అనుకున్న దొకటి...అయిన దొకటి...(కథ)
అనుకున్న దొకటి...అయిన దొకటి (కథ)
'మనం అనుకున్నది...అనుకున్నట్టు జరిగితే అది దేముడి రాత ఎందుకు అవుతుంది.
అన్నీ రాసి పెట్టాకనే మనం జన్మ
ఎత్తేది .ఎప్పుడు ,ఏది, ఎలా ,ఎందుకు జరగాలో అందులోనే ఉంటుంది.
మనం అనుకున్నది జరిగితే జీవితం కాదది. అనుకోనిది జరిగితే అదే జీవితం. ‘మన పేరున రాసి పెట్టింది ఎక్కడికీ పోదు ' ఇలా ఒక్కోక్కోరూ వారికి తోచినది అనుకుంటారు.
ఈ కథలో కూడా అదే జరిగింది. కానీ ఇది కొంచం వింతగా ఉంటుంది. అదేమిటో ఈ కథను చదివి తెలుసుకోండి
************************************************************************************************
“అనుకున్నదొకటి...అయిన దొకటి… ఇది ఎప్పుడూ ఉన్నటువంటి తంతేగా?! మీరు అవునని అన్నా,
కాదని అన్నా, ఇది అంతే. ఎందుకంటే జీవితమే ఒక వింత.
మన చిన్ని గుండెకు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. కాని అన్నీ నెరవేరవు. అది తెలియక చాలా మంది పేక మేడలు కట్టేస్తుంటారు. ఆ మేడ కూలడం ఖాయమని తెలిసినా, ఆ ప్రయత్నం విరమించుకోరు. తీరా, అది కూలిన తర్వాత నిరుత్సాహ పడుతూంటారు.
ఇది ఒక ఛత్రము వంటిది. ఇటువంటి ఛత్రాలు కోకొల్లలు. ఇది ఎప్పుడో ఒకప్పుడు కచ్చితముగా అందరికీ జరుగుతూనే ఉంటుంది. ఎలా, ఎందుకు అనే వివరాలలోకి వెళ్ళటానికి ఎవరూ సాహసించకూడదు. కొన్నింటిని అలా వదలివేయటం మంచిది.
అనుకోకుండా కొందరిని కలుసుకుంటుంటాం; కొన్ని క్రొత్త అలవాట్లు చేసుకుంటుంటాం. మన ఇష్టాలతో పనిలేకుండా, మన ఆశలతో పొంతన లేకుండా, పలు సంగతులు మన జీవితంలో జరిగిపోతుంటాయి. అసలు ఎందుకలా జరుగుతోందని ఆలోచిస్తే సమాధానాలు దొరకవు.
మానవ జీవితంలో ఇన్ని వింతలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో తెలియటం లేదు. సమాధానము కోసం దేశాటనం చేయటం, దట్టమైన అరణ్యాలలో వణ్య మృగముల మధ్య కూర్చొని ధ్యానం చేయటం, పెళ్లి చేసుకోకుండా భోగ భాగ్యాలకు దూరంగా వుంటూ సాధన చేయటం చాలామందికి చేతకాని పని. నాకు తెలిసినదంతా ఒక్కటే.. ఈ జీవితం చాలా వింతది. ఆ వింత ఎందుకని ఆరా తీసేవాడిని ఈ లోకం వింతగా చూస్తుంది”
స్వామీజీ ప్రవచనాలు విని ఇంటికి తిరిగి వచ్చిన సీతకు తన జీవితంలోనూ, తన కూతురి జీవితంలోనూ ఏర్పడ్డ మార్పులు గుర్తుకు వచ్చినై.
***********************************
సినిమా హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఎవరికీ చెప్పకుండా తన సొంత ఊరు నుండి రైలెక్కి పారిపోయి నగరానికి వచ్చింది సీత. ఆమె ఎన్ని కష్టాలు పడ్డా చివరకు ఆమెకు దొరికింది సహాయ నటి పాత్రలే. అనుకున్నది ఒక్కటి…జరిగింది ఒక్కటి...ఇక జీవితం ఇలా కొనసాగించాల్సిందే నని తనని తాను సమాధాన పరచుకుని సహాయ నటిగానే స్థిరపడిపోయింది సీత.
రోజులు గడిచాయి...ఆమె నగరంలో స్థిరపడింది...ఆడపిల్ల పుట్టింది.
తాను కాలేని హీరోయిన్ ఆశను తన కూతురు మూలం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. కూతుర్ని హీరోయిన్ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కూతురు రమ్యకు సినిమాలలో నటించటానికి ఇష్టం లేదు. తల్లి ఆశ నెరవేర్చడం కోసం సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. వెంట వెంటనే ఆఫర్లు వచ్చినై. గబగబా పైకి ఎదిగింది. గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అయ్యింది.
మొదటి సినిమాలో నటించేటప్పుడు రమ్యకు ఒక బిజినస్ మ్యాన్ తో స్నేహం మొదలయ్యింది. స్నేహం ప్రేమగా మారింది. పెళ్ళిచేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
ఆ రొజు రాత్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన రమ్య, తల్లితో "నాకు సినిమాలలో నటించటం ఇష్టంలేదని నీకు తెలుసు...నీ ఆశ తీర్చటానికే సినిమాలలో నటించటానికి ఒప్పుకున్నాను...ఇక సినిమాల జోలికి వెళ్ళను. పెళ్ళి చేసుకోబోతున్నాను. పెళ్ళి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతాను" అని చెప్పింది.
సీత తల మీద పిడుగు పడినట్లు గిలగిల లాడిపోయింది. కూతురితో ఎంతో పోరాడి చూసింది. ఫలితం దక్కలేదు.
రమ్య అనుకున్నట్లుగానే బిజినస్ మ్యాన్ను వివాహం చేసుకుంది. ఆ రోజు ఫస్ట్ నైట్.
"రమ్యా...నీ అందం కంటే నీ నటనే నన్ను పిచ్చివాడ్ని చేసింది. నీతో ప్రేమలో పడేసింది. పెళ్ళి తరువాత కూడా నువ్వు సినిమాలలో నటించాలి...అదే నా ఆశ”
“నా భార్య అద్భుతమైన నటి...నటించటానికే పుట్టింది అని ప్రజలు నిన్ను మెచ్చుకోవాలి....అంత మంచి నటికి సంతోషమైన జీవితం ఇచ్చేననే త్రుప్తి నాకు కలగాలి"....భర్త మాట్లాడుతుంటే రమ్యకు కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి. పెళ్ళి తరువాత నటించకూడదనుకున్న తాను ఇప్పుడు భర్త ఆశను నెరవేర్చటానికి నటనను కొనసాగించాలి.
అనుకున్నదొకటి...అయిన దొకటి
**************************************************సమాప్తం*******************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి