ఏల్నాటి శని...(కథ)

 

                                                                        ఏల్నాటి శని                                                                                                                                                     (కథ)

అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కష్టపడాలి. మనం విజయాలు సాధిస్తున్నప్పుడు జీవితం ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది. గెలిచిన వారి వెంట ఎంతోమంది వెళతారు అదే పరాజయాల బాటలో నడుస్తున్నప్పుడు వెనక వచ్చేవారు ఎవరూ ఎక్కువగా ఉండరు. అలాంటప్పుడు మనుషులు నిరాశకు లోనవుతారు. అలాంటప్పుడు జీవితం విషాదమయంగా బాధల సుడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ మనం చేసే పని అద్భుతంగా చేసి తీరాలి.

మనం కష్టాలలో ఉన్నాం కదా అని చేసే పనిలో నిర్లక్ష్యం చూపకూడదు. దీనికి మానసిక ధైర్యం కావాలి. ప్రపంచంలో మనం ఏం కోల్పోయినా ఫర్వాలేదు. కానీ మానసిక ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మానసిక ధైర్యమే మనకు దీర్ఘకాలిక విజయాలను చేకూర్చి పెడుతుంది. మానసిక ధైర్యం అంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎంతో తెలివిగా అర్థం చేసుకోవడం,సమస్య ఏమిటో గుర్తించడం, సమస్య అర్థమయ్యాక దానికి పరిష్కారాన్ని వెతకడం, ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు, ఎన్నో నొచ్చుకునే విషయాలు భరించాల్సి రావచ్చు. కానీ వాటన్నిటినీ భరించాలి. అలా బాధలను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి.  చేసే పనులలో ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఉన్నప్పుడే మానసిక ధైర్యం అవసరం అవుతుంది. అలాంటప్పుడు మానసిక ధైర్యం ఎంత గొప్పదో, అది మనిషిని ఎలా నిలబెడుతుందో, మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో అర్థమవుతుంది.

***************************************************************************************************

ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని కాచుకోనుంది అలమేలు.

కీటకాల శబ్ధం తగ్గి, మధ్యరాత్రి కుక్కల గోల తగ్గి, మధ్యరాత్రి తరువాతే, కొంచం నిద్ర వచ్చింది.

ఒకే గంటలోపు మెలుకువ కూడా వచ్చేసింది. కానీ, భయట, భయంకరమైన చీకటి. ఈ టైములో లేచెల్లి పళ్ళు తోముకుంటే గొణుగుతాడు మార్తాండం.

'ఏంటమ్మా ఇది. ఇంకా తెల్లార లేదు. నేనే నిద్రరాక, దొర్లి దొర్లి ఇప్పుడే కొంచం కళ్ళు మూశాను. ఇలా లేపేస్తున్నావే...పోమ్మా...' అని నీరసమైన స్వరంతో అతను చెప్పేది వింటే, ఆమెకు వెంటనే గుండె కరిగిపోతుంది.

పాపం, కొడుకు.

ఉత్సాహంగానే ఐ.టి.ఐ చదివేడు. తెలివిగలవాడే. ఎలాంటి టూవీలరైనా మొత్తం ఊడదీసి, సరిచేసి రెడీ చేసేస్తాడు. రెండు సంవత్సరాలు హోండా కంపెనీలో చేరి, పని నేర్చుకున్నాడు. సొంతంగా వర్క్ షాప్ పెట్టాలని ఆశ.

ఏడు సంవత్సరాలుగా దానికోసమే చెప్పులు అరిగేలా చుట్టాడు. ఒక ఫలితమూ దక్కలేదు.

నగరపుర బ్యాంకూ, గ్రామీణ బ్యాంకు, కోపరేటివ్ బ్యాంకు, బిజినస్ లోనూ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లోనూ అంటూ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వడ్డీ ఎక్కువగా అడుగుతున్నారు. టాక్స్ కట్టిన గత మూడు సంవత్సరాల రిటర్న్ అడుగుతున్నారు. ఏదో ఒక ఆస్తి తాకట్టు అడుగుతున్నారు.

ఎక్కడికెళ్తాడు బిడ్డ...ఆమె మాత్రం ఎక్కడికి పోగలదు. భర్త చనిపోయి ఇరవై సంవత్సరాలు అయ్యింది. కన్న బిడ్డను పస్తు పడుకోబెట్టకుండా, స్కూలుకు పంపటమే పెద్ద సవాలుగా ఉండేది.

ఒంటరి మనిషిగా అడవి, తీరం అని తిరిగి మిల్లులో నడుం విరగ బియ్యం మూటలు మోసి, గౌరవముగా జీవించటమే పెద్ద సాహసంగా ఉండేది.

ఉన్న ఈ పూరిల్లు, అత్తగారి కాలం చోటు. అదీ బీడు భూమి, తడికల ఇల్లు, పట్టా, పత్రమూ అంటూ పాత మురికిపడిన కాగితం ఒకటి ఉన్నది. దాన్ని తీసుకువెళ్ళి చూపిస్తే, హేళనగా నవ్వుతున్నారు.

'మొదట, ఇంటిని నీ పేరుకో, కొడుకు పేరుకో మార్చుకుని రావమ్మా. తరువాత చూద్దాం...' అంటూ ఖచ్చితంగా చెప్పాశారు.

తూర్పున ప్రకాశమైన ఉదయం వచ్చేసింది.

ఇది ముఖ్యమైన రోజు.

ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్మాల్ ఇండస్ట్రీస్ విభాగం గ్రామంలో బ్యాంకులు తెరిచి, ముప్పై సంవత్సరాలలోపు ఉన్న, టెక్నికల్ చదువుకున్న యువకులకు, అప్పు ఇవ్వబోతారాట. మూడు నెలలుగా పనిచేస్తున్నది. కొత్త బ్యాంకు. ఊర్లో ముగ్గురో, నలుగురో అప్పుతీసుకుని పనిచేయటం మొదలుపెట్టారు.

మార్తాండం కూడా అత్యంత చలాకీగా వెళ్ళి, అప్లికేషన్ ఇచ్చాడు. వాళ్ళు అడిగిన పేపర్లన్నీ ఇచ్చాడు. ఏదో బ్లూ ప్రింటట. కొత్త వ్యాపారం మొదలుపెట్టటానికి ప్లానట.

విజయవాడకు వెళ్ళి, ఏదో ఒక ఇంజనీరింగ్ ఆఫీసు ద్వారా దాన్ని రెడీ చేసుకుని తీసుకువచ్చి అప్పగించాడు. అయినా కానీ ఇదిగో, అదిగో అంటూ తిప్పుతున్నారు.

ఎలాగైనా ఒక రోజు లోను డబ్బు వచ్చేస్తుంది, అందులో ఆమెకు సందేహమో, అనుమానమో లేదు. విజయవాడ కనక దుర్గ వదిలిపెట్టదు. కుల దైవం వెంకటేశ్వర స్వామి కూడా వదిలిపెట్టడు.

తన ఆందోళన అంతా మార్తాండం గురించే.

అతను ముందులాగా లేడు. నిరాశా పరుడయ్యాడు. ఏడు సంవత్సరాల తిరుగుడు, ఓటమీ అతన్ని తలకిందలు చేసింది. వయసు పెరుగుతున్న కలత అతన్ని పీడిస్తోంది. కంటున్న కలకు, తాను అర్హుడినా కాదా అనే మానసిక ఒత్తిడి అతన్ని గుచ్చుతోంది.

అదే ఆమెను చాలా కష్టపెడుతున్నది.

రాజులాగా గంభీరంగా ఉంటాడు మార్తాండం.

"అమ్మా, ఈ పరిస్థితి మారుతుంది. నేను మారుస్తాను.  నా షాపు మెల్లగా పెరిగి పెద్దదవుతుంది. నలుగురిని ఉద్యోగంలో పెట్టుకుని, సంతోషంగా బ్రతుకుతాను. నన్ను చూసి నువ్వు గర్వపడేలాగా ఎదుగుతాను అమ్మా..." అంటూ నవ్వుతూ చెప్తాడు.

అలాగే కళ్ళు నీళ్లను ధారలాగా వచ్చేంతగా, మన కడుపున ఇలాంటి ఒక ముత్యం వచ్చి పుట్టిందే అని గర్వపడుతుంది.

ఎవరి కళ్ళు పడినైయ్యో, ఎవరు నోరు పెట్టారో...ఇలా తడిసిన గుడ్డలా ముడుచుకుని పడుకున్నాడు. ఈ రోజు ఎలాగూ లోను డబ్బు ఇచ్చేస్తాం అని బ్యాంకులో చెప్పి పంపించారు. కానీ, ఉత్సాహంగా ఉండవలసిన వాడు, చప్పబడిపోయి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు.

"నాయనా, లేరా అబ్బాయి...పది గంటలకల్లా రమ్మన్నారు కదా, అంతలోపు టిఫిన్, కాఫీ తిని రెడీ అవవయ్యా" అని లేపింది.

ఏదో గొణుగుతూ, "హూ...మెల్లగా వెళ్లచ్చమ్మా, తొందర లేదు" అన్నాడు.

"ఎందుకయ్యా అలా చెబుతున్నావు? నువ్వు, ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కబోతుంది రాజా...సంతోషంగా వెళ్ళిరా " అన్నది.

"నువ్వెంటమ్మా నన్ను ప్రొద్దున్నే విసిగిస్తున్నావు, నాకు విరక్తి పుట్టేసిందమ్మా...ఎంతో ఉత్సాహంగా ఎన్ని బ్యాంకులు ఎక్కి దిగుంటాను...ఎన్ని సొసైటీల మెట్ల మీద నిలబడుంటాను...'లేదు...లేదూ...లేదూ ' అన్న సమాధానం తప్ప, ఇంకేదీ వినలేదు. నీకు తెలియదా ఏమిటి?"

వాకిట్లో పక్కింటి రాజ్యం అక్క పిలవటం వినబడ, వెళ్ళి చూసొచ్చింది అలమేలు.

"నాయనా...ఇక్కడ ధన్వంతరీ మండపంలో, భవిష్యత్తు గురించి చెప్పే స్వామీజీ వచ్చున్నారంట. ఆయన ఎప్పుడూ హిమాలయా పర్వతాలలోనే ఉంటారట. ఇప్పుడు మన ఊరికి వచ్చారు. రాజ్యం అక్క అసక్తిగా పిలుస్తోంది. నేను వెళ్ళి చూసోస్తాను. నువ్వు  స్నానం చేసి రెడిగా ఉండు" అన్నది అలమేలు.

"సరేనమ్మా, త్వరగా వచ్చాయి!"

వేగంగా వెళ్ళింది అలమేలు.

అద్దం ముందు నిలబడ్డాడు మార్తాండం. దువ్వెన తీసి తల దువ్వుకోటానికే మనసు లేదు. భారంగా గుండే బరువుగా ఉన్నది. ఇదేలాగా ఎన్నెన్ని చోట్లకు పరిగెత్తి, పరిగెత్తి వెళ్లాను?

కొండనే ఎత్తి పారేయగలిగేంత ఉత్సాహం ఉండేదే. చంద్రుడ్ని పట్టేయగలననే నమ్మకం ఉండేది. ఈ రోజు అవన్నీ ఎక్కడ, ఎందుకు పోయినై? ఎవరో కావాలనే ముఖం మీద గుద్దినట్టు ఇన్ని సంఘటనలు ఎందుకు ఓటమిని ఇచ్చినై?’

తలుపును వేగంగా తోసుకుని పరిగెత్తుకు వచ్చింది అలమేలు.

"నాన్నా, ఏదీ నీ మొహం చూపించు. విభూది పెడతాను. ఇకపై ఒక్క బాధ కూడా లేదు నాన్నా...నిన్ను పీడిస్తున్న శని, ఈ వారంతో పోతుందట. ఇక అంతా మంచి కాలమేనట" అని చెప్పి, కన్నీరు పెట్టుకుంది.

"ఏంటమ్మా చెబుతున్నావు...నువ్వు మాట్లాడేదంతా కొత్తగా ఉంది. శని అది, ఇదీ అంటూ..."

అవును బాబూ, ధన్వంతరీ స్వామీజీ దగ్గర నీ గురించి చెప్పాను. అబ్బాయి మంచి చదువు చదువుకున్నాడు. తెలివిగలవాడు, ఇంకా అతనికి సరైన గది తలుపు తెరుచుకోలేదు అని ఏడ్చాను. ఆయన నువ్వు పుట్టిన తేదీ,పేరు,ఊరు అన్నీ అడిగారు చెప్పాను.

కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు ఏవో లెక్కలు వేసుకుని నీకు ఏల్నాటి శని పట్టుకుందట, ఇదిగో ఈ వారంతో ముగిసిపోతుందట. వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తుందట. కలత చెందకు అన్నారు.

నాకు ఒళ్ళు జలదరించింది. అబ్బాయ్...ఆ శని నిన్ను పట్టుకున్నందు వలనే, మొదలుపెట్టిన పనంతా ఓటమి అయ్యింది. ఇప్పుడది వదిలి వెళ్ళిపోయింది ఏల్నాటి శని. చూడు ఈ రోజు నీకు లోను దొరుకుతుంది. ఇక నీకంతా విజయమే" అన్నది అలమేలు.

మొదట్లో ఆశ్చర్యపోయాడు. తరువాత నవ్వాడు మార్తాండం.

తల దువ్వుకుని, ఉత్సాహంగా బయలుదేరాడు.

"వర్క్ షాపుకు కొత్తపేరు పెట్టబోతున్నానమ్మా. అలమేలు అమ్మ వర్క్ షాప్. నీ పేరే.  వస్తానమ్మా" అన్న అతని స్వరంలో ఆనందం తుళ్ళింది.

"ఏమిటి అలమేలు...ఏమిటేమిటో చెప్పావు. మనం చూసిన స్వామీజీ మామూలు  స్వామీజీనే కదా...భవిష్యత్ చెప్పే అతను, జాతకం చూసే ఆయనే కాదే...ఇన్ని సంవత్సరాలలో నువ్వు అడవి, తీరం అంటూ కుస్తీ పడతావు. రోజు, తిధి అన్నా అమ్మవారికి పొంగలి చేస్తావు. అంతే కదా?" అన్నది రాజ్యం అక్క.

"అవునక్కా...కొడుకు ఇలా నీరశంగా, నిరాశాపరుడుగా పడుకోనుండటం చూసి నా మనసంతా గజిబిజిగా ఉంది. బుర్ర కథలలో విని ఉన్నాము కదా, మనిషి ఏది పోగొట్టుకున్నా, ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు అని.

దాన్ని కొడుక్కి తిరిగి అందించటానికి ఈ శని జరిగే విషయాన్ని పట్టుకున్నాను అక్కా. వాడు పూర్తిగా నమ్ముతాడో, లేడో, ఏదో ఒక ఆనందం దొరికుంటుంది కదా...దాంతో సమాధానం అయ్యుంటాడు కదా.

మనసే కదా అక్కా అంతా? ఇప్పుడది బలం పొంది వాడిని ఉత్సాహంతో పని చేయనిస్తుందక్కా" అన్నది అలమేలు.

ఆశ్చర్యంతో నవ్వింది రాజ్యం అక్క.

****************************************************సమాప్తం**************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈ ధోరణి వద్దు...! (కథ)

మాతృ హృదయం...(కథ)

హక్కు...(కథ)