వెన్నెల…కథ

 

                                                                        వెన్నెల                                                                                                                                                          కథ

ఆ లేఖను చదివిన తరువాత జగపతి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ లేఖలో రాసున్న ఒక్కొక్క అక్షరమూ సాన పడుతున్న కత్తిలో నుండి వెలువడుతున్న నిప్పురవ్వల లాగా అతన్ని కాలుస్తున్నాయి.

తిన్నగా విషయాన్ని మొదలు పెట్టి...లేఖను ముగించింది జగపతి భార్య మేనక.

డబ్బును తరుముకుంటూ, ఎప్పుడు చూడూ పని...పని అంటూ తిరగాలనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు?

మీరు ఇంటికి వస్తారని ఎన్ని రాత్రులు భోజనం చేయకుండా కాచుకోనున్నానో మీకు తెలియదు? కానీ, మీరు...నేను తినేశాను, నువ్వు భోజనం చేసి పడుకో!అని చెప్పేసి పడుకునే వారు!

నా కడుపుకు మాత్రమే ఆకలి వేస్తుందా? చలికి దుప్పటి యొక్క వెచ్చదనం చాలా?

ఇవన్నీ చాలవని వారానికి రెండు మూడు రోజులు 'తాగి ఇంటికి వస్తారు. అడిగితే, 'హు...బిజినస్ లో మనుషులను మాయ చేయటానికి ఇలా 'పార్టీ' ఇవ్వాల్సి వస్తోంది!

ఇలాంటి పరిస్థితుల్లో..........

మీ బిడ్డను కడుపులో మోస్తున్నాను. ఆ విషయం మీతో చెప్పటానికి ఎన్నో రోజులు ప్రయత్నం చేశాను!

నేను చెప్పేది వినటానికి మీకు టైమూ లేదు, ఓపికా లేదు… ఇక నాకు ఓర్పూ లేదు.

అందువల్ల ఒక నిర్ణయానికి వచ్చాను.

నన్నూ, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను ప్రేమించి ఇష్టపడి నన్ను ఏలుకునే ఒకతనితో జీవించదలచుకున్నాను..........

దానితో లేఖ ముగిసిపోయింది!

ఆ లేఖను మళ్ళీ మళ్ళీ చదివాడు జగపతి.

దెబ్బతిన్న పక్షిలాగా జగపతి మనసు గిలగిలా కొట్టుకుంది.

'మేనక గర్భంగా ఉన్నదా? కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటూ ఇంకొకడితో లేచిపోయిందా? ఏంత పెద్ద ఘోరమైన పని చేసింది!

ఎన్ని కథలలో చదివుంటుంది, సినిమాలలో చూసుంటుంది. అమాయకపు ఆడవాళ్ళను ఆశ కలిగించే మాట్లతో ఆకర్షించి, లేపుకు పోయి...వ్యామోహము, వాంఛ తీర్చుకున్నాక డబ్బునూ, నగలనూ అపహరించి, రోడ్డు మధ్యలో నిలబెట్టి వెళ్ళే విపరీతాలు జరుగుతున్నాయే!

డబ్బు, నగలు అని జ్ఞాపకం వచ్చిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళి బీరువాను తెరిచి చూశాడు. యాభై వేల రూపాయలు, ముప్పై సవర్ల నగలు లేవు.

"అయ్యో...!" అంటూ నోరు తెరిచి తలబాదుకున్నాడు. ఎవరో తనని బోర్లా పడుకోబెట్టి గుండెల మీద తొక్కుతున్నట్టు అనిపించింది.

'ఇవన్నీ పోతే పోనీ. కానీ, మేనక...ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ!

'ఇప్పుడు ఏం చేయను? ఎవరి దగ్గర చెప్పను? ఎవరి దగ్గరైనా చెప్పదగిన విషయమా ఇది? అయినా కానీ, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారే...! ఏం సమాధానం చెప్పను?

"డబ్బు...డబ్బూ" అని తిరిగేనే! పార్టీ ఇచ్చి, నేనూ తాగి...ఇంటిని మరిచిపోయానే. ఆమె ఫీలింగ్స్ ను ఉదాసిన పరచి, ఉన్నతమైన జీవితాన్ని నాశనం చేసుకున్నానే.

మేనక కోసం కొంచం సమయం వెచ్చించి ఉండాల్సింది. మనసు విప్పి ఆమెతో మాట్లాడి ఉండాలి!

"ఏంటయ్యా...ప్రొద్దుట్నించి ఇళ్ళు తాళం పెట్టే ఉంది. మేనక ఎక్కడ?"

కలత చెంది, గిల గిలా కొట్టుకుంటూ బయటకు వచ్చిన జగపతిని, పక్కింటి జానకి అక్క అడిగిన ప్రశ్న అతనికి చెంపమీద కొట్టినట్టు అనిపించింది.

గబుక్కున జవాబు చెప్పలేకపోయాడు. తరువాత తమాయించుకుని "వాళ్ళ అమ్మను చూడటానికి ఊరికి వెళ్ళింది..." అని చెప్పేసి, ఎటు వెళ్ళాలో తెలియక కాళ్ళు ఎటువెడితే అటు వెళ్ళాడు.

ఆకలి వేయలేదు. తాగాలనిపించలేదు. రాత్రి చాలాసేపు అయిన తరువాత ఇంటికి వచ్చాడు.

'ఇప్పుడా వచ్చేది? ఎక్కడికి వెళ్లారు? మీకొసం ఎంతసేపు వెయిట్ చెయ్యను?'

వాకిట్లో నిలబడి మేనక ప్రశ్నలు అడుగుతుందని ఒక చిన్న ఆశ మదిలో మెదిలింది  జగపతికి.

ఇంటికి తాళం వేసుంది.

ఆ రోజు రాత్రి నరకంగా గడిచింది.

ఆ రోజు మాత్రమే కాదు...మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయాడు జగపతి.

తలుపు తడుతున్న శబ్ధం విన్నప్పుడల్లా మేనకనే అయ్యుంటుందని పరిగెత్తుకు వెళ్ళి తలుపు తెరిచాడు.

పాలవాడో, కేబుల్ టీవీ అతనో....అని ఎవరో ఉంటారు. ఆమె రాలేదు!

'ఆఫీసుకు వెళ్ళకుండా, పిచ్చిపట్టిన వాడిలాగా అలమటించాడు.

'పోలీసులకు వెళదామా? మేనక అమ్మ, నాన్నలకు విషయం చెప్పొద్దా?' అని ఆలొచించాడు.

మళ్ళీ తలుపు కొట్టే శబ్ధం వినబడింది. గబ గబా వెళ్ళి తలుపు తెరిచాడు. ఆశ్చర్యపోయాడు.

చేతిలో సూట్ కేసు సమేతంగా మేనక. వాకిట్లో నిలబడిపోయిన జగపతిని తోసుకుంటూ లోపలకు వెల్లింది. సూట్ కేసు లో ఉన్న, నగలు, డబ్బు తీసి బయటపెట్టి చెప్పింది:

"ఏమిటీ...లేచిపోయాను అనుకున్నారా? అలా గంతా వెళ్ళను! వెడితే ఏమవుతుందో అన్నది మీరు గ్రహించాలి...అందుకే లెటర్ రాసి పెట్టి, మూడు రోజులుగా నా స్నేహితురాలి ఇంట్లో ఉండి వస్తున్నాను"

కలలోంచి బయట పడ్డట్టు తల విదిలించాడు జగపతి.

మూడు రోజులుగా పడ్డ ఆందోళన, నొప్పి, వేదన, నిస్సహాయత, కన్నీళ్ళూ అన్నీ కరిగిపోయినై. ఆ రోజు రాత్రి...ఆకాశంలోనూ, ఇంట్లోనూ, జగపతి మనసులోనూ వెన్నెల విరబూసింది!

ఆ తరువాత నుండి వారిద్దరి జీవితం హయిగా గడిచింది.

********************************************************సమాప్తం****************************************************


కామెంట్‌లు

  1. తాను లేకపోతే ఎలా ఉంటుందో రియలిస్టిక్ గ చూపటానికి మాలతి తెలివిగ చేసిన పనికి మెచ్చుకోవాలి.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)