మాటల బాణాలు...(కథ)

 

                                                                  మాటల బాణాలు                                                                                                                                                  (కథ)

ప్రతి వ్యక్తి జీవితంలో మాట అనేది ఎంతో విలు వైనది. ప్రతి చర్యా, ప్రతి కదలికా ప్రతి పనీ మాటతోనే ముడిపడి వుంది. ప్రాంతమేదైనా, దేశమేదైనా భాషేదైనా మదిలో మెదిలే భావ ప్రకటనల రూపమే "మాట" .

మాటల్ని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు. మాటంటే వాంగ్మూలం, మనసుకు అద్దం. గొంతులోంచి పొంగుకొచ్చే ప్రతి మాటా...మొత్తంగా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిరాశావాదాన్ని మోసుకొచ్చే మాట మాట్లాడిన ప్రతిసారీ శరీరం కించిత్ కుంచించుకుపోతుంది. భృకుటి కాస్త ముడిపడుతుంది. కళ్లు కాసేపు శూన్యంలోకి చూస్తాయి. గుండె బలహీనంగా కొట్టుకుంటుంది. మెదడు మరింత బేజారైపోతుంది. నిశ్శబ్ద విషాద సంగీతమేదో మన చెవుల్ని తాకుతుంది.

అదే, ఆశావాదాన్ని ప్రతిబింబించే మాట నాభిలోంచి పొంగుకొస్తున్నప్పుడైతే...ఛాతీ రెండంగుళాలు విస్తరిస్తుంది. కళ్లు మెరుస్తాయి. మెదడులో ఉత్సాహ రసాయనాల వూట పెరుగుతుంది. ఒక్క మాటకే అంత శక్తి ఉంటే...రోజూ అప్రయత్నంగా వాడిపడేసే పదాలు ఇంకెంత ప్రభావితం చేస్తాయో!

*****************************************************************************************************

రాజేష్ బాగా నీరసంగా ఉన్నాడు. ఆరొగ్యం బాగుండక కాదు. మనసు బాగుండక పోవడంతో.

"మీ అమ్మగారిని చూసుకోవటమా నా పని. అందుకా నన్ను పెళ్ళి చేసుకున్నారు. మీకూ, మన పిల్లాడికి చేయటం వరకే నా డ్యూటీ. మీ అమ్మగారికి చాకిరీ చేయడం నా డ్యూటీ కాదు. అందుకని ఇక మీదట ఆవిడ మాట నా దగ్గర ఎత్తకండి" అంటూ ముందు రోజు రాత్రి రాజేష్ భార్య సంధ్య రాజేష్ తో కఠినంగా మాట్లాడటమే అతని మనో వేదనకు కారణం.

రాత్రంతా నిద్ర సరిగ్గా లేకపోవడంతో రాజేష్ కు తలనొప్పి మొదలయ్యింది. తెల్లవారు జామున బెడ్ రూములో నుండి హాలులోకి వచ్చి సోఫాలో పడుకున్నాడు. తల్లి గురించిన ఆలొచనలు అతన్ని వేదిస్తూ కలత పెడుతుంటే అతనికి నిద్ర ఎలా పడుతుంది. పడుకోలేక, సోఫాలో కూర్చున్నాడు.

ఏడింటికి నిద్ర లేచిన భార్యతో "సంధ్యా...తలనొప్పిగా ఉంది. వేడిగా కాఫీ ఇస్తావా" అని అడిగాడు.

సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన సంధ్యను తలచుకుని మరింత బాధపడ్డాడు.

మరో అరగంట తరువాత కాఫీ గ్లాసు తీసుకు వచ్చి టీపా మీద పెట్టి వెళ్ళిపోయింది సంధ్య.

కాఫీ గ్లాసు తీసుకుని కాఫీ తాగుతూంటే కొడుకు నిరంజన్ లేచి రావడంతో, తాగుతున్న కాఫీ గ్లాసును టీపా మీద పెట్టి, వాడిని రెడీ చేయడానికి వాడి చేయి పుచ్చుకున్నాడు రాజేష్.

డాడీ!... రోజు ఆదివారం. స్కూల్ లేదు. త్వరగా రెడీ అవక్కర్లేదు" అంటూ తండ్రి చేతిని విధిలించుకుని బాత్ రూమ్ వైపు పరిగెత్తాడు నిరంజన్.

అదిగూడా మర్చిపోయినందుకు తనలో తానే సిగ్గు పడ్డాడు రాజేష్. తిరిగి సోఫాలో కూర్చోబోతూండగా "పేపర్" అన్న కేక విని, గేటు దగ్గరకు వెళ్ళి, పేపర్ బాయ్ గేటులో పెట్టిన న్యూస్ పేపర్ తీసుకుని లోపలకు వచ్చి సోఫాలో కూర్చుని పేపర్ చదవబోయాడు. ఆలోచనలతో సతమత మవుతున్న రాజేష్ కి పేపర్ చదవ బుద్ది కాలేదు. పేపర్ ను టీపా మీద పడేసి, సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు రాజేష్.

