ఈ ధోరణి వద్దు...! (కథ)

 

                                                                 ఈ ధోరణి వద్దు...!                                                                                                                                                               (కథ)

"అబ్బాయిలూ! పది రోజుల నుంచి చూస్తున్నా, మీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు. గొడవ గురించి నేను మాట్లాడదలచుకోలేదు. గొడవలో తీర్పు ఇవ్వదలుచుకోలేదు.... నా బాధంతా మీ మౌనం గురించే. నా తరువాత జనరేషన్లో ఉన్నది మీరిద్దరే. మీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోకుండా ఉండిపోతే...బంధుత్వాలు ఏమైపోతాయి?

రోజు ప్రపంచం ముడుచుకుపోయి సెల్ ఫోనుగా చేతుల్లో ఉంటోంది. అదేలాగా మనిషి కూడా పిల్లల్లు, ఉమ్మడి కుటుంబాలూ లాంటివి వదిలేసి...ఇప్పుడు ఒక దంపతులకు ఒకే ఒక బిడ్డగా కుటుంబాలను చిన్నవి చేసుకుంటున్నారు.

ప్రపంచమాంతటనీ ఒకే కుటుంబంలా భావించాలని మన సంప్రదాయ ధర్మం చెబుతోంది...కానీ కాలంలో 'నా వరకే' అన్నంతగా స్థాయి దిగజారిపోతోంది. కుటుంబంలో అత్యంత ఆత్మీయంగా ఉండాల్సిన వారే పరాయి వ్యక్తులవుతున్నారు. ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు, బాంధవ్యాలు పెద్దగా కనిపించడం లేదు.... ధోరణి వద్దు.." అని తన కొడుకులకు తండ్రి ఎందుకు చెబుతున్నాడు. తెలుసుకొవటానికి కథ చదవండి

************************************************************************************************

హాలులో ఉన్న సోఫాలో ఒంటరిగా కూర్చున్న చంద్రశేఖరానికి రెండు రోజులుగా మనసు బాగోలేదు. కారణం ఆదిత్య-ఉదయ్ మధ్య మాటలు ఆగిపోయాయి.

వీళ్ళిద్దరూ చంద్రశేఖరం గారి కొడుకులు. ఆదిత్య పెద్దవాడు, ఉదయ్ అతని కంటే మూడేళ్ళు చిన్నవాడు. చదువు ముగించి ఉద్యోగానికి వెడుతున్నారు.

ఆదిత్యకు పెళ్ళి అయ్యింది, ఉదయ్ కి ఇంకా పెళ్ళి కాలేదు.

ఇద్దరూ ఎంతో అన్యొన్యంగా, ప్రేమ, అభిమానంతో కలసిమెలసిఉండేవారు. అలా ఉండే వాళ్ళిద్దరి మధ్య రెండు-మూడు రోజులుగా మాటలు లేవు. ఒకరి ముఖం ఒకరు చూసుకోక, కనబడితే మొహం చాటేసుకుని వెడుతున్నారు. గత పదేళ్ళ కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు.

చిన్న వయసులో, అంటే వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకరి పెన్సిల్ ఒకరు లాక్కునే వారు. గోడవలు పడే వారు. తరువాత చిన్న చిన్న పోట్లాటలు...చివరగా ఇద్దరూ మూర్ఖత్వంగా కొట్టుకోవడం, చొక్కాలు చింపుకోవడం చేశేవారు.

వాళ్ళే మార్తారులే అని ఓర్చుకుని, ఓర్చుకుని ఎదురు చూసిన తల్లితండ్రులకు ఓపిక నశించింది. ఒక రోజు ఇద్దరూ పోట్లాడుకుంటుంటే "ఇలా ఇద్దరినీ అబ్బాయులగా కని, వాళ్ళు కొట్టుకుంటుంటే చూస్తూ ఉండటం కంటే...ఒకర్ని అమ్మాయిగా కని పారేసుండాలి!" అని పెద్దగా అరిచింది తల్లి....... రోజు నుండి ఇద్దరి మధ్య అరుపులు, పోట్లాటలు లేవు.

అప్పట్నుంచి వాళిద్దరూ కలిసిమెలసి ఉన్నారు. కాలేజి చదువులకు వెళ్ళారు.

"హమ్మయ్య...అన్నదమ్ములిద్దరూ అన్యోన్యతగా ఉంటున్నారు" అని చంద్రశేఖరం సంతోష పడుతున్నప్పుడు, ఒక రోజు అన్నదమ్ములిద్దరూ కలిసి చదువుకునే గదిలో నుండి గట్టిగా అరుపులు వినబడ్డాయి...కాసేపట్లో చంప మీద కొట్టిన శబ్ధం వినబడింది. ఏర్రబడిన ముఖం, కళ్ళళ్ళో నీటితో గది తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు ఉదయ్.

"ఏమిట్రా ?" హాలు సోఫాలో కూర్చుని రోజు పేపర్ చదువుతున్న చంద్రశేఖరం ఉదయ్ ని అడిగాడు.

"ఏమీ లేదు"

"గదిలో ఏదో జరిగిందని నీ ముఖమే చెబుతోంది...ఏం జరిగింది?"

"ఏమీలేదు నాన్నా! చిన్న గొడవ. గబుక్కున ఆదిత్య చెయ్యి చేసుకున్నాడు. తిరిగి కొడితే తట్టుకోలేడు. అన్నయ్యే కదా అని నేను తిరిగి కోట్టలేదు" అని చెప్పి అక్కడి నుండి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు.

చిన్న వాడైనా మచ్యూర్డ్ గా ఆలొచించి తన మీద చెయ్యి చేసుకున్న అన్నయ్యను తిరిగి కొట్టలేదంటే ఉదయ్ మనసు కొంత పరిపక్వత చెందిందని అర్ధం చేసుకున్నా, చంద్రశేఖరం పెద్దగా సంతోష పడలేక పోయాడు. కారణం మెచ్యూరిటీ అనేది ఇద్దరికీ రావాలి. ఆదిత్యకు ఎప్పుడొస్తొందో, అంతవరకు ఉదయ్ శాంతంగా ఉండాలే అనే ఆలొచన చంద్రశేఖరం సంతోషానికి అడ్డుపడింది.

"సరే...సరే...గోడవపడకుండా ఉండండిరా" అంటూ ఇద్దరికీ ఒకేలాగా నచ్చ చెప్పి వాళ్ళిద్దరినీ సమాధన పరిచేడు చంద్రశేఖరం.

రెండు రోజులు మాట్లాడుకోకుండ ఉన్న అన్నదమ్ములిద్దరూ మూడో రోజు సహజమైన వాతావరణానికి తిరిగి వచ్చారు.

కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక ఆక్సిడెంట్ వారిద్దరినీ ప్రాణ మిత్రులుగా మార్చింది.

చంద్రశేఖరం తన కుటుంబ శభ్యులతో కలిసి తన చిన్ననాటి స్నేహితుడి కొడుకు పెళ్లికి ఒక వ్యానులో బయలుదేరాడు. ఆదిత్య డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఉదయ్ వెనుక సీట్లో తల్లి-తండ్రులుతో కలిసి కూర్చున్నాడు. రాత్రి పది గంటలకు బయలుదేరిన వ్యాను, అరగంట తరువాత డ్రైవర్ నిద్ర మత్తు వలన రోడ్డుకు పక్కగా ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొన్నది. డ్రైవరుకు, మిగిలిన శభ్యులకు తేలికపాటి దెబ్బలు తగిలాయి గానీ ఆదిత్యకు మాత్రం పెద్ద దెబ్బే తగిలింది. ఎడం చేతి వేళ్ళకు, ఎడం కాలుకు బాగా దెబ్బలు తగిలాయి.ఎడం చేతి రెండు వేళ్ళు చితికిపోయాయి. కాలుకు పెద్ద ఫ్యాక్చర్ అయ్యింది.

ఆరు నెలలు మంచం మీదే ఉండాల్సి వచ్చిన ఆదిత్యను తల్లితండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు తమ్ముడు ఉదయ్.

తమ్ముడి సేవలు చూసి పూరించిపోయాడు ఆదిత్య. అప్పటి నుంచే వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా అయ్యారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్నేహితులుగా మారారు.

అలాంటి కొడుకులిద్దరూ ఇప్పుడు మనస్థాపంతో మాట్లాడుకోవటంలేదు. ఇద్దరి మధ్య మాటలు లేవు. వయసొచ్చిన తరువాత కూడా కొడుకులిద్దరూ గొడవలు పడుతుంటే తల్లితండ్రులకు మనసు నొప్పి పుట్టకుండా ఎందుకుంటుంది?

చాలా సేపు ఆలొచించిన చంద్రశేఖరం "దేవీ" అంటూ తన భార్యను పిలిచాడు.

వంట గది నుండి చేతులు తుడుచుకుంటూ భర్త దగ్గరకు వచ్చి "ఏమిటండి?" అని అడిగింది.

"మన అబ్బాయిలిద్దరూ మాట్లాడుకోవటం లేదు...తెలుసా?"

"తెలుసు"

"వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏమిటి?"

"నాకు తెలియదు"

"నువ్వు అడగలేదా?"

"లేదు"

"ఎందుకని?"

"అది నాకు సంబంధం లేని విషయం...ఎప్పటిలాగా మీరే అడగండి" అనేసి మరో మాట మాట్లాడకుండా వంట గదిలోకి వెళ్ళిపోయింది.

"నాన్నకు ఇష్టం ఉండదు...కోపమోస్తుంది, తిడతారు, కొడతారు!" అని కన్న బిడ్డలను భయపెట్టి, వాళ్ళ ప్రేమాభిమానాలను తనవైపుకు తిప్పుకునే తల్లులకు భిన్నంగా ఉంటుంది ఈవిడ.

పిల్లలిద్దరిలో ఎవరు తప్పు చేసినా ఖండించదు...అంతెందుకు అసలు పట్టించుకోదు. కారణం "నువ్వు వాడికి సపోర్టా? నీకు వాడంటేనే ఇష్టం, వాడి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తావు...నా మీద నీకు అసలు ప్రేమే లేదు..." అని ఒకరి తరువాత ఒకరు తప్పు చెప్పడం భాధను కలుగజేయటేమ కాకుండా, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేకొద్ది అది వాళ్ళ గుండెల్లో పదిలమైపోతుందనే భయం.

అందువల్ల వాళ్ళిద్దరూ ఎంత గొడవపడ్డా వాళ్ళ గొడవలలో తలదూర్చదు. భర్తే అడిగి తెలుసుకోవాలి. అలా భర్త అడుగుతున్నప్పుడు కూడా ఆమె కలగచేసుకోదు.

తరువాత.

"రోహిణి!"...కోడల్ను పిలిచాడు చంద్రశేఖరం.

"ఏమిటి మావయ్యా" తన గది నుండి వేగంగా వచ్చిన రోహిణి అడిగింది.

"నీ భర్తకూ...నీ మరిదికీ మధ్య గొడవేమిటో?"

పోయిన వారం మీరు ఊరికి వెళ్ళినప్పుడు...ఇంట్లో అందరం ఒకటిగా కూర్చుని భోజనం చేస్తున్నాం...అప్పుడు ఉదయ్ తన కంచంలోని మామిడి పండును తినేసి, ఆయన కంచంలో ఉన్న మామిడి పండును అడిగాడు.......ఆయన "ఇవ్వను...ఇంత వయసొచ్చినా ఇంకా చిన్న పిల్లాడిలా ఇతరుల కంచాలలో ఉన్నవి అడగడం, అసహ్యం అనిపించటం లేదా నీకు" అని విసుక్కున్నారు.....

ఇందులో అసహ్యం ఏముంది...ఎవరో పరాయి వాళ్ళ కంచంలోది అడగలేదుగా...ఇస్తే ఇవ్వు, ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మానేయి. అంతేకాని పాఠాలు చెప్పకు" అంటూ అరిచాడు.

కాసేపు మౌనంగా కూర్చున్న ఆయన తరువాత "ఇందా తిని తగలడు" అంటూ తన కంచంలోని మామిడి పండును ఉదయ్ కంచంలోకి విసిరేశారు. అది అన్నం మీద పడి అన్నం చిందింది. ఉదయ్ కంట్లో మెతుకులు పడ్డాయి.

ఉదయ్ కి కోపం రావడంతో తినడం మానేసి, కంచం ముందు నుండి లేచి వెళ్ళిపోయాడు...ఇదే మామయ్య జరిగింది. రోజు నుండి ఇద్దరికీ మాటలు లేవు"…కన్న కూతురులాగా, ఇంట్లో జరుగుతున్న తప్పులను తండ్రి దగ్గర అప్పగించినట్లు గడ గడ చెప్పింది కోడలు.

"ఉదయ్ కి సారి చెప్పి సమాధాన పరచమని నువ్వు నీ భర్త దగ్గర చెప్పలేదా?"

"అలా చెప్పలేదు మామయ్యా"

" మరి ఇంకెలా చెప్పావు"

మీ తమ్ముడు కోపంగా ఉన్నాడు, సమాధాన పరచండి అని ఆయనతో చెప్పినప్పుడు, ఆయననేను తప్పు చేయలేదు. ఎప్పుడూ లాగానే సరదాగా మాట్లాడి మామిడి పండును వాడి కంచంలో పడేశాను. అది కంచంలోని అన్నం మీద పడి అన్నం చింది కళ్ళల్లో పడుతుందని నేను ఎదురుచూడలేదు. దీన్ని వాడు సాధారణంగా తీసుకుని నాతో మాట్లాడాలే గాని, దానికి విరుద్దంగా కోపంతో మాట్లాడకుండా ఉండటం సరికాదు.తప్పు వాడిదేఅని చెబుతున్నారు మామయ్యా.

"ఉదయ్ దగ్గర మాట్లాడేవా?"

మీ అన్నయ్య చేసింది తప్పే. దీనికంటే పెద్ద తప్పులు చేసినప్పుడు ఒకరికొకరు క్షమించుకోలేదా? మరి ఇప్పుడెందుకు అంత పట్టుదలగా ఉన్నారు?” అని చెప్పి సమాధన పరిచినప్పుడు ఉదయ్ నోరు తెరవలేదు. అతని కోపం తీరలేదు"

"నువ్వైనా ఉదయ్ తో సరిగ్గా మాట్లాడుతున్నావా?"

అయ్యో! నేను మాట్లాడుతున్నాను మామయ్యా. అన్నదమ్ములిద్దరి మధ్య నేను కలుగచేసుకోకూడదు. ఇప్పుడు నా భర్తకు సపోర్ట్ గానో, ఆయనకు భయపడో నేను ఉదయ్ తో మాట్లాడకుండా ఉంటే, రాబోవు రోజుల్లో అది పెద్ద గొడవైపోతుంది. గబుక్కున వాళ్ళిద్దరూ కలిసిపోతే అప్పుడు నేను అతికించలేని అద్దంలాగా ఉండే అవకాశం ఉంది. అందుకని నేను మాట్లాడుతూనే ఉన్నా" ఒత్తి చెప్పింది కోడలు.

కన్న తల్లి కంటే నువ్వు తెలివిగా ప్రవర్తిస్తున్నావు...మంచిదమ్మా...నువ్వెళ్ళి పనిచూసుకో" కోడల్ని పంపించాడు చంద్రశేఖరం.

అక్కడే కూర్చున్న చంద్రశేఖరాన్ని మళ్ళీ ఆలొచనలు చుట్టుముట్టాయి......జరిగింది చాలా చిన్న సంఘటన. పెద్దదిగా తీసుకుంటే పెద్ద సంఘటన. చిన్నదిగా తీసుకుంటే చిన్న సంఘటన. కన్నవారికే భయం తెప్పించే విధంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ద. ఇంతకు ముందు ఇద్దరి మధ్య ఇంతకంటే పెద్ద సంఘటనేలే జరిగాయి. అప్పుడు కోపం తెచ్చుకోకుండా సరదాగా తీసుకుని సహజంగా, ప్రేమగా ఉన్నారు.

అప్పుడంతా రాని కోపం ఇప్పుడు రావడానికి కారణం...మనిషి మనసు ఎప్పుడూ ఒకేలాగ ఉండదు అనేది నిజం కనుక! …చంద్రశేఖరానికి అర్ధమయ్యింది.

సరే...దానికొసమా మౌనం...మాట్లాడుకోకుండా ఉండటం?...రోజులు గడుస్తున్న కొద్దీ మనస్పర్ధ పెద్దదైతేభందుత్వం విడిపోయే అవకాశం ఉన్నదనే ఆలొచన రాగానే సోఫాలో వాలిపోయి తన చిన్న వయసులోకి వెళ్ళారు చంద్రశేఖరం.

అన్నయ్యా, తమ్ముళ్ళు, అక్కలు, చెళ్ళెళ్ళు...అని చంద్రశేఖరంతో పుట్టిన వారు ఎనిమిది మంది, తల్లితండ్రులు...వాళ్ళే కాకుండా తాతయ్య, బామ్మ. గ్రామంలోనే పెద్ద పెంకుటింట్లో అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. పిల్లల మధ్య పోట్లాటలూ,గొడవలు రాని రోజే లేదు.

అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ...అందరూ పిల్లలను సమాధానపరిచేవారు.

పిల్లలు ఒకర్ని చూసి ఒకరు పోట్లాటలు తగ్గించుకుంటూ, ఒకరితో ఒకరు స్నేహంగా ఉండటానికి అలవాటు పడ్డారు. పెద్ద వయసు వస్తున్న కొద్దీ ప్రేమానురాగాలు పెరిగేయే కాని పట్టుదలలు, మాట్లాడకపోవటం చోటుచేసుకునేవి కావు. పెద్దవాళ్ళు అయినాక వారిలొ బంధుత్వం బలపడింది. పెళ్ళిళ్ళు అయ్యి వేరు కాపురాలు పెట్టినా, బంధుత్వం కొనసాగింది....అదే ఉమ్మడి కుటుంబ వాతావరణం.

చంద్రశేఖరానికి పుట్టిందే ఇద్దరు. వాళ్ళిద్దరూ వయసు పైబడినా ఇలా పొట్లాటలు, గొడవలతో కాలం గడిపితే?

రోజుల్లో అంతా ముడుచుకుపోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెదిరిపోయింది. కుటుంబ నియంత్రణ చట్టం ఒత్తిడి లేకుండానే అబ్బాయో, అమ్మాయో...ఇద్దరు పిల్లలతో సరిపుచ్చుకుంటున్నారు. మధ్య కాలంలో ఒక బిడ్డతో ఆపుకోవటమే అత్యుత్తమం అనుకుంటున్నారు. ఒక బిడ్డా తల్లి-తండ్రి ఉద్యోగాల వలనడే కేర్లో పెరుగుతోంది.

తరువాత, చదువు, ఉద్యోగం అంటూ కన్నవారితో కలిసుండక...బంధుత్వం అంటే ఏమిటి? అని అడిగేంత దాకా ప్రపంచం మారిపోయింది. అలా ఉన్నప్పుడు...వీళ్ళిద్దరూ ఇలా గొడవలకు నిలబడితే...?

ఆలొచించను, ఆలొచించను చంద్రశేఖరానికి మనసు నొప్పి పుట్టింది. అయినా ఆయిన్ని ఆలొచనలు విడిచిపెట్టలేదు.

ఆలొచనలతో సతమతమైన చంద్రశేఖరం ఒక నిర్ణయాని వచ్చి...ఉద్యోగాలకు వెళ్ళిన కొడుకులిద్దరికోసం ఎదురు చూస్తూ, సోఫాలోనే కూర్చుండిపోయాడు.

