ఇంతలో గోపిబాబు వాళ్లున్నచోటికి వచ్చేడు. ఇద్దరిలో ఒకతను లేచి నిలబడి "ఇలా వచ్చేరేమిటి సార్!?" అనే ప్రశ్నతో పలకరించేడు. అతని ప్రశ్నలో ఆశ్చర్యం ఒట్టిపడుతోంది. రెండో అతను కూడా లేచి నిలబడ్డాడు.

"మీ పార్టీ ప్రెశిడెంటును కలవాలి...ఉన్నారా?" అడిగేడు గోపిబాబు.

"ఉన్నారు...కానీ మీరెందుకు ఆయన్ను కలవాలనుకుంటున్నారు?" అడిగేడు రెండో అతను.

"అది నేను ఆయనతోనే చెబుతాను" చెప్పేడు గోపిబాబు.

"సరే...మీరొచ్చేరని చెప్పొస్తాను...మీరిక్కడ వెయిట్ చేయండి" గోపిబాబుకు అక్కడున్న కుర్చీ చూపిస్తూ మేడమెట్లవైపు వెళ్లేడు మొదటతను.

                                                                   ***********************************

మేడపైన తనగదిలో కూర్చున్న పార్టీ రాష్ట్ర ప్రెశిడెంట్ ఏవో పేపర్లు చూస్తున్నాడు. మొదటతను వచ్చింది కూడా గమనించలేదు.

"గోపిబాబు వచ్చేరండి...మిమ్మల్ని కలవాలట" చెప్పేడు పైకొచ్చిన మొదటతను.

"గోపిబాబా... ఎవరతను" పేపర్లు చూస్తూనే, తలెత్తకుండానే అడిగేడు ప్రెశిడెంట్.

"అదే సార్...సిట్టింగ్ ఎం.ఎల్. రాంబాబు తమ్ముడు...గోపిబాబు"

పేరువినగానే టక్కున తలెత్తి గోపిబాబా!...అతనికి నాతో పనేంటి?" అడిగేడు ప్రెశిడెంట్.

ఆమాటే నేనూ అడిగేను...నాతో చెప్పరట. మీతోనే చెబుతారట

కుర్చీలో వెనక్కు వాలి బుర్ర గోక్కుంటూ ఒక్క క్షణం ఆలొచించిన పార్టీ ప్రెశిడెంట్ "సరే...రమ్మను" అన్నాడు.

క్రిందకు తిరిగి వచ్చిన మొదటతను " ప్రెశిడెంట్ గారు రమ్మన్నారు...వెళ్లండి" ...గోపిబాబుతో చెప్పేడు.

గోపి బాబు పైకి వెళ్ళేడు. పేపర్లలో తల దూర్చి తీవ్రంగా వాటిని పరిశీలిస్తున్నట్లు నటిస్తున్న ప్రెశిడెంట్ కు వినబడేటట్లు "నమస్తే ప్రెశిడెంట్ గారు" నమస్కారం పెడుతూ ఆయన ముందుకు వెళ్లేడు.

తలపైకెత్తి నమస్తే చెబుతూ "ఏమిటిలా వచ్చేరు?”...గోపిబాబును అడిగేడు ప్రెశిడెంట్.

"కూర్చోవచ్చా?" అడిగేడు గోపిబాబు.

"కూర్చోండి...కూర్చోండి" అన్నాడు ప్రెశిడెంట్.

ప్రెశిడెంట్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గోపిబాబు.

"ఇప్పుడు చెప్పండి...ఏమిటిలా వచ్చేరు?...గోపిబాబును చూసి అడిగేడు ప్రెశిడెంట్.

"మీ పార్టీ తరఫున లక్ష్మీపురం నియోజక వర్గంలో పోటీ చేయడానికి టికెట్టు అడుగుదామని వచ్చేను" చెప్పేడు గోపిబాబు.

ఇది ఎదురు చూడని ప్రెశిడెంట్ ఒక్క నిమిషం ఆశ్చర్యానికి లోనై "జోకులెయ్యకండి" అన్నాడు.

"జోకు కాదు సార్...నిజంగానే అడుగుతున్నా. లక్ష్మీపురం నియోజక వర్గంలో మా అన్నయ్య రాంబాబును ఎదిరించి పోటీ చేయడానికి మీ పార్టీ ప్రముఖులేవరూ ముందుకు రావటంలేదని తెలిసింది. మిగిలిన పార్టీలు కూడా భయపడుతున్నాయని విన్నాను. ఎందుకంటే మా అన్నయ్యను ఎదిరించి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతామని అందరికీ తెలుసు... డిపాజిట్లు కూడా దొరకవని తెలుసు. ...అందుకనే చెబుతున్నా...మీ పార్టీ తరఫున నన్ను నిలబెడితే లక్ష్మీపురం నియోజక వర్గం మీదౌతుంది"

"జోకులెయ్యద్దని ఇందాకే చెప్పేను" కొంచం కోపంతో చెప్పేడు ప్రెశిడెంట్.

"జోకు కాదని నేనూ ఇందాకే చెప్పేను" సమాధానం ఇచ్చేడు గోపిబాబు.

జోకు కాకపోతే ఇంకేమిటి గోపిబాబూ...లక్ష్మీపురం నియోజక వర్గంలో మీ అన్నయ్య ఎదురులేని రాజు అని నువ్వే చెబుతున్నావు...ఆయన్ని ఎదిరించి ఎవరూ గెలవలేరని కూడా నువ్వే చెబుతున్నావు...అలాంటి మీ అన్నయ్యను ఎదిరించి పోటీ చేస్తానంటున్నవే...అందులోనూ మా పార్టీ తరఫున...ఇది జోకు కాకపోతే ఇంకేమిటి"

"కోపం తెచ్చుకోకండి. నేను చెప్పేది జోకు కాదు...నిజం. మా అన్నయ్యను ఎదిరించే శక్తి నాకొక్కడికే ఉన్నది. మీన్ ఆయన కుటుంబంలో వాడినైన నా కొక్కడికే ఉన్నది...అందుకే అడుగుతున్నా"

"సరే...సరే...జోకు కాదు, నిజమమనే నమ్ముతున్నా...నేనడిగే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి

ఏమిటన్నట్లు చూసేడు గోపిబాబు

"మీ అన్నయ్యను ఎదిరించి పోటీ చేయాలనుకోవడానికి కారణం?"

కారణాలు అడగకండి...అవి మా కుటుంబ కారణాలు. ఓపెన్ గా చెప్పలేను. మా అన్నయ్యకీ నాకూ కొన్ని సంవత్సరాలుగా పడటంలేదు. ఎం.ఎల్. నన్న గర్వంతో ఇంటి సమస్యలను కూడా నాతో సంప్రదించకుండా తానే పరిష్కరిస్తున్నాడు. అది నాకు నచ్చలేదు. నేనూ ఎం.ఎల్. అయితే గానీ అన్నయ్య గర్వం తగ్గదు...నామీద గౌరవం పెరుగుతుంది...అందుకనే మీ పార్టీ తరఫున పోటీ చేసి ఎం.ఎల్. అవ్వాలని నిర్ణయించుకున్నా "

పార్టీ ప్రెశిడెంట్ కొంచం మౌనం వహించేడు.

"మీ మౌనం నాకు అర్ధమైంది...మీ పార్టీ తరఫున ఎందుకు నిలబడాలనుకుంటున్నానో అనేది మీరు తెలుసుకోవాలి...చెప్తా వినండి...ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబడ వచ్చు...ఆలా చేస్తే మా అన్నయ్యే గెలుస్తాడు...ఎలాగంటే ఓట్లు విడిపోతాయి. లక్ష్మీపురం నియోజక వర్గంలో మా కుటుంబానికున్న పలుకుబడి తరువాత మీ పార్టీకే ఎక్కువ పలుకుబడి, ఫాలోయింగ్ ఉంది...అందుకనే మీ పార్టీ తరఫున నిలబడాలనుకుంటున్నా...మా కుటుంబ పలుకుబడి, మీ పార్టీ ఫాలోయింగ్ కలిస్తే మనమే ఖచ్చితంగా గెలుస్తాము"

"బాగుంది...నీ ఆలొచన నాకు నచ్చింది...కానీ నువ్వు మా పార్టీ సభ్యుడివి కావే...నీకు సీటు ఎలా ఇచ్చేది"

"ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉంటున్నారు. మీకు తెలియనిదేముంది... రోజే సభ్యత్వం రాయండి. మీ పార్టీ పేపర్లు ఇవ్వండి. ఇక్కడే పూర్తిచేసి, ఇలాగే వెళ్ళి నామినేషన్ వేసొద్దాం"

పార్టీ ప్రెశిడెంట్ ఆలొచనలో పడ్డాడు"పద్మవ్యూహం అల్లాలి అనుకున్నా...ఇదే మంచి వ్యూహం అనిపిస్తోంది. అన్నయ్యను ఎదిరించి తమ్ముడు...ఇటు నియోజకవర్గ ప్రజలు, అటు పార్టీ హైకామాండ్

ఆశ్చర్యంలో మునిగిపోతారు...సీటు గెలవకపోయినా పరవాలేదు. పార్టీలో నాకు మంచి పేరు వస్తుంది...కానిద్దాం" తనలో తనే మాట్లాడుకుంటున్న ప్రెశిడెంటును చూసి "ఏమిటండీ... ఇంకా ఏదో ఆలొచనలో ఉన్నారు" అడిగేడు గోపిబాబు.

