ప్రేమించుకోవచ్చు!...(కథ)

 

                                                                          ప్రేమించుకోవచ్చు!                                                                                                                                                                (కథ)

రోజంతా పనిచేసిన అలసటతో,  ఆఫీసుల నుండి ఇంటికి తిరిగి వెళ్ళటానికి బస్ స్టాపింగ్ లో గుంపుగా నిలబడున్నారు కొందరు.

గుంపుకు ఎడమ పక్కగా స్వప్నతో కలిసి నిలబడున్న కౌసల్య తన చేతి గడియారం లో టైము చూసింది. 5.50. ఆమె ఇంటికి వెళ్ళాల్సిన బస్సు పాటికి వచ్చుండాలి. కానీ, ఎందుకో రోజు ఇంకా రాలేదు.

"ఏయ్... అటు చూశావా?" అంటూ కౌసల్య భుజాన్ని తట్టింది స్వప్న.

స్వప్న చూపిన వైపుగా చూసింది కౌసల్య. రోజు కూడా అతను వాళ్ళు నిలబడున్న వైపుకే వస్తున్నాడు.

"అతను మనల్ని వెంబడించి రావడం ఇది నాలుగో రోజు...రాస్కల్" అంటూ తిట్టింది కౌసల్య.

"మనల్ని కాదు... నిన్ను.నిన్నే వెంబడిస్తున్నాడు!" చెప్పింది స్వప్న.

"మొహం వాచేటట్లు నాలుగు మాటలు అడిగేయనా?"

"ఎలా అడుగుతావు? నిన్ను చూశానా? నిన్ను వెంబడిస్తున్నానా? …అంటూ అతను ఎదురుతిరిగితే?"

అంటూ స్వప్న ముగించేటప్పుడు అతను వాళ్ల దగ్గరగా వచ్చి, రోజూలాగానే రోజు కూడా వాళ్ళ వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు.

కౌసల్య వెనక్కి తిరిగి కోపంగా అతని వైపు చూసింది. అదేమీ గమనించనట్లు అతను రోడ్డునే చూస్తూ నిలబడ్డాడు.

"చూడటానికి ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్లు డీసెంటుగా కనబడుతున్నాడు...ఎందుకో పిచ్చి వేషాలుఅడిగేయనా?" అని స్వప్న చెవిలో గుసగుసలాడింది కౌసల్య. 

"గొడవని కొని తెచ్చుకోకు" గొణిగింది స్వప్న.

ఈలోపు వాళ్ళు ఎక్కవలసిన బస్సు ప్రయాణీకులతో కిటకిటలాడుతూ  ఉసూరు మనుకుంటూ వచ్చి బస్ స్టాపింగులో ఆగింది. మెట్ల మీద నిలబడున్న నలుగురైదుగురు ప్రయాణీకులు క్రిందకు దిగి దొవ ఇవ్వటంతో లోపల ఉన్న ప్రయాణీకులలో  కొంతమంది దిగుతూ ఉండగానే స్టాపింగులో ఉన్న కొందరు వేగంగా బస్సు ఎక్కి లోపలకి దూసుకు వెళ్ళారు. వారిలో స్వప్న కూడా ఉన్నది.

"ఒక వేల నేను బస్సులో ఎక్కకుండా ఉండిపోతే.అతను ఏం చేస్తాడు?" అనే ఆసక్తి తలకెక్కటంతో, బస్సు ఎక్కకుండా ఆగిపోయింది కౌసల్య.

బస్సు మెట్ల మీద నిలబడి ప్రయాణం చేయబోయిన అతను, కౌసల్య బస్సు ఎక్కకుండా క్రిందే నిలబడుంటం చూసి, బస్సు బయలుదేరుతున్నప్పుడు గబుక్కున క్రిందకు దిగిపోయాడు.

కౌసల్య బస్ స్టాపంగులోనే ఉండటం చూసిన స్వప్న, కిటికీలో నుండి తొంగి చూస్తూ "ఏయ్...నువ్వు రావట్లేదా?" అని చేతి వేళ్ళను ఉపుతూ అడిగింది. కౌసల్య నుండి జవాబు తెలుసుకునే లోపు బస్సు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది.

"బస్సులో ముందు వైపు జనం ఎక్కువగా లేరు. మీరెందుకు బస్సు ఎక్కకుండా ఆగిపోయారు?" అని కౌసల్యను చూసి అడిగాడు అతను.

"హలో...నేను ఇంతకు ముందు మీకు పరిచయమున్నానా?  మీకెందుకు అక్కర్లేని పని?"

"మేడం...నేనూ కూడా బస్సు స్టాపింగు లో నుండే బస్సు ఎక్కుతాను. మిమ్మల్ని ఇక్కడ చూశాను... పరిచయంతోనే అడిగాను"  

"మిమ్మల్ని ఇంతకు ముందు నేను చూసిందే లేదే" అన్నది కౌసల్య.

"ఇప్పుడే ఉద్యోగంలో చేరాను. నాలుగు రోజులే అయ్యింది"

అతన్ని లోతుగా గమనించింది. అతను అబద్దం చెప్పే మనిషిగా అనిపించడం లేదు. అతను తనని వెంబడిస్తున్నాడని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు తనలోనే "సారీ" చెప్పుకుంది కౌసల్య.

...అలాగా? ఎక్కడుంటున్నారు?" సహజంగా ఉండాలని అనుకుని అతన్ని అడిగింది.   

"అమీర్ పేట...మీరు?"

"పంజా గుట్ట..." అని చెప్పిన కౌసల్య "మీ భార్య ఎక్కడ పనిచేస్తోంది?" అని అడిగింది.

కళ్ళార్పకుండా ఆమెనే చూశాడు అతను.

ఒక కంపనీ పేరు చెప్పి ,...అక్కడే తన భార్య అకౌంటంట్ గా ఉద్యోగం చేస్తోందని నవ్వుతూ చెప్పాడు!

ఒక్క క్షణం కలవరపడింది కౌసల్య. 

"ఎంత ధైర్యం ఉంటే నువ్వు పనిచేస్తున్న ఆఫీసు పేరు చెబుతాడు...? నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావో తెలుసుకోవడానికి,  ఆఫీసు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికీ  ఎంత ప్రయత్నం చేసుంటాడు?....ఇతను మంచి వాడు కాదు కౌసల్యా"  కౌసల్య మనసు కౌసల్యను హెచ్చరించింది. 

"మిస్టర్...చూడటానికి మాత్రం డీసెంటు గా ఉన్నారు...కానీ నాగరీకంగా నడుచుకోవటం లేదు"

" సారీ మాడం...మీరు మాత్రం ఒక పెళ్ళి కాని అబ్బాయిని చూసి అలాంటి ప్రశ్న అడిగితే... నేను ఏం జవాబు  చెప్పాలో మీరే చెప్పండి?" అన్నాడు.

తాను అడిగిన ప్రశ్న తప్పు అని తెలుసుకున్న కౌసల్య "సారి" అన్నది.

"పరవాలేదండి. …'బై బై'...మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళికి అమ్మాయిని వెతుకుతున్నారు. నాకు మీరు బాగా నచ్చారు. మీకు నేను నచ్చుంటే మనం ప్రేమించి పెళ్ళి చేసుకోవటంలో తప్పు లేదు." 

కౌసల్య ముఖం కోపంతో ఎర్ర బడింది.

మీకు పర్సనాలటి పెరిగినంతగా బుద్ది పెరగలేదు. వయసులో పోయి ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారు. ఏది మంచిది- ఏది చెడ్డది అనే వివరం కూడా తెలుసుకోలేని 'టీన్ ఏజ్' పిల్లలే   'లవ్'  చేస్తారు. ….ఇది కరెక్టేనా...మనకి సెట్ అవుతుందా? అని ఆలోచించ గలిగే వయసులో ఉన్న మీరు ప్రేమ కోసం తహతహ లాడటం చాలా అసహ్యంగా ఉన్నది.ఇకపోతే, నాకు పెళ్ళైపోయింది. స్కూలుకు వెళ్ళే వయసులో ఇద్దరు పిల్లలు ఉన్నారు" అని ఆపకుండా మాట్లాడిన కౌసల్య అతన్ని చూసి...'నాగరీకం తెలియని మనిషి" అని గొణుక్కుంది.

అతను నవ్వుతూ "ప్రశాంతంగా ఉండండి మాడం. మీ తమ్ముడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక ఏడాది నుండి మీరు ఉద్యోగానికి వెడుతున్నారు. మీ అమ్మ-నాన్నా ఇద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నారు.  మీరు ఉద్యోగం చేయాలన్న అవసరం మీ కుటుంబానికి లేదు. కానీ మీ ఇష్టం కోసం ఉద్యోగానికి  వెడుతున్నారు. ఇకపోతే...మీ రాసి కన్య రాసి. మీ నక్షత్రం ఉత్తర-నాలుగో పాదం. లగ్నం...." అని అతను చెపుతూ వెడుతూంటే, అతన్నే గమనిస్తున్న కౌసల్యకు కోపం ఏక్కువ అయ్యింది.

"ఆపండి...మీరు రాజశేఖరే కదూ?.. జాబిల్లి ఇంజనీరింగ్' కంపనీ యొక్క ప్రొడక్షన్ మేనేజర్...కరక్టే కదా....?" 

అతను తలూపి వొప్పుకున్నాడు.

"నా గురించి ఎంక్వయరీ చేస్తున్నారా?" కౌసల్య మాటల్లో తీవ్రమైన కోపం.

"నో...నో...అదేం లేదు" నవ్వుతూ చెప్పాడు.

మరి!...అమ్మా, నాన్నా చూసిన అమ్మాయి మంచిదేనా? లేక ప్రేమ పేరుతో ఎవరితోనైనా అడ్డ దిడ్డంగా తిరుగుతోందా అని తెలుసుకోవటానికే కాదా నన్ను వెంబడిస్తూ వచ్చారు" అని కోపంగా అడిగింది.

అతను మౌనంగా...దూరంగా వస్తున్న బస్సును చూస్తూ నిలబడ్డాడు.

"పెళ్ళికి ముందే నా గుణాన్ని సందేహించే మనిషినా నేను భర్తగా పొందబోతున్నాను?.. ‘కాబోయే అల్లుడు బంగారం' అని సర్టిఫికేట్ ఇచ్చిన తండ్రిపైన కోపం తెచ్చుకుంది.

తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది కౌసల్య.

"నీ ఫోటో చూసిన వెంటనే నువ్వు అతనికి బాగా నచ్చేశావు. సిగిరెట్లు, మందు లాంటి ఎటువంటి చెడు అలవాట్లు లేవుట. పెళ్ళికొడుకు పని చేస్తున్న కంపెనీకి వెళ్ళి నాన్న గారు ఎంక్వయరీ చేసొచ్చారు. దేవుడు నీకని రాసిన సంబంధం ఇదే నని మేము నమ్ముతున్నాము"  

"పెళ్ళి కొడుకు అత్యంత నీచమైన గుణం కలవాడు అని చెప్పి పెళ్ళికొడుకును వదిలించుకోవాలి" మనసులోనే తీర్మానించుకునంది కౌసల్య.

కౌసల్య గారు, నేను మిమ్మల్ని అనుమానించో, మీకు పరీక్ష పెట్టాలనో మీ వెనుక రాలేదు...మీరు రోజూ పేపర్ చదువుతారా?"

కౌసల్య అతనికి జవాబు చెప్పలేదు.

పెళ్ళి రోజున ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన ఆడపిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చుంటాయి. పోయిన సంవత్సరం జూన్ నెల నా చెళ్ళెలు గురించిన వార్త వచ్చింది"

కౌసల్యకు ఏమీ అర్ధం కాలేదు. అయినా మౌనంగా అతను చెప్పేది వింటోంది.

అతను చెప్పటం తిరిగి ప్రారంభించాడు.

"నా చెళ్ళెలు పరమేశ్వరి తన పెళ్ళి రొజున ఆమెకు ఇష్టమైన వాడితొ వెళ్ళిపోయింది. దాని వలన మాకు జరిగిన అవమానం చాలా ఎక్కువ. పెళ్ళికి వచ్చిన వందలాది జనం ముందు మేము తల వంచుకోవలసి వచ్చింది. అవమానం తట్టుకోలేక మా నాన్నా, అమ్మా చాలా కుంగిపోయారు. చచ్చి పోదామని ఆలోచించడం మొదలు పెట్టారు. ఏలాగో వాళ్ళకు నచ్చ చెప్పి శాంత పరిచాను

పెళ్ళి ఏర్పాట్లు జరగటానికి ముందైనా నా చెళ్ళెలు నా దగ్గర తన ప్రేమ గురించి చెప్పుండొచ్చు. ఊళ్ళో వాళ్ళ ముందు తల దించుకోవలసిన అవసరం వచ్చేది కాదు. ఒక వేళ నా చెళ్ళెలు తన ప్రేమ గురించి చెప్పున్నా అమ్మా గాని, నాన్నా గాని, నేను గాని ఆమె ప్రేమను ఎదిరించే వాళ్ళమే కానీ ఆమె ప్రేమను  సమ్మతించే వాళ్లం కాదు. అది వేరే విషయం"

మా ఇంట్లో జరిగిన సంఘటన తరువాత, నెనొక నిర్ణయానికి వచ్చాను. ఇలాంటి సంఘటన మీ ఇంట్లో జరగకూడదు. అందుకనే మీరు ఇంకెవరినైనా ప్రేముస్తున్నారని తెలిస్తే...మీ ఇద్దరినీ కలపటానికి నా వంతు సహాయం చేద్దామని మిమ్మల్ని వెంబడించాను. ఇప్పుడు బాగా తెలుసుకున్నాను "

"ఏం తెలుసుకున్నారు?"

"ఇంతవరుకు మీరు ఎవరినీ 'లవ్' చేయలేదు. ఇక మీదట చేద్దామనే ఉద్దేశమూ లేదు"

"ఇంకా"

"మీకు ప్రేమ అనే పదమే నచ్చదు"

కౌసల్య  ముఖం చిట్లించుకుంది.

" ప్రేమ అనే పదం నచ్చకపోవటానికి కారణం,  నేను ప్రేమలో ఓడిపోయుంటాననే అనుమానం మీకు కలగలేదా?"

"కలగలేదు. దానికి కారణం, మీ స్నేహుతురాలు స్వప్న. ప్రేమ అనే పేరుతో ఒకడు అమెను మొసగించి, వదిలి వెళ్ళిపోయాడు. పుట్టింటికి తిరిగి వెళ్ల లేక,  ఎవరి తోడూ లేకుండా, ఒక ఆడపిల్లకు తల్లిగా ఒంటరిగా నిలబడుంది"

"ఒక వేళ ఇప్పుడు నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్ళి చేసుకుంటాను అని చెబితే...మీ రియాక్షన్?"

"ఖచ్చితంగా మీకు సహాయపడతాను. అతను మంచివాడుగా ఉండే పక్షంలో, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాను. మంచివాడు కాకపోతే మీకు మంచి సలహా ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో పెట్టటానికి ప్రయత్నిస్తాను"

" తరువాత తప్పించుకున్నామురా, బ్రతికిపోయామురా అనుకుంటూ వెళ్ళిపోతారు...అంతే కదా?"

"అలా ఎన్నడూ జరగదు...అప్పుడు కూడా మిమ్మల్నిపెళ్ళి చేసుకోవటానికి నేను రెడీ"

"ఎంతో మంది ఆడపిల్లలు ప్రేమ అనే పదంతో జీవితాన్నే పోగొట్టుకుని ఒంటరిగా నిలబడుండటం చూస్తుంటే, మగవాళ్లను, చీదరించుకోవాలని అనిపిస్తోంది"  అన్నది కౌసల్య.

"అందరి మగాళ్లనూ తప్పుగా అంచనా వేయకండి..."

"అర్ధమయ్యింది" అంటూ చిన్నగా నవ్వింది.

అతని మీద మొదట్లో ఏర్పడ్డ కోపం ఇప్పుడు తగ్గింది.  

ఇతను అనుమానపు మనిషి కాదు. తన ఇంట్లో జరిగిన సంఘటన లాగా, ఇంకెవరి ఇంట్లోనూ జరగ కూడదు అనే మంచి ఆలొచన కలిగినవాడు, దాంతో పాటు ఆడపిల్లల మనోభావాలకు మర్యాద ఇచ్చేవాడు మనసులోనే అనుకున్నది కౌసల్య.

"కౌసల్య గారూ...ఇప్పుడు ఏమనిపిస్తోంది?" ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ అడిగాడు.

"మొసగించ లేడు అనే పూచి దొరికితే, పెద్దల ఆసీస్సులతో ప్రేమించుకో వచ్చు..."

వెంటనే అతను కౌసల్య కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు.  క్షణం కౌసల్యకు తాను ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు అనిపించింది.

"కౌసల్య గారు...నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరూ నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను….మనం ప్రేమించుకుందామా?" అంటూ గొణిగాడు.

"ప్రేమ...ఇంత మధురమా"  అన్న భావన కౌసల్యలో కలిగింది.

"ఇంకో కొన్ని రోజుల్లో పెద్దల అంగీకారంతో మన పెళ్ళి జరిగిన తరువాత మనం ప్రేమించుకొవచ్చుప్రేమించుకుందాం" అని అంటూ అతని చెతుల్లో ఉన్న తన చేతిని మెల్లగా అతని దగ్గర నుండి విడిపించుకుంది కౌసల్య.

ష్యూర్ అంటూ అతను కన్ను గీటేడు.

ఆనందమయమైన వాళ్ళిద్దరి ప్రేమ కొసం భవిష్యత్ కాలం ఎదురుచూస్తోంది.

*************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)