రాత్రి ఏడు గంటలకు ఆదిత్య-ఉదయ్ ఆఫీసుల నుండి ఒక్కొక్కరే ఇంటికి వచ్చారు. ఇద్దరూ కాసేపు రిలాక్స్ అయిన తరువాత "అదిత్యా...ఉదయ్" అంటూ పిలిచారు.

"నాన్నా" అంటూ ఇద్దరూ తండ్రి దగ్గరకు వచ్చారు.

"అబ్బాయిలూ! పది రోజుల నుంచి చూస్తున్నా, మీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు. గొడవ గురించి నేను మాట్లాడదలచుకోలేదు. గొడవలో తీర్పు ఇవ్వదలుచుకోలేదు.... నా బాధంతా మీ మౌనం గురించే. నా తరువాత జనరేషన్లో ఉన్నది మీరిద్దరే. మీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోకుండా ఉండిపోతే...బంధుత్వాలు ఏమైపోతాయి?

రోజు ప్రపంచం ముడుచుకుపోయి సెల్ ఫోనుగా చేతుల్లో ఉంటోంది. అదేలాగా మనిషి కూడా పిల్లల్లు, ఉమ్మడి కుటుంబాలూ లాంటివి వదిలేసి...ఇప్పుడు ఒక దంపతులకు ఒకే ఒక బిడ్డగా కుటుంబాలను చిన్నవి చేసుకుంటున్నారు.

ప్రపంచమాంతటనీ ఒకే కుటుంబంలా భావించాలని మన సంప్రదాయ ధర్మం చెబుతోంది...కానీ కాలంలో 'నా వరకే' అన్నంతగా స్థాయి దిగజారిపోతోంది. కుటుంబంలో అత్యంత ఆత్మీయంగా ఉండాల్సిన వారే పరాయి వ్యక్తులవుతున్నారు. ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు, బాంధవ్యాలు పెద్దగా కనిపించడం లేదు.

పెళ్లిలో, విందులో కలుసుకుని ఒలకపోసే ప్రేమ, అభిమానం.... పూటవరకే. పోకడ ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. ఒంటరి జీవితం నాటికీ మంచిది కాదు. అటువంటి పోకడ మీకే కాదు, సమాజానికే హానికరం.

ఇలాటి పరిస్థితులలో మీరిద్దరూ అనవసరంగా పోట్లాటలు పెట్టుకుంటూ, గొడవలు పడి మాట్లాడుకోకుండా ఉండి...మిగిలిపోయిన బంధుత్వాన్ని చెడగోట్టుకుంటే...మీకు బంధువులే లేని కాలం త్వరగా వస్తుంది. విపరీత దోరణి వద్దర్రా.. అర్ధం చేసుకుని నడుచుకోండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను!" చెప్పటం ఆపిన చంద్రశేఖరం కళ్ళు తుడుచుకుంటూ తలదించుకున్నాడు.

తండ్రి యొక్క వాడిపోయిన ముఖం, బాధతో కూడిన మాటలు కొడుకులిద్దరి మనసుల్లో ముళ్ళు లాగా గుచ్చుకోవటంతో ...కలవరపడ్డారు.

"నాన్నా! మమ్మల్ని క్షమించు" అంటూ ఏడుస్తూ ఇద్దరూ తండ్రికి చెరో పక్కన కూర్చుని, ఆయన భుజం మీద వాలిపోయారు.

చంద్రశేఖరం మనసులో ఉన్న బాధ తొలగిపోయింది. అతనికి తెలియకుండానే కన్నీరు ఉబికి వచ్చింది. కొడుకులిద్దర్నీ కౌగలించుకున్నాడు.

దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న చంద్రశేఖరం భార్య, కోడలు దీప తమ కళ్ళ చివర్లలో చేరుకున్న కన్నీటిని తమ చీర చెంగుతో తుడుచుకున్నారు.

**************************************************సమాప్తం******************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)