ఆలొచనేమీలేదు గోపిబాబు...నిజం చెప్పాలంటే ఇంతవరకు నేను పడుతున్న కన్ ఫ్యూజన్ లో నుంచి నువ్వు నన్ను బయటపడేసేవు...నువ్వు అంత ఖచ్చితంగా, నమ్మకంగా చెబుతుంటే నేను కాదంటానా...మీ అన్నయ్య రాంబాబును ఎదిరించి లక్ష్మీపురం నియోజకవర్గంలో మా పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థివి నువ్వే" అంటూ గోపిబాబుకు చేతులందించేడు పార్టీ ప్రెశిడెంట్.

గోపిబాబూ తను కూర్చున్న కుర్చీలోనుంచి లేచి పార్టీ ప్రెశిడెంట్ చేతులతో తన చేతులు కలుపుతూ "ధాంక్యూ సార్...గెలుపు మనదే" అన్నాడు.

                                                                      ***********************************

విషయం అటు లక్ష్మీపురం నియోజక వర్గం ప్రజలకూ, ఇటు పార్టీ హైకమాండ్ కి తెలిసింది.

లక్ష్మీపురం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు..."తల్లిలాగా ఉండి, పెంచి పోషించి, జీవితాన్ని చక్కబరచిన అన్నయ్య రాంబాబును ఎదిరించి పోటీ చేస్తూ గోపిబాబు అన్నయ్యను వెన్నుపోటు పొడిచి రాజకీయ విరోధి అయ్యేడు. ఇది దారుణం" అనుకున్నారు. పార్టి హైకమాండ్ సంతోష పడింది. రాష్ట్ర పార్టీ ప్రెశిడెంటుకు అభినందినలు తెలియజేసింది.

నామినేషన్ తుది వివరాలు ఎలక్షన్ కమీషన్ విడుదల చేసింది. సిట్టింగ్ ఎం.ఎల్ రాంబాబు నామినేషసన్ తో పాటూ తమ్ముడు గోపిబాబు నామినేషన్ కూడా అంగీకరించబడింది.

                                                                  ***********************************

బంగళా తోటలో ఉన్న అన్నయ్య రాంబాబును కలిసి, అతని కాళ్ళమీద పడి "నన్ను ఆశీర్వదించు అన్నయ్యా" అన్నాడు గోపిబాబు.

"శభాష్ రా...నేను అనుకున్నట్లే నా ప్లాను ఫలించింది...ఏం జరుగుతుందో...నిన్ను వాళ్ళు క్యాండిడేట్ గా ఒప్పుకుంటారో లేదో అని విపరీతమైన టెన్షన్ లో ఉన్నాను....కానీ నువ్వు చాలా ఈజీగా వాళ్ళను ఒప్పించి

నా ప్లానును విజయవంతంగా నెరవేర్చేవు. నీలో కూడా రాజకీయ లక్షణాలు చాలా ఉన్నాయి" అంటూ తమ్ముడు గోపిబాబును కౌగలించుకున్నాడు రాంబాబు.

"అది సరే అన్నయ్యా...నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నీకు తెలుసు కదా...అలాంటప్పుడు నన్ను ఎందుకు పంపేవు...అదే నాకు అర్ధం కాలేదు" తన మనసులోని మాటను అప్పుడడిగేడు గోపిబాబు.

"చెబుతా విను... మొదట ఇలా కుర్చీలో కూర్చో" అన్నాడు రాంబాబు.

గోపిబాబు కుర్చిలో కూర్చుని అన్నయ్య ఏమి చెబుతాడో నని తధేకంగా అన్నయ్యనే చూస్తున్నాడు.

సారి ఎలక్షన్లలో మా పార్టీ అధికారంలోకి రాదని ఇంటలిజెన్స్ విభాగం మాకు రహస్య సమాచారం అందించేరు. లక్ష్మీపురం నియొజక వర్గమును కూడా డౌట్ క్యాటగిరీలోనే ఉంచేరు. ఒక వేల నేను గెలిచినా మా పార్టీ మాత్రం అధికారంలోకి రాదు...మన ఆస్తులను కాపాడుకోవటానికి మనలో ఎవరో ఒకరు అధికారంలో ఉండాలి. ఇప్పుడు నేను పార్టీ మారలేను. అది ప్రజలలో మనమీద దురభిప్రాయం ఏర్పరుస్తుంది. ప్రజలలో మన కుటుంబానికున్న గౌరవం ఒక్కసారిగా మట్టిపాలవుతుంది...అందుకే ప్లాను వేసేను. నిన్ను పార్టీలోకి పంపించేను... ఇప్పుడు నువ్వు గెలిచినా...నేను గెలిచినా మన ఆస్తులకు డోకా లేదు...నువ్వు కొత్తగా రాజకీయ ప్రవేశం చేసావు కాబట్టి మన నియోజక వర్గ ప్రజలు నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు...జయం నీకే" అన్నాడు రాంబాబు.

కాదు...కాదు...జయం మనకే" అన్నాడు గోపిబాబు.

*************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జంట పండ్లు…(కథ)

జాబిల్లీ నువ్వే కావాలి …(కథ)

మాతృ హృదయం...(కథ)