ఆనందనిలయం….(కథ)

 

                                                                     ఆనందనిలయం                                                                                                                                                 (కథ)

"విమల్...డైనింగ్ టేబుల్ మీద చపాతీలు ఉన్నాయి. ఫ్లాస్కులో కాఫీ పోసుంచాను. డాడీ ఏడు గంటలకు వచ్చాస్తారు. అంతవరకు చదువుకుంటూ ఉండు. ఆకలి వేస్తే నువ్వు తినేయి. నాకు ఆఫీసుకు టైమైంది" అని హడావిడి పడుతోంది స్వర్ణ.

"నువ్వు తిన్నావా అమ్మా?"

"లేదు బంగారం. నాకు ఆఫీసుకు టైమైంది. నేను  బయలుదేరుతానుఇల్లు తాళం వేసుకుని జాగ్రత్తగా ఉండు"

"సరేనమ్మా?"

వేగ వేగంగా రెండు ముద్దలు తినడానికి కూడా సమయం లేక వెలుతున్న అమ్మను చూస్తున్న విమల్ కు చదువుకోవటానికో...తినడానికో ఇష్టం లేకపోయింది.

రాత్రి ఏడు గంటల తరువాత ఇంటికి వచ్చిన విమల్ తండ్రి  ప్రశాద్, "తిన్నావా విమల్...?" అని ఏదో అడగాలని అడిగి, భోజనం చేయకుండా పడుకుండి పోయాడు.

ఎప్పటిలాగానే ప్రొద్దున్నే లేచాడు ప్రశాద్. విమల్ కు నాలుగు ముక్కలు 'బ్రెడ్ టోస్ట్' చేసిచ్చి ఉద్యోగానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నైట్ షిఫ్ట్ కు వెళ్ళిన అమ్మ ఎనిమిది గంటలు దాటితేనే వస్తుంది.

ఇద్దరూ '.టి కంపెనీలలో పని చేస్తున్నారు.

చాలా వరకు ఎవరో ఒకరితోనే విమల్ వలన ఇంట్లో గడపడం జరుగుతుంది. రోజుకూడా తల్లి ఇంటికి రావటానికి ముందే స్కూల్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు విమల్.

ఆరో క్లాసు చదువుతున్న విమల్ ఎప్పుడూ ఏదో వెలితిగానే ఉంటాడు. రోజు ఆదివారం. స్వర్ణ మాత్రం ఇంట్లో ఉంది. ప్రశాద్ అర్జెంటు పని ఉన్నదని ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

వంట పనులు ముగించుకుని, బట్టలు ఉతికి ఆరేయటానికి వెళ్ళేటప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. కాసేపు రెస్టు తీసుకుందామని విమల్ పక్కన వచ్చి కూర్చుంది. వాడు తల్లిని గమనించక ఏదో ఆలొచనలో ఉన్నాడు.

"ఎందుకు అదోలాగా ఉన్నావు విమల్? ఏమిటి ఆలొచిస్తున్నావు?" కొడుకు తల నిమురుతూ అడిగింది.

"ఏమీ లేదమ్మా"

"నీ ముఖమే సరిలేదు విమల్...ఏమిటో చెప్పు? విషయం ఏమిటో చెబితేనేగా తెలుస్తుంది "

"నువ్వూ, నాన్నా ఎందుకమ్మా ఇంట్లోనే ఉండటం లేదు? నాన్న ఇంట్లో ఉంటే నువ్వు పనికి వెడుతున్నావు. ఇంట్లో నువ్వుంటే ...నాన్న పనికి వెళుతున్నారు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం ఇంట్లో ఉండటం చూడటమే కుదరట్లేదు"

"మా ఉద్యోగాలు అలాంటివిరా బంగారం. డే...నైట్ అంటూ వెళ్ళాలి. ఇద్దరం ఒకే షిఫ్టు కు వెళ్ళొచ్చు. కానీ నిన్ను చూసుకోవటం కుదరదని ఇద్దరం మార్చి మార్చి వెడుతున్నాం."

"ఎందుకమ్మా ఇద్దరూ పనికి వెడుతున్నారు?"

"అప్పుడే కదా ఎక్కువ సంపాదించుకోవచ్చు"

"ఎక్కువ సంపాదించి ఏం చేస్తారు?"

"నిన్ను బాగా చదివిస్తాం"

"తరువాత"

"కారు కొనాలి. దీని కంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి"

"తరువాత ఏమిటో అర్ధమయ్యింది అమ్మా

"ఏమర్ధమయ్యిందో చెప్పు చూద్దాం?"

"నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగానికి వెడతాను"

"వెరీ గుడ్....తరువాత?"

"ఎక్కువ సంపాదించి బ్యాంకులో డబ్బులు చేర్చి పెడతాను"

"గుడ్ బాయ్...తరువాత?"

"బంధువులు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను"

" విమల్...ఏం చెబుతున్నావు?"  

"ఇంకా వినమ్మా. చదువుకున్న అమ్మాయినే పెళ్ళిచేసుకుంటా. బామ్మను వృద్దాశ్రమంలో నువ్వు చేర్చినట్టు...నిన్ను, నాన్ననూ వృద్ధాశ్రమంలో చేర్చేసి, నేను కూడా రాత్రీ-పగలు డ్యూటీలకు పరిగెడతాను"

"రేయ్...ఏమిట్రా ఇదంతా?"

"నువ్వూ, నాన్నా అలాగే కదా ఉన్నారు"

"నువ్వు నీ వయసుకు ఎక్కువ మాట్లాడుతున్నావు"

"అమ్మా...కోపగించుకోకు. అదే జీవితమని నేను అనుకుంటున్నాను. కానీ, నా ఫ్రెండు హరి లేడు, వాడు వేరే విధంగా చెబుతున్నాడమ్మా"

"వేరే విధంగా అంటే?"

"వాడి నాన్నా-అమ్మా ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారట. వాళ్ళింట్లో బామ్మా-తాతయ్యా ఉన్నారట. వాడికి వాళ్ళ బామ్మే అన్నం పెడుతుందట. తాతయ్య బోలడన్ని కథలు చెబుతాడట"

నోరు మూయకుండా మాట్లాడుతున్న కొడుకును నోరు మూసుకుని చూస్తూ నిలబడింది తల్లి స్వర్ణ.

"అమ్మా...వాడు నాలాగా ఒంటరిగా నిద్రపోడట. వాళ్ళ తాతయ్య-బామ్మలతో పాటూ... కథ వింటూ నిద్రపోతాడట. అదంతా నిజమా అమ్మా? లేక వాడు నా దగ్గర అబద్ధం చెబుతున్నాడా?"

"వాడు చెప్పేదంతా నిజమేరా"

"అలాగైతే మనింట్లో మాత్రం ఎందుకమ్మా తాత-బామ్మలు  లేరు? అంతే కాదు...వాళ్ళింటికి అప్పుడప్పుడు బంధువులు వస్తూ ఉంటారట. మనకి మాత్రం ఎందుకమ్మా బంధువులే లేరు?"

ప్రశ్నలడుగుతున్న కొడుక్కి సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాక కూర్చుండిపోయింది తల్లి స్వర్ణ.

అమ్మ దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి పక్కింటి అబ్బాయితో ఆడుకొవడానికి వెళ్ళిపోయాడు విమల్.

లేవటానికి కూడా మనసొప్పక ఆలొచిస్తూనే కూర్చున్నది స్వర్ణ. ఆ రోజు కూడా సాయంత్రం ఏడుగంటలకు వచ్చిన భర్తకు కాఫీ కలిపిచ్చి పక్కనే కూర్చుంది.

"ఏమండీ..."

"చెప్పు స్వర్ణా "

"నేను ఈ  ఉద్యోగం మానేద్దామని నిర్ణయించుకున్నాను"

"ఏమీటి హఠాత్తుగా?"

"ఇద్దరం పనికి వెళ్ళటం వలన మనం విమల్ ను సరిగ్గా పట్టించుకోవటం లేదని నాకు అనిపిస్తోంది"

"ఏం....వాడు కరెక్టుగానే స్కూలుకు వెడుతున్నాడు కదా?"

