పది నెలల బంధం…(కథ)

 

                                                                       పది నెలల బంధం                                                                                                                                              (కథ)

పది నెలలు మోసి ఒకరికి ఈ మనిషి రూపం ఇచ్చి సహాయపడుతుంది అమ్మ....ఆ ఒక్క అర్హత కోసమే ఎవరైనా సరే...అమ్మను తమతో ఉంచుకుని కాపాడవలసిన బాధ్యత కలిగున్నారు...మాతృత్వం అనే స్థానం ప్రకృతి ఒక స్త్రీకి అందించిన విషేశ హక్కు.

****************************************************************************************************

నందగోపాల్ నివాసముంటున్న కాలనీ చివర్లో ఒక స్కూలు. ప్రొద్దున అతను తన హోటలుకు పదిగంటల సమయంలో వెళ్ళటం అలవాటు. హోటల్ యొక్క మరో పార్ట్నరు అతని బావమరిది. అతను తెల్లవారు జామునే హోటల్ తెరిచి వ్యాపారాన్ని మొదలు పెట్టేసుంటాడు.   

సైకిల్ను మెల్లగా తొక్కుకుంటూ స్కూలు దగ్గరకు వచ్చిన తరువాత సైకిల్ నుండి దిగి, ఒక పక్కగా నిలబడ్డాడు నందగోపాల్. అక్కడ అతను మెయిన్ రోడ్డు క్రాస్ చేయాలి.

పిచ్చుకల లాగా, యూనిఫారంలో ఆడ, మగ పిల్లలందరూ ఎదురుగా ఉన్న బాట నుండి, రోడ్డును దాటుతున్న ప్రయత్నంలో అరుపులూ, కేకలూ వేస్తున్నారు.

పోలీసు అధికారి ఒకరు రోజూ సమయానికి అక్కడికి వచ్చి నిలబడి చేతులు మార్చి, మార్చి ఊపుతూ ట్రాఫిక్కును ఆపుతూ పిల్లలను ఎదుటి వైపున్న స్కూలుకు వెళ్ళటానికి సహాయం చేయటం అలవాటు.

రోజు పిల్లలను చూస్తున్న నందగోపాల్, అక్కడ చూసిన ఒక దృశ్యం వలన షాక్ తిన్నాడు. షాక్వలన అంతవరకు అతనిలో అనిగిపోయున్న పాత జ్ఞాపకాలు  గుప్పుమని మనసులోనే తలెత్తి నిలబడ అతని కళ్ళు తడిసినై. పిల్లలు రోడ్డు దాటటాన్ని వేడుక చూస్తూ ఒక వైపుగా నిలబడ్డాడు.   

పోలియో వలన ఒక కాలు చిన్నగా ఉన్న ఆరు సంవత్సరాల పిల్లాడు, ఇనుప కడ్డీ అతికించబడ్డ షూను కాలుకు వేసుకోనున్నాడు.

అమ్మా, నాకు భయంగా ఉంది! అని అరిచాడు పిల్లాడు.

బూటుతో నువ్వు నడవటం నేర్చుకోవాలని డాక్టర్ చెప్పారు కదా?”

పడిపోతానేమోనని భయంగా ఉందమ్మా

"పడిపోవు, అమ్మ చెయ్యి పట్టుకుని మెల్లగా నడు...ఏదీ నడు చూద్దాం?”

తల్లి చెయ్యి పుచ్చుకుని నెమ్మదిగా నడవటం మొదలుపెట్టిన పిల్లాడు మళ్ళీ తల్లి వైపు చూసి అమ్మా! నా కాలు  సరైపోతుందా?”

స్కూలు వదిలిన తరువాత నువ్వు బయటకు వచ్చేలోపల రోజూ బయట నీకొసం కాచుకోనుంటాను -- నా చేతులు పుచ్చుకుని నడుస్తూ నువ్వు ఇంటికి వస్తావు. కాలుకున్న బూట్లను విప్పదీసేసి...తైలం రాసి...రుద్ది రాస్తాను. వేడి నీళ్ళతో కాపు ఇస్తాను

రోజూ చేస్తావా అమ్మా?”

చేస్తానురా నాన్నా....కొన్ని రోజులలో నీ కాలు సరి అయిపోతుంది...

అన్నయ్య లాగా నేనూ పరుగులు పెట్టి ఆడుకోగలనా అమ్మా?”

నువ్వూ నేనూ దాగుడుమూతల ఆట కూడా ఆడగలం -- అలా పరిగెత్త గలుగుతావు

నమ్మకం కాంతిలాగా ప్రకాశించ, బియ్యం లాంటి పళ్ళు కనబడేలాగా పిల్లాడు సంతోషంలో గల్లుమని నవ్వుతూ తల్లి చేతిని పుచ్చుకుని ఉత్సాహంగా నడిచాడు.

తల్లి ఒక చిన్న పిల్లే, నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు, కాటన్ చీర, మెడలో తాళి గొలుసు, చేతికి మట్టి గాజులు, సాధారణ కుటుంబానికి చెందిందే...వికలాంగముతో ఉన్నా తాను కన్న బిడ్డ అనే ప్రేమ...అభిమానం, జాలి ఎత్తి పోసే తల్లి ఆమె... మాతృత్వ కళతో దేవత లాంటి వెలుగుతో కనబడుతోంది.

సంభ్రమంతో ఆమెను పై నుండి కిందకు చూసాడు నందగోపాల్. అతనిలో వెయ్యి భూకంపాలు పేలి గుండె ముక్కలై, బూడిద అయినట్లు ఒక ఆశ్చర్యం. ఆశ్చర్యం నందగోపాల్ మనసులో తలెత్తి నిలబడున్న అతని పాత జ్ఞాపకాలను రీవైండ్ చేసింది.

కాళ్ళూ, చేతులూ పనిచేయవు... పుట్టుకతోనే వ్యాధిగ్రస్తుడై మంచంలోనే పడిపోయాడు తమ్ముడు చలపతి...రోజులు గడుస్తున్న కొద్దీ చూపు కూడా పోయి గుడ్డి వాడయ్యాడు. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా ఎవరో ఒకరు అతన్ని ఎత్తుకుని తీసుకు వెళ్ళి సహాయం చేయాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి.

పళ్ళు తోమటానికి తమ్ముడ్ని నందగోపాల్ రోజూ బావి దగ్గరకు తీసుకు వెళ్ళటం అలవాటు.

రోజు కూడా అదే చేసాడు.

అలాగే ఉండు...ఒక బక్కెటడు నీళ్ళు తోడి నిదానంగా నిన్ను స్నానం చేయిపిస్తాను

ఉండు, ఉండు...తొందరపడకు...బనియన్ తొడిగి, నిక్కరు వేసి మోసుకెళ్ళి పడుకోబెడతాను

చలపతీ నోరు తెరు...ఇడ్లీ ముక్క నోట్లో పెడతాను

--ఇలా పలు పనులు తమ్ముడికి చేస్తూ వచ్చాడు నందగోపాల్.

ఇద్దరూ తండ్రిని చిన్న వయసులోనే పోగొట్టుకున్నారు. వీళ్ళ లాంటి పిల్లలు ప్రపంచమంతా ఎంతోమంది ఉన్నారు! చివరి ఇంటి సీనూ  కూడా చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. సీనూ తో కలిపి ఐదుగురు ఉన్న కుటుంబాన్ని అతని విధవరాలు తల్లి, చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకుని, చిల్లరగా సంపాదిస్తూ కుటుంబాన్ని కాపాడుతోంది. సీనూ -- అతని తమ్ముడు సోమూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు.

మగ పిల్లలు పెద్ద వాళ్ళు అవుతారు. చెల్లెలను పెళ్ళి చేసి పంపుతారు -- అనే నమ్మకంతో వాళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పెంచింది. మాటి మాటికి తన పిల్లల గురించి గొప్పగా మాట్లాడుతుంది.

తన తల్లి కూడా అదేలాగా గర్వ పడాలనే నందగోపాల్ లేత మనసు మిక్కిలి ఆశపడింది. కోరికతోనే తల్లికి భారమైపోయిన తమ్ముడ్ని తానే చూసుకుంటూ ఉన్నాడు. ఆడపిల్లలాగా తెల్లవారు జామున లేచి నీళ్ళ బిందెను కడిగి -- తల్లికి పూలతోటి నుండి మంచినీళ్ళు తీసుకు వచ్చి సహాయం చేసాడు. ఏదుందో అది తినేసి స్కూలుకు వెళ్ళిపోయేవాడు. లక్ష్యంతో చదివాడు. క్లాసులో మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడు.

అన్నీ పొలాన్ని పాడుచేసిన నీరులాగా పాడైపోయింది. ఒక రోజు సాయంత్రం, స్కూలు నుండి అతను ఇంటికి త్వరగా వచ్చాడు.

వాకిలివైపున్న తలుపు తోసాడు. లోపల గొళ్ళెం పెట్టుంది. తల్లి ఇంకా నిద్రలేవలేదని అనుకుంటూ, ఆమె నిద్రను భంగపరచ కూడదనుకుని వెనుక వైపున్న తలుపు తోసుకుని లోపలికి వచ్చిన అతను అధిరిపడ్డాడు.

వాళ్ళు పడుకునే రూములో నుండి బయటకు వచ్చాడు, పక్కింట్లో అద్దెకు ఉంటున్న కార్పెంటర్. అతని వెనుక అమ్మ...బయటకు వచ్చింది.

అయోమయంతోనూ, కలవరపాటుతోనూ నిలబడ్డ కొడుకు వీపును తల్లి ముద్దుగా తాకింది.

అల్మారా సరిగ్గా మూసుకోవటం లేదు -- ఆయనతో చెప్పి సరిచేయమన్నాను చిన్నగా గొణిగింది.

వాడు దాన్ని నమ్మాడు.

కానీ, మరుసటి రోజు ప్రొద్దున రోగ తీవ్రతతో పడుకునే ఉన్న తమ్ముడికి ప్రొద్దున టిఫిన్ ఇస్తున్నప్పుడు...అతను చెప్పిన సమాచారం, కంట్రోల్ చేసుకోలేనంత ఆశ్చర్యాన్ని ఇచ్చింది.

నిజంగానా...? మన అమ్మ అలాగా నడుచుకుంటోంది...?’ -- అతని హృదయం దిగులుతో కొట్టుకుంది. అవమానంతో ఒళ్ళు గాలిపోయిన బెలూన్ లాగా కుచించుకుపోయింది.

సమయంలో తల్లి ఇంటి వెనుక బట్టలు ఉతుకుతోంది. తల్లి ఇంట్లో లేదని గ్రహించి తమ్ముడు అన్ని విషయాలూ చెప్పాడు.

అన్నయ్యా! అమ్మ చేసేది నాకేదీ నచ్చలేదు... కార్పెంటర్ మన ఇంటికి నువ్వు లేనప్పుడు వస్తున్నాడు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ రూములోపలకు వెళ్ళి గొళ్ళెం పెట్టుకుంటున్నారు. నాకు కాళ్ళు లేవు...కళ్ళు లేవు. కానీ మనసు ఉంది. భావోద్వేగాలు ఉన్నాయి...అమ్మ తప్పు పని చేస్తోందని తల్లడిల్లిపోయాను...నేనొక రోగిని...నీకంటే వయసులో చిన్నవాడిని. నేనేం చేయగలను వెక్కి వెక్కి ఏడ్చాడు చలపతి.

రోజంతా స్కూల్లో నందగోపాల్ కి పాఠాలే బుర్ర కెక్కలేదు.

వ్యాధిగ్రస్తుడైన పదేళ్ళ వయసున్న పిల్లాడ్ని ఇంట్లో పెట్టుకుని అమ్మ ఇంత నీచంగా ప్రవర్తించాలా!

చివరి ఇంటి సీనూ తల్లి కూడా విధవరాలే కదా...? ఆవిడ ఇలా తప్పుగా నడుచుకోలేదే...?’

ఎన్ని సార్లో అలొచించుకున్న తరువాత అమ్మ దగ్గర దీని గురించి అడగాలిఅని నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు...ఇంకొక షాక్. అతని తల్లి కార్పెంటర్ తో బయలుదేరి ఊరి వదిలే వెళ్ళిపోయిందని.

