మూగ ప్రేమ…(కథ)
మూగ ప్రేమ (కథ)
రెండు నిండు ప్లాస్టిక్ కవర్లతో బయటకు వెళ్ళిన రఘు ఇంటికి తిరిగి వస్తునప్పుడు ఒక నిండు కవరుతో వచ్చాడు.
ఇంటి బయట తన పాత చెప్పులను వదిలిపెడుతూ ఇంటి తలుపుపై "శేఖర్...టైలర్" అని రాసున్న పాత చెక్క పలకను చూసి చిన్నగా నవ్వుకుని ఇంట్లోకి వెళ్ళాడు రఘు.
కొడుకు ఇంట్లోకి రావడం చూసిన శేఖర్ బట్టలు కుడుతున్న టైలరింగ్ మిషెన్ ఆపి "ఏరా రఘూ... యూనీఫాం బట్టలు ఇచ్చేసావా?" అని అడిగేడు.
"శంకరంగారింట్లో ఇచ్చేసాను...సూర్యంగారిళ్ళు తాళం వేసుంది. ఇదిగో వాళ్ళ బట్టలు" చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవరును పక్కనున్న టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగేడు రఘు.
"రఘూ...ఈ చొక్కాకి బొత్తాలు కుడతావా. ఈ బట్టలు ఈ రోజు డెలివరీ ఇస్తానని మాటిచ్చాను" శేఖర్ కొడుకుని అడిగేడు.
తండ్రి మాటలకు వెనక్కి తిరిగిన రఘు "స్నానం చేసొచ్చి కుడతాను" అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయేడు.
***********************************
వంటింట్లో తల్లి పెట్టిన టిఫెన్ తింటూ ఏదో ఆలొచిస్తున్నాడు రఘు.
కొడుక్కు మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ "త్వరగా తినరా...నాన్నగారు ఏదో పనిచెప్పారుగా" చెప్పింది తల్లి వేణి.
"త్వరగానే తింటున్నాను" చెప్పాడు రఘు.
అతని మాటలలో కోపం గ్రహించిన వేణి కొడుకును ఇంకేమి అనలేక వంటింట్లో సామాన్లు సద్దడంలో మనసు మళ్ళించింది.
"అమ్మా" అన్న రఘు పిలుపు విని వెనక్కి తిరగకుండానే "ఏవిట్రా" అన్నది వేణి.
“ఈ సంవత్సరం స్కూల్ కి కొత్త యూనీఫాం వేసుకుని వెళ్ళాలని ఆశగా ఉందమ్మా...నాన్నకి చెప్పి నాకు కొత్త యూనీఫాం కుట్టివ్వమని చెప్పవా" రఘు ఆశగా అడిగేడు తల్లిని.
"ఈ సంవత్సరం కుదరుదులేరా...వచ్చే సంవత్సరం తప్పకుండా కొత్త యూనీఫాం వేసుకు వెడుదువుగాని" కొడుకు వైపు తిరిగి చూసి మాట్లాడే ధైర్యం చాలక సామాన్లు సర్ధుతూనే చెప్పింది.
"ఇలా ప్రతి సంవత్సరం నువ్వు చెబుతూనే ఉన్నావు...నేనూ కొత్త యూనీఫాం వేసుకుని స్కూలుకు వెడుతున్నట్లు ప్రతి సంవత్సరం కలలు కంటూనే ఉన్నాను. కానీ నా కలలు, కలలుగానే మిగిలిపోతున్నాయి" రఘూ మాటల్లో దుఃఖము, బాధ కలిసున్నాయి.
అది గ్రహించిన రఘు తల్లి సామాన్లను సద్దటం ఆపి వెనక్కి తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి కూర్చుంది. "ఏం చేస్తాం చెప్పు...మన పరిస్థితి అలాంటిది...నీకు తెలుసు కదా రఘూ" కొడుకును బుజ్జగిస్తున్నట్లు చెప్పింది.
"నేనేమీ ఖరీదైన బట్టలు కొనమనడం లేదమ్మా... ఉన్నదాంట్లోనే అతి తక్కువ ధర గుడ్డ కొంటే చాలు.....ఏదో కొత్తవి వేసుకున్నానే ఆనందం కలిగితే చాలు" మెల్లగా చెప్పేడు రఘు.
