తలవంపు...(కథ)

 

                                                                              తలవంపు                                                                                                                                                                                             (కథ)

"అయ్యగారండీ...అయ్యగారండీ" అని ఇంటి బయట నుండి కేకలు వినబడటంతో, చదువుతున్న పేపర్ను పక్కన పడేసి, కూర్చున్న ఈజీచైర్ లో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు కేశవరావ్.

వాకిట్లో నడుం చుట్టూ తుండు కట్టుకుని నిలబడున్న పనివాడు కనిపించాడు.

"ఏవిట్రా అరుపులు...ఏదో కొంపలు మునిగిపోయినట్లు"

"అవునండయ్యా...నిజంగానే మన కొంప మునిగిందయ్యా. మన చిన్నయ్యగారు నూకాలమ్మ కూతురితో రైలు స్టేషన్లో కనిపించారండి "

"ఏవిట్రా వాగుతున్నావ్" కళ్ళు పెద్దవి చేసాడు కేశవరావ్.

నే సెప్పేది నిజమేనండయ్యా...నా కళ్ళారా చూసానయ్యా. ఇద్దరి సేతుల్లోనూ సూటు కేసులున్నాయండయ్యా... ఇషయాన్ని మీకాడ సెప్పాలని ఎంటనే లగెత్తుకుని ఈడకొచ్చానయ్యా"

"సావిత్రీ" అంటూ పెద్దగా అరిచాడు కేశవరావ్.

"ఏమిటండీ అలా అరిచారు!" వంటగదిలోనుండి పరిగెత్తుకొచ్చిన కేశవరావ్ భార్య సావిత్రి భర్తను చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది.

"కిష్టుడు గదిలో ఉన్నాడో లేడో చూడు" భార్యను ఆదేశించాడు కేశవరావ్.

"గదిలోనే ఉంటాడు...నిద్రలో నుండి ఇంకా లేచుండడు" చెప్పింది సావిత్రి.

"చెప్పింది చెయ్యి" భార్యను గదమాయించాడు కేశవరావ్.

వెంటనే పరుగు లాంటి నడకతో మేడపైకి వెళ్ళింది సావిత్రి. కొడుకు క్రిష్ణా రావ్ గది తలుపును రెండు సార్లు తట్టింది. మూడోసారి గది తలుపు మీద తట్టినప్పుడు తలుపులు కొంచంగా తెరుచుకున్నాయి. దాంతో సావిత్రిలో భయం పుట్టుకొచ్చింది. ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళి చూసింది. కొడుకు మంచం మీద లేడు. బాత్ రూములో ఉన్నాడేమోనన్న అనుమానంతో అటు తిరిగింది. బాత్ రూము తలుపు తెరిచే ఉంది. బాత్ రూములో కూడా కొడుకు కనిపించకపోయేసరికి సావిత్రి గుండె గుభేలుమంది.

కొడుకు గదిలో నుండి పరుగులాంటి నడకతో బయటకు వచ్చి "కిష్టుడు రూములో లేడండి" మేడపై నుండే భర్తకు వినబడేలా చెప్పింది సావిత్రి. ఆమె గొంతులో వొణుకు చోటుచేసుకోవటం ఎవరికైనా అర్ధమైపోతుంది.

భార్య మాట వినగానే నెత్తిమీద బరువు పడినట్లు పక్కకు ఒరిగిన కేశవరావ్ పడిపోకుండా ఉండటానికి దగ్గరున్న గుమ్మాన్ని పట్టుకున్నాడు. "ఎంత పనిచేసాడు!...కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకు వచ్చాడే...గౌరవంగా బ్రతుకుతున్న నన్ను తలవంచుకునేలా చేసాడే" అనుకుంటూ కుంగిపోతూ పక్కనున్న గుమ్మం మీద కూర్చుండిపోయాడు.

"ఏమైందండీ...ఎప్పుడూ మీసాలు తిప్పుకుంటూ గంభీరంగా ఉండే మీరు...ఇలా డీలా పడి కూర్చున్నారు" భర్త దగ్గరకు వచ్చిన సావిత్రి కేశవరావ్ ను చూసి అడిగింది.

"నీ కొడుకు చేసిన ఘనకార్యమే"

"ఏం చేసాడండి"

"ఏం చేసాడని నిదానంగా అడుగుతావేం...మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకొచ్చే నీచమైన పని చేసేడే నీ కొడుకు... ఊళ్ళో నన్ను తల దించుకునేలా చేసాడు"

"అదే ఏం చేసాడని అడుగుతున్నా"

" నూకాలమ్మ కూతురితో ఊరు వదిలి వెళ్ళిపోయాడు...రైల్వే స్టేషన్లో వాలిద్దరినీ సూట్ కేసులతో చూసాడట మన ఏకాంబరం" అంటూ లేచి నిలబడి మనసుని ద్రుడం చేసుకుంటూ, మీసాలు మెలేస్తూ "వదలను...కుటుంబ గౌరవానికి కళంకం తీసుకు వచ్చిన వాడిని వదలను. కులం తక్కువ దానితో కులకటానికి ఇన్నేళ్ళు పెంచి పోషించిన తల్లితండ్రులనే వదులుకుంటాడా?...కుల గౌరవాన్ని, పెద్దవాళ్ళని తలవంచుకునేలా చేయడానికా వాడు చదువుకుంది? వదలను...వదలను...మనకూ, మన కుటుంబ గౌరవానికీ తలవంపులు తీసుకు వచ్చిన వాడ్ని వదలను" ఎర్ర బడ్డ కళ్ళతో అటూ ఇటూ తిరుగుతూ పూనకం వచ్చినవాడిలా చిందులు వేసాడు కేశవరావ్.

పని వాళ్ళు, విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు అప్పుడే కేశవరావ్ ఇంటి ముందు గుమికూడారు.

"ఏవండీ...మీరు ఆవేశపడకండి...మీ ఆరోగ్యం దెబ్బతింటుంది" భయపడుతూ చెప్పింది భార్య సావిత్రి.

"ఆవేశపడకుండా ఎలా ఉండనే...నీ కొడుకు చేసిన పనిని సమర్ధించమంటావా? లేక ఇంట్లో నుండి కులం తక్కువ దానితో ఊరు వదిలి పారిపోయి మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకు వచ్చిన పిరికివాడిని మన్నించమంటావా?...వదలనే...వాడిని, దానిని ఇద్దరినీ వదలను..." పూనకం వచ్చినవాడిలా ఊగిపోయాడు కేశవరావ్.

"వదలద్దండి...వాడిని వదిలేయమని నేనటంలేదు. మీరు ఆవేశం తగ్గించుకుని...ఏం చేయాలో నిదానంగా ఆలోచించమని చెబుతున్నాను" అన్నది సావిత్రి.

మాటకు కొంచం శాంతించిన కేశవరావ్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

అక్కడ గుమికూడిన వారందరూ తమ తమ పనులకు వెళ్ళిపోయారు.

                                                                     ************************************

రైలులో వస్తున్న వాళ్ళని తీసుకు వెళ్ళడానికి కేశవరావ్ మరియూ అతని నమ్మిన బంటు చెంచలయ్య రైల్వే ప్లాట్ ఫారం మీద నిలబడున్నారు.

గౌతమీ ఎక్స్ ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫారంలోకి వచ్చి ఆగింది.

అందులో నుండి క్రిష్ణా రావ్, అతనితో పాటు హేమ దిగారు. దిగిన వెంటనే వారిద్దరికీ కేశవరావ్, చెంచలయ్య కనిపించారు. వారిద్దరినీ చూసి ఆశ్చర్యపోయిన క్రిష్ణా రావ్, హేమలకు చెమటలతో పాటు గుండె ధడ ఒక్కసారిగా పట్టుకున్నాయి.

"రా క్రిష్ణా...ఎలా ఉన్నావు. ఆరు నెలలో ఇంత చిక్కిపోయేవేం.....సరే రా...ఇంటికి వెడదాం. మీ ఇద్దరినీ ఊరికి రప్పించటానికే నూకాలమ్మకు యాక్సిడెంట్ అని అబద్దం చెప్పాను. మీరూ వచ్చాసారు. బయట కారు నిలబడుంది...వచ్చి ఎక్కు" కొడుకు క్రిష్ణా రావును చూస్తూ, మీసాలు తిప్పుకుంటూ, చిరు మందహాసంతో అతని ఎదురుగా వెళ్ళాడు కేశవరావ్.

"నాన్నా...హేమ..." అని చెప్పి ముగించేలోపు క్రిష్ణా రావ్ చెంప చెల్లు మనేలా గట్టి దెబ్బ వేసాడు తండ్రి కేశవ రావ్. కొడుకు గొంతు వెనుక తన బలమైన చేతులు వేసి అతన్ని తోసుకుంటూ రైలు స్టెషన్ బయటకు వచ్చాడు. అక్కడ నిలబడున్న కారు తలుపులు తెరుచుకున్నాయి. క్రిష్ణా రావును అందులోకి తోసి బంధించాడు కేశవరావ్.

కారు తమ ఊరి వైపు వెళ్ళే రోడ్డు ఎక్కింది.

                                                                 ************************************

రైల్వే స్టేషన్లో తన కళ్ళెదుట జరింగింది చూసి పిచ్చెక్కిన మనిషిలా నిలబడిపోయింది హేమ. తన కళ్ళెదుటే తన భర్త క్రిష్ణారావును అతని తండ్రి కొట్టి లాక్కు పోవడం ఆమె మనసును కలవర పెట్టింది. "ఏం చెయ్యాలి...ఇప్పుడేం చేయాలి" అనుకుంటున్న హేమకు తాను ఏమీ చేయలేనని అర్ధమవడానికి పది నిమిషాలు పట్టింది. మనుష్యులే లేని చిట్టడవిలో వదిలిపెట్టబడ్డ అనాధలాగా ప్లాట్ ఫారంపై నిలబడింది.

తల్లికి ఏమీ అవలేదనే తృప్తి ఆమె మనసును శాంత పరుస్తున్నా...కడుపులో శిశివుతో ఇంటికి వెడితే తల్లి ఒప్పుకుంటుందా? ఆరు నెలల క్రింద తల్లికి చెప్పకుండా క్రిష్ణారావుతో ఊరు వదిలి వెళ్ళిపోవటం, తల్లికి యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే తిరిగి ఊరికి వచ్చిన తనకు రైల్వే స్టేషన్లో జరిగిన అవమానం ఆమె కళ్ళెదుట మారి మారి వస్తుంటే హేమకు ఏడుపు ఆగలేదు. తన భవిష్యత్తు, తన బిడ్డ భవిష్యత్తు గురించిన ఆలొచన రాగానే కళ్ళు తుడుచుకుని బస్ స్టేషన్ కు వెళ్ళింది. బస్సులో ఎక్కి కూర్చుంది. బస్సు బయలుదేరింది.

భర్త క్రిష్ణారావ్ ఎలకల బోనులో చిక్కుకున్నట్లు అతని తండ్రి దగ్గర దొరికిపోయిన సంఘటన ఆమె మనసు నుండి దూరమవడానికి నిరాకరించింది. క్రిష్ణారావ్ చెంప మీద చెల్లు మని పడిన దెబ్బ, తన చెంప మీద పడినట్టు చెంపంతా నొప్పి పుట్టింది.

బస్సు దిగేటప్పటికి చీకటి పడింది. ధైర్యం తెచ్చుకుంటూ తన గుడిసెవైపుకు వెళ్ళింది. గుడిస ముందు నిలబడి "అమ్మా" అని పిలిచింది.

ఎవరై ఉంటారనుకుంటూ ఇంటి బయటకు వచ్చిన నూకాలమ్మకు కూతురు హేమ కనబడటంతో కొయ్యబారి నిలబడిపోయింది. ఆరు నెలల కిందట తనతో చెప్పకుండా, క్రిష్ణారావ్ తో ఊరు వదిలి పారిపోయిన కూతురు ఇప్పుడు కడుపులో బిడ్డతో తిరిగి రావటం...నూకాలమ్మ జీర్ణించుకోలేకపోయింది. ఇంట్లోకి రమ్మనాలా...లేక తిరిగి వెళ్ళిపొమ్మనాలా? కన్న ప్రేమ కూతుర్ని తిరిగి వెళ్ళమని చెప్పగలదా?...హేమ చేతులు పుచ్చుకుని ఇంట్లోకి తీసుకు వెళ్ళింది. నులక మంచం మీద కూర్చున్న హేమకు మంచినీళ్ళు ఇచ్చి, ఆమె దగ్గరగా నేలపై కూర్చుంది నూకాలమ్మ.

"నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు, నువ్వెక్కడికి వెళ్ళావో, ఎందుకు వెళ్ళిపోయావో తెలియక నా మనసు ఎంత గిలగిలా కొట్టుకుందో తెలుసా. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్న నాకు ఏడుకొండలు వచ్చి జరిగిన విషయం చెప్పటంతో నా గుండె జారిపోయింది. నిమిషంలో ఏం కబురొస్తుందో, లేక కేశవరావ్ మనుష్యులు వచ్చి నన్నేం చేస్తారో నన్న భయం నాలో జ్వరం తీసుకు వచ్చింది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేదు. రెండు రోజులైనా ఎవరూ రాకపోయేసరికి మనసు కొంచం కుదటపడింది. కానీ భయం పోలేదు...కేశవరావ్ ఎందుకు వూరికే ఉన్నాడు?...లేదు...ఏదో ప్లానులొ ఉండే ఉంటాడని అనిపించింది...మీరెక్కడున్నా వెతికి పట్టుకుని చంపేస్తాడని మాత్రం అర్ధమయ్యింది. ఇన్నిరోజులూ ఏం కబురు వస్తుందో ననే భయంతోనే గడిపాను. కానీ నువ్విలా ప్రాణాలతో తిరిగొస్తావని నేను కలలో కూడా అనుకోలేదు...అసలేం జరిగింది చెప్పు" తలవంచుకుని ఏడుస్తునే ఉన్న కూతురు హేమను అడిగింది.

కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా తల్లితో చెప్పింది హేమ.

"సరే...జరిగిందేదో జరిగిపోయింది. నీ తలరాత ఎలా రాసుందో అలాగే జరుగుతుంది...దాన్నెవరూ మార్చలేరు. కానీ ఇంకేదో చేసేద్దామని మాత్రం మరో కొత్త ఆలొచన పెట్టుకోకు. మన మేమిటో, మన కులమేమిటో, సంఘంలో మన స్థానమేమిటో అర్ధం చేసుకుని ఈసారన్నా తెలివిగా ప్రవర్తించు...నేను బ్రతికున్నంతవరకూ నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతాను...ఆలేస్యమైంది...భోజనం చేసి పడుకో" అన్నది నూకాలమ్మ.

తల్లిప్రేమను అర్ధంచేసుకున్న హేమ "అమ్మా...నన్ను క్షమించు" అంటూ తల్లి కాళ్ళమీద పడ్డది. కూతుర్ని లేపి అభయంగా తన హృదయానికి హత్తుకుంది నూకాలమ్మ.

రాత్రంతా ఏడుపుతో గడిపింది హేమ.

                                                                       ************************************

మరుసటి రోజు ప్రొద్దున పెరట్లో పాత్రలు కడుగుతోంది నూకాలమ్మ.

"నూకాలమ్మా...నూకాలమ్మా"…ఎవరో తనని పిలుస్తున్నారని, కడుగుతున్న పాత్రను పక్కన పడేసి, చేతులు కడుక్కుని ఇంటి బయటకు వచ్చింది నూకాలమ్మ.

"అయ్యగారు నిన్ను పిలుచుకు రమ్మన్నారు " చెప్పాడు ఏకాంబరం.

నూకాలమ్మ వొళ్ళు జలదరించింది. చీర కొంగుతో మొహం మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ "వస్తున్నా...నువ్వు ముందు పద" అన్నది.

"లేదు...దగ్గరుండి తీసుకురమ్మన్నారు" చెప్పాడు ఏకాంబరం.

"సరే ఉండు...ఒక్క నిమిషంలో వస్తాను" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి, దేవుడి ఫోటోకు దణ్ణం పెట్టుకుని ఇంటిబయటకు వస్తుంటే "నేనూ రానా" కూతురు హేమ అడిగింది.

"వద్దు...నిన్ను రమ్మని చెప్పలేదు. నే వెళ్ళొస్తా...నువ్వు జాగ్రత్త" కూతురు జవాబుకు ఎదురు చూడకుండా బయటకు వచ్చి, ఏకాంబరాన్ని చూసి "పద" అంటూ బయటకు నడిచింది.

కేశవరావ్ ఇంటి దగ్గరకు వెడుతుంటే నూకాలమ్మ కాళ్ళలో వొణుకు మొదలయ్యింది.నెమ్మదిగా

నడుచుకుంటూ కేశవరావ్ ఇంటి గేటుదాటి కాంపౌండ్ లోపలికి వెళ్ళింది. అక్కడ కేశవరావ్ తో పాటు చెంచలయ్య, మరో ఇద్దరు ఊరి పెద్దలు కుర్చీలేసుకుని కూర్చోనున్నారు. చుట్టూ జనం ఉన్నారు. నూకాలమ్మను చూసిన వెంటనే గుమికూడిన జనం పక్కకు తప్పుకుని ఆమెకు దోవ వదిలేరు.

నేరారోపణ మోపబడిన ఒక ఖైదీలాగా, వాళ్ళముందుకు వెళ్ళి, నేరస్తులు బోనులో నిలబడే విధంగా తలదించుకు నిలబడింది నూకాలమ్మ.

"నూకాలమ్మా...జరిగిందేదో జరిగిపోయింది. నా కొడుకు నీ కూతుర్ని లేపుకుపోయేడని నేను చెప్పను...నీ కూతురే నా కొడుకును లేపుకుపోయింది. ఏది ఏమైనా నీ కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా కొడుకు కారణం అయ్యాడు...కానీ, నా కొడుకు నీ కూతురి మెడలో తాలి కట్టలేదు...రిజిస్టర్ మ్యారేజీ చేసుకోలేదు. అందువలన విడాకులకు అవసరంలేదు. అయినా సరే నేను యాబై వేల రూపాయలు డబ్బిస్తాను. తీసుకు వెళ్ళు...నీ కూతురు నా కొడుకును మర్చిపోవాలి" చెప్పాడు కేశవరావ్.

తలెత్తి కేశవరావును చూసే ధైర్యం లేక, తల దించుకునే కొంగుతో కళ్లు తుడుచుకుంటూ మౌనంగా నిలబడింది నూకాలమ్మ.

"ఏం...సమాధానమే లేదు" కఠినంగా అడిగాడు కేశవరావ్.

"మీరు చెబితే సరే నండి" అన్న నూకాలమ్మ చేతుల్లో యాబై వెల రూపాయలను ఉంచాడు కేశవరావ్ గుమాస్తా.....అంతే. కేశవరావ్ లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు... తరువాత మిగిలినవారందరూ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయారు.

తన కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఖరీదు కట్టి కేశవరావ్ తన చేతిలో పెట్టిన డబ్బును చూసుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చిన నూకాలమ్మను ఏకాంబరం ఆపాడు..."చూడు నూకాలమ్మా... కేశవరావ్ ఎందుకనో నీమీద కరుణ చూపించాడు. అసలు నిన్నూ, నీ కూతుర్ని చంపేస్తాడేమో అనుకున్నాం...ఇలా నీ చేతిలో డబ్బు పెట్టి, మిమ్మల్ని క్షమిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. భూమ్మీద మీకింకా నూకలుండబట్టే వదిలేసేడేమో ననిపిస్తోంది" అన్నాడు.

నిజమే నూకాలమ్మా...ఈమధ్య కుల గౌరవం, కుటుంబ గౌరవం, తమ వ్యక్తిగత గౌరవం మంటగలిపేరని ఎంతో మంది, తప్పు చేసింది తమ పిల్లలేనని కూడా చూడకుండా వారిని చంపేస్తున్నారు...పైగా నేరానికి "పరువు హత్య" అని గౌరవమైన నామకరణం చేసారు. నీ కూతురి విషయంలో అలా జరగలేదని సంతోష పడు... విషయాన్ని ఇంతటితో వదిలేయమని నీ కూతురితో చెప్పు" ఇంకొకరు చెప్పారు.

పిచ్చి పట్టినదానికి మళ్ళే నూకాలమ్మ కాళ్ళీడ్చుకుంటూ ఇంటివైపు నడిచింది.

                                                                      ************************************

అమ్మ రాక కోసం పూరి గుడిసెలో ఎదురుచూస్తున్న హేమ అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న తల్లిని చూసి "ఎందుకు రమ్మనారు?...ఏం చెప్పారు?" అని అడిగింది.

కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేశవరావ్ ఇచ్చిన డబ్బును హేమ ముందు ఉంచి " డబ్బు తీసుకుని...క్రిష్ణారావ్ ని నువ్వు మర్చిపోవాలట" అన్నది నూకాలమ్మ.

క్రిష్ణారావ్ బిడ్డను తన కడుపులో మొస్తున్నందుకు కూలీగా డబ్బును ఇచ్చారని అనుకున్నప్పుడు హామకి సముదాయం మీద, సంఘం మీద విరక్తి ఏర్పడింది. ఇక మీదట క్రిష్ణారావ్ తన వాడు కాదు అన్న భావన కలిగినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళు జలపాతంగా ఉప్పొంగినై.

అతనితో గడిపిన రోజులు, అతను తనకిచ్చిన మరో ప్రాణాన్ని మోస్తున్న అనుభూతులు...అన్నిటినీ మర్చిపోవాలా?...తన మీద, తన తలరాత మీద హేమకు కోపం వచ్చింది. తమాయించుకుని, నిలకడ తెచ్చుకుని " డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయమ్మా" అని తల్లితో చెప్పింది.

కూతురి నోట మాట విన్నప్పుడు నూకాలమ్మ మొహం చిగురించింది...మనసు ఆనందపడింది...డబ్బు డిపాజిట్ చేయమన్నందుకు కాదు...కూతురు ఇక మీదట క్రిష్ణారావ్ మాట ఎత్తదని గ్రహించినందుకు.

                                                                    ************************************

రోజులు గడిచినై.

హేమకు ఆడపిల్ల పుట్టింది. పుట్టిన బిడ్డతో హేమను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకు వచ్చిన నూకాలమ్మకు ఇంటి గుమ్మం దగ్గర చిందరవందర జుట్టుతో, పిచ్చివాడిలో నిలబడున్న క్రిష్ణారావ్ కనబడ్డాడు.

ఏం జరుగుతుందో నన్న భయం పట్టుకుంది నూకాలమ్మకు.

ఆటోలో నుండి దిగిన హేమ క్రిష్ణారావ్ ను చూసి కూడా చూడనట్లు అతన్ని దాటుతుంటే "హేమా...నాతో మాట్లాడవా?...నా బిడ్డను నాకు చూపించవా?" అడిగాడు క్రిష్ణారావ్.

హేమ క్రిష్ణారావ్ కి సమాధానం చెప్పకుండా "అమ్మా...తాళం తీయ్" అన్నది.

కూతురి మాటలకు ధైర్యం తెచ్చుకున్న నూకాలమ్మ "చూడు బాబూ...అనవసరంగా గొడవ చేయకు. నీకు, నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు. డబ్బులిచ్చి సరి చేసారు...మళ్ళీ హేమతో మాటలెందుకు" అన్నది.

ఆమె మాటలు విన్న క్రిష్ణారావ్ ఒక్కసారి హేమ వైపు చూసేడు. హేమ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది...అంతేక్రిష్ణారావ్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరాడు. తిన్నగా సారా కొట్టువైపుకు వెళ్ళాడు.

హేమ బిడ్డతో ఇంట్లోకి వెళ్ళింది.

                                                                ************************************

హేమకు డబ్బులిచ్చి కొడుకుతో ఆమె భందుత్వాన్ని తెంపేసిన కేశవరావ్ కొడుకు క్రిష్ణారావ్ కి తమ కులానికి చెందిన వేరే అమ్మాయితో పెళ్ళి సంబంధం కుదిర్చాడు. పెళ్ళి సంబంధం కుదుర్చుకున్న మూడురోజుల తరువాత పెళ్ళి కూతురు తరఫునుండి పెళ్ళి క్యాన్సెల్ చేసుకున్నామని కబురు వచ్చింది.

క్రిష్ణారావ్, హేమతో కలిసి ఊరువదిలి పారిపోయి ఆరు నెలలు గడిపాడని తెలియటంతో క్రిష్ణారావ్ కి పెళ్ళి కుదరలేదు. బయట ఊర్ల నుండి సంబంధాలు వెతుకున్నా అవి కూడా తప్పిపోవటంతో కేశవరావ్ కి దిగులు పట్టుకుంది...క్రిష్ణారావ్ తాగుడుకు అలవాటుపడి దానికి బానిసైపోయాడు. విపరీతంగా తాగటంతో మనిషి చిక్కి సల్యమైపోయాడు.

కొడుకును చూసి తల్లి సావిత్రి ఏడవని రోజు లేదు. కానీ భర్తతో మాట్లాడటానికి భయ పడింది. కానీ రోజు భర్త దిగులుతో ఉన్నాడని తెలుసుకున్న ఆమె ఈజీచైర్లో కూర్చున్న భర్త దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

"ఏమండీ... రోజు మన కొడుకును, హేమ దగ్గర నుండి విడదీయమని, అది గనుక జరగకపోతే హేమను చంపైనా కొడుకును తీసుకొచ్చి మన కుల గౌరవాన్ని కాపాడమని మిమ్మల్ని ఉసిగొల్పిన మన కులం వాళ్ళే రోజు మన కిష్టుడికి పిల్లనివ్వడానికి వెనకాడుతున్నారు...వీళ్ళా కుల గౌరవాన్ని కాపాడే పెద్దలు. వీరి మాటలు వినా మనం వాలిద్దరినీ విడదీసింది...ఇంకా నయం కుల గౌరవం పేరిట వాళ్ళను హతమార్చలేదు. అలాచేసుంటే మీరు జైలుకు వెళ్ళేవారు...నేను ఒంటరిదాన్ని అయ్యేదాన్ని. కులం,కులం అంటూ అవతలివారిని ఉసిగొల్పటమే తప్ప వారి వరకు వస్తే ఎలా తప్పుకుంటున్నారో చూసారా. వీళ్ళకోసం మన బిడ్డను మనం శిక్చించి, మనం పెద్ద తప్పు చేసేమండి...వాడేమైపోతాడో నన్న భయం నన్ను వేదిస్తోంది" అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది.

