నిజమైన మగాడు…(కథ)

 

                                                                    నిజమైన మగాడు                                                                     (కథ)

చెంప చెళ్ళుమన్న శబ్ధం వినబడింది.

పార్కులో బెంచి మీద కూర్చుని తన ప్రేమికుడు మహేష్ తో సరదాగా మాట్లాడుకుంటున్న రమ శబ్ధానికి ఉలిక్కిపడి, కూర్చున్న బెంచి నుండి పైకి లేచి శబ్ధం వచ్చిన వైపు చూసింది.

అక్కడ చెట్టు క్రింద తన స్నేహితురాలు మాలతి, ఆమె ప్రేమికుడు రాజు నిలబడున్నారు. మాలతి తన చెంపను పట్టుకుని, తల దించుకుని నిలబడున్నది. ఆమె కంటి నుండి ధారగా నీరు కారడం, ఆమె ప్రేమికుడు రాజు వేగంగాఅక్కడి నుండి వెళ్ళిపోవటం గమనించిన రమ కోపంగా అడుగు ముందుకు వేసింది.

"ఎక్కడికి" అమె చేయి పుచ్చుకుని ఆపిన మహేష్ రమను అడిగాడు.

"ఎక్కడికని అడుగాతావేమిటి మహేష్!?...నా స్నేహితురాలు మాలతిని ఆమె ప్రేమికుడు రాజు కొట్టి వెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా?...ఎందుకు కొట్టేవు అని రాజును నిలదీయ వద్దా?...వదులు, నా చేయి వదులు మహేష్. రాజు తల దించుకునేలా నాలుగు మాటలు అడుగుతాను" కోపంగా చెప్పింది రమ.

"అది కాదు రమా..." అని మహేష్ ఏదో చెప్పబోతుంటే "నన్ను ఆపకు మహేష్...భార్యను కొట్టటమే తప్పు. ప్రేమికురాలును కొట్టటం అంతకంటే పెద్ద తప్పు?...ప్రేమించేటప్పుడే ఇలా కొడుతున్నాడే ...పెళ్ళి చేసుకున్న తరువాతమాలతిని ఎన్ని కష్టాలు పెడతాడో...సరైన రాక్షసుడిలా ఉన్నాడు" ఆవేశంగా చెప్పింది.

రమ ఆవేశంగా మాట్లాడటం మహేష్ కి నచ్చలేదు. చిరాకు కూడా తెప్పించింది.

అది గమనించిన రమ తన ఆవేశాన్ని ఆపుకుంటూ మహేష్ పక్కన కూర్చుంటూ " మాలతిని రాజు ఖచ్చితంగా పెళ్ళి చేసుకోడు. టైం పాస్ కోసం ప్రేమిస్తునట్టు నటిస్తున్నాడు. విషయాన్ని మాలతి త్వరగానే అర్ధంచేసుకుంటుంది. రాజు దగ్గర నుండి విడిపోతుంది.మాలతి అర్ధం చేసుకోకపోతే నేనే దానికి అర్ధమయ్యేలాగా చెప్పి వాళ్ళ అబద్ధమైన ప్రేమను విడదీసి మాలతిని రాజు దగ్గర నుండి కాపాడుతాను" అన్నది.

అక్కడ జరిగిన సంఘటన మహేష్, రమల సంతోషానికి అడ్డుకట్టవేసింది.

"కూల్ రమ.. కూల్" రమ చేయి పుచ్చుని చిన్నగా నొక్కుతూ ఆమెను శాంత పరిచాడు మహేష్.

"అది కాదు మహేష్..." అంటూ రమ ఇంకా ఏదో చెప్పబోతుంటే మహేష్ అడ్డుపడి "వదిలేయ్...మాలతి ఏదైనా తప్పుగా మాట్లాడుంటుంది. అందుకని రాజు చిన్న దెబ్బ వేసుంటాడు....ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుందని నీకుతెలియదా" అన్నాడు మహేష్.

"ఎలా వదిలి పెట్టమంటావు?...మాలతి నా స్నేహితురాలు. ఇంట్లో చాలా గారాబంగా పెరిగిన పిల్ల. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్ను ఇంతవరకు ఎవరూ కొట్టలేదు అని నాతో చాలాసార్లు చెప్పింది. అలా గారాబంగా పెరిగిన పిల్లమీద చెయ్యి చేసుకుని దాన్ని చిన్నబుచ్చాడు...అయినా నాకు తెలియక అడుగుతా మాలతి ఏదో తప్పుగా మాట్లాడుంటుందని, అందువలనే రాజు ఆమెను కొట్టుంటాడని అన్నావే...తప్పుగా మాట్లాడినంత మాత్రానా ప్రేమిస్తున్నఅమ్మాయిని కొట్టటం కరెక్టా?...ఏం మాట్లాడి తీర్చుకోలేడా? ఒక పబ్లిక్ పార్కులో అలా కొట్టటం సంస్కారవంతుల లక్షణమా?"

రమ మాటలు మహేష్ లో ఏదో తెలియని భయాన్ని ఏర్పరచింది...సమాధానం చెబితే తమ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయేమోనని భయపడి మౌనంగా కూర్చున్నాడు.

తప్పు చేయటంలో ఆడవాళ్ళకంటే మగ వాళ్ళే ఎక్కువ. కానీ రాజు కంటే నువ్వు చాలా మంచి వాడివి. ఇంతవరకు నువ్వు కోపంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మనిద్దరి మధ్య గొడవలే రాలేదు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ మహేష్. మంచి సంస్కారవంతుడివి. నిన్ను ప్రేమించినందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?...నేను చాలా అద్రుష్టవంతురాలిని" చెప్పింది రమ.

పొగడటం ఆడవాళ్ళకు మాత్రమే కాదు...మగవారికి కూడా ఇష్టమే. మహేష్ పొగడ్తల మత్తులో కొంచం ఆనందపడ్డాడు.

"నీ దగ్గర కోపం కొంచం కూడా లేదు. కొట్టాలనుకున్నా కూడా నీ చేతులు నన్ను కొట్టలేవు" మహేష్ చేతి వేళ్ళను నిమురుతూ చెప్పింది రమ.

రమను ఎక్కువగా మాట్లాడనీయడం ఇష్టం లేని మహేష్ ఎంతో చాక చక్యంగా ఆమెను చోటు నుండి తీసుకు వచ్చాడు. కొద్దిసేపట్లోనే మాలతి-రాజుల గొడవను పూర్తిగా మర్చిపోయింది రమ.

కానీ రమను హాస్టల్ దగ్గర దింపినప్పుడు మహేష్ మన ప్రేమ నిర్మలమైన ప్రేమ. నాలాగానే మాలతి కూడా చాలా మంచి మనసు కలిగిందే. ప్రేమ మీద నమ్మకం, ప్రేమికుడి మీద ప్రాణం పెట్టుకుంది. కానీ రాజు నిజమైన ప్రేమికుడిగాకనబడటంలేదు" అన్నది.

రమా...వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే మాట్లాడి తీర్చుకుంటారు. మనం, మన ప్రేమ గురించి, మన గురించి మాట్లాడుకుంటూ దానిని కాపాడుకుందాం...వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడుచేసుకోకు...సరేనా" సమాధనపరిచాడుమహేష్.

"సరే...బాయ్ మహేష్" అని చెప్పి హాస్టల్ లోపలకు వెళ్ళిపోయంది రమ.

                                                                     ******************************************

మరుసటి రోజు అదే పార్కులో అదే బెంచి దగ్గర మహేష్ ను కలుసుకున్న రమ క్రితం రోజు జరిగిన రాజు-మాలతీల సంఘటన గురించి మాట్లాడింది.

"మాలతి చెంప బాగా వాచిపోయిందట. చెంప పైన నాలుగు వేలి గుర్తులు ఎర్రగా కనబడుతున్నాయట. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తునే ఉందట...మాలతి రూమ్ మేట్ చెప్పింది"

"రాజు ఎందుకు కొట్టాడో కారణమేమైనా చెప్పిందా" తననే మర్చిపోయి అడిగాడు మహేష్.

"ప్రొద్దున మాలతిని కలుసుకున్నప్పుడు అడిగాను...చెంప మీద వేళ్ల గుర్తులు కనబడకుండా ఉండటానికి చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఏమీ లేదని చెప్పింది"

"అలాగా!" ఆశ్చర్యంగా అడిగాడు మహేష్.

"కానీ అలా చెబుతున్నప్పుడు చాలా కష్టపడింది" రమ తన చెంపను తడుముకుంటూ చెప్పటం చూసి చిన్నగా నవ్విన మహేష్ "అదేదో...నేను నీ చెంప మీద కొట్టినట్టు నువ్వు చెంప రుద్దుకుంటూ మాట్లాడుతున్నావ్" అన్నాడు.

"నిన్ననే చెప్పానుగా...నువ్వు నన్ను కొట్టాలనుకున్నా నీ చేతులు నన్ను కొట్టలేవని ..." అని రమ మాట్లాడుతూండగా ఆమె పెదవుల మీద చేతులు పెట్టి "ఆపు...ఆపు" అంటూ రమను అక్కడి నుంచి తీసుకు వెళ్ళాడు మహేష్.

                                                                        ******************************************

మామూలుగా వారానికి ఒక రోజు ఫోను చేయడం, శని-ఆదివారాలలో రమను పార్కులో కలవడం చేసే మహేష్ వారం రమకు ఫోను చెయ్యలేదు. పార్కుకు వస్తాడేమోనని శనివారం, ఆదివారం పార్కుకు వెళ్ళి చాలాసేపుకూర్చుంది రమ. మహేష్ పార్కుకు కూడా రాలేదు. "ఏమై ఉంటుందబ్బా?...మనమే ఫోన్ చేస్తే?...వద్దు..మహేష్ ఎంతో ముఖ్యమైన ఆఫీసు టూర్ పనిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. కాబట్టి ఫోను వద్దు... వారంమహేషే ఫోను చేశ్తాడు" మహేష్ ను డిస్టర్బ్ చేయడం ఇష్టంలేని రమ తిరిగి వెళ్ళిపోయింది.

రెండో వారం కూడా మహేష్ దగ్గర నుండి ఫోన్ రాలేదు. నిరాశ పడిన రమ "ఇలా ఎప్పుడూ జరగలేదే?...ఆఫీసు పనుల వలన టూర్ పొడిగిస్తే విషయాన్ని ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్పేవాడు...మరెందుకు ఫోన్ చేయలేదో?'అనుకున్న వెంటనే మహేష్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఎందుకు ఫోన్ చేయలేదని అతనితో పోట్లాడాలనుకుంది, అసలు మాట్లాడకూడదిని కూడా అనుకుంది.

కపటం తెలియని ప్రేమ ఆమె మనసును మార్చింది "చెప్పు మహేష్...నీ ఫోను కోసమే ఎదురుచూస్తున్నా" అన్నది.

"రేపు సాయంత్రం పార్కుకు వస్తావు కదూ" అడిగాడు మహేష్.

."వస్తాను" అని చెప్పి ఫోను పెట్టేసింది రమ.

                                                                    ******************************************

పార్కులో మహేష్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న రమకు దూరంగా మహేష్ రావడం కనిపించింది. "అమ్మయ్య" అనుకుంటూ సంతోష పడింది.

మహేష్ వచ్చాడు. ఒక విధమైన బిడియంతో ఆమె పక్కనే ఎప్పుడూ కూర్చోనంత దూరంగా కూర్చున్నాడు. నేను తిడతానని దూరంగా కూర్చున్నాడు" అనుకుంటూ రమ అతన్ని కవ్వించే విధంగా చూస్తూ అతని దగ్గరగా జరిగికూర్చుంది.

సిగ్గుతో వొంకర్లు తిరిగాడు మహేష్.

"ఏమైంది మహేష్...ఆఫీసు టూర్ పొడిగించినా ఫోను చేసి చెప్తావు కదా...ఇన్ని రోజులలో కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు?"

సారీ రమా...ఆఫీస్ టూర్ వెళ్ళలేదు...అర్జెంటుగా రమ్మంటే మా ఊరు వెళ్ళాను" మెల్లగా చెప్పాడు.

రమ దగ్గరున్న ఉత్సాహాం అతని దగ్గర లేదు.

అతని ముఖం డల్ గా ఉన్నది. ఎవరో తెలియని మూడో వ్యక్తిలాగా బిడియంగా ఉన్నాడు. ప్రేమ మైకంలో ఉన్న రమ ఇవన్నీ గమనించలేదు. ఒక వేల గమనించి ఉన్నా "ప్రయాణ బడలిక" అని తనని తానే సమాధాన పరచుకునిఉండేది.

అర్జెంటుగా ఊరు వెళ్ళి ఉంటే కూడా..అక్కడకు వెళ్ళిన తరువాత నిదానంగా ఒక ఫోను అయినా చేసి చెప్పుండాలి...పర్వలేదు. నేను మర్చిపోయాను. నువ్వు కూడా విషయం మర్చిపోయి ఫ్రిగా ఉండు" అన్నది రమ.

గుడ్ రమా...నేను చెప్పాలనుకున్నది కూడా అదే. నువ్వు నన్ను మర్చిపో...మన ప్రేమ పెళ్ళిగా మారదు" అన్నాడు.

మాటలతో షాక్ తిన్న రమ "ఏయ్...ఏం చెబుతున్నావ్" అన్నది.

"అవును...బంధుత్వం వదిలిపోకూడదని, అయినవాళ్ళలోనే పెళ్ళి చేసుకోవాలని, చేతిలో విషం పెట్టుకుని నన్ను బెదురిస్తున్నారు మా అమ్మానాన్నలు"

"తరవాత"

"నిశ్చతార్ధం కూడా అయిపోయింది...నీకు ఫోను చేసే ధైర్యం కూడా లేకపోయింది. అందుకు నేను ఎంత కుమిలిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు...వెరి...వెరి సారీ" అన్నాడు మహేష్.

మహేష్ చెప్పింది అర్ధం చేసుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది రమకు. "చేతిలో విషం పుచ్చుకుని నేను కూడా మహేష్ను బెదిరించవచ్చు...కానీ అలాంటి జీవితం అవసరమా" అనుకున్నది రమ.

మంటల్లో చిక్కుకుని కాలిపోతున్నట్లు అనిపించడంతో ఒక్కసారిగా పైకి లేచింది రమ. గట్టిగా ఏడవాలనిపించింది. ఖచ్చితంగా మహేష్ ముందు ఏడవకూడదు" అనే నిర్ణయంతో మహేష్ ముఖం వైపు కూడా చూడటం ఇష్టం లేకసుడిగుండంలాగా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది రమ.

తన బాధను ఎవరితో చెప్పుకుని ఏడవాలో తెలియక రోజు సాయంత్రం గుడికి వెళ్ళింది...అక్కడ

మాలతీ, రాజు ఎదురు పడ్డారు.

తనని చూసి నవ్వు ముఖం పెట్టిన మాలతి మెడలో తాలిబొట్టు కనిపించింది.

సారీ రమా...నీ దగ్గర చెప్పలేకపోయాను. రాజు వాళ్ళింట్లో మా వివాహానికి ఎవరూ ఒప్పుకోలేదు. తన ప్రేమ మీద పట్టుదలతో ఉన్న రాజు నలుగురు స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్ళి రిజిస్టర్ చేసి, అక్కడే అందరిముందు నాకు తాలి కట్టాడుచెప్పింది మాలతి.

ఆశ్చర్యంగా చూసింది రమ.

"ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావ్... రోజు చెంప మీద కొట్టాడు... రోజు తాలి కట్టాడు...ఏమిటా అని కదురాజు నిన్ను ఎందుకు కొట్టాడు అని రోజు నువ్వు అడిగావే...ఇందుకే కొట్టేడు" అన్నది మాలతి.

అయోమయంగా చూసింది రమ.

"అర్ధం కాలేదు కదూ రోజు పార్కులో ఏంజరిగిందో చెబుతా విను" అన్న మాలతి రమ చేయి పుచ్చుకుని పక్కనున్న అరుగు మీద కూర్చుంది. రాజు తన స్నేహితులతో మరో అరుగు మీద కూర్చున్నాడు.

                                                                       ******************************************

"మాలతీ...మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పొకోవటంలేదు...వాళ్ళని కాదని పెళ్ళిచేసుకుంటే చచ్చిపోతామని బెదిరించేరు" చెప్పాడు రాజు.

"నువ్వేం చెప్పావు" ఆదుర్దాగా అడిగింది మాలతి.

"మీ బెదిరింపులకు నేను భయపడేది లేదు...మీరేమైనా చేసుకోండి అని చెప్పి వచ్చాశాను"

"అయ్యే అలా ఎందుకు చేశావు...నిన్ను కని, పెంచి, పోషించిన నీ తల్లితండ్రులతో అలాగేనా మాట్లాడేది"

"ఇంకెలా మాట్లాడుండాలి?"

"వాళ్లని కన్విన్స్ చేసుండాలి"

"చచ్చిపోతానని బెదిరించే తల్లితండ్రులను కన్విన్స్ చేయలేము...అందుకే గొడవ పడి వచ్చాశాను"

"ఇంట్లో వాళ్ళతో గొడవెందుకు రాజు...వాళ్ళు చెప్పినట్లే నువ్వు వాళ్ళు చెప్పిన అమ్మాయినే పెళ్ళిచేసుకో"

"అంటే తల్లితండ్రులకోసం ప్రేమను త్యాగం చేయమంటున్నావుఅవునా

"అవును"

"నేను అలాంటివాడిని కాదు....నా ప్రేమను, ప్రేమించిన అమ్మాయిని త్యాగం పేరుతో మోసం చేసే గుణం నాకు లేదు"

అది కాదు రాజు"

చూడు మాలతి...ప్రేమకు పెద్దవాళ్లందరూ విరోధులే. ప్రేమించి పెళ్ళిచేసుకున్న తల్లితండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ప్రేమిస్తే సహించరు, వాళ్ళ పిల్లల ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమకు ఎదురు చెబుతారు. ఇది ఒక విధమైనబూటక సమాజ గౌరవంఅలాగే...ప్రేమ వివాహానికి తల్లితండ్రులు ఒప్పుకోరని ప్రతి యువతకూ తెలుసు. అలాంటప్పుడు ఎందుకు ఒకరిని ప్రేమించటం, తరువాత తల్లితండ్రుల పేరుతో ప్రేమించినవారిని వదిలేయటం. ఇది ప్రేమకుచేసే అన్యాయం కాదా….ప్రేమిస్తే, ప్రేమించినవారినే పెళ్ళిచేసుకోవాలి. తల్లితండ్రులు ఒప్పుకోకుంటే వాళ్ళను ఎదిరించైనా ప్రేమించిన వాళ్ళను పెళ్ళిచేసుకోవాలి. లేకపోతే...అలాంటి సాహసం చేయలేకపోతే అసలు ప్రేమించనే కూడదు.ఇది సినిమా కాదు. నిజ జీవితం. నిజ జీవిత ప్రేమలో ప్రేమకోసం తల్లితండ్రులను త్యాగం చేయలి కాని తల్లి తండ్రులకోసం ప్రేమను త్యాగం చేయ కూడదు

నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు...మ్యారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ప్రపంచంలో అన్నీ ఒక పధకం ప్రకారమే జరుగుతాయంటారు...అన్నీ ముందుగానే నిర్ణయమవుతాయనే వాదన కూడా ఉంది. నీకు ఇంకోకఅమ్మాయితో పెళ్ళి జరగాలని దేవుడు నిర్ణయించి ఉంటే...మన ప్రేమ ఎలా గెలుస్తుంది. మన విషయంలో బహుశ అదే జరిగి ఉంటుంది

వాదన అని నువ్వే అంటున్నావు...అదే నిజం. అది వాదన మాత్రమే. తాము చేసే తప్పులను సమర్ధించుకోవటానికి దేవుడి పేరు చెబుతూ తప్పించుకుంటున్నారు

మాలతి మౌనంగా ఉండిపోయింది…. మళ్ళీ రాజునే మాట్లాడేడు.

యువతీ-యువకుల ప్రేమలో మొదటి భాగం ఆకర్షణ. ఆకర్షణకు కారణం ఏదైనా కావచ్చు. అభిరుచులు కలిసినా అది ఆకర్షణకే దారి తీస్తుంది. ఆకర్షణే ఇద్దరినీ ఒక చోట చేరుస్తుంది. కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరి మధ్యమానసిక అనుభంధం ఏర్పడుతుంది. తరువాత అది ప్రేమగా మారుతుంది. దాన్ని నిలబెట్టుకోవాలన్నా, తెంచుకోవాలన్నా అది వారిద్దరి ఆలొచనలు, బుద్ది మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కారణం ప్రేమలో బాధ్యత ఉండదు.”

పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో తెంచుకోవాలన్న ఆలొచనే రాదా?” అడిగింది మాలతి.

వస్తుంది. అయితే ఆలొచనకు వాళ్ళ ఇద్దరి మధ్య పెళ్ళి వలన ఏర్పడిన మానసిక అనుభందంతో పాటు బాధ్యత కూడా ఆడ్డుగోడగా నిలుస్తుంది. దీనికే కాదు భార్యా భర్తల మధ్య ఏర్పడే ఎన్నో అహంకార ఆలొచనలకు పెళ్లి అడ్డుగోడగా నిలుస్తుంది. కారణం పెళ్ళిలో బాధ్యత ఉంటుందిపెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా ఏదో ఒక ఆకర్షణ వలనే వధూ-వరులు పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి భంధం వలన వాళ్ళ మధ్య మానసికఅనుభంధం చాలా తొందరగా ఏర్పడుతుంది. పెళ్ళి జరిగిపోయింది కాబట్టి వారు వారి మానసిక అనుభంధంను నిలబెట్టుకోవటానికే ఎక్కువగా శ్రమ పడతారుకాబట్టి ప్రేమించిన యువతి-యువకులు కూడా సాధ్యమైనంత త్వరగా పెళ్ళి చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ మధ్య ఏర్పడ్డ మానసిక అనుభందం మరింత గట్టి బడుతుంది, బాధ్యత వస్తుంది...దాంపత్య జీవితం సుఖమయమవుతుందిదాంపత్య జీవితం సుఖమయమవాలంటే ఇద్దరి మధ్య మానసిక అనుబంధం చాలా ముఖ్యం. మానసిక అనుబంధం ఏర్పడటానికి పెళ్ళి చాలా ముఖ్యమైన వ్యవస్థ "

మాలతి ఏదో ఆలొచనలో పడింది.

"చూడు మాలతి...సమాజంలో అనేక రకాల కాలుష్యాల గురించి వినే ఉంటావు. అన్నిటికంటే ప్రమాదమైన కాలుష్యం ప్రేమ కాలుష్యం. ఆనందమైన దాంపత్య జీవితాలకు, సంత్రుప్తికరమైన కుటుంబ జీవితానికి, ప్రశాంతమైన సమాజంఏర్పడటానికి కావలసింది కాలుష్యంలేని ప్రేమ....నేను అదే కోరుకుంటున్నాను. పదిహేను రోజుల తరువాత మనిద్దరం రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళిచేసుకుంటున్నాము. దానికి కావలసిన ఏర్పాట్లు రోజు మొదలు పెట్టేను"

"వద్దు రాజు...ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసుకోవటం నాకు ఇష్టం లేదు"

అంతే మాలతి చెంప చెళ్ళుమన్నది.

                                                                    ******************************************

కంటి చివరగా కారుతున్న కన్నీటిని రుమాలతో రహస్యంగా తుడుచుకుంది రమ. 'నిజమైన ప్రేమను వెలిబుచ్చిన రాజును రాక్షసుడనుకున్నామేఅతను రాక్షసుడు కాదు....నిజమైన మగాడు' రమ మనసు నొప్పితో బాధపడింది.

"కంగ్రాట్స్" మాలతికి, రాజుకు షేక్ హ్యాండ్ ఇచ్చి గుడిలోపలకు వెళ్ళింది రమ.

************************************************సమాప్తం*********************************************                                                                                                                      


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

చిలుకల గుంపు...(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)