"అది కొనడానికి కూడా మన దగ్గర వసతిలేదు కదా నాన్నా"
"స్కూలు తెరిచిన మొదటి రోజు పిల్లలందరూ కొత్త యూనీఫాం వేసుకొస్తారమ్మా. కొంతమంది పిల్లలైతే అందులోనే ఖరీదైనవి వేసుకొస్తారు. నా ఫ్రెండ్ వెంకట్ అయితే అత్యంత ఖరీదైనది, తలతలా మెరిసిపోయే బట్టలు వేసుకొస్తాడు. నేను కనీసం ధర తక్కువదైనా, కొత్తవి వేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. నాలుగు సంవత్సరాల నుండి ఒకే యూనీఫాం వేసుకేడుతున్నా. ఆవి చూడు రంగులే మారిపోయినై"
కొడుకు మాట్లాడుతున్నప్పుడు అతని కంఠం బొంగురు పోవడం గమనించిన తల్లి "నిజమేరా...కానీ ఏం చేయగలం చెప్పు. నిన్ను కాన్వెంట్లో చేర్చడానికే మీ నాన్న బ్రహ్మ ప్రయత్నం చేసేరు. రెకమెండేషన్ల కోసం ఎంతో మంది దగ్గర చేతులు కట్టుకు నిలబడ్డారు. ఆ తరువాత ఫీజులకోసం ఎన్నో సేవా సంఘాల వారి కాళ్ళు పట్టుకున్నారు. అందుకని ప్రతి సంవత్సరం కొత్త యూనీఫాం కొనగలరా చెప్పు" అన్నది.
"సరేలే"….ఎప్పుడూ తిన్న ప్లేటును, పెరట్లోకి తీసుకెళ్ళి కడిగి తిరిగి అలమార్లో పెట్టే అలవాటున్న రఘు ఆ రోజు ప్లేటులోనే చేతులు కడుక్కుని, ప్లేటును కూడా తీయకుండా లేచి తండ్రి ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు.
తండ్రి కుట్టి పడేసిన యూనీఫాం డ్రస్సులలో ఒకటి తీసుకుని బొత్తాలు కుట్టడం మొదలుపెట్టేడు. కుడుతూ అక్కడున్న, ఇంకా కుట్టని కొత్త యూనీఫాం గుడ్డల వైపు చూసేడు. కొన్నింటిని చేత్తో ముట్టుకుని ఆనందించేడు. ఇంతలో రఘూ కళ్ళు అక్కడున్న ఒక యూనీఫాం గుడ్డ మీద పడింది. తలతలా మెరిసిపోతున్న ఆ గుడ్డలను చేతిలోకి తీసుకుని "ఇది ఖచ్చితంగా వెంకట్ దే అయ్యుంటుంది" అనుకుంటూ ఆ గుడ్డను గుండెలకు హత్తుకుని, శరీరం మీద పెట్టుకుని ఒక్క నిమిషం తనని ఊహించుకున్నాడు.
అక్కడే మిషన్ కుడుతున్న రఘు తండ్రి శేఖర్ కొడుకును గమనించాడు. అతనికి కళ్ళ వెంబడి నీళ్ళు రావటంతో కుడుతున్న మిషెన్ను ఆపి కళ్ళు తుడుచుకున్నాడు.
కుట్టు మిషెన్ ఆగటంతో ఈ లోకానికొచ్చిన రఘు, తండ్రి కళ్ళు తుడుచుకోవడం గమనించి బొత్తాలు కుడుతున్న గుడ్డను పక్కన పెట్టి తండ్రి దగ్గరగా వచ్చి "ఎందుకు నాన్నా కంట తడిపెడుతున్నావు? నాకు కొత్త యూనీఫాంకొనివ్వలేకపోయావనా?...బాధ పడకు నాన్నా...మన పరిస్థితి నేను అర్ధం చేసుకోగలను" తండ్రిని సమాధానపరిచేడు.
"లేదురా...నువ్వు ఇందాక మీ అమ్మతో కొత్త యూనీఫాం గురించి మాట్లాడుతున్నప్పుడు విన్నాను...ఇప్పుడు ఆ కొత్త డ్రస్సులు చూసి నువ్వు పడుతున్న బాధ తెలుసుకున్నాను. అర్ధం చేసుకున్నాను. అప్పు చేసైనా ఈ సంవత్సరం నీకు కొత్త యూనీఫాం కొని ఉండాల్సింది. నీ పాత యూనీఫాం రంగే మారిపోయింది. స్కూల్లో టీచర్లు నిన్నేమంటారో... దానికి నువ్వు ఏం సమాధానం చెబుతున్నావో, వీటన్నిటి గురించి, నీ గురించి నా కెందుకు ఆలొచనే రాలేదు అనుకున్నా... ఏడుపు వచ్చేసిందిరా”
"అదా...ఏదో అప్పుడున్న ఆవేశంలో అలా మాట్లాడేను...నువ్వేమీ పట్టించుకోకు. నాకెలాంటి బాధలేదు నాన్నా...నీ దగ్గర డబ్బులున్నప్పుడే కొనిపెట్టు...నాకు కొనిపెట్టలేకపోయేవే అని బాధ పడకు...అలా బాధ పడుతూ ఉంటే కుట్టడంలో తేడా వస్తుంది" అని చెప్పేసి తండ్రి కుట్టి క్రింద పెట్టిన కొన్ని గుడ్డలను తీసుకుని "వంటింట్లో కూర్చుని కుట్టుకొస్తా"...తను అక్కడుంటే తండ్రి తన గురించే ఆలొచిస్తాడని రఘు వంటింట్లోకి వెళ్ళాడు.
తీసుకొచ్చిన గుడ్డలను నేల మీద పెడుతూ "ఎంత పోరపాటు చేసేను. ఇంటి పరిస్థితులు తెలిసుండి కూడా నాకు తెలియకుండానే అమ్మతో అంత గట్టిగా మాట్లాడి పెద్ద తప్పు చేసేను....అమ్మా, నాన్నలని బాధకు గురిచేసేను...నన్ను క్షమించు నాన్నా" అనుకుంటూ బొత్తాలు కుట్టడానికి నేల మీద కూర్చున్నాడు రఘు.
***********************************
వంటింట్లో నుండి భర్త ఉండే గదికి వచ్చిన వేణి, భర్త కుట్టి పెట్టిన మరికొన్ని డ్రస్సులు తీసుకుని అక్కడే నేల మీద కూర్చుని వాటికి బొత్తాలు కుట్టటం మొదలు పెట్టింది.
"చూసావా వేణీ...కష్టాలు పిల్లలను పెద్ద వాళ్ళని చేస్తాయన్న మాట...రఘూ చూడు ఎంత పెద్ద మనిషి తరహాతో మాట్లాడేడో...కొత్త యూనీఫాం మీద మనసులో విపరీతమైన ఆశ, వేసుకోలేకపోతున్నామే అనే బాధ ఉన్నా వాటిని నా దగ్గర బయట పడనీయకుండా ఎలా మాట్లాడేడో విన్నావా?...నీతో ఇందాక కొత్త యూనీఫాం గురించి మాట్లాడింది ఏదో అప్పుడున్న ఆవేశంలోనట...వాడి మాటల్ని పట్టించుకోవద్దని నన్ను సముదాయిస్తున్నాడు" మిషెన్ కుడుతూనే భార్య వేణీతో చెప్పాడు శేఖర్.
"వాడి గురించి మీకు తెలియదా ఏమిటి? నాలుగేళ్ళ నుండి యూనిఫామే కాదు పుస్తకాలు, బూట్లు, రోజువారి బట్టలు, సంచీ అన్నీ పాతవే కదా వాడుతున్నాడు...ఏరోజైనా బయటపడ్డాడా? ఎప్పుడైనా మీ దగ్గరకొచ్చి నాకు కొత్త బట్టలు కొనివ్వండని అడిగేడా?...వాడి మనసు నాకు బాగా తెలుసండి...వాడికి మన ఆర్ధీక పరిస్థితి బాగా తెలుసు...వాడిది మూగ ప్రేమండి...త్వరగా బయటపడడు...వాడు మనుష్యులలో ప్రేమను వెతుక్కుంటాడు...పాత వాటిల్లోనే కొత్త జీవితం వెతుక్కుంటాడు" చెప్పింది వేణి.
కుడుతున్న కుట్టు మిషన్ను ఆపి "నిజమేనే...ఇంత మంచి, అర్ధంచేసుకునే పిల్లవాడిని కనడం మనం చేసుకున్న అద్రుష్టం...అలాంటి వాడు మనింట్లో పుట్టడం వాడి దురద్రుష్టం" అని చెప్పి మళ్ళీ కుట్టు మిషన్ను తొక్కడం మొదలు పెట్టేడు.
ఇద్దరూ పనిలో లీనమయ్యేరు.
కుట్టి ముగించిన బట్టలను తీసుకుని వంట గదిలో నుండి తండ్రి దగ్గరకు వచ్చేడు రఘు. వాటిని తండ్రి ముందు ఉంచి "ఈ రోజు నా ఫ్రెండ్ వెంకట్ పుట్టినరోజు...తప్పకుండా రమ్మన్నాడు...ఈ హాడావిడిలో టైము చూసుకోలేదు. నేను వెంకట్ ఇంటికి వెళ్ళొస్తా" అని తండ్రికి చెప్పి, ఒక్క నిమిషంలో ముఖం కడుక్కుని, వేసుకున్న బట్టలతోనే వెంకట్ ఇంటికి బయలుదేరాడు రఘు.
***********************************
వెంకట్ భర్త్ డే ఫంక్షన్ నుండి తిరిగి వచ్చిన రఘు తిన్నగా వంట గదిలోకి వెళ్ళి(అదే అతని బెడ్ రూం కూడా)తన చాప వేసుకుని పడుకున్నాడు.
"భోజనం చేసి పడుకోరా" అన్నది ఆ గదిలోనే ఉన్న అతని తల్లి.
"వద్దమ్మా...నాకు కడుపు నిండుగా ఉంది...భర్త్ డే పార్టీలో వెంకట్ దగ్గరుండి బోలెడు ఐటెంస్ తినిపించేడు. వద్దన్నా ఐస్ క్రీం రెండుసార్లు తినిపించేడు" అని తల్లితో చెప్పి ఒక పక్కకు తిరిగి కళ్ళుమూసుకున్నాడు.
రఘూకి ఇట్టే నిద్దర పట్టేసింది.
"నేను బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలి. చేతి నిండా సంపాదించాలి. మంచి మంచి డ్రస్సులు కొనుక్కోవాలి. కేకులు కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి" నిద్రలో కలవరిస్తున్న రఘూ బుగ్గలపైన ముద్దు పెట్టుకుని వాడి పక్కనే పడుకుంది రఘూ తల్లి.
***********************************
మరుసటి రోజు ప్రొద్దున "రఘూ...రఘూ" అంటూ కొడుకును లేపాడు తండ్రి శేఖర్.
"ఏమిటి నాన్నా" కళ్ళు నలుపుకుంటూ అడిగేడు రఘు.
“రెండు రోజుల్లో స్కూలు తెరుస్తారు కదా...కుట్టిన యీనీఫాములను డెలివరీ చేయడానికి వెళ్ళాలి. అమ్మ ప్రొద్దున్నే గుడికి వెళ్ళింది. నేను స్నానం చేసి బయలుదేరుతాను...నేను వెళ్ళిన తరువాత గొళ్లేం పెట్టుకోవాలి...లేస్తావా" అన్నాడు రఘు తండ్రి.
"అలాగే" అంటూ లేచి కూర్చున్నాడు రఘు.
భుజం మీదున్న టవల్ను చేత పుచ్చుకుని స్నానానికి వెళ్ళేడు శేఖర్.నిద్రలో నుండి లేచిన రఘు చాప చుడుతూ "అవును...ఎల్లుండే స్కూల్ తెరిచేది...అయినా అది ఎప్పుడు తెరిచినా మనకు ఒకటే...అదే పాత యూనీఫాం, అదే పాత స్కూల్ బ్యాగు, అదే పాత బూట్లు...ఈ రోజు తెరిచినా మనం రెడీయే" అనుకుంటూ చుట్టిన చాపను గది చివర్లో ఉంచి ముందు గదిలోకి వచ్చేడు.
గదిలో పది నిండు కవర్లు కనబడ్డాయి. కవర్ల దగ్గరకు వెళ్ళేడు. కుట్టి ముగించిన యూనిఫాములను వేరు వేరు కవర్లలో పెట్టి వాటి మీద పేర్లు రాసున్నాయి. రఘు ఒక్కొక కవరు మీద రాసున్న పేర్లను చదువుకుంటూ ఒక కవరు దగ్గర చూడటం ఆపేడు. ఆ కవరు మీద వెంకట్ అని రాసుండటమే దానికి కారణం. ఆ కవరును చేతిలోకి తీసుకున్నాడు. కవరులోని యూనీఫాం డ్రస్సును బయటకు తీసేడు. ఆ డ్రస్సు వాసనను ఒక సారి పీల్చుకున్నాడు. తండ్రి వస్తున్న చప్పుడు విని నలిగిపోకుండా ఆ డ్రస్సును మళ్ళీ ఆ కవరులోనే ఉంచి, , తండ్రి కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు.
శేఖర్ రెండు పెద్ద సంచులలో అక్కడున్న కవర్లను పెట్టుకుని "వెళ్ళొస్తా రఘూ...గొళ్ళెం పెట్టుకో" అని కొడుకుకు చెప్పి సంచీలు పుచ్చుకుని బయటకు వెళ్ళేడు.
తండ్రి వెళ్ళిన తరువాత తలుపుకు గొళ్ళెం పెట్టి ముఖం కడుక్కోవడానికి బాత్ రూం వైపుకు వెళ్ళేడు రఘు.
***********************************
ఆ రోజు స్కూల్ తెరుస్తున్నారు. పాత యూనీఫాం వేసుకుని, పాత బూట్లు వేసుకుని, పాత సంచీ తగిలించుకుని స్కూలుకు బయలుదేరేడు రఘు.
స్కూలుకు చేరుకున్న రఘూకి చాలామంది పిల్లలు కనిపించేరు. చాలామంది కొత్త యూనీఫాం డ్రస్సులతో కనిపించేరు. కొంత మంది పాతవి వేసుకున్నా అవి రంగులు పోకుండా బాగానే ఉన్నాయి. తాను వేసుకున్న యూనీఫాం డ్రస్సును ఒక సారి చూసుకున్నాడు. వాడి మనసు వాడిని కలతకు గురిచేసింది. వేసుకున్న యూనీఫాం డ్రస్సు శుభ్రంగా ఉన్నా, వెలిసిపోయిన రంగుతో అవి ఎంత పాతవో ఎవరైనా అర్ధం చేసుకోగలరు. "ముందే స్కూలుకు వెడితే...ఏం రఘూ ఈ సంవత్సరం కూడా పాత డ్రస్సేనా అని ఎగతాలి చేస్తారే" అన్న ఆలొచన రాగానే స్కూల్ బెల్ కొట్టిన తరువాత లోపలకు వెడదామని నిర్ణయించుకున్నాడు రఘు.
స్కూల్ బెల్లు కొట్టనే కొట్టింది. మెల్లగా స్కూల్లోకి వెళ్ళిన రఘు తిన్నగా ప్రార్ధనా గీతంలో పాల్గొన్నాడు.
అందరూ ప్రార్ధన చేసేరు.
ప్రార్ధన పూర్తి కాగానే స్కూల్ ప్రిన్సిపల్ మైకు దగ్గరకు వచ్చింది. "డియర్ స్టూడెంట్స్...ఈ రోజు స్కూలుకు సెలవు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే మన స్టూడెంట్ వెంకట్ యాక్సిడెంట్లో చనిపోయేడు. అతని ఆత్మ శాంతించాలని అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి వెళ్ళిపోవచ్చు" చెప్పింది ప్రిన్సిపల్.
షాక్ తిన్నాడు రఘు. కళ్ళ వెంట నీళ్ళతో అలాగే మౌనంగా నిలబడిపోయేడు. రెండు నిమిషాలు కాగానే అందరూ తిరిగి వెళ్ళిపోయేరు. రఘు తిరిగి వెళ్ళడానికి పది నిమిషాలు పట్టింది. కళ్ళు తుడుచుకుంటూ ఇంటిదారి పట్టేడు రఘు.
***********************************
నిదానంగా, నీరసంగా ఇంట్లోకి వచ్చిన రఘు సంచీని కూడా గోడకు తగిలించకుండా గోడకానుకుని చతికిలపడిపోయేడు. కుడుతున్న కుట్టు మిషెన్ను ఆపి కొడుకు దగ్గరకు వచ్చేడు శేఖర్.
"రఘూ...నీ ఫ్రెండ్ వెంకట్ చనిపోయేడటగా...నాకూ ఇందాకే తెలిసింది...కుట్టిన యూనీఫాంలను ఇద్దామని నిన్న, మొన్న వెంకట్ వాళ్ళింటికి వెళ్ళేను. ఇళ్లు తాళం వేసుంది. ఊరు వెడుతున్నామని అంతకు ముందు నాతో చెప్పేరు. స్కూలు తెరుస్తున్నా ఇంకా రాలేదిమిటా అని అనుకున్నా...ఏదో ఆలస్యం అయ్యుంటుదని అనుకున్నా గానీ...ఇలా అవుతుందని అనుకోలేదు"
“ఈ రోజు స్కూలు తెరుస్తున్నారు కదా, ఖచ్చితంగా వచ్చుంటారని, ప్రొద్దున్నే వాళ్ళింటికి వెళ్ళేను. ఇళ్లు తెరిచుంది. హమ్మయ్య అనుకుంటూ లోపలకు వెళ్ళేను. నన్ను చూడగానే వెంకట్ తల్లి భోరుమని ఏడవడం మొదలెట్టింది. ఏమై వుంటొదో అనుకుంటూ అక్కడే కుర్చీలో మౌనంగా కూర్చున్న వెంకట్ తండ్రి వైపు చూసేను. ఆయన విషయం చెప్పి వెక్కి వెక్కి ఏడ్ఛేడు. ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతోందో నాకు అర్ధం కాలేదు. వాళ్ల చుట్టాలాయన అనుకుంటా "ఇదిగో బాబూ" అంటూ నన్ను భుజం పట్టుకుని ఊపేడు. నాకూ ఏడుపు ఆగలేదు. వాళ్ళని ఎలా పలకరించాలో నాకు అర్ధం కాలేదు. ఎలాగొలా ఏడుపు ఆపుకుని “ఇవిగోనండమ్మా...వెంకట్ స్కూల్ యూనీఫాం” అంటూ కవరు అందించేను. వాళ్ళమ్మ ఇంకా వెక్కి, వెక్కి ఏడ్చింది కానీ నా దగ్గర యూనీఫాం బట్టలు తీసుకోలేదు. “వెంకట్ ఇక లేడు...ఈ యూనీఫాంతో ఇక పనిలేదు" అన్నాడు వెంకట్ నాన్న.
“మా వెంకట్ ఎప్పుడూ మీ అబ్బాయి గురించే చెబుతుండేవాడు. రఘు చాలా మంచి వాడు, మంచి స్నేహితుడు అంటూ తెగ పొగిడేవాడు. వాడికి యూనిఫాం లేదని మా చేత రఘుకి కూడా ఒక జత కొనిపించేడు...ఈ విషయం రఘూకి సర్ ప్రైజ్ గా ఉండాలని, తన పుట్టిన రోజు నాడు రఘూ వచ్చినా చెప్పలేదు. స్కూల్ తెరిచే ముందు రోజు వాడింటికి వెళ్ళి ఇచ్చొస్తా నని చెప్పేడు.అందులో ఒక జత మీవాడికే...వెంకట్ ఇక లేడు. వాడి యూనీఫాంలను కూడా రఘూకి ఇవ్వండి. వాడి మనసు శాంతిస్తుంది” అన్నది వెంకట్ తల్లి.
“ఇంకేదైనా మాట్లాడితే వాళ్ళు మరింత బాధ పడతారని కవర్లు తీసుకుని తిరిగి వచ్చేసేను" అని చెప్పి, టేబుల్ మీద వెంకట్ అని రాసున్న కవర్ చేతిలోకి తీసుకుని...“నువెప్పుడూ కొత్త యూనీఫాం బట్టల మీద ఆశపడుతూంటావుగా...నీ మూగ భాష నీ ఫ్రెండుకు అర్ధమయ్యిందనుకుంటా...ఒక జత నీకని కుట్టించేడు...అవిగాక మరో రెండు జతలు ఇందులో ఉన్నాయి...తీసుకో" అంటూ ఆ కవరును కొడుకుకు అందించేడు శేఖర్.
తండ్రి చేతిలోని కవరును వేగంగా లాక్కుని, అదే వేగంతో పక్కన పారేస్తూ "నాకు ఈ కొత్త యూనీఫాం బట్టలు వద్దు...నాకు వెంకటే కావాలి" అంటూ తాండ్రిని కౌగలించుకుని బోరుమని ఏడ్చేడు రఘు.
శేఖర్ కళ్ళు చెమర్చేయి “తప్పైపోయింది రఘు...కొత్త యూనీఫాం మోజులో ఉన్నావని ఈ కవరుఅందించేను. కొత్త బట్టలపై నీకున్న మోజుకన్నా వెంకట్ స్నేహమే గొప్పదని నువ్వూ, తన యూనీఫాం బట్టలతోపాటూ నీకూ ఒక యూనీఫాం కుట్టించిన వెంకట్ వి మూగప్రేమలురా.....దాన్ని అర్ధం చేసుకోవటం ఎవరి తరము కాదురా...వెంకట్ మీద నీకున్న పవిత్రమైన ప్రేమను తప్పుగా అర్ధం చేసుకున్నాను. నన్ను క్షమించు” అంటూ తాను కూడా దుఃఖంలో మునిగిపోయేడు శేఖర్.
*************************************************సమాప్తం****************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి