చిన్నారి కోరిక ...(కథ)

 

                                                                      చిన్నారి కోరిక                                                                                                                                                              (కథ)

అది బాల నేరస్థుల న్యాయస్థానం.

పోలీసులు ఆరేళ్ళున్న ఒక కుర్రాడిని జడ్జి ముందు నిలబెట్టారు.

గుమాస్తా అందించిన కేసు ఫైలును తీసుకున్న జడ్జి, కేసు ఫైలును చదివి ఆశ్చర్య పోయాడు. దెబ్బలను చూసుకుంటూ, ఏడుస్తూ బోనులో నిలబడున్న కుర్రాడిని చూశాడు. న్యాయ మూర్తికి ఆగ్రహం వచ్చింది. వాడిని న్యాయ స్థానం లోకి తీసుకు వచ్చిన పోలీసులను చూసి మీ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వచ్చారా?” అని అడిగాడు.

లేదు యువరానర్...స్టేషన్ లోనే ఉన్నారు చెప్పాడు ఒక కానిస్టేబుల్.

న్యాయ స్థానానికి వెంటనే రమ్మని కబురు పెట్టండి..మీ ఇన్స్ పెక్టర్ వచ్చిన తరువాత కేసు విచారణ మొదలు పెడతాను అని కానిస్టేబుల్ తో చెప్పి కేసు ఫైలును పక్కన పెట్టారు జడ్జి.

అర గంట తరువాత వచ్చిన ఇన్స్ పెక్టర్ను చూసి కుర్రాడి మీద కేసు ఫైలు ప్రిపేర్ చేసింది మీరేనా?” అడిగాడు జడ్జి.

ఎస్. సర్ అన్నాడు ఇన్స్ పెక్టర్.

 ఏం మనుషులయ్యా మీరు. చిన్న పిల్ల వాడిని పట్టుకుని గొడ్డును బాదినట్టు బాదారు. వాడేం తప్పు చేశాడని అలా కొట్టారు. దొంగ తనం చేశాడా? దోపిడీ చేశాడా?మాన భంగం చేశాడా? లేక జేబులు కొట్టాడా? లేదే... మహిళ బొమ్మను కౌగలించుకున్నాడు. అంత మాత్రానా వాడు పాడు బుద్ది గలవాడని మీరంతా ఎలా ఒక నిర్ణయానికి వచ్చారు?”… ఇన్స్ పెక్టర్ను చూసి గట్టిగా అరిచాడు.

వయసులో వాడికి పాడు బుద్ది ఆలొచన వస్తుందా?...వీడికే కాదు...వీడి వయసులో ఉన్న పిల్లలకైనా అలాంటి ఆలొచన వస్తుందా? మీ ఇళ్ళల్లో వీడి వయసు పిల్లలు లేరా?...వాళ్ళకి కూడా ఇలాంటి బుద్దులే ఉన్నాయా...ఏం పోలీసులయ్యా మీరు?”

పోలీసులంటే నేరారోపణలో ఎంత నిజముందో అక్కడికక్కడే కనుక్కునే మొదటి వ్యక్తులయ్యా. నేరస్తుల తల రాతలను రాసే వారిలో మీరే మొదటి వారు. అలాంటి బాధ్యత గల పదవులు నిర్వర్తిస్తూ నేరారోపణలో నిజముందో లేదో తెలుసుకోకుండా కళ్ళు మూసుకుని నేరం మోపబడిన వ్యక్తిని ఖైదు చేస్తూ ఎందుకయ్యా న్యాయస్థానాన్ని అవమానిస్తారు?”

మొదటి సారి కాబట్టి మీమీద చర్య తీసుకోవటం లేదు...ఇక మీదటైనా కేసులలో నిజమెంతుందో తెలుసుకుని మీ విధులను నిర్వహించండి...దిస్ కేస్ ఈజ్ డిస్ మిస్సెడ్. కుర్రాడిని విడిచి పెట్టండి ఆర్డర్ వేశారు జడ్జి.

కోర్టులో హాలులో నిలబడి అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న కొబ్బరి కాయల కొట్టు యజమాని రాజయ్య సంతోషం పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి కుర్రాడిని కౌగలించుకుని "నీకేమీ కాదని నాకు తెలుసు పిచ్చాయ్...ఎందుకంటే ఎప్పుడూ న్యాయంగా బ్రతకాలనే మనసున్న బొమ్మల బామ్మ చని పోయినా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని నాకు తెలుసు" అని చెప్పి వాడ్ని తనతో తీసుకు వెళ్ళాడు.

కొట్లో ఉన్న స్టూలు మీద పిచ్చాయిని కూర్చోబెట్టి, మంచి నీళ్ళు ఇచ్చి "ఉండు...నొప్పులకు మాత్ర ఇస్తాను" అని చెప్పి మాత్ర తీసుకు రావాడానికి లోపలకు వెళ్ళాడు కొబ్బరి కాయల కొట్టు యజమాని రాజయ్య.

మాత్ర తీసుకుని తిరిగి వచ్చి చూస్తే పిచ్చాయ్ అక్కడ లేడు. "అమ్మోరి గుడి దగ్గరున్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళుంటాడు" అనుకుంటూ ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ తన కుర్చీలో కూర్చున్నాడు రాజయ్య.

అతని మనసు పిచ్చాయ్ జీవిత చరిత్రను గుర్తు చేసుకుంది.

                                                                  ************************************

స్కూల్ గేటు బయట చొక్కా లేకుండా నిలబడున్నాడు ఎనిమిదేళ్లున్న పిచ్చాయి.

ప్రతి రోజూ స్కూల్లో లంచ్ బెల్ కొట్టక ముందు నుండే అక్కడకు వచ్చి నిలబడటం పిచ్చాయికి అలవాటు. లంచ్ బెల్ కొట్టిన వెంటనే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ స్కూల్ కాంపౌండ్ లోని చెట్ల కింద లంచ్ బాక్సులతో నిలబడున్న వారి తల్లి తండ్రుల దగ్గరకు వస్తారు. నవ్వుతూ, ఏవో కబుర్లు చెబుతూ, తల్లులు ప్రేమతో పెడుతున్న లంచ్ బాక్స్ లోని ఆహారాన్ని ఆనందంతో తింటారు. గేటు బయట నిలబడున్న పిచ్చాయికి దృశ్యం ఎంతో ఆనందానిస్తుంది. ఆనందం కోసమే రోజూ వాడు లంచ్ టైముకు స్కూల్ గేటు దగ్గరకు వచ్చి నిలబడతాడు.

లంచ్ అయిన తరువాత పిల్లలు మిగిల్చిన ఆహారాన్ని కొంతమంది తల్లులు పిచ్చాయికి ఇస్తారు. వాడు ఎంతో ఆనందంతో ఆహారాన్ని తింటాడు.

పిచ్చాయి స్కూల్ గేటు దగ్గరకు లంచ్ టైమ్ కి వచ్చేది తిండి కోసం కాదు. అడుక్కోవడం వాడికి నచ్చదు. అడుక్కోవడం తప్పు, కష్ట పడి, ఏదైనా పని చేసి సంపాదించి తినాలని వాడికి, వాడిని పెంచిన బొమ్మల బామ్మ చెప్పింది. బొమ్మల బామ్మ ఏది చెబితే అది వేద వాక్కుగా తీసుకుంటాడు పిచ్చాయి.

లంచ్ టైమ్ ముగిసిన తరువాత స్కూల్ దగ్గర నుండి బయలు దేరి తిన్నగా మార్కెట్ వీధి లోకి వస్తాడు పిచ్చాయి. వీధిలో ఉన్న బట్టల కొట్టు దగ్గర నిలబడతాడు. బట్టల కొట్టు బయట నిలబెట్టిన మహిళ అలంకార బొమ్మను కళ్లార్పకుండా తదేకంగా చూస్తాడు. అది చూసి బట్టల కొట్లోని ఉద్యోగస్తులు పిచ్చాయిని కసురుకుంటారు.

పిచ్చాయి రోజూ లంచ్ టైముకు స్కూల్ గేటు దగ్గరకు ఎందుకు వస్తున్నాడు? అడుక్కోవడం నచ్చని పిచ్చాయి పిల్లలు మిగిల్చిన ఆహారాన్ని వారి తల్లులు ఇస్తుంటే ఎందుకు తింటున్నాడు? బట్టల కొట్టు దగ్గర నిలబడి అలంకార బొమ్మను ఎందుకు తదేకంగా చూస్తాడు?... వీటన్నిటికీ సమాధానం కోరిక!... ఆరేళ్ళ పిచ్చాయికి ఉన్న కోరిక ఏమిటో?

                                                                         ************************************

ఎవరో పిచ్చాయిని కనేసి ఒక చెత్త కుండిలో పారేసి వెళ్లి పోయారు. వాడిని చెత్త కుండీ నుండి తీసుకుని పెంచి పోషించేది బొమ్మల బామ్మ.

బొమ్మల బామ్మకు వయసు సుమారు డెబ్బై ఏళ్లుంటాయి. వయసులో ఉన్నప్పుడు ఇళ్ళల్లో పనులు చేసుకుని బ్రతికేది. వయసు మళ్లిన తరువాత శరీరం సహరించక పోవటంతో బొమ్మలు అమ్ముకుని కాలం వెళ్ళబుచ్చుతోంది. అందుకని ఆమెను అందరూ బొమ్మల బామ్మ అని పిలిచేవారు.

బొమ్మలు అమ్మిన డబ్బుతోనే తాను తింటూ, పిచ్చాయిని కూడా పోషించేది బొమ్మల బామ్మ.

బొమ్మల బామ్మకు ఇల్లు లేదు. అమ్మోరి గుడి బయట ఉన్న వేప చెట్టు నీడే ఆమెకు ఇల్లు. అక్కడే పిచ్చాయిని పెట్టుకుని నిద్ర పోయేది. వర్షం వచ్చినప్పుడు మాత్రం గుడి బయట ఉన్న వరాండాలో తల దాచుకునేది.

బొమ్మల బామ్మే వాడికి పిచ్చాయి అని పేరు పెట్టింది. పేరు ఎందుకు పెట్టిందో బొమ్మల బామ్మకు మాత్రమే తెలుసు. వాడు పసి గుడ్డుగా ఉన్నప్పటి నుండి వాడిని తనతో పాటూ, తాను ఎక్కడికి వెడితే వాడ్ని అక్కడకు తీసుకు వెళ్లేది.

వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. బొమ్మల బామ్మకు అవి, ఇవీ అందివ్వటంలో సహాయ పడుతూ ఉండేవాడు. పాత గుడ్డలు అమ్మే రాజమ్మ దగ్గర అప్పుడప్పుడు పిచ్చాయికి గుడ్డలు కొనేది. అవే వాడికి కొత్త బట్టలు.

ఎందుకనో పిచ్చాయికి చొక్కా వేసుకోవటం ఇష్టం లేదు. బొమ్మల బామ్మ చొక్కా కొన్నా దాన్ని వేసుకునే వాడు కాదు. వేప చెట్టు క్రింద దాచేవాడు. బొమ్మల బామ్మ పిచ్చాయిని చొక్కా లేకుండానే ఎక్కువ రోజులు పెంచింది. బహుశ అలా పెరిగినందు వలనో ఎమో వాడికి చొక్కా వేసుకునే అలవాటు రాలేదు.

పిచ్చాయికి ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికి వాడికి మాటలు బాగా వచ్చాయి. కానీ ఎందుకనో ఎక్కువగా మాట్లాడే వాడు కాదు.

ఒక రోజు ఎండ ఎక్కువగా ఉన్నందు వలన బొమ్మల బామ్మ పిచ్చాయిని తనతో తీసుకు వెళ్ల లేదు. గుడి పక్కనున్న కొబ్బరి కాయల కొట్టు యజమాని రాజయ్యకు పిచ్చాయిని చూసుకోమని చెప్పి వెళ్లింది.

బొమ్మల బామ్మ తిరిగి వచ్చేటప్పుడు పిచ్చాయి గుడి ముందు నిలబడి అడుక్కుంటున్నాడు. గబగబా వాడి వైపుకు వెళ్ళి వాడ్ని లాక్కుని చెట్టు కిందకు వచ్చింది. "చూడయ్యా...అడుక్కుని డబ్బు సంపాదించుకో కూడదు...కష్ట పడి పని చేసి డబ్బు సంపాదించుకుని, డబ్బుతోనే తినాలి" అన్నది.

"అదెలా?" అని అమాయకంగా అడిగాడు పిచ్చాయి.

ఎవరికైనా పని చేసి పెట్టి... వాళ్లిచ్చే డబ్బు తీసుకోవచ్చు"

"అదెలా?" అని మళ్లీ అమాయకంగా అడిగాడు పిచ్చాయి.

"రేపు చూపిస్తా" అని బామ్మ చెప్పటంతో రేపు ఎప్పుడొస్తుందా అన్న ఎదురుచూపుతో నిద్రలోకి జారుకున్నాడు పిచ్చాయి.

                                                                     ************************************

మరుసటి రోజు ఉదయం బొమ్మల బామ్మ తన పని మీద వెడుతూ, గుడి పక్కనున్న కొబ్బరి కాయల కొట్టు యజమాని రాజయ్యతో "వీడిని...వూరక కూర్చోపెట్టుకోకు. చిన్న, చిన్న పనులు చేయించు...నీకు తోచింది వాడి చేతిలో పెట్టు" అని చెప్పి వెళ్ళిపోయింది.


చాలా సేపు పని లేక కూర్చున్న పిచ్చాయికి పని చెప్పాడు కొట్టు యజమాని. నాలుగు కొబ్బరి కాయలను ఒక సంచీలో వేసి "ఇదిగో పిచ్చాయ్... సంచీ తీసుకెళ్లి పక్క వీధి మొదట్లో ఉన్న హోటల్లో ఇచ్చిరా" అన్నాడు.

"అలాగే" అంటూ యజమాని ఇచ్చిన సంచీని చేతిలోకి తీసుకున్నాడు. మోయ లేక క్రింద పెట్టాడు. అప్పుడు కొట్టు యజమాని, సంచీని పిచ్చాయి నెత్తి మీద పెట్టి "ఇప్పుడు వెళ్ళు" అన్నాడు.

పిచ్చాయి తిరిగి వచ్చిన తరువాత వాడి చేతిలో రూపాయి బిళ్ళ ఉంచాడు.

పిచ్చాయి ఆనందానికి అవదుల్లేవు. బొమ్మల బామ్మ ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూశాడు. బొమ్మల బామ్మ రానే వచ్చింది. ఒక్క పరుగున బామ్మ ముందుకు వెళ్లి "బామ్మా...ఇదిగో ఒక రూపాయి సంపాదించాను " అంటూ ఆనందంతో రూపాయి ఎలా వచ్చిందో చెబుతూ రూపాయను బామ్మ చేతిలో ఉంచాడు.

చూశావా...కష్ట పడి పనిచేస్తే సంపాదించింది రూపాయైనా సంతోషం ఎలా పొంగుకు వస్తోందో...ఇక మీదట డబ్బును అలానే సంపాదించాలి" అంటూ ఇదిగో రూపాయను నువ్వే దాచుకో. ఆకలేసినప్పుడు ఏదైన కొనుక్కు తిను... బిచ్చమెత్తుకోకూడదు...సరేనా" అన్నది.

"అలాగే బామ్మా" అంటూ తన రూపాయను తన మూటలో దాచుకుని బామ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

బామ్మ పేపర్లో చుట్టుకొచ్చిన రొట్టెను వాడి ముందు ఉంచి "తిను" అన్నది.

"తింటా గానీ...మా అమ్మ ఎక్కడుందో చెప్పు బామ్మా" అని అడిగాడు.

"ముందు తిను" అన్నది బామ్మ.

"నేను తినను...మా అమ్మ ఎక్కడ అని ఎప్పుడు అడిగినా...తరువాత చెబుతానంటావు. నన్ను ఏమార్చి వెళ్లి పోతావు. రోజు చెబితే గాని తినను" మొండికేశాడు పిచ్చాయి.


చెప్పక తప్ప లేదు బామ్మకు "నిన్ను కని, నా దగ్గర ఇచ్చేసి మీ అమ్మ శిలగా అయిపోయిందిరా" నోటికొచ్చింది చెప్పింది.

"అమ్మ శిల ఎక్కడుంది బామ్మా?" అమాయకంగా అడిగేడు పిచ్చాయి.

బొమ్మల బామ్మకు ఏం చెప్పాలో తొచక " మార్కెట్ వీధిలో బట్టల కొట్టు ఉందే... బట్టల కొట్టు ముందు నిలబడుంటుంది చూడు ఒక బొమ్మ...ఆమే నీ తల్లి" అని చెప్పి పూటకు హమ్మయ్య అనుకుంది.

వాడిని సమాధాన పరచాలని అప్పుడు బామ్మ చెప్పిన అబద్దాన్ని వాడు నిజమని నమ్మాడు.....వాస్తవం కంటే ఊహే గొప్పది...నిజ ప్రపంచం కంటే మనసు సృష్టించుకునే ప్రపంచమే గొప్పది.

అంతే...పిచ్చాయి గబ గబ పరిగెత్తు కుంటూ వెళ్లి బట్టల కొట్టు ముందున్న బొమ్మ దగ్గర నిలబడ్డాడు. తదేకంగా బొమ్మను చూశాడు. "అమ్మా...ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళి పోయావు? నేను నల్లగా, అసహ్యంగా ఉన్నానని నీకు నచ్చలేదా?...అమ్మా నన్ను గట్టిగా ఒకసారి కౌగలించు కోవా?...నాకొక ముద్దు పెట్టవా?" అని బొమ్మ దగ్గర తన ఆశను వెలిబుచ్చాడు.

అది చూసిన బట్టల కొట్టు యజమాని "రాయ్...అక్కడ్నుంచి వెళ్లు...కస్టమర్లు వచ్చే వేల అయ్యింది" అని అరిచాడు.

పిచ్చాయి అక్కడ్నుంచి వెనక్కి తిరిగి నెమ్మదిగా నడుచుకుంటూ వేప చెట్టు క్రిందకు వచ్చాడు. నిద్ర పోతున్న బొమ్మల బామ్మ పక్కన కూర్చున్నాడు.

                                                                       ************************************

బొమ్మల బామ్మ చనిపోయింది.

కొబ్బరి కాయల కొట్టు యజమాని రాజయ్య పిచ్చాయిని తన దగ్గర ఉంచుకున్నాడు. మధ్యాహ్నం పూట, రాత్రి పూట వేప చెట్టు క్రిందకు వెడతాడు పిచ్చాయి. ఇప్పుడు బామ్మ మూట కూడా వాడి ఆస్తి అయ్యింది.

ఒక రోజు పిచ్చాయి కొట్టు యజమానిని అడిగాడు "నిజమైన అమ్మలు ఎక్కడుంటారు" అని. దానికి యజమాని "మార్కెట్ పక్కనున్న స్కూలుకు పన్నెండింటికి వెళ్లు...బోలేడు మంది అమ్మలు కనబడతారు" అన్నాడు.

రోజు నుండి రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే స్కూల్ దగ్గరకు వెళ్లటం, అక్కడ లంచ్ టైముకు పిల్లల తల్లులు, తమ పిల్లలకు లంచ్ పెడుతుంటే చూసి ఆనందపడటం, లంచ్ బాక్సులలో మిగిలి పోయిన లంచ్ ను తల్లులు పిచ్చాయికి ఇస్తే, అది తన తల్లే ఇచ్చిందని సంతోష పడటం పిచ్చాయికి రొటీన్ అయి పోయింది.

అదే లాగా రోజుకు ఒక సారైనా బట్టల కొట్టు ముందున్న బొమ్మ దగ్గరకు వెళ్ళటం, బొమ్మ దగ్గర తన ఆశను మొర పెట్టుకోవటం వాడికి ఒక లక్ష్యంగా మారింది.

                                                                                ************************************

రోజు కూడా రోజూ లాగానే స్కూలు గేటు బయట నిలబడి స్కూలు పిల్లల తల్లులను చూసి ఆనంద పడ్డాడు పిచ్చాయి. కానీ ఎందుకనో రోజు లంచ్ అవర్ పూర్తి కాకుండానే తిరిగి వచ్చేశాడు.

కోరుకున్నది మనసులో ఎంత స్పష్టంగా ముద్ర వేసుకుంటుందో...అంతే త్వరగా అది వాస్తవానికి దారి తీస్తుందంటారు. అదే జరిగింది.

స్కూలు నుండి బయలు దేరిన పిచ్చాయి నేరుగా బట్టల కొట్టుకు వచ్చాడు. బట్టల కొట్టు గుమ్మంలో పెట్టిన బొమ్మను పైకీ కిందకూ ఒకసారి చూశాడు. బొమ్మను చూసి "ఎన్నిసార్లు అడిగినా నువ్వు నన్ను ఎందుకు కౌగిలించుకోవటం లేదమ్మా? ఎందుకు ముద్దు పెట్టుకోవటం లేదమ్మా?... స్కూల్లో పిల్లలను చూడు, వాళ్ల అమ్మలు వాళ్లకి ముద్దలూ పెడుతున్నారు...ముద్దులూ పెడుతున్నారు..నువ్వు కౌగలించుకోక పొతే...నేనే నిన్ను కౌగలించుకుంటా" అంటూ బొమ్మను గట్టిగా కౌగలించుకున్నాడు.

బట్టల కొట్టు యజమాని, ఉద్యోగస్తులూ అది చూశారు." వయసులో వాడికి ఎలాంటి బుద్ది పుట్టిందో చూడండి...బొమ్మను కౌగలించుకున్నాడు" అని అరుచుకుంటూ బయటకు వచ్చిన బట్టల కొట్టు యజమాని ఫటేల్ మని చొక్కా లేని పిచ్చాయి వీపు మీద ఒకటిచ్చాడు. ఉద్యోగస్తులూ తలో దెబ్బ వేసి వాడిని లోపలకు లాక్కు వెళ్ళారు.

వయసులో వీడికి ఇదేం బుద్ది...ఇలాంటి వారే పెరిగి పెద్దయ్యాక అఘాయిత్యాలు చేస్తారు" అన్నాడు ఒక ఉద్యోగి.

"రోజూ వాడు బొమ్మ వైపు చూస్తూ నిలబడుతున్నప్పుడే అనుకున్నా...వీడు వక్ర బుద్ది గల వాడని" అన్నాడు మరో ఉద్యోగి.

బట్టలు కొలిచే స్కేలుతో వాడ్ని కొట్టేడు యజమాని.

బట్టల కొట్టు ముందు చిన్న గుంపు చేరింది. "వీడిని పోలీసులకు అప్పచెప్పండి... వాళ్లు వీడిని పిల్ల నేరస్తుల జైల్లో పడేస్తారు" గుంపులో ఎవరో అన్నారు.

బట్టల కొట్టు యజమాని పోలీసులకు ఫోన్ చేసాడు.

ఏం జరుగుతోందో, ఎందుకు కొడుతున్నారో తెలియని అయోమయ స్థితిలో ఉన్న పిచ్చాయి వాళ్లు కొట్టే దెబ్బలు భరించ లేక "కొట్టద్దు...కొట్టద్దు" అంటూ ఏడుస్తూ నిలబడ్డాడు. వాడి తరపు న్యాయం ఎత్తి చెప్పటానికి ఎవరూ లేరు...వాడికి చెప్పటం చేత కాదు...చెప్పినా ఎవరూ వినరు.

పోలీసులు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. " వయసులో నీకు ఇదేం పాడు బుద్దిరా" అంటూ వాళ్లు కూడా నాలుగు తగిలించేరు."వీడొక అనాధ వెధవ సార్" అన్నాడు ఒక పోలీసు.

అందరూ కలిసి ఒక టెర్రరిస్టును బంధించి తీసుకు వెడుతున్నట్టు పిచ్చాయిని పోలీసు స్టేషనుకు తీసుకు వెళ్లారు.

                                                                                ************************************

వాళ్ళూ, వీళ్ళూ కొట్టిన దెబ్బల వలన కలిగిన నొప్పిని భరించ లేని పిచ్చాయి రాజయ్య కొట్లో కూర్చోలేక అక్కడ్నుంచి బయలు దేరి మెల్లగా నడుచుకుంటూ వేప చెట్టు క్రిందకు వచ్చాడు. పాత గుడ్డల మూటను తీసుకుని తల కింద పెట్టుకుని ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు.

వాడి కళ్ళల్లో నుండి కారిన కన్నీరు బుగ్గలపై నుండి క్రిందకు జారాయి. కన్నీరు...దెబ్బల నొప్పి వలన వచ్చినవా? …లేక అమ్మ అనుకుని బొమ్మను కౌగలించుకున్నాడే... తన కోరిక తీరిందనే ఆనందంలో వచ్చిన ఆనందభాష్పాలా?...తెలియటం లేదు!!

*************************************************************సమాప్తం******************************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

తీర్పు...(కథ)