"వాడు బాగానే ఉన్నాడు...మనమే సరిగ్గా లేమని అనిపిస్తోంది"

"ఎందుకు అదొలా మాట్లాడుతున్నావు?"

"చాలండి. డబ్బు డబ్బు అని తిరిగాము. వాడికి ఎలాంటి జీవిత పాఠం నేర్పించామో ఈరోజు తెలుసుకున్నాను"

స్వర్ణ కన్నీటితో మధ్యాహ్నం విమల్ మాట్లాడిందంతా చెప్పింది. ప్రశాద్ మనసు కూడా అల్లకళ్లొలమయ్యింది.

"స్వర్ణా... నిన్ను పనికి వెళ్ళమని నేనెప్పుడూ ఒత్తిడి చేయలేదు. కానీ, అంత పెద్ద చదువు చదువుకుని ఇంట్లో కూర్చోవాలంటే నీకు అదొలా ఉంటుందని అనుకుంటా"

"ఈ ఉద్యోగం మానేస్తానని మాత్రమే చెప్పాను...ఉద్యోగమే చేయనని చెప్పలేదే"

"నాకేమీ అర్ధం కావటం లేదు"

"మనింటి వెనుక వీధిలో ఉన్న ఒక స్కూల్లో నన్ను టీచర్ ఉద్యోగానికి రాగలరా అని అడుగుతూ ఉండే వారే?  ఆ ఉద్యోగానికి వెళ్దామని నిర్ణయించుకున్నాను"

"అక్కడికి వెడితే ఇప్పుడు తీసుకుంటున్న జీతంలో పది శాతం కూడా ఇవ్వరు"

"చాలండి సంపాదించింది. డబ్బు మాత్రమే జీవితం కాదు. డబ్బు వెనుక పరిగెత్తి పరిగెత్తి కొడుకు జీవితాన్ని నాశనం చేయద్దు. సాయంత్రం నాలుగింటికల్లా వచ్చేస్తాను. విమల్ ను చూసుకున్నట్టూ ఉంటుంది"

"నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వూ, వాడూ సంతోషంగా ఉంటే చాలు"

"అది మాత్రం కాదండి. మిమ్మల్ని కూడా సంతోషపడేలా చెయ్యబోతాం"

"ఏమిటి విషయం?"

"వృద్దాశ్రమంలో ఉన్న మీ అమ్మను ఇప్పుడే వెళ్ళి తీసుకొద్దాం"

" స్వర్ణా... నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ది కావటం లేదు. మా అమ్మంటే నీకు పూర్తిగా ఇష్టం లేదే. ఎప్పుడు చూడు అమెతో పోట్లాడుతూ ఉండే దానివి. సరే...అక్కడైనా ప్రశాంతంగా ఉండనీ అనే కదా ఆమెను అక్కడీకి తీసుకు వెళ్ళి వదిలేను"

"లేదండీ...ఇక మీదట అత్తయ్యతో గొడవ పెట్టుకోను, పడను. ఆమె నాకూ అమ్మే"

స్వర్ణకు ఇన్నిరోజులు విమల్ ను చూసుకోలేదనే బాధ.ఉద్యోగం,ఇల్లు, పనుల వలన ఏర్పడిన ఒత్తిడి—రెండూ ఒకేసారి దూరమైనట్లు అనిపించింది.

ఇక అమ్మ తనతో ఉండబోతోందనే సంతోషంతో ఆనందంగా బయలుదేరాడు ప్రశాద్. ఎప్పుడూ ధీనంగా మొహం పెట్టుకుని ఇంటికి వచ్చే విమల్ కు బామ్మను పిలుచుకురావటనికి అమ్మ-నాన్నతో తానూ వెళ్ళబోతున్నానని తెలుసుకున్నప్పుడు అతని మనసు అతనితో పాటూ ఎగిరి గంతులు వేసింది. వాడి మొహంలో ఎప్పుడూ లేని తేజస్సు కనబడింది.

ఇక ఆ ఇల్లు ఆనంద నిలయమే!

***********************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జంట పండ్లు…(కథ)

జాబిల్లీ నువ్వే కావాలి …(కథ)

మాతృ హృదయం...(కథ)