కళ్ళు తెలియని తమ్ముడు, జరిగింది చెప్పి గట్టిగా ఏడ్చినప్పుడు అతని మనసు విరిగిపోయింది...తమ్ముడ్ని కావలించుకుని అతను ఏడ్చిన ఏడుపు...మంచికాలం ఎదురింటి బామ్మ కనికరంగల మనసున్నది.

నేను నీ తమ్ముడ్ని చూసుకుంటాను. నువ్వు పరీక్ష రాసి ముగించు. తరువాత ఏదైనా పని వెతుక్కోవచ్చు అని ఓదార్పు మాటలు చెప్పి సహాయం చేయటానికి ముందుకు వచ్చింది.

పరీక్షలు రాసి విజయం సాధించాడు -- అతను ఉద్యోగం వెతుక్కుంటూ తమ్ముడ్ని కాపాడటానికి ముందే చలపతి రోగం సీరియస్ అయి -- మరణించాడు.

తల్లి లేదు -- తమ్ముడు లేడు. అనాధగా నందగోపాల్ బజారు వీధిలో కూలీ పనిచేసి తనని తాను కాపాడుకోవాలని ప్రయత్నించాడు.

జీవితంలో కూడా అతన్ని ఊరి ప్రజలు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు.

అదిగో వెళుతున్నాడే...అతనే నందగోపాల్. అతని తల్లి...పక్కింటి వాడితో లేచిపోయింది

పిల్లాడు పాపం.  స్కూల్లో చదువుకుంటున్నాడు. కొవ్వెక్కిన వాళ్ళ అమ్మ ఎవడ్నో లాక్కుని వెళ్ళిపోయింది

నందగోపాల్ తల్లి మంచిది కాదు. వ్యాధిగ్రస్తుడైన కొడుకును చావుకు వదిలేసి...దొంగ మొగుడితో పారిపోయింది -- మాటలు బాణంలా దూసుకురాగా -- అవమానాన్ని  తట్టుకోలేక, ఒక రోజు వాడి వస్తువులన్నీ తీసుకుని నగరానికి బయలుదేరాడు.

" మీరు వెళ్ళండి" అని వేసిన పోలీస్ అధికారి కేకతో పాత జ్ఞాపకాలను పక్కకు నెట్టి, ప్రస్తుతానికి వచ్చాడు నందగోపాల్. 

స్కూలు పిల్లలందరూ రోడ్డు దాటిన తరువాత, సైకిల్ని తొసుకుంటూ నందగోపాల్ కూడా రోడ్డు దాటాడు.

వికలాంగ పిల్లవాడిని చూసినప్పుడు పాత జ్ఞాపకాలతో అతని మనసు బరువెక్కింది. గతం మళ్ళీ గుర్తుకు వచ్చింది.

కానీ, నగర జీవితం అతన్ని బంగపరచలేదు. నగర రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లోసర్వర్ గా పని మొదలుపెట్టాడు. రాత్రీ--పగలు కష్టపడి పనిచేసాడు. పొదుపుగా జీవించాడు. కొన్ని వస్తువులు కొన్నాడు. కొన్ని సంవత్సరాలలో సొంతంగా ఒక చిన్న హోటల్ మొదలు పెట్టాడు...హోటల్ అభివ్రుద్ది చెందింది...మంచి లాభం దొరికింది. డబ్బు ఇచ్చిన బలంతో పాత బాధలను వదిలించుకుని, మనిషిలాగా రొమ్ము విరుచుకుని జీవించటం మొదలు పెట్టాడు.

అంతలో అతనికి ఎంతోమంది స్నేహితులు? స్నేహితుల గుంపులో బాగా దగ్గరైన స్నేహితుడు భాస్కర్. అతని చెల్లెలు వసంతాను ఒకే ఒకసారి అనుకోకుండా చూసాడు -- మనసుకు బాగా నచ్చింది. స్నేహితుడితో మాట్లాడి వసంతాను పెళ్ళి చేసుకున్నాడు.

వసంతా రావటంతో అతన్ని అదృష్టం పెద్ద ఎత్తున వరించింది. హోటల్ పెద్దదిగా డెవెలప్ అయ్యింది...అతని బావమరిదినే అందులో పార్ట్నర్ గా చేర్చుకుని...ఇద్దరూ రెండు షిఫ్టులుగా పనిచేస్తూ, వ్యాపారం చూసుకున్నారు. హోటల్ కు కొంచం దగ్గరగానే ఒక ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాడు.

వసంతా టైలరింగ్ నేర్చుకుంది -- ఒక కుట్టు మిషన్ను వాయిదా పద్దతిలో కొని పడేసాడు. ఖాలీ సమయంలో ఆమె టైలరింగ్ పనులు చేస్తూ సంపాదించటం మొదలుపెట్టింది.

రెండేళ్ళల్లో ఆమె ఒక షాపును అద్దెకు తీసుకుని ఒక చిన్న టైలరింగ్ కొట్టు పెట్టింది. అందులోనూ పేరు సంపాదించి ఒక మంచి మొత్తాన్ని సంపాదించటం ప్రారంభించింది.

భార్యా--భర్తలు ఇద్దరూ చాలా కష్టపడి జీవించారు. పొదుపుగా జీవించారు. సేవింగ్స్ చేసారు. కొద్ది రోజులలో చుట్టు పక్క వీధిలోనే ఒక పాత ఇంటిని కొని, దాన్ని బాగుచేయించాలని నిర్ణయించుకున్నాడు.

సమయంలోనే వసంతా అతనికి సంతోషకరమైన వార్త చెప్పింది. త్వరలో ఆమె తల్లి అవబోతున్నదని చెప్పింది.

అతనికి తట్టుకోలేనంత ఆనందం. తన తల్లి జ్ఞాపకాలు సూదుల్లాగా గుచ్చటం గుర్తించాడు. ఇంటికి దగ్గరలో నివసిస్తున్న మహిళలు-మామగారు-అత్తగారు-భర్త-భార్య అంటూ ఉమ్మడి కుటుంబంలాగా -- ఒకటిగా జీవించటం చూసి అలజడితో తల్లడిల్లాడు. అతని తల్లి మాత్రం...అలాంటి ఒక పని చేసుండకపోతే... వసంతాతో వయసైన కాలంలో ప్రశాంతతతో, ప్రేమాభిమానాలతో జీవితం గడిపేది కదా?  అవును...అతని తల్లి ఇప్పుడు ఎక్కడుంది...? ఏం చేస్తూ ఉంది?

కళ్ళల్లో ఉబికి వచ్చిన నీళ్ళను కంట్రోల్ చేసుకుని, అతను తన హోటల్ను గమనించుకోవటానికి లోపలకు వెళ్లాడు.

కొద్ది రోజుల తరువాత అతను తన హోటల్ కు కావలసిన వస్తువులు కొనడానికి...బావమరిది దగ్గర హోటల్ను అప్పగించి...నగరం చివరకు వెళ్ళాడు. కావలసిన వస్తువులు కొనుక్కుని, లాగుడు బండీలో ఎక్కించి, లాగుడు బండీ వాడికి చిరునామా రాసిచ్చి, తాను బస్సు ఎక్కి వెళ్ళటానికి బస్సు స్టేషన్ కు వేగంగా వచ్చాడు.

నడుస్తున్న బాటలో, ప్లాట్ ఫారానికి చివరగా, కుష్టు రోగి బిచ్చగాళ్ళ పక్కన, గుండు కొట్టించుకున్న తలతో, చిరిగిపోయిన దుస్తులతో, నేల మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళ దగ్గర చెయ్యి జాపి బిచ్చమెత్తుకుంటోంది ఒక ముసల్ది.

అయ్యా ధర్మ ప్రభువులూ! ధర్మం చేయండి బాబూ...రెండు రోజులుగా పస్తు...జ్వరం కూడా ఉంది. నీకు చేతులెత్తి దన్నం పెడతాను...

గొంతు, స్వరం? విని తడబడ్డ నందగోపాల్ ఆగి బిచ్చగత్తెను లోతుగా చూస్తూ   నిలబడ్డాడు. హృదయమే ముక్కలైనట్లు ఒక భావం. చూడ చూడ ముసలి దాని పేదరికం కళ్ళల్లో కరిగి...వయసులో ఉన్న తోటలోని ఆకుకూర కొమ్మలాగా...అతని తల్లి తల తల మని నిలబడున్నట్టు అధిరిపడ్డాడు!

