సంస్కారం...(కథ)

 

                                                                                 సంస్కారం                                                                                                                                                                       (కథ)

మనసు మంచి నడవడిని కలిగి ఉండటాన్ని హృదయ సంస్కారం అంటారు. ... కోపం లేకపోవడం, సామరస్యంతో ఉండటం, త్యాగ భావన ఉండటం, అతి ప్రవర్తన లేకుండటం, ఎవరి మనసు నొప్పించకుండా ఉండటం, మానవ సంబంధాలను దెబ్బతీయకపోవడం, ప్రతీకారం లేకుండటం కూడా సంస్కారామే. 

ఈ కథలో హీరోయిన్ సురేఖ కి అతి సన్నిహితురాలైన స్నేహితురాలుకి పెళ్ళి సెటిల్ అవుతుంది. పెళ్ళి రోజు దగ్గర పడుతున్నా స్నేహితురాలి ఇంటి నుండి సురేఖకి పెళ్ళి శుభలేఖ ఇవ్వలేదు. స్నేహితురాలి పెళ్ళికి తానే దగ్గరుండి అన్ని పనులు చేయాలని తాపత్రయపడ్డ సురేఖకి పెళ్ళి శుభలేఖ అందకపోవడంతో నిరాస పడుతుంది. ఆ కాలనీలో సురేఖ చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో వాళ్ళందరికీ పెళ్ళి శుభలేఖ ఇచ్చిన సురేఖ స్నేహితురాలి కుటుంబం సురేఖకు ఎందుకు పెళ్ళి శుభలేఖ ఇవ్వలేదు? కారణం తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.

****************************************************************************************************

ఇంటి బయట మోటర్ సైకిల్ ఆగిన శబ్ధం వినబడటంతో కిటికీలో నుండి బయటకు తొంగి చూసింది సురేఖ.

మోటర్ సైకిల్ స్టాండు వేస్తూ కనిపించాడు ఆమె భర్త సాగర్.

"పిల్లలూ, బయలుదేరండి...బయలుదేరండి! అంకుల్ వచ్చాశారు"....తన ఇంట్లో ఆడుకుంటున్న ఇరుగు పొరుగు ఇళ్ళలోని పిల్లలను పంపించే ప్రయత్నంలో పడింది సురేఖ.

సాగర్ లోపలకు వచ్చాడు.

"హాయ్ అంకుల్..." చెప్పింది ఒక పిల్ల. "బై అంకుల్" అన్నది ఇంకో పిల్ల.

ఇలా జరగటం ఇంట్లో కొత్తేమీ కాదు. సాగర్, సురేఖ దంపతులు కాలనీలోని ఇంటికి అద్దెకు వచ్చిన రోజు నుండి అదే తంతు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అయినా సురేఖ తన అలవాటును మానుకోలేదు.

సురేఖ పెద్దగా చదువుకోలేదు. కుటుంబాన్ని చూసుకోవటమే ఆమె ముఖ్యమైన పని. కంటికి కనబడిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, చనువుగా మాట్లాడటం ఆమె సహజ గుణం. కానీ ఆమె భర్త చాలా సైలంట్. వచ్చేదీ తెలియదు, వెళ్లేదీ తెలియదు. అంత ప్రశాంతంగా ఉంటాడు.

వాళ్ళ వీధిలోనే కాకుండా, కాలనీలోని మిగిలిన వీధులలో ఉన్న ఇళ్ళల్లో జరిగే ప్రతి ఒక ఫంక్షన్ కు సురేఖ హాజరు అవుతుంది. తానే కలగజేసుకుని వాళ్ళ పనులలో సహాయ పడుతుంది. ఇలాంటి ఎన్నో ప్లస్ పాయింట్లు సురేఖ దగ్గర ఉన్నాయి. అందువలనే సురేఖ అన్నా, ఆమె కుటుంబం అన్నా కాలనీలో వాళ్ళందరికీ గౌరవం, మర్యాద.

సహాయం చేయాలనే మంచి గుణం కలిగిన సురేఖకు తగిన భర్త దొరకడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇతరులకు చేసే సహాయ పనులకు సాగర్ ఏనాడు ఎదురు చెప్పలేదు.

