గురువు (మినీ కథ)
దైవం కంటే మిన్న అయినవాడు గురువు. మనకు రెండు జీవన విధానాలు ఉన్నాయి- ఆధ్యాత్మికం, లౌకికం. వీటిని సమన్వయం చేస్తూ- మానవ జీవన విధానానికీ, వికాసానికీ, దోహదం చేస్తూ మార్గ నిర్దేశనం చేసేవాడే గురువు. గురువంటే విద్య నేర్పించే పెద్దలు అని మాత్రమే అర్ధం కాదు. ఎవరైనా సరే, మంచిన భోదించే ప్రతి ఒక్కరూ గురువులే.
మరి ఈ మినీ కథలో గురువు ఎవరో తెలుసుకోండి?
*****************************************************************************************************
రామచంద్ర రావ్ గారికి ఒక్కడే కొడుకు. నార్త్ ఇండియాలోని గౌహాతీలో ఉన్నాడు. కొడుకు, భార్యతో పాటూ స్వగ్రామం వచ్చాడు.
మనవుడ్ని చూసిన రామచంద్ర రావ్ గారు వాడ్ని దగ్గరకు పిలిచి ముద్దాడుతున్నారు. అప్పుడు ఆయన కొడుకు ఆయన దగ్గరకు వచ్చాడు.
“నాన్నా వాడికి ఈ రెండు నెలలూ 'సెలవులే'...మీరు వాడికి గురువుగా ఉండి మన సంస్కృతి, మంచి అలవాట్లూ నేర్పించండి. బాగా నేర్పిస్తే మంచివాడుగా పెరుగుతాడు. వాడికి స్కూల్ తెరిచే ముందు వచ్చి తీసుకు వెడతాం" అని చెప్పి భార్యతో పాటూ తిరిగి గౌహాతీకి వెళ్ళిపోయాడు రామచంద్ర రావ్ గారి కొడుకు.
తాతయ్యకు చాల గర్వంగా ఉన్నది. 'మంచి అలవాట్లను ఒక్కొక్కటి మర్చిపోకుండా, వదలకుండా మనవడికి నేర్పించాలి అని తీర్మానించుకున్నాడు.
"అబీ...రారా! మన మామిడి, కొబ్బరి తోటకు వెళ్ళోద్దాం" అని తాతయ్య చెప్పటంతో, చెప్పులు వేసుకుని ఉత్సాహంగా బయలుదేరాడు మనవడు.
ఇద్దరూ మెట్లు దిగి క్రిందకు దిగినప్పుడు, వాకిట్లో పడుకున్న వాళ్ళ పెంపుడు కుక్క వాళ్ళకు ఎదురుగా వచ్చి ముందరి రెండు కాళ్ళనూ జాపి...వొళ్ళు వంచి, తలను నేలకు ఆనించింది. 'బద్దకం’ తీర్చుకుంటోంది అనుకున్నారు తాతగారు.
మనవుడు మాత్రం రెండు చేతులూ జోడించి కుక్క కు "నమస్తే" అన్నాడు.
కుక్క...తల ఆడిస్తూ, తోక ఊపుకుంటూ పరిగెత్తింది.
వాళ్ళు నడిచి వెడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి వచ్చింది.
గుడి ముందు మనవడు ఆగి, చెప్పులు విప్పి, చెంపలు వేసుకుని నమస్కరించాడు.
తరువాత తోటలో కొబ్బరి బోండాం కొట్టి ఇచ్చారు.
ఆ కొబ్బరి బోండాం నీళ్ళు తాగిన మనవుడు పరిగెత్తుకు వెళ్ళి ఒక చిన్న బకెట్ తో నీళ్ళు తీసుకు వచ్చి, కొబ్బరి చెట్టు వేర్లకు పోశాడు. కొబ్బరి చెట్టుకు ధన్యవాదాలు చెబుతున్న దోరణితో.
చూస్తున్నాడు తాతయ్య.
రాత్రి కొడుక్కు ఫోన్ చేశాడు రామచంద్ర రావ్.
“అబ్బాయి! మనవుడు ఇంకో నెల ఇక్కడ ఉండనీ. వాడి దగ్గర నుండి మేము చాలా మంచి విషయాలు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. వాడికి నేను గురువుగా ఉండక్కర్లేదురా...వాడే మాకు గురువు." అన్నాడు.
********************************************సమాప్తం***********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి