గెలుపులో పాఠం…(కథ)

 

                                                                  గెలుపులో పాఠం                                                                                                                                                                                (కథ)

"రాయ్...రెడ్డప్పా...అసలు నువ్వు నా కొడుకువేనా?...నిన్ను ఒకడు కొడితే, చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని వచ్చేస్తావా? వెళ్ళు...వెళ్ళి వాడికి నాలుగు తగిలించిరా...వీలైతే వాడిని చితక బాదిరా...అప్పుడే నువ్వు నా కొడుకువనిపించు కుంటావు" మీసాలు మెలేస్తూ చెప్పాడు తండ్రి వెంకటాచలం.

"ఏమండీ...చిన్న పిల్లవాడికి ఇలాగేనా చెప్పిచ్చేది! వాళ్లు చిన్న పిల్లలండి... రోజు కొట్టుకుంటారు...రేపు కలిసిపోతారు. వెతుక్కుని వెళ్ళి దెబ్బలాడోస్తే పగ పెరుగుతుందే తప్ప...ఇంకేమొస్తుంది చెప్పండి?" పక్కనే నిలబడున్న రెడ్డప్ప తల్లి, భర్తతో చెప్పింది.

"వసంతా" భార్యను చూసి గట్టిగా అరిచిన రెడ్డప్ప తండ్రి వెంకటాచలం "ఆపుతావా నీ పిరికిమాటలను. వాడు నా కొడుకే...నాలాగా వీరుడిగా అవాలి...అంతేగానీ నీలాగా భయస్తుడవకూడదు" అన్నాడు.

"వీరుడై మీరు ఏం సాధించారు? ఆస్తులు సంపాదించారా? సంఘంలో గౌరవ మర్యాదలను సంపాదించారా? లేదే...విరోధులను సంపాదించుకున్నారు, గొడవలను సంపాదించుకున్నారు...వీటి వలన ఏం లాభం చెప్పండి...మీలాంటి బ్రతుకే వాడూ బ్రతకాలా? వద్దండి...అలాంటి పాఠాలు వాడికి నేర్పకండి" చెప్పింది.

"వాడిని అడ్డుపెట్టుకుని...నన్ను మందలిస్తున్నావా?...నీ మాటలు విని నేను పిరికివాడిగా జీవితం కొనసాగించుంటే...ఇదిగో ఇప్పుడు తింటున్న కూడు కూడా దొరకదు సరికదా మనల్ని కుక్కిన పేనులాగా చూశేవారు...ఎవరో తెలుసా! నువ్వు చెబుతున్నావే ఏదో సంఘమని... సంఘమే" భార్యకు చెబుతూ మళ్ళీ మీసం మెలేశాడు.

అది విన్న రెడ్డప్ప తల్లికి మొదటిసారిగా కోపం వచ్చింది. "ఆపండి మీ భాగోతం! మీ చిన్నప్పుడు మీ పెద్దలు మీరు చేసిన అల్లర్లను ఖండించి మందలించుంటే, మీరూ బాగుపడే ఉండేవారు. నేను అలా ఉండలేను" కోపంగా చెప్పింది.

" నువ్వైతే ఏం చేసే దానివి?" ఎగతాలిగా అడిగాడు వెంకటాచలం.

"వీపు మీద నాలుగు దెబ్బలు వేసి మార్చేదాన్ని" చెప్పింది.

వెంకటాచలం పెద్దగా నవ్వాడు.

భర్త నవ్వును అసహ్యించుకుంటూ "పిల్లలు తప్పుదోవ పడుతుంటే తల్లితండ్రులు వాళ్ళని కొట్టో, తిట్టో మంచి దోవలో పెట్టటానికి ప్రయత్నిస్తారు. ఇది సహజంగా ఇంట్లోనైనా పెద్దలు చేసే పని. రౌడీ తండ్రులు కూడా తమ పిల్లలు బాగు పడాలిని ఆశపడతారు...కానీ మీరు దానికి విరుద్దంగా రెడ్డప్ప భుజం తట్టి వాడిని రౌడి అవమని ప్రొశ్చహిస్తున్నారు!...ఇది వాడిని ఎక్కడికి తీసుకు వెళ్ళి వదుల్తుందో?" అంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

వెంకటాచలం నవ్వుకుంటూ, మీసం మెలేస్తూ బయటకు వెళ్ళిపోయాడు.

తల్లితండ్రులలో ఎవరో ఒకరు తమ పిల్లల్ని అతిగారాబం చేస్తూ నెత్తికెక్కించుకుంటున్న రోజుల్లో పుత్ర రత్నాలు దోషులుగా మారాడం...బలికావడం ఎంతసేపు.

                                                                    ***********************************

వయసుతో పాటు రెడ్డప్ప హడావిడితనం, పొగరు, రౌడితనం పెరిగిపోతోంది.

క్రింద, మీదా పడి తండ్రి సహాయంతో ఉపాధ్యాయులను బెదిరించి, పరీక్షలలో కాపీలు కొట్టి ఎలాగో ఒకలాగా కాలేజీలోకి అడుగుపెట్టేడు.

మెడలో మెరిసిపోయే బంగారు గొలుసు, నడిచే స్టైలు, దర్జాను పైకెత్తి చూపే ధుస్తులు, రెడ్డప్ప అవతారం అతన్ని ఒక భయంకర వ్యక్తిగా ఎత్తి చూపుతున్నాయి. వాడి చుట్టూ చేరిని కొంతమంది స్టూడెంట్స్ రెడ్డప్పలోని అహంకారాన్ని, రౌడీతనాన్ని మరింత పెంచారు.

విత్తనాలుగా ఉండే సహజ దుర్గుణాలు సావాసాల బలంతో మొలకెత్తి క్రమంగా విష వృక్షాలవుతాయి. రెడప్ప ప్రవర్తనలోనూ అదే జరిగింది. రెడ్డప్ప చుట్టూ చేరిన స్టూడెంట్స్ వాడిని "లీడర్...లీడర్" అని పిలవటంతో వాడికి కళ్ళు నెత్తికెక్కినై.

కాలేజి యూనియన్ ఎన్నికలు వచ్చినై. రెడ్డప్ప స్నేహితులు రెడ్డప్పను బరిలోకి దింపేరు. రెడ్డప్ప కాలేజి స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ పదవికి పోటీ చేశాడు. తనని ఎదిరించి ఎవరూ నిలబడరని అనుకున్నాడు. కానీ గోపాల్ అనే విధ్యార్ధి అదే పోస్టుకు నామినేషన్ దాఖాలు చేశాడు. వాడు బాగా చదివే విద్యార్ధి. చక్కటి వాక్చాతుర్యం కలిగిన స్టూడెంట్. విద్యార్ధుల మధ్య మంచి మర్యాద, గౌరవం కలిగినవాడు.

రెడ్డప్ప స్నేహితులు రెడ్డప్పను రెచ్చగొట్టారు.

"నిన్ను ఎదిరించి ఒకడు పోటీ చేయడమా?....ఎంత ధైర్యం!"

"ఇది ఉత్త పోటీ మాత్రమే కాదు రెడ్డప్పా. నీ గౌరవానికే ఒక సవాల్...మనం, విషయాన్ని పట్టించుకోకుండా ఉండిపోతే వాడే గెలుస్తాడు. ఎందుకంటే వాడంటే స్టూడెంట్స్ అందరికీ గౌరవం. విధ్యార్ధులలో అతనికి మంచి పేరుంది"

" గోపాల్ గాడిని ఎన్నికల నామినేషన్ తిరిగి తీసుకునేలా చేయాలి. నామినేషన్లను వాపస్ తీసుకోవటానికి రేపే ఆఖరి రోజు. రోజే మనం ఏదైనా చేయాలి"

"అవును మావా...వైస్ చైర్మన్ పదవికి క్రిష్ణారావు, సెక్రటరీ పోస్టుకు సంధ్య, ట్రెషెరర్ పోస్టుకు శంకర్ మాత్రమే నామినేషన్లు వేశారు. వాళ్ళకు పోటీగా ఇంకెవరూ నిలబడటం లేదు కాబట్టి వాళ్ళంతా పోటీ లేకుండానే గెలిచినట్లు అనౌన్స్ చేశ్తారు...పోటీ ఒక్క చైర్మన్ పోస్టుకే...!"

తట్టుకోలేకపోయేడు రెడ్డప్పచేస్తా...నేనేమిటో వాడికి చూపిస్తా" కసిగా చెప్పాడు రెడ్డప్ప.

అదీ మావారెడ్డప్పంటే" మళ్ళీ రెచ్చగొట్టేరు రెడప్ప స్నేహితులు.

సాయంత్రం కాలేజీ అయిపోయింది. గోపాల్ సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళే దారిలో రెడ్డప్ప తన స్నేహితులతో గోపాల్ ను అడ్డగించాడు.

ప్లాన్ వేసుకున్న విధంగానే రెడ్డప్ప గోపాల్ చంప మీద గట్టి దెబ్బ వేశాడు. తరువాతే మాట్లాడేడు.

"ఎలక్షన్లలో నుండి వైదొలగటానికి రేపే ఆఖరి రోజు. నువ్వు వైదొలగుతున్నట్లు అప్లికేషన్ మీద సంతకం పెట్టు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. లేకపోతేకాదు కూడదు అని హీరో మాటలు చెబితే నీ ఎముకలను నువ్వే క్రింద నుండి ఏరుకుని, లెక్కపెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది" గంభీరంగా చెప్పాడు రెడ్డప్ప.

ఇలా జరుగుతుందని గోపాల్ ఎదురుచూడలేదు. దెబ్బ తగిలిన చెంప మీద చెత్తో తడుముకుంటూ క్రింద పడిపోయిన సైకిలును పైకెత్తి నిలబెట్టి బెదురు చూపులతో రెడ్డప్ప గుంపును చూస్తూ "నేను గొడవలు పెట్టుకోవడానికి కాలేజీకి రాలేదు" నిదానంగా చెప్పాడు.

రెడ్డప్ప గుంపులో ఒకడు "మరెందుకొచ్చినట్టో?" గోపాల్ ని చూసి ఎగతాలిగా అడిగాడు.

"చదువుకోవటానికి" చెప్పాడు గోపాల్.

మరి బుద్దిగా చదువుకోకుండా...స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టో" గుంపులోని మరొకడు అడిగాడు.

"కాలేజీలో కొన్ని వసతులు చేయడానికి"

"ఎలాంటి వసతులో...అవికూడా చెప్పు" ఇంకొకడు.

లైబ్రరీ సరిగ్గాలేదు. అనవసరమైన పుస్తకాలు చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ కి ఉపయోగపడే పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. క్యాంటీన్లో ఫుడ్ అసలు బాగలేదు, కాంట్రాక్టర్ను మార్చాలి, రెస్ట్ రూములు సరిచేయించాలి, అటలపోటీలు నడపాలి...ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి" మాట్లాడుతున్నప్పుడు దవడ నొప్పి పుట్టడంతో చెప్పటం ఆపాడు గోపాల్.

"చదువుకోవడానికి వచ్చిన వాడివి వీటిని సరిచేయడానికే సమయమంతా కేటాయిస్తే చదువెలా సాగుతుంది...అవన్నీ మేము చూసుకుంటాం... నువ్వు ఫారం మీద సంతకం పెట్టు" చివరగా మాట్లాడాడు రెడ్డప్ప.

సినిమా టైపు గొడవని ఎదురు చూడని గోపాల్ ఇంకేమీ మాట్లాడకుండా రెడ్డప్ప జాపిన ఫారం తీసుకుని సంతకం పెట్టి తిరిగి ఇచ్చేశాడు.

"ఇక నువ్వు వెళ్ళొచ్చు" గుంపులో ఎవరో అన్నారు.

గోపాల్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు.

                                                                    ***********************************

మరుసటి రోజు కాలేజీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.

చైర్మన్ పోస్టుకు రెడ్డప్ప, వైస్- చైర్మన్ పోస్టుకు క్రిష్ణారావు, సెక్రెటరీ పోస్టుకు సంధ్య, ట్రెషరర్ పోస్టుకు శంకర్ పోటీలేని కారణంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు.

రెడప్ప స్నేహితులు రెడ్డప్ప గెలుపును గొప్పగా, పండుగలాగా చేసుకున్నారు. రెడ్డప్పకు పూలమాల వేసి ఎత్తుకుని ఊరేగించారు. ఆటలూ, పాటలతో పాటు టపాకాయలు కూడా కాల్చారు. అందరూ ఒకచోట చేరి స్వీట్లు పంచుకు తింటుంటే అక్కడికి రెడ్డప్ప స్నేహితుడోకడు పరిగెత్తుకొచ్చి ఆయాస పడుతూ అసలు విషయం చెప్పాడు. విషయం విని రెడ్డప్ప షాక్ తిన్నాడు. సెక్రటరీ పోస్టుకు పోటీ చేసి గెలిచిన సంధ్య తన పదవికి రాజీనామా చేసిందట.

అందరూ తింటున్న స్వీట్లను వెనక్కి పెట్టుకున్నారు. రెడ్డప్ప చేతిలోని స్వీట్ అతనికి తెలియకుండానే చేజారి క్రింద పడిపోయింది.

"ఏమిట్రా వాగుతున్నావ్...నువ్వు చెప్పేది నిజమేనా?" అతని చొక్కా కాలరు పుచ్చుకుని అడిగాడు రెడ్డప్ప.

నిజమే మామా... ప్రిన్సిపాల్ రూము దగ్గర కొంతమంది స్టూడెంట్స్ గుంపుగా గుమికూడి ఏదో మాట్లాడుకుంటున్నట్లుంటే ఏమై ఉంటుందా అని తెలుసుకుందామని అక్కడకు వెళ్ళాను... ఎందుకు గుమికూడేరని అడిగాను... సెక్రెటరీ పోస్టుకు సంద్య రాజీనామా చేసిందట, చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయింటారు కాబట్టి సంగతిని రేపు ప్రకటిద్దామని ప్రిన్సిపాల్ చెప్పినట్టు ఆఫీస్ ప్యూన్ చెప్పాడట

"సంధ్య ఎందుకు రాజీనామా చేసుంటదబ్బా!?" బుర్ర గోక్కుంటూ తనలో తాను అనుకుంటున్నా అది అందరికీ వినబడింది.

"దానికి కారణం చెబితే నువ్వు తట్టుకోలేవు మావా"

"అంటే...ఎందుకు రాజీనామా చేసిందో తెలిసిపోయిందా?...ప్యూన్ అది కూడా చెప్పాడా!...ఏమిటా కారణం?" అడిగాడు రెడ్డప్ప.

"గోపాల్ చైర్మన్ గా గెలుస్తాడనే నమ్మకంతోనే సంధ్య సెక్రటరీ పోస్టుకు నిలబడాలనుకున్నదట. నువ్వు చైర్మన్ గా ఎన్నికయ్యేవు కనుక సంధ్యకు సెక్రటరీ గా ఉండటం ఇష్టంలేదట. ఇదే విషయాన్ని తన రాజీనామా లేఖలో రాసిందట"

రెడ్డప్ప మొహం కోపంతో ఎర్ర బడింది.

రెడప్ప కోపాన్ని గ్రహించిన అతని మరో స్నేహితుడు తన చేతిలోని స్వీటును క్రిందకు విసిరి కొడుతూ "ఇది చాలా పెద్ద అవమానం గురూ...ఇలా గర్వంతో చెలరేగే సంధ్యకు బుద్ది వచ్చేట్లు చేయాలి. అరెనీ గురించి తెలిసి కూడా ఇలా చేసిందంటే దానికి ఎంత పొగరు...దీన్ని మామూలుగా విడిచిపెట్టకూడదు" అన్నాడు.

"రేపు కాలేజీ మొదలు పెట్టిన వెంటనే సంధ్య రాజీనామా గురించి ప్రిన్సిపాల్ ప్రకటిస్తాడు...కాబట్టి రోజే మనం సంధ్యతో మాట్లాడాలి" గుర్తు చేశాడు మరొక స్నేహితుడు.

"రేయ్...మేము కాలేజీ బయట నిలబడుంటాం, నువ్వెళ్ళి సంధ్య ఉందో లేక వెళ్ళిపోయిందో తెలుసుకురా" ఒక స్నేహితుడిని చూసి ఆర్డర్ వేశాడు రెడ్డప్ప.

వెంటనే అందరూ తమ మోటర్ సైకిళ్ళ మీద కాలేజీ బయటకు వచ్చారు. ఇంకా స్టూడెంట్స్ బయటకు వస్తూనే ఉన్నారు. రెడప్ప అతని స్నేహితులు రోడ్డుకు అవతలి వైపు నిలబడ్డారు.

సంధ్య తన స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ వస్తోంది.

"సంధ్యా..." రెడప్ప పిలిచాడు.

సంధ్య ఆగింది. సంధ్యతో వచ్చిన స్నేహితులు గబగబా వెళ్ళిపోయారు. సంధ్య రెడ్డప్పను చూసి "ఏమిటి" అన్నట్లు కురులు పైగెరేసి నిర్లక్ష్యంగా అడిగింది.

"సంధ్యా...సెక్రెటరీ పోస్టుకు ఎందుకు రాజీనామా చేశావు?" అడిగాడు రెడ్డప్ప.

"నాకు ఇష్టంలేదు...అందుకని రాజీనామా చేశాను"

"మొదట్లో ఎందుకు ఇష్టపడ్డావు?"

"సెక్రటరీ గా ఉండాలని అప్పుడు అనిపించింది"

"నేను చైర్మాన్ అయినందువలన నీకు సెక్రటరీగా ఉండటానికి ఇష్టంలేదు కదూ"

"మిస్టర్ రెడ్డప్పా....నువ్వడిగే ప్రశ్నలన్నింటికీ నేను జవాబు చెప్పాలనే నిర్భందం నాకు లేదు" కోపంగా చెప్పింది సంధ్య.

అప్పుడు రెడ్డప్ప స్నేహితుడొకడు అడ్డుమాట్లాడాడు.

"సంధ్యా...నువ్వు చేసింది రెడప్పకు పెద్ద అవమానం...నీ రాజీనామా లెటర్ను వెనక్కి తీసుకుని, సెక్రటరీగా ఉంటానని రిక్వస్ట్ చెయ్యి...నువ్వే సెక్రటరీగా ఉండాలి...లేకపోతే జరిగేదే వేరు"

సంధ్య చాలా నిర్లక్ష్యంగా అతనివైపు చూసి "మిస్టర్...ఒక దెబ్బకే నామినేషన్ తిరిగి తీసుకోవటానికి నేనేమీ గొపాల్ కాదు. ఇక్కడ జరిగిందంతా కాలేజి ప్రిన్సిపాల్ కు చెబితే మీ అందరి సీట్లు చించిపారేస్తారు" అన్నది.

సంధ్య దగ్గర నుండి ఇలాంటి సమాధానాన్ని ఎదురు చూడని రెడప్ప, అతని స్నేహితులు స్టన్ అయిపోయారు.

"రెడ్డప్ప లాంటి హింసాత్మక విధానం, రౌడీతనం, బెదిరింపు ధోరణి కలిగిన నీచమైన బుద్ది గలవారు ఎవరు చైర్మాన్ గా ఎన్నికైనా ఇలాగే చేశేదాన్ని. అలాంటి వారి క్రింద సెక్రెటరీగా ఉండి పనిచేయడం కంటే మన కాలేజీ ప్యూనుకు సెక్రెటరీగా ఉండొచ్చు" అని చెప్పి రెడ్డప్ప వైపు తిరిగి "రెడప్పా...నువ్వు హింసాత్మక దారి, రౌడీతనం వదిలిపెట్టి సూటిగా వెళ్ళు. నీక్కూడా మంచి మర్యాద, గౌరవం దొరుకుతుంది. పది మందిని వెంటపెట్టుకుని వెడితే నువ్వు పిరికివాడివని అందరికీ తెలిసిపోతుంది

"నిన్ను చూసి అందరూ భయపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆలొచన తప్పు. నిన్ను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. భయానికీ, అసహ్యానికి చాలా తేడా ఉంది. మనిషిని చూసి మనిషి ఎప్పుడూ భయపడడు. కానీ మనిషిని చూసి మనిషి అసహ్యించుకుంటాడు. రౌడీలు, అధికార గర్వంతో విర్రవీగే వాళ్ళూ ఇతరులు వారిని చూసి అసహ్యించుకోవటాన్ని భయం అనుకుని అపోహపడుతున్నారు. బురదలో రాయేస్తే మళ్లీ తమపైనే బురద పడుతుందని నీలాంటి వారి నుండి తప్పుకు వెడుతున్నారు….పక్కకు వెళ్ళి "థూ" అని ఉమ్మేస్తున్నారు"

"మనిషనే వాడు సంఘజీవి. సమాజంలో ఉన్నంతవరకు తల్లితండ్రులను, ఇతర కుటుంబ శభ్యులను, సాటి మనుష్యులను ప్రేమించాలి. దాని వలన మాత్రమే సుఖం, శాంతి, గౌరవ మర్యాదలు లభ్యమవుతాయి. మన్యుష్యులను ప్రేమించి వారికి సేవలందించటానికి పదవులను వాడుకోవాలి కానీ పదవిని ప్రేమిస్తూ మనుష్యులను వాడుకోరాదు"

"నేను రాజీనామా చేసింది చేసిందే...దానిని వెనక్కి తీసుకోను. నీ బెదిరింపులకు లొంగను...అవసరమైతే రేపు కాలేజీలో మీటింగు పెట్టి ఇప్పుడు జరిగిందంతా వాళ్ళకు చెబుతాను...ఏం చేస్తావో చేసుకో" అని చెప్పేసి వారి జవాబుకు ఎదురుచూడకుండా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

రెడప్పకు ఏదో పెద్ద దెబ్బ తగిలి, విరిగిపోయి, ముక్కలైపోయినట్లు అయిపోయింది. సంధ్య అతని మనసుపై ఉమ్మేసి వెల్తున్నట్లు అనిపించింది. మెళ్ళిగా తన చుట్టూ చూశాడు. అంతవరకు తనతో ఉన్న స్నేహితులు కనబడలేదు. మనసు చివుక్కుమన్నది. బైక్ స్టార్ట్ చేసి నెమ్మదిగా ఇంటివైపు పోనిచ్చాడు.

                                                                    ***********************************

ఇంటికి వెళ్ళిన రెడ్డప్ప దేనిమీద మనసును లగ్నం చేయలేకపోయాడు. మనసులో అగ్నిపర్వతం బద్దలై ముక్కలైనట్లు ఫీలింగ్. తన జీవితంలో తాను ప్రవర్తించిన ప్రవర్తనల తీరును తిరిగి తిరిగి ఆలొచించాడు. కాలేజీలో తాను గెలిచినట్లు ప్రకటించినా...తనకు దొరికింది ఒక పెద్ద ఓటమేనని గ్రహించేడు. తల్లి భోజనానికి రమ్మన్నా నాకు ఆకలిగాలేదని చెప్పాడు. రాత్రి పన్నెండు దాటినా రెడ్డప్పకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు కాలేజీలో అతన్ని అందరూ ఎలా చూస్తారో ఊహించుకున్నాడు. అసహ్యంగా చూసేవారే ఎక్కువమంది కనబడ్డారు. అగ్ని కణాలను ఎదుర్కొనే శక్తి అతను కోల్పోయినట్లు, కాలేజీ ప్రిన్సిపాల్ తనను పిలిచి డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టినట్లు. అది తీసుకుని బయటకు వస్తుంటే సంధ్యతో సహా అందరూ అతని మోహంపై ఉమ్మేస్తున్నట్లు ఊహించుకున్నాడు. ఆలొచించను ఆలొచించను అతని మనసులో అడవి మంటలు పెరిగినై. అంతవరకు నేనే గెలిచేనన్న అతని ఆనందం మంటల్లో పడి మసైపోయింది.

"నిన్ను చూసి అందరూ భయపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆలొచన తప్పు. నిన్ను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు.నువ్వొక విషయం గుర్తుంచుకోవాలి. విజయం ఒంటరిగానే సాధించాలి...ఇలా నలుగురు పనికిమాలిన వెధవల్ని వెంటేసుకుని...అందరినీ బెదిరించి విజయాన్ని సంపాదించలేవు. ఒక వేల అలా సంపాదించినా పదవి ఎక్కువ కాలం నిలవదు...ఇదిగో ఇలా అవమానాలతో పదవిని నెట్టుకురావాలి" సంధ్య చెబుతున్నట్లు, తనను చూసి ఎగతాలి చేస్తున్నట్లు అతని మనసు పదే పదే చెబుతోంది.

రెడ్డప్ప ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా తల ఆడించేడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు.

                                                                    ***********************************

మరునాడు ఉదయం నిద్ర నుంచి లేచిన రెడ్డప్పకు మనసు చాలా తేలికగా ఉన్నది. మామూలుగా దర్జాకోసం వేసుకునే దుస్తులను వేసుకోకుండా మామూలు దుస్తులు ధరించాడు. మెడలో వేసుకున్న బంగారు గొలుసులు తీసేశాడు. చేతికి వేసుకున్న ఉంగరాలు కూడా తీసేశాడు. బైకు తీసుకుని కాలేజీకీ వెళ్ళాడు.

అప్పుడే కాలేజీ బెల్లు కొట్టారు....స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెడూతున్నారు. బైకును కాలేజీ మధ్యలో ఆపి, బండిపై నిలబడి"ఫ్రెండ్స్" అని గట్టిగా అరిచాడు. క్లాసులకు వెడుతున్నవారు ఒక్కసారిగా ఆగేరు.

"అందరూ ఒక్కసారి ఇక్కడకు రావాలి...క్లాసులో ఉన్న వారందరినీ కూడా నేను చెప్పేది ఒకసారి వినమని చెప్పండి" అన్నాడు.

రెడ్డప్ప స్నేహితులూ, మిగిలిన స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరే అక్కడ పోగయ్యారు. కొంతమంది మేడపైనుండి వింటామన్నారు. "ఏం గొడవ మొదలవుతుందో" నన్న భయంతో ప్రిన్సిపాల్ కూడ బయటకు వచ్చాడు.

"డియర్ ఫ్రెండ్స్...నేను చైర్మాన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాకంటే పదవిని సమర్ధవంతంగా ఉపయోగించుకునే సామర్ధ్యం మన స్నేహితుడు గోపాల్ కి ఉన్నదని నా అభిప్రాయం. కాలేజీలో ఎన్నో వసతులు విధ్యార్ధులకు కలిపించాలని, దానికొసం ఏమేమి చేయాలో పనుల పట్టీని నా దగ్గర వివరించాడు. అతను చెప్పి నేను చేయటం కన్నా అతనే చైర్మాన్ పదవిలో ఉండి పనులు చేయాలని నా కోరిక. మీరందరూ నా కోరికను సమర్ధించాలని, గోపాల్ చైర్మాన్ పదవి భాద్యతలు తీసుకోవాలని వేడుకుంటున్నాను. మీ అందరిలాగే నేను కూడా గోపాల్ కి కావలసిన సహాయం అందిస్తానని మాట ఇస్తున్నాను" చప్పట్ల మోతతో కాలేజీ దద్దరిల్లింది.

ఇంతవరకు తనమాటలకు చప్పట్లు కొట్టని సహ విధ్యార్ధులు ఇప్పుడెందుకు కొడుతున్నారో రెడ్డప్పకు అర్ధమయ్యింది. దూరంగా మేడపై తన క్లాసు ఆవరణలో సంధ్య నిలబడి ఉండటం చూసేడు రెడప్ప.

సంధ్య తన కుడిచేతి బొటను వేలును పైకెత్తి "దంబ్స్ అప్" చూపింది. రెడ్డప్ప కూడా "దంబ్స్ అప్" చూపిస్తూ బైకుపై నుండి క్రిందకు దిగాడు.

***********************************************సమాప్తం******************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)