టీవీ లో న్యూస్ వస్తున్న శబ్ధం విని కళ్ళు తెరిచాడు.

ఏమీ జరగనట్లు, సొఫాలో వొయ్యారంగా కూర్చుని టీవీ లో వస్తున్న న్యూస్ వింటోంది సంధ్య. పక్క నున్న సింగిల్ సీటర్ సోఫాలో కొడుకు నిరంజన్ ఐపాడ్ పుచ్చుకుని గేమ్ ఆడుతున్నాడు.

ఇష్టం లేకపోయినా టీపా మీదున్న న్యూస్ పేపర్ ను తీసుకుని ముఖానికి అడ్డుపెట్టుకున్నాడు రాజేష్

సడన్ గా ఏదో ఆలొచన వచ్చిన నిరంజన్, గేమ్ ఆడటం ఆపి "డాడీ... రోజు ఒకటో తారీఖు కదా. రోజు బామ్మ మనింటికి రావటం లేదా?" అని అడిగాడు.

కొడుక్కి ఏం చెప్పాలో అని రాజేష్ ఆలొచిస్తుంటే "నిరంజన్...బామ్మను తీసుకురావటానికి డాడీ వెళ్ళకపోయినా, మీ పెద్దనాన్న ఆవిడ్ని తీసుకు వచ్చి ఇక్కడ దింపుతారురా...నువ్వేమీ బాధ పడకు" టీవీ వైపున్న చూపును మార్చకుండానే పరోక్షంగా భర్తను వెక్కిరిస్తున్నట్టు చెప్పింది సంధ్య.

రాజేష్ ఏదో మాట్లాడాలనుకున్నాడు. మాట్లాడితే మళ్ళీ సంధ్య రాద్దాంతం చేస్తుందేమోనన్న భయంతో మాట్లాడకుండా ఉండిపోయాడు.

"మీ పెద్దమ్మకు, ఆమె మాటలు వినే మొగుడు దొరికాడు. అందరికీ అలాంటి మొగుడు దొరుకుతాడా ఏమిటి?" కొడుకుతో మాట్లాడుతున్నట్టు రాజేష్ ను మాటల బాణాలతో గుచ్చింది సంధ్య.

తల్లి మాటలలోని భావం నిరంజన్ కు అర్ధంకాలేదు.

లోపు టీపా మీదున్న రాజేష్ సెల్ ఫోన్ మోగింది. సెల్ ఫోన్ స్క్రీన్ మీద రాజేష్ అన్నయ ఫోటో కనబడింది. అది చూసిన సంధ్య "తీయండి...మీ అన్నయ్యే. ఒకాటో తారీఖైతే అద్దె అడిగే హౌస్ ఓనర్ లాగా మాట్లాడతారు చూడండి" ఎగతాలిగా మాట్లాడింది సంధ్య.

రాజేష్ ఫోన్ తీసుకుని "చెప్పన్నయ్యా...వదిన, పిల్లలు బాగున్నారా?" అంటూ సోఫాలో నుండి లేచి నడుస్తూ కొంచం దూరంగా వెళ్ళాడు.

సంధ్య చెప్పినట్లే రాజేష్ అన్నయ్య తిన్నగా విషయానికి వచ్చాడు "ఏమిట్రా రాజేష్...అమ్మని తీసుకు వెళ్ళటానికి ఇంకా రాలేదు. ఏదైనా పని మీద ఉన్నావా? నీకు వీలు కుదరకపోతే చెప్పు...సాయంత్రం నేను వచ్చేటప్పుడు తీసుకు వచ్చి దింపుతా. మీ వదినకు రేపు హాస్పిటల్లో చెక్ అప్ ఉందట" గబ గబా మాట్లాడాడు రాజేష్ అన్నయ్య.

"అన్నయ్యను నిందించి ప్రయోజనం లేదు. వదిన చెప్పిచ్చినట్లు అప్ప చెబుతున్నాడు" మనసులోనే చెప్పుకున్నాడు రాజేష్....."అదంతా ఏమీ లేదన్నయ్యా. రాత్రి ఆఫీసు నుండి వచ్చేటప్పటికి బాగా లేటయ్యింది. లేటుగా నిద్ర లేచాను. లేకపోతే ప్రొద్దున్నే వచ్చేవాడిని. మీరు ఇంట్లోనే ఉంటారు కదా? నేను ఇంకో గంటలో వస్తాను" అని చెప్పి తిన్నగా బెడ్ రూముకు వెళ్ళి టవల్ తీసుకుని స్నానాల గదిలోకి వెళ్ళాడు.

స్నానం చేస్తున్నంత సేపూ తల్లిని తీసుకు వచ్చిన తరువాత ఇంట్లో జరగబోయే యుద్దం గురించే ఆలొచించాడు. యుద్దానికి భయపడి తల్లిని తీసుకు రాకుండానూ ఉండలేడు. సారి యుద్దం తీవ్రంగా ఉంటుందని తెలుసు. మానసిక గాయాలు కూడా పెద్దవిగానే ఉంటాయనే ఆలొచన అతనిలో వొణుకు తెప్పించింది. "భగవంతుడా...సంధ్య లో మార్పును తీసుకు రావటం నీ ఒక్కడి వల్లే సాధ్య పడుతుంది. మార్పు ఒక్కటే రోజు జరగబోయే యుద్దాన్ని ఆపగలదు. సంధ్యలో మార్పు తీసుకురావటం నీ చేతిలోనే ఉంది. ఏం చేస్తావో నీ ఇష్టం " స్నానాల గదిలోనే దేవుడుని వేడుకున్నాడు.

స్నానం ముగించుకుని, డ్రస్సు మార్చుకుని, హాలులోకి వచ్చి మేకుకు తగిలించిన మోటార్ సైకిల్ కీస్ తీసుకుంటున్నప్పుడు కొడుకు నిరంజన్ తల్లితో మాట్లాడటం రాజేష్ విన్నాడు.

"మమ్మీ...నాకొక సందేహం" అన్నాడు

"ఏమిటా సందేహం" అడిగింది సంధ్య.

"బామ్మకు డాడీ, పెద్దనాన్న అని ఇద్దరు కొడుకులు. అందువలన బామ్మను ఇద్దరూ మార్చి మార్చి చూసుకుంటున్నారు. నేను ఒకడే కొడుకును. నీకు బామ్మ వయసు వస్తే ఒక నెల మాత్రమే ఉంచుకుంటాను. తరువాత నెల నువ్వెక్కడికి వెల్తావు"

చెంప మీద ఎవరో చెల్లున కొట్టినట్టు అనిపించింది సంధ్యకు. కొడుకు దగర నుండి ఎదురు చూడని ప్రశ్నతో అమె ముఖమంతా చెమటతో తడిసిపోయింది.

తాను భార్యను అడగలేని ప్రశ్నను కొడుకు అడిగినందుకు రాజేష్ మనసు ఆనంద పడింది. కానీ పిల్లవాడి మనసులో పడ్డ విష బీజం పెద్ద వృక్షంగా మారకూడదని, బీజాన్ని వెంటనే ఏరిపారేయాలనే ఆలొచన రావడంతో...

"నిరంజన్...అలా ఎప్పుడూ ఆలొచించ కూడదు. చిన్న పిల్లలప్పుడు, పీల్లలకొసం తమ సుఖాలను త్యాగం చేసి వాళ్ళను పెద్దవాళ్ళుగా, ప్రయోజకులుగా చేయడానికి కష్ట పడే తల్లి-తండ్రులను వాళ్ల వయసైన కాలంలో పిల్లలే ప్రేమగా చూసుకోవాలి. వృద్దులైన తల్లి-తండ్రులను భాద్యతగా తీసుకుని వాళ్ళను చూసుకోవాలి. నువ్వు సగం, నేను సగం అని వేరు చేసే పనిగా చూడ కూడదు. బామ్మ విషయంలో, బామ్మ భాధ్యత ఆమె కొడుకులైన మా ఇద్దరికీ ఉంది. కొడుకులిద్దరినీ సమంగా చూడాలి కనుక బామ్మే ఇద్దరి దగ్గరా మార్చి, మార్చి ఉంటోందిఅర్ధమైందా?” విడమరచి చెప్పాడు రాజేష్.

"అర్ధమయ్యింది డాడీ" అని కొడుకు సమాధనం ఇచ్చిన తరువాత భార్య సంధ్య వైపు చూడకుండా వరాండాలోకి వెళ్ళి మోటార్ సైకిల్ తీసే పని మొదలుపెట్టాడు రాజేష్.

కొడుకు విసిరిన మాటల బాణం, భర్త కొడుకుకు చెప్పిన మాటల ఉపదేశం బాణాలలా మనసులో గుచ్చుకుని హృదయాన్ని కుదుపుతుంటే సోఫాలో కూర్చున్న సంధ్య ఒక్క పరుగున వరాండాలోకి వెళ్ళీ రాజేష్ ను చూసి "ఉండండి...అత్తయ్యగారిని తీసుకురావటానికి నేనూ వస్తాను" అని చెప్పింది.

రాజేష్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

అవి ఆనందభాష్పాలని సంధ్యకు అర్ధమయ్యింది.

***************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)