"నిజమేనే...నేను చాలా పెద్ద తప్పు చేసాను...నా తప్పును నేనే సరిదిద్దుతాను...కిష్టుడుని కాపాడతాను" భార్యకు కేశవరావ్ అభయమిచ్చాడు.

                                                                  ************************************

రోజు సాయంత్రం కేశవరావ్ హేమ గుడిసెకు వచ్చాడు. నూకాలమ్మ ఇంట్లో ఉన్న పాత కుర్చీని తన చీర కొంగుతో తుడిచి అందులో ఆయన్ను కూర్చొమన్నది.

కేశవరావ్ అందులో కూర్చున్నాడు.

"హేమా నిన్నునా కొడుకు దగ్గర నుండి విడదీసి, వాడికి మా కులం పిల్లతో పెళ్ళిచేయాలనుకున్నాను...అది కుదర్లేదు. ఇప్పుడు వాడు తాగి, తాగి వొళ్ళు పాడుచేసుకుని, నిన్నే తలచుకుని జీవిస్తున్నాడు. వాడ్ని ఇలాగే వదిలిపెడితే చచ్చిపోతాడు...కాబట్టి వాడిని నువ్వే పెళ్ళిచేసుకో...ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండండి" తన గంభీరాన్నీ, గౌరవాన్నీ, పరువు-మర్యాదలు అన్నిటినీ గాలికి వదిలేసి తప్పు తెలుసుకున్న వాడిలా చెప్పాడు కేశవరావ్.

హేమ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద మనిషి తన గుడెసను వెతుక్కుంటూ వచ్చి...తన కొడుకును పెళ్ళిచేసుకుని, వాడికి ప్రాణ బిక్ష పెట్టమని అడగడం కేశవరావ్ తన తప్పును తెలుసుకున్నాడని గ్రహించింది...కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు.

"ఇప్పుడు మీరు మనసు మారి వచ్చారు...మమ్మల్ని పెళ్ళిచేసుకోమంటున్నారు...కానీ మీ కొడుకు ఇప్పుడు పాత క్రిష్ణారావ్ కాదే?...తాగి, తాగి తన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న ఒక రోగి. అతన్ని పెళ్ళిచేసుకుని కొన్ని రోజులు సుమంగళిగా బ్రతకటం కన్నా...జీవితాంతం నేను ఒంటరిగానే ఉండిపోతాను" చెప్పింది హేమ.

ఆమె మాటలు చెంప మీద కొట్టినట్టు అనిపించడంతో కేశవరావ్ తలవంచుకున్నాడు. ఇద్దర్నీ విడదీసిన తప్పుకు తన కొడుకు బలి అవుతున్నాడన్న ఆలొచనతో కుచించుకుపోయాడు.

కొడుకు హేమతో పారిపోయినప్పుడు తన పరువు తీసాడని, తనకీ, తన కులానికీ తలవంపులు తెచ్చాడని కుల అహంభావంతో వాళ్ళిదరినీ విడదీసాడు. కానీ రోజు హేమ అన్న మాటలు కేశవరావును నిజంగానే తల దించుకునేలా చేసింది.

కులం పేరుతో వాళ్ళిదరినీ విడదీసి తనే తప్పు చేసేనని "ఇదే నిజమైన తలవంపు" అని గ్రహించిన కేశవరావ్ తన గంభీరాన్నీ, బెదిరించే చూపులనూ అక్కడే విడిచిపెట్టి తప్పు చేసిన మనిషిలా తలవంచుకుని అక్కడి నుండి బయటకు వచ్చాడు.

***************************************************సమాప్తం********************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)

వెన్నెల…కథ