అనుమానమే లేదు...ఆమె అతని తల్లే...ముసలితనం వయసు రాకుండానే ముసల్ది అయ్యి, పేదరికం కొట్టచ్చే రూపంలో...రోడ్డు మీద బిచ్చం అడుక్కునే పరిస్థితిలో...అయ్యయ్యో.

గల్లు గల్లు మని దగ్గుతూ తనవైపుకు జాపిన చేతిలో ఒక పది రూపాయల కాగితం వేసేసి పరుగులాంటి నడకతో బస్సు ఎక్కాడు.

అతను విషయాన్నీ అతని భార్య దగ్గర దాచింది లేదు. వసంతా ఎక్కువ చదువుకున్నదీ కాదు...కానీ, తెలివి ఎక్కువ ఉన్న మహిళ.

తన తల్లి గురించిన అవమానమైన వార్తను అతను అంతకు ముందే ఆమెకు చెప్పాడు. ప్లాట్ ఫారం లో అతను చూసిన దృశ్యాన్ని భార్యకు వివరించ, వేదనతో గోడకు వాలిపోయి కూర్చుండి పోయాడు.

దగ్గరకొచ్చిన వసంతా...కాఫీ గ్లాసును...అతని చేతికిచ్చి అతని పక్కన కూర్చుంది.

మీ మనసు పడుతున్న బాధ నాకు అర్ధమవుతోంది. కాఫీ తాగేసి వెంటనే ఒక ఆటో పుచ్చుకుని...అక్కడికి వెళ్ళి ప్లాట్ ఫారం మీద కూర్చుని బిచ్చం ఎత్తుకుంటున్న మీ అమ్మను ఇంటికి తీసుకు రండి

నన్ను చిన్న వయసులోనే...వ్యాధిగ్రస్తుడైన తమ్ముడి దగ్గర వదిలేసి పారిపోయిన అవిడ్నా పిలుచుకు రమ్మంటున్నావు?”

ఏది ఏమైనా ఆమె మీ తల్లి...పది నెలలు మోసి మీకు మనిషి రూపం ఇచ్చి సహాయపడింది... ఒక్క అర్హత కోసమే మీరు...ఆమెను ఉంచుకుని కాపాడవలసిన బాధ్యత కలిగున్నారు...నేను త్వరలోనే మీ బిడ్డకు తల్లి కాబోతున్నాను. మాతృత్వం అనే స్థానం ప్రకృతి ఒక స్త్రీకి అందించిన విషేశ హక్కు...త్వరగా బయలుదేరండి

వసంతా...నువ్వు చాలా మంచి దానివి...

మీ బిడ్డకు నేను నా చివరి రోజు వరకు ఒక మంచి తల్లిగా ఉంటాను...మీ  విషయంలో మీ అమ్మ ఎందుకో తడబడింది. దానికి దేవుడు వేసిన శిక్ష అనుభవించింది. కాబట్టి ఆవిడ తప్పులను మర్చిపోయి మన్నించేయండి...వెళ్ళి తీసుకురండి...

కానీ అతని తల్లి, కొడుకుతో వాడింట్లో ఉండేంత ఆరోగ్యంగా లేదు. తీవ్రమైన జ్వరంతో ప్లాట్ ఫారంపై పడి ఉంది.

కళ్ళు తెరిచి కొడుకును చూడకుండానే, ఆశుపత్రిలో చేర్చిన రెండో రోజే చనిపోయింది.

తల్లిని ప్రాణంతో ఇంటికి తీసుకురాలేని నందగోపాల్ తల్లి దేహాన్ని ఇంటికి తీసుకు వచ్చాడు.

తల్లి రుణం తీర్చుకునే విధంగా ఆమె అంతిమ సంస్కారాల బాధ్యతను వహించాడు. తల ఎత్తుకుని అగ్ని కుండతో నందగోపాల్, తల్లి అంత్యక్రియలకు శ్మశానానికి బయలుదేరాడు...పది నెలలు తనని మోసిన తల్లి రుణాన్ని తీర్చుకోవాలని...తల్లి అంతిమ యాత్రలో ముందుగా కొడుకుగా నడిచాడు.

*************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చిలుకల గుంపు...(కథ)

ఉమ్మడి కుటుంబం…(మినీ కథ)

ఏల్నాటి శని...(కథ)