ఇంట్లోకి వచ్చిన సాగర్, కాళ్ళు చేతులు కడుక్కుని రిలాక్స్ అయ్యి, టీపా మీదున్న టీ.వీ రిమోట్ తీసుకుంటూ అక్కడే ఉన్న సోఫాలొ వాలిపోయాడు.

కాఫీ గ్లాసు తీసుకుని అక్కడికి వచ్చిన సురేఖ, సాగర్ కు కాఫీ గ్లాసు అందిస్తూ సోఫాలో భర్త పక్కనే కూర్చుంటూ "ఏమిటండి టయర్డ్ గా ఉన్నారు...ఆఫీసులో పని ఎక్కువగా ఉందా?" అడిగింది.

"ఆఫీసంటే పనులు ఎక్కువ, తక్కువలు ఉండటం మామూలే"

"అది కాదండి...ఆరోగ్యం బాగుంటేనే కదా కష్టపడి పనిచేయగలరు. అందుకే అడిగాను"

"అదంతా ఏమీ లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను"

"ఏమండి...మీదగ్గర ఒక విషయం చెప్పటం మరిచిపోయాను! మన కాలనీ నాలుగో రోడ్డులో పద్మనాభం గారు ఉన్నారు కదా...వాళ్ళమ్మాయి రాధకు పెళ్ళి కుదిరిందట. ఒక్కొక్క ఇంటికీ వచ్చి పత్రిక ఇచ్చి వెడుతున్నారు. ఇంకా మన ఇంటికి రాలేదు……రేపు మధ్యాహ్నం లోపల వస్తారనుకుంటా. పెళ్ళి పనులు, షాపింగ్ పనులలో బిజీగా ఉండుంటారు.. నిన్న వాళ్ళ గ్రామం వెళ్ళారట. పక్కింటి క్రిష్ణవేణి చెప్పింది" అంటూ మాట్లాడుతూ వెడుతున్న భార్యను కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు సాగర్.

"వాళ్ళింట్లో పెళ్ళికి నేను చీర కట్టుకోను...?" అంటూ బీరువా తెరిచి అందులో ఉన్న చీరలను చూపించి అడిగింది.

"చూడు సురేఖా...మనకింకా వాళ్ళు పెళ్ళి పత్రిక ఇవ్వనేలేదు. అంతలోపు నువ్వు ఎందుకు అంత అవసరపడతావు"

"మనల్ని పిలవకుండా ఉంటారా ఏమిటి! పెళ్ళికి ఇంకా రెండు రోజులే ఉంది. రేపో, ఎళ్ళుండో పిలవ వచ్చు. ఎందుకంటే పెళ్ళి కూడా మన కాలనీ కమ్యూనిటీ హాలులోనే. అప్పటికప్పుడు చీర సెలక్ట్ చేసుకోవాలంటే కష్టం...అందుకే ఇప్పుడే అడుగుతున్నా" చిన్న పిల్లలాగా మారం చేసిన భార్యను చూసి ఒక చిరునవ్వు నవ్వి రెండు చీరలు సెలక్ట్ చేశాడు సాగర్.

                                                                   ***********************************

మరుసటి రోజు.

మధ్యాహ్నం సమయం.

ఆఫీసులో పని చూసుకుంటున్న సాగర్ కు తన మొబైల్ రింగ్ అవటం వినిపించింది. తీసి చూశాడు. హోమ్(సురేఖ)అని కనబడింది.

మొబైల్ ఆన్ చేసి "చెప్పు...ఏమిటి సమయంలో ఫోన్ చేశావు?" అని అడిగాడు.

"ఏమీ లేదండి...టైము రెండు అవుతోంది. పద్మనాభం గారి ఇంట్లో నుండి పత్రిక ఇవ్వటానికి ఎవరూ రాలేదు. మనసు కొంచం బాగో లేదు. అందుకే ఫోన్ చేశాను"

"రాని పత్రిక కోసం ఎందుకు అంత ఆరాట పడుతున్నావు...హైరానా పడి మనసు పాడు చేసుకుంటావు?"

"పక్కింటి క్రిష్ణవేణి అక్కా వాళ్ళింటికి ఉదయం పది గంటలకు వచ్చి పత్రిక ఇచ్చేసి వెళ్ళారట. నేను సమయంలో ఇంట్లోనే ఉన్నాను. మరి మనింటికి రాలేదు! ఎందుకు రాలేదో నాకేమీ అర్ధంకావట్లేదు"

"నువ్వు మైన్ డోర్ వేసుకుని లోపల పనిలో ఉండుంటావు...ఇంట్లో ఎవరూ లేరేమే అనుకుని తిరిగి వెళ్ళిపోయుంటారు"

"మైన్ డోర్ వేసుంటే కాలింగ్ బెల్ కొట్టాలిగా?"

"కాలింగ్ బెల్ కొట్టుంటారు...నువ్వు ధ్యాసలో ఉన్నావోనీకు వినబడి ఉండదు"

"ఇంకా నయం నీకు చెవుడు వచ్చిందేమో అనలేదు"

"ఎందుకలా బాధ పడతావు...నిన్ను పిలవకుండా ఉంటారా? ఖచ్చితంగా పిలుస్తారు"

పెళ్ళి కూతుర్ని నాకు బాగా తెలుసు. తెలుసు అనడం కంటే మంచి స్నేహితురాలు అనడమే నిజం. రాధ అంటే నాకు చాలా ఇష్టం. ఇది వాళ్ళింట్లో వాళ్ళందరికీ తెలుసు. పక్కింటి క్రిష్ణవేణి వాళ్ళింట్లో పిలిచి మనింటికి రాకపోవడం...అందుకే నా మనసు అదొలా ఉంది"

"సరి...సరి! విషయం గురించి సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తరువాత మాట్లాడుకుందాం. ఫోను పెట్టేసి హాయిగా నిద్రపో" ఫోన్ కట్ చేశాడు సాగర్.

సురేఖకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే నిద్రకు బదులు పెళ్ళి కూతురే కనబడుతోంది. లేచి కూర్చుంది. "తిన్నగా వాళ్ళింటికే వెళ్ళి అడిగేద్దామా...? నన్ను ఎందుకు, ఎలా మర్చిపోయారు? అని!........అది బాగుండదు. రేపు ప్రొద్దున్నే పెళ్ళి మంటపానికి వెళ్ళిపోతారు . కాబట్టి సాయంత్రం లోపు వచ్చి పిలవాల్సిందే... " తనలో తానే మాట్లాడుకుంటోంది.

లోపు కాలింగ్ బెల్ మోగింది.

"వాళ్ళే అయ్యుంటారు. పత్రిక ఇవ్వటానికి వచ్చుంటారు...నన్ను మర్చిపోగలరా?" ఆనందంతో ఒక గెంతుతో మంచం దిగి గబ గబా వెళ్ళి తలుపు తీసింది.

పక్కింటి క్రిష్ణవేణి . చేతిలో నాలుగైదు చీరలతో నిలబడున్నది.

"సురేఖా, ఇందులో పెళ్ళికి చీర కట్టుకోను. నువ్వు సెలక్ట్ చేస్తే బాగుంటుంది...సెలక్ట్ చేసి పెట్టవా" ఎంతో హక్కుగా అడిగింది క్రిష్ణవేణి.

సురేఖకు ఏడుపు వచ్చేసింది. వచ్చే ఏడుపును దిగమింగుకుని ఇష్టం లేకపోయినా క్రిష్ణవేణి చేతిలో ఉన్న చీరలలో ఒక చీర సెలక్ట్ చేసి ఆమెకు అందించింది.

"ధ్యాంక్స్" అని చెప్పి క్రిష్ణవేణి వెనక్కి తిరిగిన వెళ్ళిన వెంటనే సురేఖ గబగబా ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి మంచం మీద పడ్డది. ఏడుపును ఆపుకోలేకపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.

                                                                       ***********************************

సాయంత్రం ఆరు గంటలు.

సాగర్ ఇంటికి చేరాడు. సురేఖ బాగా టయర్డ్ గా కనబడింది.

"ఏమిటోయ్...ఇక్కడ ఎప్పుడూ ఉత్సాహంగా తిరిగే సురేఖ అనే అమ్మాయి ఉండేది...నువ్వు గాని చూశావా?" సురేఖ బుగ్గ గిల్లుతూ అడిగాడు సాగర్.

తన బుగ్గ మీద భర్త ప్రేమగా పెట్టిన చేతిన తోసేసింది సురేఖ.

సురేఖ మూడ్ లో లేదని అర్ధం చేసుకున్న సాగర్ అక్కడ్నించి స్నానాల గది వైపుకు వెళ్ళాడు.

"...ఒక చిన్న విషయానికి ఎప్పుడూ చలాకీగా ఉండే నువ్వు ఇలా మారిపోతావా?...ఎంతో ప్రేమతో బుగ్గ గిల్లిన భర్త చేతిని అలా తొసేశావు" సురేఖ మనసు సురేఖతో పోట్లాడింది.

అంతవరకు "పెళ్ళికి ఎందుకు పిలవలేదు?" అన్న ఒకే ఆలొచనతో లోకాన్నే మర్చిపోయిన సురేఖ అప్పుడు మనసు మార్చుకుని భర్తకు కాఫీ పెట్టటానికి వంటింటి వైపుకు వెళ్ళబోయింది.

"సురేఖా...సురేఖా" అన్న పిలుపు వినబడటంతో గుమ్మంవైపు తిరిగి చూసిందిఎదురుగా క్రిష్ణవేణి రావడం కనిపించింది. గబ గబా ముందు గదిలోకి వచ్చింది సురేఖ .

"సురేఖా...నువ్వింకా బయలుదేరలేదా? కాలనీ గుడిలోనేగా రాధను పెళ్ళి కుతూరు చేస్తున్నారు... ముహూర్తం దగ్గర పడుతోంది. మర్చిపొయావా?...సరే, త్వరగా రెడీ అయి రా...ఇద్దరం కలిసే వెడదాం" చెప్పింది క్రిష్ణవేణి అక్క.

"మమ్మల్ని పెళ్ళికి పిలవలేదు...పత్రిక ఇవ్వలేదు" అని నిజం చెప్పటానికి సురేఖకు అవమానం ఆడ్డొచ్చింది. "అక్కా...మా ఆయన ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చారు. కాసేపట్లో బయలుదేరి వస్తాం. నువ్వు వెళ్ళక్కా" నాగరీకంగా చెప్పేసి ఇంట్లోకి జారుకుంది సురేఖ.

లోపలకు వచ్చిన సురేఖకు కన్నీళ్ళు కుండపోతగా కారినై. తనకు పత్రిక ఇవ్వలేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. వంటింటి వైపు వెళ్ళకుండా మళ్ళీ హాలులోని సోఫాలోనే కూర్చుంది.

"ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు పద్మనాభం గారు...నువ్వు కూడా నాకు కూతురు లాంటిదానివే అని కనబడిన ప్రతిసారి చెప్తారు. బయట మార్కెట్టులో కనబడితే ఏంటమ్మా... ఎందుకు ఇంత ఎండలో తిరుగుతున్నావు! గొడుగు వేసుకురాలేదు .. ఎండ ఆరొగ్యానికి ఎంత చేటో తెలుసా? రా ఇద్దరం కలిసి నా గొడుగులో వెడదాం అచ్చం నా తండ్రిలాగేనే మాట్లాడతారు...అలాంటి ఆయన తన కూతురు పెళ్ళికి నన్నెందుకు పిలవలేదు" సురేఖ మనసు బాధతో నలిగిపోతోంది.

అప్పుడే స్నానం ముగించుకు వచ్చిన సాగర్ సురేఖను చూసి "ఏమిట్రా...అదొలా ఉన్నావు. కావాలంటే పెళ్ళికి వెళ్ళిరా. వాళ్ళు ఖచ్చితంగా పత్రిక ఇవ్వటం మర్చిపోయుంటారు. నువ్వు వెళ్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు." చెప్పాడు.

"మీరు రారా...?"

"పత్రిక ఇవ్వకుండా పిలవని పేరంటానికి ఎలా రాను అని ఆలొచిస్తున్నాను"

"నా భర్త కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు...నన్ను ఎవరూ మర్చిపోరు. పత్రిక ఇవ్వటానికి మర్చిపోయారు అంటే నాకు నమ్మసక్యంగా లేదు" అంటూ కళ్ళు తుడుచుకుంది.

సాగర్ రెండు చేతులతో ఆమెను దగ్గరకు తీసుకుని మనం ఒక పని చేద్దాం. నువ్వు కూర్చుని టీ.వీ చూస్తూ ఉండు. నేను వంట వండుతాను. నా వంట ఎలా ఉంటుందో తెలుసా? ఇన్ని రోజులు వంటను మిస్ చేశామే అని ఫీలవుతావు" ఓదార్పుగా చెప్పాడు సాగర్.

కళ్ళను పూర్తిగా తుడుచుకుని "వద్దండీ" అంటూ ఉత్సాహంగా వంట గదిలోకి వెళ్ళింది సురేఖ. గబగబా వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది.

కాలనీ గుడిలో నుండి సన్నాయి మేళం శబ్ధం జోరుగా వినబడింది. సాగర్ టీ.వీ సౌండ్ పెంచాడు. కిటికీలు మూశేసి .సి. ఆన్ చేశాడు.

.సి. చల్లదనం బయటకు పోకుండా ఉండాలని కిటికీ తలుపులు మూశాను" కారణం చెప్పాడు.

సురేఖ చిన్నగా నవ్వింది.

సురేఖకు మేళతాళాలు వినబడ కుండా ఉండటానికి, ఆమె ఆలొచనలను మార్చటానికి టీవీలో వచ్చే ప్రొగ్రాం గురించి మాట్లాడాడు సాగర్.

కొంత సేపటికి మేళతాళాల శబ్ధం తగ్గింది. సాగర్, సురేఖ భోజనాలు ముగించుకున్నారు. డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి, పాత్రలను వంట గదిలో సర్దేసి బెడ్ రూముకు వచ్చి పడుకుంది సురేఖ.

ఆమే కళ్ళల్లో కన్నీళ్ళూ ధారగా కారినై...తన కన్నీరును సాగర్ కు కనిపించకుండా ఉండటానికి పక్కకు తిరిగి పడుకున్నది సురేఖ.

                                                              ***********************************

వారం రోజుల తరువాత మార్కెట్ లో కనబడ్డారు పద్మనాభం గారు. ఆయన మొహనే అడిగేద్దామనుకుంది సురేఖ. కానీ ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా ఉండటంతో పద్మనాభం గారిని చూసి చూడనట్లు నడిచింది సురేఖ.

"అమ్మా...సురేఖ" సురేఖను పిలిచారు పద్మనాభం గారు.

నడుస్తున్న సురేఖ ఆగింది గానీ వెనక్కి తిరిగి పద్మనాభం గారిని చూడలేదు.

"ఏమ్మా సురేఖా...నన్ను చూడటానికి కూడా ఇష్టపడటం లేదా"

గబుక్కున వెనక్కు తిరిగిన సురేఖ ఏడుస్తూ "నేను కనబడ్డ ప్రతిసారి నువ్వు కూడా నా కూతురువేనమ్మా అంటూ ప్రేమతో పలకరించేరే...అలాంటిది రాధ పెళ్ళికి కాలనీలోని వారందరినీ పిలిచి, నన్ను మాత్రం పిలవకుండా అవమానపరిచేరే...అది న్యాయమేనా?

"నేను ఏదిచేసినా, నీ మంచికోసమే చేస్తానని నీకు తెలియదా?"

"మీ కూతురు పెళ్ళికి నన్ను పిలవకుండా అవమానపరచింది కూడా నా మంచికేనా?”

"అది...అది" అంటూ తటపటాయించారు పద్మనాభం గారు.

"వద్దు అంకుల్... వయసులో నాతో అబద్దం చెప్పి మీ పెద్దరికాన్ని, సంస్కారాన్ని మీరే అవమాన పరచుకోకండీ అంటూ వస్తున్న ఏడుపును దిగమింగుకుని అక్కడ్నుండి వేగంగా వెళ్ళిపోయింది సురేఖ.

బరువైన మనసుతో వెనక్కి తిరిగిన పద్మనాభం గారు మెల్లగా నడుచుకుంటూ మార్కెట్ లో ఉన్న వినాయకుడి గుడికి వచ్చి చేతులెత్తి దైవానికి మొక్కుతూ ఎలా చెప్పను? సురేఖ దగ్గర ఎలా చెప్పను.....పెళ్ళికి పిలవకపోవటానికి నిజమైన కారణం చెబితే సురేఖ తట్టుకుంటుందా?...హాయిగా సాగిపోతున్న సురేఖ సంసార జీవితంలో చిచ్చు పెట్టిన వాడినవ్వను? నిన్ను పెళ్ళిచేసుకోవడానికి ముందే నీ భర్త నా కూతురిని ప్రేమించాడు......అని ఎలా చెప్పను" అని మనసులోనే అనుకుంటూ ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు గొప్ప సంస్కారవంతుడు.

************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)